Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మూడోదశ నిరోధం అవశ్యం

కొవిడ్‌19 మహమ్మారి దేశప్రజల జీవనచిత్రాన్ని సమూలంగా మార్చివేసింది. లక్షలాదిమంది ప్రాణాలను కంటికి కనిపించని వైరస్‌ బలిగొన్నది. మొదటి, రెండో దశల్లో ఈ మహమ్మారి ప్రవేశాన్ని అడ్డుకొనేందుకు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా కేంద్ర పాలకులు తమ ఎజెండాను అమలు చేయడంలో మునిగి పోయారు. పరిస్థితులు విషమించి దేశాన్ని ఈ మహమ్మారి చుట్టుముట్టి కోట్లాదిమంది జీవన పరిస్థితులను తల్లకిందులు చేసింది. రెండోదశ ఇంకా కొనసాగుతూనే ఉంది. మళ్లీ క్రమంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం 38 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ స్థితిలో మూడోదశ మహమ్మారి నిరోధానికి ప్రజలంతా కరోనా నిబంధనలు విధిగా పాటించాలని ప్రధాని మోదీ ప్రజలను అప్రమత్తం చేశారు. మంచిదే, ఇప్పటికైనా మేలుకొన్నారని భావించాలి. గడిచిన రెండు దశల్లోనూ ప్రభుత్వ వైఫల్యాలను దేశ ప్రజలు స్పష్టంగా గ్రహించారు. తొలి నుంచి ఆరోగ్య శాఖను తన చేతుల్లో పెట్టుకొని వ్యవహారాలు నిర్వహిస్తున్న మోదీ మంత్రివర్గం మార్పులు, చేర్పుల్లో భాగంగా ఆరోగ్యమంత్రిని బలిచేశారు. మొదటి దశ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తు హెచ్చరికలను పట్టించుకొని తగు చర్యలు చేపట్టకుండా ట్రంప్‌ సేవలో మునిగిపోయారు. పార్లమెంటులో అవసరమైన చట్టాలు చేసుకొని తీరిగ్గా 2020 మార్చి 24 రాత్రి నాలుగు గంటలు గడువిచ్చి జాతీయ లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో కోట్లాదిమంది వలస కార్మికులు జీవితంలో ఏనాడు అనుభవించని కష్టాలు ఎదుర్కొని వందలు, వేల మైళ్ళు కాలి నడకన ఇళ్లకు చేరుకున్నారు. అన్ని రంగాల కార్య కలాపాలు స్తంభించిపోయాయి. మోదీ తన ప్రసంగాలు, చర్యలతో బెంబేలెత్తించారు. కరోనాను అన్ని దేశాలకంటే ముందు తామే నియంత్రించామని చెప్పి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించారు. పెద్ద గడువు లేకుండానే రెండోదశ మహమ్మారి వేగంగా దేశమంతటా విజృంభించింది. ఈ రెండుదశల్లో పాలకులు తమ వైఫల్యాలను అంగీకరించలేదు. విమర్శలను సహృదయంతో స్వీకరించి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. పనులు లేక ఆదాయం లేక సామాన్య జనమేగాక మధ్యతరగతి జీవులు సైతం ఇటు ఆర్థిక, అటు మహమ్మారి భీతి కష్టాలతో బెంబేలెత్తిపోయారు. రెండు దశల్లో కోట్లాది మంది ఉపాధులు, ఉద్యోగాలు కోల్పోయారు. కొవిడ్‌ మహమ్మారికి ముందే పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ, రెండు దశల్లోనూ సంక్షోభంలో పడిరది. కొత్తగా 20 కోట్ల మందికి పైగా పేదరికంలోకి వచ్చి చేరారు. ఇవన్నీ ప్రజలు అనుభవించినవే. వీటిని మరిచిపోవడం సాధ్యమా! ప్రజల కష్టాలను పట్టించుకొని సహాయపడకుండా ఉపదేశాలు, హెచ్చరికలతో ఎలాంటి ప్రయోజనం చేకూరదు. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజిని గడచిన రెండు దశల్లో ప్రకటించారు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఎలాంటి సహాయం అందలేదు. పైగా కార్పొరేట్లకు ఒకేసారి లక్షా 45 వేల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారు. ప్యాకేజీ అంతా అంతక్రితం చేపట్టిన కార్యకలాపాల సర్దుబాటుకు కేటాయింపులు చేశారు. తాజాగా ప్రకటించిన 6 లక్షల కోట్లకు పైగా ఉద్దీపన ప్యాకేజి కూడా అత్యధికంగా సర్దుబాట్లకే సరిపోయింది. ఆరోగ్య రంగానికి కేవలం 15 వేల కోట్లు కేటాయించారని, ఇది ఏ మూలకు సరిపోతుందన్న వ్యాఖ్యలు బలంగా వినిపించాయి. మహమ్మారి నియంత్రణ లేదా మూడోదశ నిరోధానికి కేవలం నిబంధనలు పాటిస్తే సరిపోతుందా? ఒకవేళ మూడోదశ ప్రవేశిస్తే అందుకు ప్రజలను బాధ్యులను చేయడానికి పన్నిన ఎత్తుగడ కాదు కదా ఇది! ప్రజలు గుంపులుగా చేరకూడదని మోదీ చెప్పిన మాట వాస్తవమే. ఒకేసారి ప్రపంచ మానవాళి అంతా ఏనాడు ఎరుగని విపత్తు వచ్చి పడిన దశలోనూ నిష్క్రియాపరంగా ఉన్న