Friday, April 19, 2024
Friday, April 19, 2024

మహిళా మల్లయోధుల మహా గర్జన

భారత మల్లయోధుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ, ఆయనను అరెస్టు చేయాలని కోరుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన మల్ల యోధులు దిల్లీ జంతర్‌ మంతర్‌లో నిరవధికంగా నిరసన చేపట్టి నెల దాటింది. ఈ నిరసన ఏప్రిల్‌ 23 నుంచి కొనసాగుతూనే ఉంది. తమకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగు తుందని ఈ మల్ల యోధులు అంటున్నారు. ఈ మహిళా మల్ల యోధులకు బజరంగ్‌ పునియా లాంటి మేటి క్రీడాకారులు కూడా అండగా నిలిచారు. మోదీ ప్రభుత్వానికి ఈ నిరసన ధ్వనులు చెవికి సోకడం లేదు. ఈ ఆందోళన సమసి పోయేట్టు చేయడానికి మోదీ ప్రభుత్వం ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. వచ్చే ఆదివారం ప్రధానమంత్రి మోదీ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించ డానికి సిద్ధం అవుతున్నారు. అందువల్ల అదే పార్లమెంటు భవనం ముందు మహా పంచాయత్‌ నిర్వహించాలని మల్ల యోధులు నిర్ణయించారు. వీరి ఉద్యమానికి పదమూడు నెలల పాటు దిల్లీ పొలిమేరల్లో ఆందోళన నిర్వహించిన రైతు సంఘాల మద్దతు ఉంది. భారతీయ కిసాన్‌ మంచ్‌ నాయకుడు రాకేశ్‌ టికైత్‌ జంతర్‌ మంతర్‌ దగ్గర అనేక సార్లు కనిపించారు. వీరందరూ రైతుల అమ్మాయిలే కనక వారికి న్యాయం జరిగేదాకా పోరాడతామని టికైత్‌ ప్రకటించారు. కేవలం రైతులే కాక వివిధ వర్గాల ప్రజలు, భిన్న రాజకీయ పార్టీలు కూడా మల్ల యోధులకు అండగా నిలిచాయి. ఆదివారం మల్ల యోధులు పార్లమెంటు దగ్గర నిరసన తెలియజేసే అవకాశం ఉంటుందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. మల్ల యోధుల పోరాట పటిమను అభినందించవలసిందే. ఈ మల్ల యోధులలో ఎక్కువమంది హర్యాణాకు చెందినవారు. వీరి ఆందోళనకు మద్దతుగా నూతన పార్లమెంటు భవనం వద్ద మహా పంచాయత్‌ నిర్వహించాలని హర్యాణాలోకి వివిధ రైతు సంఘాల వారు ప్రయత్నిస్తున్నారు. ఖాప్‌పంచాయతీలు కూడా నిర్వహించా లనుకుంటున్నారు. ఆదివారం నాటి నిరసనకు సిద్ధపడడంలో భాగంగా హర్యాణాలోని జింద్‌-నర్వానా జాతీయ రహదారిలో గురువారం కిసాన్‌ పంచాయత్‌ నిర్వహించారు. ఈ పంచాయత్‌లో జమ్ము-కశ్మీర్‌ మాజీ గవర్నర్‌, బీజేపీ నాయకుడు సత్యపాల్‌ మాలిక్‌ కూడా పాల్గొన్నారు. ఆదివారం జరిగే మహాపంచాయత్‌ కు మద్దతు సమీకరించడం కోసం బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌ తీవ్ర ప్రయత్నమే చేస్తున్నారు. వీరు హర్యాణాలోనే కాక పొరుగు రాష్ట్రాలలో కూడా పర్యటించి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ మహా పంచాయత్‌లో పాల్గొనడానికి దిల్లీకి తరలి రావాలని మల్ల యోధులు యువతకు, మహిళలకు విజ్ఞప్తి చేశారు. క్రీడా సంఘాలలో బ్రిజ్‌భూషణ్‌ లాంటి చీడపురుగులను ఏరి వేయాలన్న సంకల్పబలం వీరిలో స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం కుస్తీల్లోనే కాక అనేక క్రీడా విభాగాలలో బ్రిజ్‌ భూషణ్‌ లాంటి వారికి కొదవ లేదు.
