Friday, April 19, 2024
Friday, April 19, 2024

మోదీకి ఊరట కలిగించే సుప్రీంకోర్టు తీర్పు

జకియా జాఫ్రీది రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న న్యాయ పోరాటం. తన భర్త మాజీ ఎంపీ ఎహసాన్‌ జాఫ్రీని గుజరాత్‌ మారణకాండ సందర్భంగా కిరాతకంగా హతమార్చా రని ఆయన భార్య ఈ ఇరవై ఏళ్లుగా ఎక్కని గుమ్మం లేదు. చివరకు సుప్రీంకోర్టు ఆమె మొర ఆలకించలేదు. ఆమె పిటిషన్‌లో పస లేదని శుక్రవారం తేల్చింది. గుజరాత్‌ మారణకాండ జరిగి ఇరవై ఏళ్లు దాటింది. ఈ మారణ కాండకు ముందు గోధ్రాలో రైలు పెట్టె దగ్ధం చేశారు. ఆ సందర్భంలో మరణించిన వారిలో ఎక్కువ మంది హిందువులు. దీనికి ముస్లింలు కారణమని అనుమానించారు. అందువల్ల హిందువులు ప్రతీకారం తీర్చుకున్నారన్న వాదన ఉంది. ఆ ప్రతీకార మారణ కాండ మూడు నెలల పాటు నిరాఘాటంగా కొనసాగింది. కనీసం 2000 మంది మరణించారు. అందులో ముస్లింల సంఖ్యే ఎక్కువ. ఈ మారణ కాండకు విస్తృతమైన కుట్ర జరిగిందనీ అందులో అప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర ఉందని, రెండు మూడు రోజులు కిమ్మనకుండా ఉండాలని ప్రభుత్వంలోని ఉన్నత వర్గాల నుంచి పోలీసులకు ఆదేశాలు అందాయన్న ఆరోపణ ఉంది. ఈ ప్రతీకార చర్యను నిరోధించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నించిన దాఖలాలు లేవు. పైగా ప్రోత్సహించా రన్న అనుమానం ఉంది. అప్పుడు మోదీ మీద అనేక ఫిర్యాదులు వచ్చాయి. మారణకాండ కొనసాగుతుంటే ఆయన చూస్తూ కూర్చున్నా రన్న ఆరోపణ ఉంది. ఇది ముస్లింల మీద జరిగిన దాడిలో భాగమే కనుక ఈ కుట్రలో మోదీ పాత్ర కూడా ఉందని ఒక్క జకియా జాఫ్రీనే కాదు, అనేక మంది ఆరోపించారు. కానీ ఈ వ్యవహారాలు తేల్చడానికి పదేళ్ల పాటు దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) మోదీకే కాక మరో 60 మందికి పైగా క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఇలా క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై నాయపోరాటం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఎహసాన్‌ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ, మోదీకి క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని వివిధ దశల్లో సవాలు చేశారు. సుప్రీంకోర్టులో జకియా, తీస్తా సెతల్వాడ్‌ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ గతేడాది డిసెంబర్‌లో ముగిసింది. అప్పుడు న్యాయ మూర్తులు ఎ.ఎం. ఖాన్విల్కర్‌, దినేశ్‌ మహేశ్వరి, సి.టి. రవి కుమార్‌తో కూడిన బెంచి తీర్పు చెప్పడం వాయిదా వేసి శుక్రవారం నాడు వెల్లడిరచింది. గుజరాత్‌ మారణకాండకు పన్నిన కుట్రలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ పాత్ర ఉందన్న వాదన అన్ని దశల్లోనూ విఫలమవుతూనే వచ్చింది. మోదీ పాత్ర నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు లేవనే అన్ని స్థాయిల్లో నిర్ధారణలకు వచ్చారు. మోదీ పాత్ర ఏ మేరకు ఉండడానికి అవకాశం ఉంది, ముఖ్యమంత్రి మౌనానికి, ఉదాసీనతకు, నిష్క్రియకు