Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మానని నోట్ల రద్దు గాయాలు

సరిగ్గా ఆరేళ్ల కింద 2016 నవంబర్‌ 8న నరేంద్ర మోదీ ప్రభుత్వం చెప్పా పెట్టకుండా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. నల్ల ధనాన్ని వెలికి తీయడం, తీవ్రవాదానికి కళ్లెం వేయడం, అవినీతికి అడ్డుకట్ట వేయడం పెద్దనోట్ల రద్దు లక్ష్యం అని ప్రధానమంత్రి మోదీ రేడియో, టీవీల్లో హఠాత్తుగా ప్రత్యక్షమై ప్రకటించారు. ఈ నోట్లను మార్చుకోకపోతే అవి చిత్తు కాగితాల కిందే లెక్క అని మోదీ చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి జనం బ్యాంకుల ముందు పడిగాపులుపడి నోట్లు మార్చుకోవడానికి నానాయాతన పడ్డారు. ఈ క్రమంలో కనీసం 150 మంది మరణించారు. మోదీ ఒక్క కన్నీటిబొట్టు కూడా కార్చలేదు. పెద్దనోట్లను రద్దుచేయడం ద్వారా చెలామణిలో ఉన్న నోట్లు రిజర్వుబ్యాంకు దగ్గరకు చేరాయి. ఎన్ని నోట్లయితే చెలామణిలో ఉన్నాయనుకున్నారో అన్ని కొత్త నోట్లు చెలామణిలోకి వచ్చాయి. మరి నల్లధనం ఏది అన్నది మాత్రం ఇప్పటిదాకా తేలలేదు. మోదీ ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడ్తే ప్రతి సంవత్సరం అదే రోజు పెద్ద పండగ చేస్తుంది. తమ ఘనత చాటుకోవడానికి పత్రికలలో ప్రజాధనంతో వ్యాపార ప్రకటనలు గుప్పిస్తుంది. 2017 నుంచి 2022 నవంబర్‌ ఎనిమిది వరకు మోదీ ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ పెద్దనోట్ల రద్దుచేసిన మరుసటి సంవత్సరం మోదీ సర్కారు నల్లధన వ్యతిరేక దినోత్సవం జరపడం మాత్రం మరిచిపోలేదు. నల్లధనం దాచుకున్న వారు ఆ ధనాన్ని నష్టపోయారు అని మాత్రం దండిగా ప్రచారం చేశారు. పెద్ద నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల దగ్గర ఏ పెద్ద ఆసామీ, ఏ అగ్ర నాయకుడూ కనిపించలేదు. అంటే నల్లధనాన్ని దాచుకున్నవారు బ్యాంకులకు వెళ్లకుండానే తమ పెద్దనోట్లను దొడ్డిదారిన మార్చుకున్నారనుకోవాలి. ఎంత మొత్తంలో పెద్దనోట్లు రిజర్వు బ్యాంకుకు తిరిగి వెళ్లాయో అంతే మొత్తంలో డబ్బు చెలామణిలోకి వచ్చింది. అంటే రిజర్వు బ్యాంకుకు చేరిన నోట్లలో ఒక్కనోటు కూడా నల్లది కాదన్న మాట. నల్లధనం నోట్లరూపంలో ఉంటుందన్నది మోదీ ప్రభుత్వం భ్రమ. నల్లధనంలో నగదురూపంలో ఉండేది ఒక్క శాతం కూడా ఉండదు. వ్యాపార లావాదేవీల్లో అనుసరించే అక్రమ పద్ధతులవల్ల పోగుపడే నల్లధనాన్ని నోట్ల రద్దు ఏమాత్రం నివారించలేక పోయింది. పెద్ద నోట్ల రద్దు మోదీ ప్రభుత్వం కన్నా ముందు కూడా ఒకటి రెండు సార్లు అమలైంది. అప్పుడు చెలామణిలో ఉన్న పెద్ద నోట్లే తక్కువ. వెయ్యిరూపాయల నోట్లను కళ్లతో చూసినవారు అతి కొద్దిమంది. అందువల్ల జనంపై ఆ నోట్లరద్దు ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. కానీ 2016నాటి నోట్లరద్దు ప్రతి వ్యక్తిని దెబ్బ తీసింది. పోనీ పెద్ద నోట్ల రద్దువల్ల డబ్బు చెలామణి తగ్గిందా అంటే అదీ లేదు. అప్పుడు రూ. 17.7 లక్షల కోట్లు చెలామణిలో ఉన్నాయనుకుంటే ఈ ఆరేళ్ల కాలంలో డబ్బు చెలామణి 72శాతం పెరిగి రూ.30.88 లక్షల కోట్లకు చేరింది. అంటే ఎడాపెడా నోట్లు ముద్రిస్తున్నారు. రద్దుచేసిన 500 నోట్ల స్థానంలో కొత్తనోట్లు వచ్చాయి. వెయ్యి నోట్లు కొత్తవి రాలేదు కాని రెండు వేల రూపాయలు భారీ స్థాయిలో ఇప్పుడు చెలామణిలో ఉన్నాయి. నోటు విలువ ధనం నల్లదో తెల్లదో తేలడానికి ఉపకరించే అంశం కాదు.
