Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్న రైతులు

దేశంలోని రైతులు మరో మహా పోరాటానికి సిద్ధం అవుతున్నట్టున్నారు. ఏడాదికి పైగా దిల్లీ పొలిమేరల్లో సుదీర్ఘ కాలం శాంతియుతంగా ఉద్యమం కొనసాగించిన తరవాత ప్రధానమంత్రి మోదీ వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చారు. కానీ ఇవి అమలులోకి రాలేదు. అందువల్ల 2022 నవంబర్‌ 26న రైతులు మరోసారి ఉద్యమం చేపట్టారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయడానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో సోమవారం దిల్లీలో కిసాన్‌ మహా పంచాయత్‌ నిర్వహించారు. తమ కోర్కెలను కేంద్ర ప్రభుత్వం తీర్చకపోతే ఇంతకు ముందు చేపట్టిన ఉద్యమంకన్నా భారీ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వంలో కొంతమంది రైతులు కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్‌ తోమార్‌కు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ధరలు అమాంతం పడిపోయినందువల్ల బంగాళాదుంప, టొమాటో, ఉల్లి, ఆవాల రైతులు బాగా నష్టపోయారు. ఇది ఈ సంవత్సరం తలెత్తిన సమస్య. దిల్లీ పొలిమేరల్లో 2020 నవంబర్‌ 26న ప్రారంభించిన ధర్నా 2021 డిసెంబర్‌లో ముగిసింది. 2021 నవంబర్‌ 19న ప్రధాన మంత్రి మోదీ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఏకపక్షంగా ఉపసంహరించినా రైతులు వెంటనే ఆనందోత్సాహాలతో ఉద్యమం విరమించలేదని గుర్తుంచుకోవాలి. కేంద్రప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన తరవాతే రైతులు ఉద్యమం విరమించారు. రైతుల న్యాయమైన కోర్కెలన్నిటినీ తీరుస్తామని కేంద్రప్రభుత్వం అప్పుడు వాగ్దానం చేసింది. అప్పటినుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి న్యాయమైన రైతుల కోర్కెలు ఏమీ కనిపించలేదనుకోవాలి. లేకపోతే మోదీచేసే అనేకానేక వాగ్దానాలలాగే రైతులకు ఇచ్చిన మాటకూడా బూటకం అయిఉండాలి. ఉద్యమం ఎంత శాంతియుతంగా సాగినా ఆ క్రమంలో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇంతమంది రైతులు ప్రాణత్యాగం చేస్తే మోదీ ఒక్క కన్నీటిబొట్టు అయినా రాల్చకపోవడం రైతుల విషయంలో ఆయన ధోరణి ఏమిటో అర్థంచేసుకోవచ్చు. రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందువల్లే తాము ఉద్యమం విరమించామని రైతులు వ్యవసాయశాఖమంత్రికి అందజేసిన విజ్ఞాపనపత్రంలో తెలియజేశారు. అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరకపోగా మారిన పరిస్థితుల్లో  రైతులు కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటిని కూడా ఈ విజ్ఞాపన పత్రంలో ఏకరువుపెట్టారు. ఉద్యమం చేపట్టిన రైతులు ఇతర సమస్యలతో పాటు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు కనీస మద్దతుధర చెల్లించడానికి చట్టం చేయాలని కోరారు. కనీస మద్దతుధర చెల్లిస్తూనే ఉన్నాం కదా అని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంత అరకొరగా నెరవేరుస్తున్నారో తెలుసుగనకే రైతులు కనీస మద్దతుధరకు చట్ట ప్రతిపత్తి కల్పించాలని పట్టుబడ్తున్నారు. సేద్యానికి అయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి కనక స్వామినాథన్‌ కమిషన్‌ లాంటి కమిషన్‌  మళ్లీ ఏర్పాటుచేయాలని కూడా రైతులు కోరుతున్నారు. రైతుల రుణభారం చాలా పెరిగింది కనక రుణాలన్నీ మాఫీ చేయాలని కూడా రైతులు కోరారు. నెలకు రైతులకు రూ.5,000 పింఛన్‌ చెల్లించాలనీ అడిగారు. విద్యుత్‌ (సవరణ) బిల్లును ఉపసంహరించాలని, పంటల బీమా సమర్థవంతంగా అమలు చేయాలని కూడా రైతులు కోరుతున్నారు. 

