Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మరణ శిక్ష విధించడం మానుకోరా?

ప్రధానమంత్రి అభ్యర్థి అయిన నరేంద్ర మోదీ ప్రసంగించ వలసిన పట్నాలోని గాంధీ మైదానంలో వరస బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ.ఎ.) ప్రత్యేక కోర్టు నలుగురికి మరణ శిక్ష విధించింది. మరో అయిదుగురికి వివిధ రకాలుగా శిక్షలు ఖరారు చేసింది. ఎన్‌.ఐ.ఎ. ప్రత్యేక కోర్టులో విచారణ నిర్వహించిన అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి గుర్వీందర్‌ సింగ్‌ మల్హోత్రా సోమవారం ఇంతియాజ్‌ అన్సారీ, హైదర్‌ అలీ అలియాస్‌ అబ్దుల్లా, నోమాన్‌ అన్సారీ, మహమ్మద్‌ ముజీబుల్లా అన్సారీకి మరణ శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. ఉమర్‌ సిద్ధీఖీ, అరaరుద్దీన్‌ ఖురేషీకి జీవిత ఖైదు విధించారు. అహమద్‌ హుసేన్‌, ఫెరోజ్‌ అస్లం పదేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మహమ్మద్‌ ఇఫ్తెహార్‌ ఆలం కు ఏడేళ్ల కారాగార వాస శిక్ష విధించారు. 2013 అక్టోబర్‌ 27న పట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ప్రసంగించడానికి ముందు ఏడు అధునాతన బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో ఆరుగురు మరణించారు. 90 మంది గాయపడ్డారు. ఈ కేసు విచారించిన న్యాయ మూర్తి మరణ శిక్షలు విధించారు. ఇప్పుడు శిక్షలు అనుభవించవలసిన వారిలో అయిదుగురు దోషులు – హైదర్‌ అలీ, ఇంతియాజ్‌ అన్సారీ అంతకన్నా మూడు నెలల ముందు బుద్ధ గయలో మోదీ ప్రసంగించవలసిన ర్యాలీలో పేలుళ్లకు బాధ్యులని తేలినందువల్ల వారు ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. మరణ శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి గుర్వీందర్‌ సింగ్‌ తేల్చిన వారిలో ఇద్దరు ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. సోమవారం శిక్షలు ప్రకటించిన వారి మీద మోపిన దేశద్రోహం, నేరపూరిత కుట్ర, హత్య, హత్యాయత్నం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం లాంటి ఆరోపణలు రుజువైనాయని ఎన్‌.ఐ.ఎ. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చెప్పారు. అందువల్ల మరణ శిక్ష విధించక తప్పలేదని న్యాయమూర్తి అన్నారు. పేలింది బాంబులు కనక, ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారు ఉన్నందున హత్య, హత్యా ప్రయత్నం నేరాలు రుజువైనాయంటే నమ్మడానికి అవకాశం ఉంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద మోపిన ఆరోపణలు రుజువైనాయని అన్నా నమ్మడానికి అవకాశం ఉండవచ్చు. కానీ దేశద్రోహ ఆరోపణ ఎలా రుజువైందో అంతుపట్టదు. అప్పటికి ప్రధాని కాని మోదీ మీద దాడి చేయడం ఏ రకంగా దేశద్రోహం కిందకు వస్తుందో తెలియదు. హత్యా, హత్యా యత్నం సైతం దేశద్రోహం కిందకు వస్తాయా. ఎన్‌.ఐ.ఎ. ప్రత్యేక కోర్టు అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి విధించిన మరణ శిక్షలను హైకోర్టు ఖరారు చేయవలసి ఉంది. అయితే మరణ శిక్షలు విధించడం ప్రజా స్వామ్యంలో, ఆధునిక పరిపాలనా విధానంలో ఎంతవరకు సబబు అన్న ప్రశ్న ఉండనే ఉంటుంది. మరణ శిక్ష విధించడం అనాగరికం అన్న అభిప్రాయం బలంగానే ఉంది. ఇది కంటికి కన్ను పంటికి పన్ను అన్న ఆటవిక న్యాయం అన్న భావనా ఉంది. మన న్యాయమూర్తుల్లో అనేక మంది న్యాయమూర్తులు వ్యక్తిగతంగా మరణ శిక్షకు వ్యతిరేకం. మరణ శిక్ష విధించే అవకాశం మన చట్టాల్లో ఉంది కనక తమ వ్యక్తిగత అభిప్రాయాలతో, భావనలతో నిమిత్తం లేకుండా మరణ శిక్ష విధించవలసి వస్తోందని ఆ న్యాయమూర్తులు అంటున్నారు. అంటే చట్టంలోనే మరణ శిక్ష విధించే అవకాశాన్ని తొలగించగలిగితే ఈ న్యాయమూర్తులే కాక ఎవరూ మరణ శిక్ష విధించలేరు. మరణ శిక్ష ప్రతీకారేచ్ఛ. శిక్ష నేర తీవ్రతనుబట్టి ఉండాలన్న అభిప్రాయం కూడా ఉంది కనక మరణ శిక్ష విధించినా తప్పు లేదు అనే వారూ ఉంటారు.