నోట్లను రద్దు చేయడానికి సాధారణంగా రిజర్వు బ్యాంకు సిఫార్సు చేస్తే ప్రభుత్వం దాన్ని పరిశీలించి ఓ నిర్ణయానికి వస్తుంది. కానీ మోదీ రిజర్వు బ్యాంకుకు ఏ మాత్రం సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుని జనం మీద రుద్దేశారు. నిజానికి ఆయన మంత్రివర్గానికి కూడా నోట్లురద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించిన తరవాతే తెలిసింది. అప్పటి ఆర్థికమంత్రి అరుణ జైట్లీకి కూడా ఈ నిర్ణయంతో సంబంధం లేదు. అంటే విధాన నిర్ణయాల్లో కూడా మోదీది నిరంకుశత్వమే. పెద్ద నోట్లరద్దు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారిని కష్టాలపాలు చేసింది. చిన్న, మధ్యతరగతి వ్యాపారులను కోలుకోలేని దెబ్బతీసింది. మన దేశంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారే 94 శాతం ఉన్నారు. వీరికే తీవ్ర విఘాతం కల్గింది. చేతిలో డబ్బు ఆడనందువల్ల చిన్న, మధ్య తరగతి వ్యాపారులు చాలా ఇబ్బందిపడ్డారు. కొందరైతే ఈ వ్యాపారాలు మానుకోవలసి వచ్చింది. ఇలాంటి వ్యాపారాలు పరిస్థితి కుదుటపడ్డ తరవాత పుంజుకోవడానికి ఉండే అవకాశం చాలా తక్కువ. ఇలా వ్యాపారాలు కోల్పోయినవారు ఉపాధికోసం యాతనపడ్డారు. నోట్ల రద్దు నిరుద్యోగాన్ని పెంచింది. మన స్థూల జాతీయోత్పత్తిని లెక్కకట్టే విధానమే లోపభూయిష్టమైంది. ఆ లెక్కలకు వ్యవస్థీకృత రంగమే ప్రధానాధారం. ఆర్థికాభివృద్ధి పుంజుకుంటోందన్న దశలో మోదీ నోట్లరద్దుతో దెబ్బ తీశారు. ఆ తరవాత వస్తు సేవల పన్ను (జి.ఎస్‌.టి.) సమ్మెట పోటైంది. నోట్లు రద్దయిన తరవాత నోట్ల కొరత రెండు మూడునెలలు తీవ్రంగానూ, ఏడాదిపాటు ఓ మోస్తరుగానూ కొన సాగింది. ప్రభుత్వ దిక్కూ దిశాలేని విధానం జనాన్ని ఇబ్బందుల పాలు చేసింది. పెద్దనోట్లరద్దు తరవాత 2017-18లో ఆర్థికాభి వృద్ధి రేటు 8శాతం ఉంటే 2019-20లో అది 3.1 శాతానికి పడిపోయిందని అధికారికలెక్కలే చెప్తున్నాయి. అవ్యవస్థీకృత రంగం పరిస్థితి ఆర్థికాభివృద్ధి అంచనాల్లో అంతగా ప్రతిఫలించదు. వ్యవస్థీకృత రంగం లోనూ అభివృద్ధి కుంటుపడడానికీ పెద్దనోట్ల రద్దు అనే తప్పుడు విధానమే కారణం.
పెద్దనోట్లరద్దు గురించి వాస్తవాలు బయటపెట్టాలని సమాచార హక్కు కింద ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా మోదీ సర్కారు చలించ లేదు. దానికి సంబంధించిన పత్రాలను వెల్లడిరచలేదు. పెద్దనోట్ల రద్దు తరవాత దాదాపు నెలరోజులకే ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో సవాలుచేశారు. 2016 డిసెంబర్‌లోనే ఈ కేసును అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. కాని విచారణ కొనసాగలేదు. ఆ కేసు బుధవారం నాడే విచారణకు వచ్చింది. సాధారణంగా విధాన నిర్ణయాలపై కోర్టులు తీర్పులు చెప్పవు. న్యాయమూర్తి నజీర్‌ నాయకత్వంలోని అయిదుగురు న్యాయ మూర్తుల బెంచి నోట్లరద్దు రాజ్యాంగంలోని 300ఎ అధికరణానికి విరుద్ధమైందో కాదో తేల్చాల్సి ఉంది. ఈ అధికరణం ప్రకారం ఏ వ్యక్తి ఆస్తిని లేకుండా చేయడం కుదరదు. ఏకపక్షంగా ప్రభుత్వానికి నోట్లు రద్దుచేసే అధికారం ఉందో లేదో సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది. ఏమైతేనేమి నోట్లరద్దు గాయాలు ఆరేళ్లకుకూడా మానలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img