Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మళ్ళీ రైతుల పోరుబాట?

అసత్యాన్ని ఎదుర్కోవడమే కష్టం అనుకుంటే పాలకుల అబద్ధా లను తట్టుకోవడం మరింత కష్టం. అబద్ధం చెప్పడంలో విశేషమైన నైపుణ్యం సాధించిన మోదీ పరిపాలనలో అన్ని వర్గాల వారు అసత్యాన్ని ఎదిరించడానికి అడుగడుగునా పోరాడవలసి వస్తోంది. 2020 నవంబర్‌లో ప్రారంభమై 2021 డిసెంబర్‌ దాకా దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరంతరం ఉద్యమం కొనసాగించిన సమ యంలో ప్రధానమంత్రి వారి సమస్యలను వినిపించుకోనే లేదు. వారితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ 2022 ఆరంభంలో అయిదు రాష్ట్రాలలో, ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో శాసన సభ ఎన్నికలు జరగవలసి ఉన్నందున 2021 ఆఖరులో చడీచప్పుడు లేకుండా వివాదాస్పదమైన మూడు సేద్య చట్టాలను ఉపసంహరించుకున్నారు. దానితో రైతుల ఉద్యమం ఆగిపోయింది. ఆ సందర్భంలో ప్రధానమంత్రి స్వయంగా రైతులకు లిఖిత పూర్వకంగా హామీలు ఇచ్చారు. కాని అదంతా జరిగి ఏడాది దాటినా ఒక్క హామీ కూడా నెరవేరలేదు. రైతు ఉద్యమం భీకరంగా జరుగుతున్నప్పుడు అందులో ఉత్తర ప్రదేశ్‌ రైతులు కూడా కీలక పాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ రైతులు ఉద్యమానికి ముందుపీఠీన నిలిచారు. ఈ ఉద్యమ ప్రభావం శాసనసభ ఎన్నికలలో ఎక్కడ తమకు నష్టం కలిగిస్తుందో అని భయపడి మోదీ సర్కారు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంది. ఉద్యమ ఉధృతి చూస్తే బీజేపీ గెలవడం అటుంచి రెండో స్థానంలోనో, మూడో స్థానంలోనో ఉండవచ్చునన్న ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రమాదమేమీ ముంచుకు రాలేదు. మునుపు రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా మళ్లీ సమర సన్నాహాలు చేస్తోంది. వచ్చే 18వ తేదీ నుంచి పోరుబాట పట్టాలని నిర్ణయించింది. యోగీ ఆదిత్యనాథ్‌ నాయకత్వంలో బీజేపీ నిక్షేపంగా విజయం సాధించినందువల్ల రైతులకు ఇచ్చిన హామీలను పట్టించుకోవడం మానేసింది. కానీ ఉద్యమాన్ని విరమించినప్పుడే హామీలు అమలు కాకపోతే మళ్లీ ఉద్యమ బాట పడ్తామని రైతులు హెచ్చరించారు. అదే ఇప్పుడు మళ్లీ అనుభవంలోకి రావచ్చు. 2021 డిసెంబర్‌లో మోదీ ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేరలేదు. ఈ హామీలూ మోదీ అనునిత్యం పలికే అసత్యాల జాబితాలో చేరిపోయాయి. వాగ్దానాలు నెరవేర్చనందుకు సంయుక్త కిసాన్‌ మోర్చా ఆగ్రహంగా ఉంది. సాక్షాత్తు ప్రభుత్వాధినేత హామీలిచ్చి అవి నెరవేరకపోతే మరో చోట అయితే ఆ నాయకుడు సిగ్గుతో తల వంచుకునే వాడు. రాజీనామా చేసేవాడు. కానీ మోదీకి ఇలాంటి మర్యాదలేమీ పట్టవు. మోదీ ఉద్దేశంలో వాగ్దానాలంటేనే ఉల్లంఘించదగినవి. విమర్శలకు, నిరసనలకు తలొగ్గే వ్యక్తిత్వం మోదీది కాదు. ఆయన హామీలను తుంగలో తొక్కడం ఇది మొదటిసారేం కాదు. ఆయన నోరు తెరిస్తే వాగ్దానాలే జాలువారుతాయి. రైతుల సమస్యల పరి ష్కారానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ఒక ఎత్తయితే లఖింపూర్‌ ఖేరీలో కేంద్ర మంత్రి అజయ మిశ్రా పుత్రరత్నం ఆశీష్‌ మిశ్రా సృష్టించిన ఆగడాల వల్ల కలిగిన నష్టం నుంచి రైతులు ఇంతవరకు కోలుకోనే లేదు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకుండానే ఉండిపోయాయి.
