Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మళ్లీ ముంచిన విపత్తు

ఆంధ్రప్రదేశ్‌ను విపత్తులు వెంటాడుతున్నాయి. ప్రకృతి ప్రకోపా నికి మానవ తప్పిదం కలిస్తే విలయం ఏ స్థాయిలో వుంటుందో హుద్‌హుద్‌, తిత్లీ, పెథాయ్‌ తుపాన్లు నిరూపించాయి. ఉత్తరాంధ్రను వణికించిన హుద్‌హుద్‌ తుపాను విధ్వంసకర జాడలు మాయం కాకముందే కొన్ని మాసాల క్రితం ‘యాస్‌’ తుపాను అటుఇటుగా ఒడిశాతోపాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలను అల్లాడిరచింది. ఇప్పుడు మళ్లీ ‘గులాబ్‌’ పేరుతో రైతు గుండె కోత మిగిల్చేలా తుపాన్‌ వీరవిహారం చేసింది. తుపాను ముందస్తు హెచ్చరికలు, జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్‌డిఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ (ఎస్‌డిఆర్‌ఎఫ్‌)ల చొరవ మానవ వినాశనాన్ని ఆపగలిగినా, రైతుకు, ప్రాతిపదిక సౌకర్యాలకు కలిగే నష్టం మాత్రం అనివార్యంగా మారే పరిస్థితి దాపురించింది.
గులాబ్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు మళ్లీ అన్నదాత వెన్నువెరిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.91 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినప్పటికీ, కనీసం 3 లక్షల ఎకరాల్లో పంట నేల కూలినట్లు తెలుస్తోంది. ఇందులో సింహభాగం ఉత్తరాంధ్రదే. అత్యధికంగా విజయనగరం జిల్లాలో పంట నష్టం జరగ్గా, శ్రీకాకుళం, విశాఖపట్నం తదుపరి స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, చెరకు పంటలు నీటమునిగి రైతులు గగ్గోలు పెడుతున్నారు. పొలాల్లో ముంపు ఏ మాత్రం తగ్గలేదు. ఇంకో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని భయపడుతున్నారు. మునిగినచోట వరదనీరు ఇంకిపోవ డమే తప్ప అది బయటకు పోయే మార్గమే లేకుండా పోయింది. జాతీయ రహదారులపై సైతం నీరు చేరినా, గట్లకు గండికొడితే తప్ప నీరు కదలని దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది. ఆంధ్రాలోనే కాదు…భారతదేశంలో ఎక్కడ, ఎప్పుడు వరదలు సంభవించినా క్షణాల్లో నీరు నిలువెత్తున చేరుతుంది. అది తగ్గుముఖం పట్టడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. స్వతంత్ర భారతావనిలో ఇప్పటివరకు విపత్తు నిర్వహణ పట్ల సరైన విధానం లేకపోవడమే ఈ స్థితికి కారణమని నిపుణుల అభిప్రాయం.
గులాబ్‌ సృష్టించిన బీభత్సానికి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఆరు జిల్లాలు ప్రధానంగా నష్టాన్ని చవిచూశాయి. అధికారులు చెప్పిన వివరాలు ప్రకారం చూసినా, 2,145 గ్రామాలు తుపాను ప్రభావానికి లోనుకాగా, 1,82,722 ఎకరాల విస్తీర్ణంలోని వ్యవసాయ పంటలు, 7,902 ఎకరాల్లోని ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, చెరకుతో పాటు పత్తి, మినుము, వేరుసెనగ, పెసర, పొగాకు, రాగి, రాజ్మా పంటలు, అరటి, బొప్పాయి తోటలు నేలకూలి, రైతుకు కన్నీటిని మిగిల్చాయి. విశాఖ పట్నంలో 2011లో మునిగిన గ్రామాలే ఈసారి కూడా మునిగి ఉన్నట్టుండి ప్రజలకు నిలువనీడలేకుండా చేయడం విషాదకరం. నాగావళి, సువర్ణ ముఖి, వేగావతి నదులు ఇంకా పొంగిపొర్లుతూనే వున్నాయి. తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టుల్లోకి నీరు హద్దులు దాటి వచ్చి చేరింది. వెంగళ్రాయ సాగర్‌, పెద్దగెడ్డ రిజర్వాయర్ల నుంచి ఎలాంటి సమాచారం లేకుండా నీటిని ఒకేసారి కిందికి విడిచిపెట్టిన అధికారుల నిర్లక్ష్యానికి పదుల సంఖ్యలో గ్రామాలు నిండామునిగాయి. తూర్పుగోదావరి జిల్లా మన్యం వరకు చిన్నా పెద్ద రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఆరేడు మండలాలకు మూడు రోజులుగా విద్యుత్‌ సరఫరా లేదు. జనం అంధకారంలో బతుకీడుస్తున్నారు. మేహాద్రి రిజర్వాయరు గేట్లను సకాలంలో ఎత్తి ఉండక పోతే, ఇంకొన్ని గ్రామాలు గల్లంతయ్యేవి. గులాబ్‌తో అస్తవ్యస్థమయిన జనజీవనం తేరుకోవడానికి ఇంకొన్ని రోజులు పట్టవచ్చు.