లఖింపూర్‌ఖేరీ సంఘటనతో ప్రమేయం ఉన్నందువల్ల కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా ‘‘తేనీ’’ని తొలగించాలన్న డిమాండునూ మోదీ ఇప్పటిదాకా పెడ్తూ వచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రైతుల మీద మోపిన కేసులను ఉపసంహరించుకోవాలన్న డిమాండుకూ అతీగతీ లేదు. అమరులైన రైతులకు స్మారక చిహ్నం నిర్మించడానికి స్థలం కేటాయించాలన్న కోరికనూ పట్టించుకున్న వారేలేరు. ఇంతకు ముందు అందజేసిన విజ్ఞాపన పత్రాలలో కూడా ఇవే కోర్కెలున్నాయి. అంటే మోదీ సర్కారు ఏ సమస్యనూ పరిష్కరించలేదన్న మాట. ప్రస్తుతం రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికే ఇటీవలే నాసిక్‌ నుంచి ముంబై దాకా రైతులు సుదీర్ఘ పాద యాత్ర చేయవలసి వచ్చింది. ఇప్పుడు అమలులో ఉన్న మద్దతుధరల పథకాలను ఇంత సంక్షోభ సమయంలోనూ అమలు చేయడంలేదు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక వేపు ఎగుమతి, దిగుమతుల మీద ఆంక్షలు విధిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే మిషతో రైతులకు మెరుగైన ధర దక్కడానికి ఏ చర్యా తీసుకోవడం లేదు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని, రాష్ట్రస్థాయి సదస్సులు, అఖిలభారత స్థాయిలో ర్యాలీలు నిర్వహించి ఈ సమస్యలను జనందృష్టికి తీసుకు వస్తామని సోమవారంనాటి కిసాన్‌ మహాపంచాయత్‌లో హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికే రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉపసం హరించుకున్న వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల లక్ష్యమూ అదే. రైతు వ్యతిరేక విధానాలను అమలు చేయడమే మోదీ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. విచిత్రం ఏమిటంటే ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు అనుబంధంగా ఉన్న భారతీయ కిసాన్‌ సంఫ్‌ు 2022 డిసెంబర్‌లో దిల్లీలో రైతు గర్జన నిర్వహించిందంటే బీజేపీకి అనుకూల రైతు సంఘాలు కూడా రైతు వ్యతిరేక విధానాలపై పోరాడక తప్పని పరిస్థితి ఉంది. ఆ సంఘమూ మద్దతు ధర గురించి మాట్లాడడమే కాక సేద్యానికి అయ్యే పెట్టుబడి తగ్గేట్టు చూడాలని కోరింది. తమ కోర్కెలు అంగీకరించకపోతే ఉద్యమం తప్పదని ఆర్‌.ఎస్‌.ఎస్‌. అనుబంధరైతు సంఘం కూడా హెచ్చరించడం అంటే మోదీ సర్కారు మంకుతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆరు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే రైతులు కూడా మళ్లీ ఉద్యమ బాట పడుతున్నట్టున్నారు. మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని కూడా సంయుక్త కిసాన్‌మోర్చా ఆలోచిస్తోంది. ఇంతకు ముందు బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలోనూ రైతులు ఇలాగే బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయవలసి వచ్చింది. రైతుల ప్రచార ప్రభావం ఎంత అని నికరంగా లెక్కవేయడం కుదరకపోవచ్చు. ఈ వ్యతిరేక ప్రచారాన్ని ఎదుర్కొని ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ చేసిన కట్టుదిట్టాల గురించీ కచ్చితంగా చెప్పలేం. మోదీ ప్రభుత్వం ఇదే మొండివైఖరి అనుసరిస్తే మరోసారి భీకరమైన రైతుఉద్యమం తప్పకపోవచ్చు. ఇటీవలి కాలంలో ఇతర ఏ వర్గానికన్నా కూడా రైతులే తమ సంఘటిత శక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ వాస్తవం విస్మరించడం మోదీకి ప్రతికూలమైన పరిస్థితికే దారితీస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img