మోదీ రైతులకు ఆందోళన జీవులు అనే ముద్దు పేరు పెట్టారు. ఆ దెప్పి పొడుపు వెనక ఉన్న ఆంతర్యం ఏదైనప్పటికీ దాన్ని స్ఫూర్తిని మాత్రం రైతులు మరిచిపోవడానికి సిద్ధంగా లేరు. తాజా పరిస్థితిని సమీక్షించడం కోసం సంయుక్త కిసాన్‌ మోర్చాలో భాగమైన వివిధ రైతు సంఘాల నాయకులు గత మూడవ తేదీన ఘజియాబాద్‌లో సమావేశం అయ్యారు. వివాదాస్పద చట్టాలను మోదీ సర్కారు వెనక్కు తీసుకుని ఉండవచ్చు. వీటిని పార్లమెంటు కూడా లాంఛనంగా రద్దు చేసి ఉండవచ్చు. కానీ రద్దుతో బాటు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదు. వివాదాస్పద చట్టాలను వెనక్కు తీసు కోవడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఉండాలన్నది రైతుల కోర్కెల్లో ప్రధానమైంది. ఈ అంశంపై ఒక కమిటీని నియమిస్తామని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే రైతుల మీద మోపిన బూటకపు కేసులను వెనక్కు తీసుకుంటామని కూడా వాగ్దానం చేసింది. అన్నింటికన్నా ముఖ్యంగా మద్దతు ధరకు చట్టప్రతిపత్తి అన్న వాగ్దానానికే దిక్కు లేకుండా పోయింది. వచ్చే 18వ తేదీన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సరిగ్గా అదే రోజున దేశమంతటా వాగ్దాన భంగానికి నిరసనగా ప్రదర్శనలు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు ఇచ్చింది. 31న అమర వీరుడు ఉద్ధం సింగ్‌ వర్ధంతి సందర్భంగా అన్ని ప్రధాన రహదారులను దిగ్బంధం చేయాలని తలపెట్టారు. ముందున్న సమస్యలు, ఇచ్చిన హామీలు అపరిష్కృతంగా మిగిలిపోయాయనుకుంటే సైనికులను చేర్చుకోవడానికి మోదీ సర్కారు ప్రారంభించిన అగ్నిపథ్‌ పథ కాన్ని నిరుద్యోగ యువకులే కాకుండా రైతులు కూడా తీవ్రంగా వ్యతిరేకి స్తున్నారు. ఎందుకంటే సైన్యంలో చేరేది ఎక్కువ భాగం రైతుల పిల్లలే. అగ్నిపథ్‌ పథకం ‘‘జాతి వ్యతిరేకం, యువతకు వ్యతిరేకం, రైతులకు వ్యతి రేకం’’ అని సంయుక్త కిసాన్‌ మోర్చా భావిస్తోంది. రైతు ఉద్యమంలో ప్రధాన పాత్ర పంజాబ్‌, హర్యానా రైతులదే అన్నది ఎంత వాస్తవమో సైన్యంలో చేరే వారిలో ఆ రాష్ట్రాల వారే అధికం అన్నది అంతకన్నా ఎక్కువ వాస్తవం. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల వారు కూడా సైనిక బలగాలలో ఎక్కువగా చేరుతుంటారు. కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు రైతుల ఉద్యమాన్ని బలపరిచాయి. అగ్నిపథ్‌ పథకాన్ని ఆక్షేపించాయి. అందువల్ల రైతులు మళ్లీ ఉద్యమం మొదలుపెడ్తే ఈ పక్షాల మద్దతు కచ్చితంగా ఉంటుంది. అగ్నిపథ్‌కు వ్యతి రేకంగా ప్రతిపక్షాల నిరసన ప్రదర్శనలకు మాజీ సైనికులు, నిరుద్యోగ యువకులు అండగా నిలబడ్తున్నారు. మోదీ ప్రభుత్వం హామీలు ఇవ్వడంలో ఎంత దిట్టో ప్రతిఘటన ఎదురైనప్పుడు వెనకడుగు వేయడంలో అంతకన్నా ఎక్కువ దిట్ట. కానీ ఇదే కిటుకు పదే పదే మోదీ సర్కారును ఆదుకోకపోవచ్చు. మోదీ చేతులు జోడిరచి క్షమాపణ అడిగితే రైతులు ఇప్పుడు నమ్మే దశలో లేరు. రైతుల ఉద్యమాన్ని విరమింప చేయడానికి మోదీ హామీలు పడేసి అప్పటికి ప్రతికూల పరిస్థితి నుంచి గట్టెక్కి ఉండ వచ్చు. వాగ్దానాలను అటకెక్కించడం ఎల్ల వేళలా సాగకపోవచ్చు. ఏడాదికి పైగా దిల్లీ పొలిమేరల్లో సాగిన రైతుల ఉద్యమం చరిత్రాత్మకమైందన్న మాట వాస్తవం. కానీ అదే ఊపు, ఉధృతి పునరావృతం అవుతాయన్న నమ్మకం ఏమీ లేదు. కానీ మోదీ అసత్యాలను ఎండగట్టాలని రైతులు భావిస్తే మళ్లీ పోరుబాట పట్టక తప్పక పోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img