అయితే ఏ న్యాయస్థానం అయినా చట్టంలో ఉన్న అవకాశం ప్రకారం శిక్ష విధించగలదు. కానీ మరణ శిక్ష విధిస్తే, అది అమలు జరిగితే మళ్లీ ఒక మనిషి ప్రాణాలు వెనక్కు తీసుకురాలేం కదా అన్న వాదనకు ఉన్న బలాన్ని తోసిపుచ్చలేం. అనేక మంది న్యాయమూర్తులు తాము విధించిన మరణ శిక్షలు తప్పని ఆ తరవాత ఎప్పుడో తీరికగా పశ్చాత్తాపం లాంటిది వ్యక్తం చేశారు. శిక్షల వెనకాల ఓ కచ్చితమైన సిద్ధాంతం ఉంటుంది. శిక్ష ఎప్పుడైనా నేరస్థుడికి తగిన దండన కోసం ఉద్దేశించిందే. తప్పు చేసి జైలు శిక్ష అనుభవించే క్రమంలో ఆ నేరస్థుడిలో పశ్చాత్తాపం కలగడానికి అవకాశం ఉంటుంది. శిక్ష అమలైపోతే ఆ అవకాశం లేకుండా పోతుంది. శిక్ష విధించడంలో మరో ఉద్దేశం నేరస్థుడు తనను తాను సంస్కరించుకునే అవకాశం కల్పించడం. మరణ శిక్ష అమలైతే ఈ సంస్కరణకూ వీలుండదు. శిక్ష అంటే ప్రతీకారం తీర్చుకోవడం అని ఏ న్యాయశాస్త్రమూ చెప్పదు. దోషి తాను చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవించడం, అవకాశం ఉంటే తనను తాను సంస్కరించుకోవడం అన్నవే న్యాయ సూత్రాల సారాంశం. నేరానికి తగిన శిక్ష విధించడం అన్న ప్రసక్తి వచ్చినప్పుడు ప్రాణం తీసిన వ్యక్తికి మరణ శిక్ష విధిస్తే తప్పు కాదు కదా అని వాదించే వారూ ఉంటారు. నిజమే కాని ఒక్కసారి మరణ శిక్ష అమలైతే పశ్చాత్తాపం, సంస్కరణ అన్న మాటలకు అవకాశమే లేకుండా పోతుంది.
మరణ శిక్ష విధించడం మన దేశంలో సులభమే కావచ్చు. కానీ ఒక న్యాయమూర్తి ఆ శిక్ష విధిస్తే అది అమాంతం అమలైపోదు. హైకోర్టు ఆ శిక్షను ధృవీకరించాలన్న నియమం ఉంది. అంటే మనిషి ప్రాణంతో చెలగాటం ఆడకూడదన్న ధ్యాస ఉన్నందువల్లే ఈ ఆమోదం అన్న సూత్రం తప్పని సరైంది. 2017 నాటికి 106 దేశాలు మరణ శిక్షను రద్దు చేశాయి. ఎనిమిది దేశాలలో అత్యంత హేయమైన నేరాలకే మరణ శిక్ష విధిస్తున్నారు. 28 దేశాలలో మరణ శిక్ష విధించడానికి అవకాశం ఉన్నప్పటికీ గత పదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా అమలు చేయలేదు. 56 దేశాలలో మరణ శిక్ష విధించడానికి ఇంకా చట్ట రీత్యా అవకాశం ఉంది. 1991 నాటికి 48 దేశాలు మరణ శిక్షను రద్దు చేస్తే 2017 నాటికి ఆ దేశాల సంఖ్య 106 కు చేరింది. దీన్నిబట్టి ప్రపంచం క్రమక్రమగా మరణ శిక్ష అనాగరికం అన్న అభిప్రాయానికి వస్తోంది. మన దేశంలో హేయమైన నేరాలకు ఈ శిక్ష విధిస్తామని చెప్పినా ఎడా పెడా న్యాయమూర్తులు మరణ శిక్ష విధిస్తూనే ఉన్నారు. మరణశిక్ష ఉండకూడదన్న తాత్వికత కింది స్థాయి న్యాయ మూర్తులకు ఒంటబట్టడం లేదని అర్థమవుతోంది. ఉన్నత న్యాయస్థానాలు చెల్లవని ప్రకటించిన చట్టాల పరిధిలో ఇప్పటికీ శిక్షలు విధిస్తున్న దేశం మనది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img