పాలకుల్లో మనవాళ్లే ప్రధమస్థానంలో ఉన్నారని భావించాలి. మహమ్మారి రోజుకు వేలాదిమంది ప్రాణాలు హరిస్తున్నదని తెలిసి కూడా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దాదాపు మూడు నెలలు సాగదీసి నిర్వహించడానికి అనుమతించడం సమర్థ పాలనకు సూచిక అవుతుందా? పశ్చిమబెంగాల్‌ లేదా మరో రాష్ట్రంలో అనేక పదుల ప్రచార సభల్లో ప్రధాని, హోంమంత్రి చేసిన ప్రసంగాలు వినేందుకు లక్షలాది మంది ఎలాంటి మాస్కులు ధరించారు? ఆ రోజుల్లో ఈ పాలకులకు నిబంధనలే గుర్తు రాలేదు. మహామహులైన అనేక మంది మాస్కులు లేకుండానే సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సభల ద్వారా బెంగాల్‌లో మహమ్మారి విస్తరించిందని అధ్యయనాలు తెలియజేశాయి. కొవిడ్‌ నియంత్రణ ప్రధానంగా టీకాల పంపిణీతోనే సాధ్యమవు తుందని శాస్త్రవేత్తలు, అధ్యయనవేత్తలు, ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో ప్రజలు నిబంధనలు విధిగా పాటించవలసిందే. ప్రభుత్వం టీకాల ఉత్పత్తి, పంపిణీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ అంశంపై దేశ, విదేశీ విశ్లేషకులు, మీడియా అనేక దేశాలు, చివరకు ఐరాస పరిశీలకులు విశ్లేషించారు. మోదీ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొని ప్రజలను వేలెత్తి చూపడానికి ప్రయత్నించడంలో ఏ మాత్రం ఔచిత్యం లేదు. లక్షలాది మంది గంగానదిలో మునిగి పునీతులు అవుతారన్న నమ్మకానికి కుంభమేళాకు ఏడాది ముందుగానే అనుమతించి మహమ్మారి మరిన్ని ప్రాంతాలకు చేరడానికి కారకులయ్యారు. అసలే కాలుష్య భరితమైన గంగలో వందలాది కొవిడ్‌ బాధితుల మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. ఇవి మూఢ నమ్మకాలకు, పాలకుల వైఫల్యాలకు ప్రతీకగా నిలుస్తాయి. టీకాల ఉత్పత్తికి ప్రభుత్వరంగ సంస్థలను విస్మరించి రెండు ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. అవి ఉత్పత్తి చేసిన టీకాలు తక్కువ. వాటిని సైతం ఎగుమతికి అనుమతించి దేశంలో కరోనా బాధితులను గాలికి వదిలేశారు. పరిస్థితులు ముంచుకొచ్చిన తర్వాతనైనా ఉత్పత్తి పెంచి ప్రజలందరికీ వేగంగా టీకాలు వేయించవలసిన బాధ్యతను కేంద్రం తీసుకోకుండా రాష్ట్రాల మీద భారం మోపింది. టీకాలు అందుబాటులోకి వచ్చినా అవి అరకొరగానే ఉన్నాయి. కనీసం 75 శాతం ప్రజలకు టీకాలు పంపిణీ చేస్తేనే కొంతవరకు భరోసా కల్పించినట్లవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టీకాల రేట్లను మూడుగా విభజించడం, 1845 ఏళ్ల మధ్య వయస్కులకూ టీకాను మే 1 నుండి ఇస్తామని అపసవ్య ప్రకటన చేయడం వైఫల్యం గాక మరేమిటి? టీకాలు నిల్వ లేకుండానే ప్రకటన చేయడం మోదీకే తగింది. మాటల చాతుర్యంతో చేసే పాలనను ప్రజలు ఎంతో కాలం నమ్మరు. మూడో దశకైనా సిద్ధం కావాలని సుప్రీంకోర్టు చేసిన సూచనను సైతం పట్టించుకోలేదని మోదీ తాజా హెచ్చరిక తెలియజేస్తుంది.
ఎలాంటి చర్యలు చేపడతారు, ప్రణాళిక ఏమిటి? తయారుచేసి మాకు ఇవ్వండి అని సుప్రీం ఆదేశాన్ని పట్టించుకొని ఉంటే చర్యల జాబితాను ప్రకటించి ఉండాలి. రెండో దశ ముగిసిపోలేదు. టీకాలను వేగంగా ప్రజలకు పంపిణీ చేసేందుకు సంసిద్ధత లేదు. దేశ వ్యాప్తంగా మూడో దశను ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాలకు ఆర్థిక వనరులు అందజేయవలసిన బాధ్యత కేంద్రానిదే. ఎందుకంటే రాష్ట్రాల పరిధి నుంచి ఆరోగ్య వ్యవస్థను కేంద్రం తన అధీనంలోకి తీసుకున్నది. ఇంత వరకు దాదాపు 10.5 కోట్ల మందికి మాత్రమే టీకాలు వేశారని అంచనాలు వెలువడ్డాయి. నత్తనడకన టీకాను పంపిణీ చేస్తే 2022 చివరికి అందరికీ టీకా అందుతుందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. తాజాగా డెల్టాప్లస్‌ వేరియంట్‌ 104 దేశాలకు విస్తరించిందని, అన్ని వేరియంట్ల కంటే ఇది ఎక్కువ ప్రమాదకారి అని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రాస్‌ అధనామ్‌ చేసిన హెచ్చరికనైనా మోదీ పట్టించుకొని తగు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img