మోదీ నూతన పార్లమెంటుభవనాన్ని ప్రారంభించేరోజునే మల్ల యోధుల నిరసన తీవ్రరూపం దాల్చడం ప్రధానమంత్రి కీర్తికి మచ్చ తెస్తుందన్న ఆందోళన బీజేపీ నాయకుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ సమస్య హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను మరింతగా వేధిస్తోంది. హర్యాణాలోని బీజేపీ నాయకులుకూడా మల్లయోధుల ఉద్యమానికిబాసటగా నిలబడడం ఖట్టర్‌కు తల నొప్పిగా తయారైంది. కేంద్ర మాజీ మంత్రి బీరేంద్ర సింగ్‌, ఆయన కుమారుడు, హిసార్‌ నుంచి ఎన్నికైన ఎంపీ బ్రిజేంద్రసింగ్‌, హర్యాణా విద్యుత్‌ శాఖా మంత్రి రంజిత్‌ సింగ్‌, ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే కూడా మల్ల యోధుల పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. హర్యాణా ప్రభుత్వంలో భాగస్వామి అయిన జన నాయక్‌ జనతా పార్టీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలా కూడా మద్దతు ఇస్తున్నారు. ఎఫ్‌.ఐ.ఆర్‌. ఆధారంగా బ్రిజ్‌ భూషణ్‌ పై కఠిన చర్య తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. దీనితో ఖట్టర్‌ ఇరకాటంలో పడ్డారు. మల్ల యోధుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే కనక గ్రామీణుల మద్దతు కూడా వారికి ఉంది. ఇది ఖట్టర్‌ను మరింత ఇబ్బందికి గురి చేస్తోంది. అందుకే ఆయన ఏప్రిల్‌ నెల అంతా ‘‘జన సంవాద్‌’’ (ప్రజలతో సంప్రదింపులు) కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు.
ముఖ్యమంత్రి ఖట్టర్‌ ఎంత ప్రయత్నించినా ప్రజల దగ్గర నుంచి నిరసన ఎదురవుతూనే ఉంది. సిర్సాలో వరసగా మూడు రోజులు ఖట్టర్‌ కు నిరసన సెగలు తప్పలేదు. ఒక చోట ఒక మహిళ ముఖ్యమంత్రితో ఘర్షణపడి తన దుపట్టాను ఆయన కాళ్ల మీద విసిరేశారు. షరా మామూలుగా దీనికంతటికీ కొన్ని రాజకీయ పార్టీలే కారణమని ఖట్టర్‌ ఆరోపించారు. ఇతర రాజకీయ పార్టీల కార్యక్రమాలకు అడ్డుతగిలే పార్టీల వారి మీద చర్య తీసుకుంటామని హుంకరించారు. ఈ వివాదంలో బ్రిజ్‌ భూషణ్‌ తో పాటు మల్ల యోధులు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధ పడ్డారు కనక ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని హర్యాణా హోం మంత్రి అనిల్‌ విజ్‌ అంటున్నారు. కాంగ్రెస్‌ లాంటి రాజకీయ పార్టీలే ఈ ఆందోళనను రెచ్చగొడ్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. తాము పరిష్కరించలేని సమస్యలకు ప్రతిపక్ష పార్టీలను బాధ్యుల్ని చేయడం బీజేపీకి కొత్త కాదు. మహిళా క్రీడాకారిణుల ఉద్యమం కేవలం వారికే పరిమితమైందికాదు. ఇది మహిళల ఆత్మ గౌరవానికి, గౌరవంగా జీవించడానికి సంబంధించిన సమస్య. ఈ పోరాట లక్ష్యం కూడా మహిళల ఆకాంక్షలకు ఊతం ఇవ్వడమే. న్యాయం కోసం పోరాడలేనప్పుడు మెడలోపతకాలు ఉన్నందువల్ల ప్రయోజనం ఏమిటన్నది ఈ క్రీడాకారుల ప్రశ్న. స్త్రీ, పురుష సమానత్వం విషయంలో యథాతథ వాదాన్ని సమర్థించే గ్రామీణ సంఘాలు కూడా పోరుబాటపట్టారు. బేటీబచావో, బేటీపఢావో అని నిరంతరం నినదించే ప్రధానమంత్రి మోదీకి మల్ల యోధుల సమస్య పట్టక పోవడం ఆయన ఆధిపత్య ధోరణికి నిదర్శనం. దేశ ప్రతిష్ఠను ఇనుమడిరప చేసిన అమ్మాయిలు రోడ్లమీదకు వచ్చి వారాల తరబడి నిరసన తెలియజేయవలసి వస్తోంది. వీరి పోరాటం ఇప్పుడు జాతి గౌరవానికి, త్రివర్ణ పతాకం గౌరవానికి సంబంధించిన పోరాటంగా తయారైంది. ఈ పోరాటం ప్రతిపక్షాల ఐక్యతను ఎక్కడ బలోపేతం చేస్తుందోనన్న బాధ కూడా బీజేపీని పీడిస్తోంది. మల్ల యోధుల ఉద్యమం ప్రత్యక్షంగా ఖట్టర్‌ ప్రభుత్వంపై ప్రభావం చూపుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img