విపత్తులు సంభవించిన ప్రతిసారీ కొన్ని సవాళ్లు మనల్ని వెక్కిరిస్తూనే వున్నాయి. నూటికి నూరు శాతం ప్రభుత్వాల వైఫల్యం జన కష్టాలను కడ తేర్చలేకపోతున్నది. విపత్తు నిర్వహణ వైఫల్యం కచ్చితంగా మానవ తప్పిదమే అవుతుంది. ప్రకృతి ప్రచండ గాలులను చేతితో అడ్డం పెట్టి మనం ఆపలేక పోవచ్చు. వరద ఉధృతికి అడ్డంగా నిలబడి దాన్ని నిలువరించలేకపోవచ్చు. కానీ కాలం చెల్లిన విధానాలతో గిరిగీసుకు కూర్చున్న వారి మెదళ్లలో పుట్టిన ఆలోచనలను పాతిపెట్టి, పెరిగిన అధునాతన సాంకేతికతను ఉపయోగించు కొని, వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను ఆపోసన పట్టి, మన పరి స్థితులకు అనుగుణంగా అన్వయించుకొని, సరైన విపత్తు నివారణ విధా నంతో ముందుకెళితే, కచ్చితంగా ప్రళయాల నష్టాన్ని గరిష్ఠస్థాయిలో నివారించవచ్చు.
తుపాన్లు, వరదలు, భూకంపాలు, అగ్నిపర్వత ప్రేలుళ్లు, సునామీలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులకు, ప్రమాదవశాత్తు జరిగే విషవాయు లీకేజీ ఘటనలు, అణువిద్యుత్‌ కర్మాగారాల్లో జరిగే విషా దాలు, ఉగ్రవాద బాంబుదాడులు, కుట్రపూరిత విషవాయు ప్రయోగాలు వంటి మానవ తప్పిద విపత్తులకు మధ్య తేడాలు ఈమధ్య కాలంలో తగ్గిపోతున్నాయి. మానవ హననంలో అన్నీ సమానంగానే ఉంటున్నాయి. భూక్షయం, భూమిపై తవ్వకాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. గాలి ఒత్తిళ్లు, సముద్ర ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. పరిమితికి మించి భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కాలుష్యకారక కార్యకలాపాలు విస్తృతమవు తున్నాయి. గ్రీన్‌గ్యాస్‌ ఉద్గారాలపై అంతర్జాతీయ స్థాయిలోనే నియంత్రణ కొరవడిరది. పర్యావరణ హిత పారిశ్రామికీకరణ ఊసేలేకుండా పోయింది. తద్వారా భూతాపం పెరిగింది. వాతావరణం గతితప్పింది. పర్యావరణంపై అవగాహన పెంచడమనేది తక్షణావసరంగా మారిపోయింది. పైగా కొండ లపై పడినా, రహదారులపై పడినా, ఇంకెక్కడ పడినా వర్షం దారి పొలాల్లోకే అన్నట్లుంది! పొలాలను ముంచిన నీరు బయటకు పోవడానికి దారేది? నీటిపారుదల వ్యవస్థ నేటికీ ఒక పద్ధతి ప్రకారం ఉండకపోవడానికి కారణాలేంటి? రోడ్ల పక్క కాల్వలుగానీ, కాల్వలను మింగేస్తున్న అక్రమార్కుల దుశ్చర్యలు గానీ, కాల్వల్లో పూడికలు గానీ, నదీజలాల్లో వర్థ్యాలు గానీ, కొండలపైన చివరి దాకా పుట్టగొడుగుల్లా ప్రత్యక్షమవుతున్న కట్టడాలు గానీ… ఇవేవీ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు? వరద నీరు క్షణాల్లో తగ్గుముఖం పట్టడానికి సమగ్ర ప్రణాళిక ఏదీ? ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, డ్యాముల వద్ద నీటి విడుదల విషయంలో అధికారుల మధ్య సమన్వయ మేదీ? ఇరిగేషన్‌పై వారికి అవగాహన లేదనుకోవాలా? ఆరేళ్లలో ఆరేడు తుపాన్లు ఉత్తరాంధ్రను ముంచెత్తినప్పటికీ, హడావిడిగా పడవలు, తెడ్లు మోసుకుపోవడమే తప్ప, ఆ ప్రాంతంపై వరద నష్ట నివారణకు ముందస్తు చర్యలేవీ? పంట నష్టాలపై శాస్త్రీయతకు చోటేదీ? విపత్తులతో వెన్నువిరిగిన అన్నదాతకు ఏనాడూ పూర్తిస్థాయి పరిహారం అందలేదంటే, వారి పట్ల ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధేది? జాతీయ, రాష్ట్ర విపత్తు నివారణ సంస్థలకు అధునాతన సాంకేతిక సంపత్తిని అందజేయలేకపోతున్నారన్న ఆరోపణలకు సమాధానమేదీ? ఇవన్నీ ప్రభుత్వాల ముందున్న సవాళ్లే. విపత్తులను అడ్డుకునే శక్తి లేకపోయినా, వాటిని సమగ్రంగా అంచనా వేసి, నష్టాన్ని తగ్గించవచ్చని ఇటీవల శ్రీలంకలో నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడిరచింది. దీనిపై సర్కార్లు దృష్టిసారించాలి. అలాగే గులాబ్‌ తుపాను బాధితులను తక్షణమే ఆదుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img