Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మాటల మాంత్రికుడు

స్వాతంత్య్ర దిన అమృతోత్సవాలు అని ఏడాది నుంచి దేశ వాసులను మురిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఎర్రకోట బురుజుల మీంచి ప్రసంగిస్తూ దేశం సుభిక్షంగా ఉండా లంటే మరో పాతికేళ్లు ఆగాలని అనునయ పూర్వకంగా చెప్పారు. సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రభుత్వం చేసిన, చేస్తున్న, చేయబోయే పనులను వివరించి నూతన దిశా నిర్దేశం చేసే సంప్రదాయం ఉంది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం తన వక్తృత్వ పటిమను సంపూర్ణంగా ప్రదర్శించి అసలు సమస్యలను ప్రస్తావించకుండా దాట వేయడంలో అనితర సాధ్య మైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. అయితే మోదీ భక్తులు కొన్ని వారాల తరబడి ఆయన కీర్తి గానం చేయడానికి కావలసినంత సరంజామా అందించారు. దేశ రుగ్మతలన్నింటికీ కాంగ్రెస్‌ మాత్రమే కారణం అని నమ్మించడానికి శాయశక్తులా ప్రయత్నించారు. స్వాతంత్య్రం సంపా దించిన తొలి దశలో తొలి ప్రధానమంత్రి నెహ్రూ నిర్మించిన ప్రజా స్వామ్య వ్యవస్థలను గత ఎనిమిదేళ్ల పాలనలో ఎలా విచ్ఛిన్నం చేస్తు న్నారో చెప్పకుండా వాటంగా దాట వేశారు. కానీ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడానికి కాంగ్రెస్‌ కొనసాగించిన వంశపారంపర్య పాలన మాత్రమే కారణం అని నమ్మబలకడానికి ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ఆనువంశిక పాలన వల్ల మన ప్రతిభకు భంగం కలిగిందని, దేశ సామర్థ్యం కుంటువడిరదని, అవినీతికి బాటలు వేసిందని చెప్పడానికి తన హావభావ ప్రదర్శనా నైపుణ్యాన్నంతటినీ వినియోగించుకున్నారు. దేశాన్ని లూటీ చేసిన వారి నుంచి ఆ సొమ్మంతా కక్కించాలని కూడా ఉద్బోధించారు. పేదరికంతో పోరాడుతున్న ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా సర్వ శక్తులు ఒడ్డి పోరాడాలని కూడా పిలుపు ఇచ్చారు. అయితే భారతీయ జనతా పార్టీ నాయకులలో ఎంతమంది ఆనువంశిక విధానాలను కొనసాగిస్తున్నారో మాత్రం జనానికి చెప్పకుండా దాచేశారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తామని, విదేశాల్లో దాచు కున్న సొమ్మును వెనక్కు తీసుకొచ్చి ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందో మాత్రం ప్రధాన మంత్రి ప్రసంగాన్ని ఎంత శ్రద్ధగా విన్నా ఆ ప్రస్తావనే కనిపించదు. పైగా యువత వచ్చే 25 ఏళ్లు దేశాభివృద్ధికి పాటుపడాలనీ, మనం మొత్తం మాన వాళి అభివృద్ధికి పాటుపడాల్సి ఉందని చెప్పడంతో తన ఎనిమిదేళ్ల పాల నలో హామీలు గుప్పించడం తప్ప సాధించేదేమీ లేదని చెప్పకనే చెప్పారు. గాంధీజీ, భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, రాం ప్రసాద్‌ బిస్మిల్‌, అష్ఫాఖుల్లా ఖాన్‌, రాణీ లక్ష్మీ బాయి. సుభాష్‌ చంద్రబోస్‌, తాంత్యా తోపేతో సహా ఎంతో మంది స్వాతంత్య్ర పోరాట యోధులు బ్రిటిష్‌ సామ్రాజ్య కుదుళ్లు కది లించారని చెప్పడానికి పరిమితమయ్యారు తప్ప నామమాత్రంగా, మర్యాద పూర్వకంగానైనా నెహ్రూను ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ పేర్లన్నీ దొర్లించడంలో ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న వారిని కూడా ప్రస్తావించారు. ఆ మాట చెప్తూనే అపరిమిత త్యాగాలు చేసిన వారికి దక్కవలసినంత స్థానం దక్కలేదని షరా మామూలుగా తన అక్కసు వెళ్ల గక్కారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారతే అని చెప్పడం జాతీయతా భావాలను రెచ్చగొట్టడానికేనని మోదీ వైఖరి తెలిసిన వారందరికీ అర్థం అవుతూనే ఉంటుంది.
వైవిధ్యం, విభిన్నత మన దేశానికి శక్తినిస్తోందని చెప్పినందుకు ప్రధాన మంత్రిని అభినందించవలసిందే. కానీ మోదీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్ల కాలంలో ఈ వైవిధ్యాన్ని ఎలా కుళ్లబొడిచిందో, ముస్లింలను పక్కకు నెట్టేయడానికి పథకం ప్రకారం ఎలా కృషి చేస్తోందో ఆలోచించే వారికి మోదీ వైవిధ్యతా కీర్తి గానంలోని డొల్లతనం అర్థం కాకుండా ఉండదు. జనం ఆకాంక్షలు పెరుగుతున్నాయనీ, ప్రతి పౌరుడు మార్పు కోరుకుంటు న్నాడని, మార్పు తన కళ్లముందే జరగాలనుకుంటున్నాడని, ఇక ప్రజలు వేచి చూసే అవకాశం లేదని చెప్పిన నోటితోనే మోదీ దేశం సుభిక్షం కావడానికి మరో పాతికేళ్లు వేచి ఉండాలని చెప్పడం విడ్డూరంగా ఉంది. దేశాభివృద్ధి కోసం అంకితమైన వాడిని తానొక్కడినే అని చెప్పుకోవడానికే మోదీ 82 నిముషాల ప్రసంగాన్ని వెచ్చించారు. గత ఎనిమిదేళ్ల పాలనను అనుభ వించిన వారికి మోదీ సైద్ధాంతికత ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రధాన కేంద్రమైన నాగ పూర్‌లో మూస పోసి వెలికి వచ్చిందని అర్థం కాదన్న భరోసా ఆయన ప్రసంగంలో అడుగడుగునా కనిపించింది. తన వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచు కోవడానికి ఆయన పడని పాట్లు లేవు. గత 75 ఏళ్ల చరిత్రను తిరగ తోడడానికి బాగా ప్రయత్నించారు. మోదీ ప్రసంగంలో కొట్టొచ్చినట్టు కనిపించింది ఆయన వాగాడంబరం. ఆయన హిందీ భాషా వైదుష్యం, నాటకీయత, హావభావాలు ప్రసంగం నిండా కనిపించాయి. దేశం ఎదుర్కుంటున్న కనీవినీ ఎరుగని నిరుద్యోగం, రాకెట్‌లా దూసుకుపోతున్న ద్రవ్యోల్బణం, మైనారిటీల దుస్థితి, సరిహద్దులో చైనా ఆగడాలను నిలువ రించడంలో తన ప్రభుత్వ వైఫల్యం, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పెరుగు తున్న అఖాతం, ఫెడరల్‌ వ్యవస్థను ఛిద్రం చేస్తున్న వైనం ఆయన ప్రసంగంలో ఎక్కడా కనిపించదు. వాగాడంబరం ప్రదర్శించే ఏ నాయ కుడూ ప్రజలకు వాస్తవాలు కనిపించనివ్వడు. ఈ కళలో మోదీ అద్వితీయు డనిపించుకున్నాడు. తన మాటల గారడీవల్ల ప్రజలు తమ సమస్యలు మరిచిపోయేట్టు చేయగలనన్న ధీమా ఆయన ప్రతి మాటలోనూ కని పించింది. సమాజంలో పెరుగుతున్న విద్వేషం ఎంత ప్రమాదకరమో జనం గ్రహించలేరన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం కాబోలు. మన దేశంలో ప్రజాస్వామ్యం ఎలా కునారిల్లి పోతోందో అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తే వాటిని మోదీ సర్కారు కొట్టి పారేస్తుంది. అవి విదేశీ కొలమానాలని తోసిపుచ్చుతోంది. ఇది జనాన్ని అంతర్ముఖుల్ని చేసి నిద్ర పుచ్చడంలో భాగం. మన మహోన్నత నాగరికత మనకు మార్గదర్శకంగా ఉండాలని, స్ఫూర్తి కలిగించాలని మోదీ అలసట లేకుండా చెప్తున్నారు. కానీ ఆ మహోన్నత నాగరికత సంఫ్‌ు పరివార్‌ భాష్యానికి లోబడి ఉంటుందని ప్రజలు గ్రహించలేరని ఆయన అనుకుంటున్నారు. గత ఎనిమిదేళ్ల నుంచి కొనసాగుతున్న నాసిరకం ఏలుబడే సర్వోత్కృష్టమైందని గొంతు చించుకుని చెప్తున్న వైనం సవ్యంగా ఆలోచించే వారికి మింగుడు పడదన్న వాస్తవాన్ని గ్రహించడానికి మోదీ సిద్ధంగా లేరు. అవినీతిపరులను సమాజం నుంచి బహిష్కరించాలని మోదీ చెప్తున్న మాట బీజేపీలో అవినీతిపరుల ఆగడాలను కప్పి పుచ్చే ప్రయత్నంలో భాగమే. తన మీద విశ్వాసం ఉంచడమే, తాను చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మి నోరుమూసుకుని ఉండడమే సకల సమస్యలకు పరిష్కార మార్గ మన్నది మోదీ ప్రగాఢ విశ్వాసం లాగుంది. బూటకపు వాగ్దానాలతో కాలం వెళ్లబుచ్చడానికి అలవాటు పడిన మోదీ నిరంతరంగా జనం వీటిని నమ్ము తారన్న భరోసాతో ఉన్నట్టున్నారు. మోదీ ప్రసంగం ఆకర్షణీయంగా ఉండొచ్చు. అందులో జనాన్ని కట్టి పడేసే చిట్కాలు ఉండొచ్చు. కానీ ప్రజల వాస్తవ సమస్యలకు పరిష్కారం మాత్రం కాగడా పెట్టి వెతికినా దొరకదు. మాటలు కడుపు నింపవని, వాస్తవాలను వెల్లడిరచే సమాచారం కప్పిపుచ్చడం జరుగుతున్న తప్పులను దిద్దుకోవడానికి ఉపకరించదని ఈ మాటల మాంత్రికుడి తలకెక్కుతుందా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img