కూడా నిర్దిష్టమైన కారణాలు ఉంటాయని, మారణకాండ కొనసాగించడానికి ఏ ముఖ్యమంత్రి లిఖిత రూపంలో ఆదేశాలు ఇవ్వరనీ సుప్రీంకోర్టు ఎంత లోతుగా ఆలోచించిందో తెలియదు. రాజకీయ నాయకులు అధికారులకు ఇచ్చే ఆదేశాలు అన్ని సందర్భాల్లో లిఖిత రూపంలో నిర్దిష్టంగా ఉండవు. ఆ నాయకుల మనసెరిగి పని చేయడంలో నైపుణ్యం సంపాదించిన అధికారులే ఎక్కువ మంది ఉంటారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలు దొరకవు. అయినా ఎహసాన్‌ జాఫ్రీని గుల్బర్గ్‌ సొసైటీలోని ఆయన ఇంట్లోంచి బయటికి లాగి, నరికి చంపి, దగ్ధం చేశారన్నదీ వాస్తవమే. మూక దాడిలో ఎన్ని రుజువులు దొరికి ఉంటాయి? ఎంత మందిని శిక్షించి ఉంటారు. హతమార్చడం వాస్తవమైనా హంతకులకు వ్యతిరేకంగా నిర్దిష్ట సాక్ష్యాధారాలు దొరక నప్పుడు ఎవరికీ శిక్ష పడకపోవచ్చు. అందులోనూ ముఖ్యమంత్రి లాంటి వారి మౌన అనుమతి ఉన్నప్పుడు సాక్ష్యాలు దొరకడం కష్టమే.
ఈ మారణకాండపై విచారణ జరిపిన అహమదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు 24 మందికి శిక్ష విధించింది. ‘‘పౌర సమాజ చరిత్రలో ఇది అత్యంత చీకటి రోజు’’ అని హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇదే కేసులో శిక్షించడానికి తగిన సాక్ష్యాలు లేనందువల్ల ఒక బీజేపీ కార్పొరేటర్‌తో పాటు మరో 36 మందిని అలహాబాద్‌ హైకోర్టు శిక్షించకుండా వదిలేసింది. పైగా విస్తృత కుట్రేమీ లేదని కూడా తేల్చింది. అప్పటి ప్రధాన మంత్రి వాజ్‌పేయి, నరేంద్ర మోదీ రాజధర్మం పాటిం చాలని మోదీ ఉండగానే వ్యాఖ్యానించారు. తాను ఆ పనే చేస్తున్నానని మోదీ చెప్పుకున్నారు. ఆ సమయంలో అమెరికాతో సహా ఒక దేశం తరవాత మరో దేశం మోదీకి ఆయా దేశాల్లో పర్యటించడానికి వీసాలు నిరాకరించాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఏ దేశమూ నిష్కారణంగా వీసా నిరాకరించదుగా. కాని 2014 మే 26వ తేదీన మోదీ ప్రధాని పీఠం ఎక్కగానే వీసా నిరాకరించిన దేశాలన్నీ బాహువులు చాచి మోదీకి స్వాగతం చెప్పాయి. ఇవన్నీ రాజకీయ నిర్ణయాలేనన్నది బ్రహ్మ రహస్యం ఏమీ కాదు. కానీ న్యాయవ్యవస్థ న్యాయాన్యాలే చూస్తుంది తప్ప రాజకీయ దృక్కోణం ప్రదర్శించదని జనం నమ్ముతారు. ఆ నమ్మకం అనేక రూపాల్లో వమ్ము అవుతుంది. ఇప్పుడూ అదే జరిగింది. ఇంతకన్నా బాధాకరమైంది ఏమిటంటే ముగ్గురు నాయమూర్తులు వెలువరించిన తీర్పులో జకియా జాఫ్రీ తీర్పులో పస లేదు అనడం, తీస్తా సెతల్వాడ్‌ పిటిషన్‌లో దురుద్దేశం ఉందని వ్యాఖ్యానించడం న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం సడలడానికే ఉపకరిస్తుంది. ముఖ్యంగా మారణ కాండకు బలై ప్రాణాలర్పించిన గుజరాత్‌ ముస్లింలకు మరోసారి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం తగ్గడానికి దారి తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. న్యాయమూర్తులకు దురుద్దేశం అంటగట్టడానికి అవకాశం లేకపోవచ్చు. కానీ న్యాయమూర్తులు ఎందుకు ఈ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని అలవోకగా వ్యాఖ్యానిస్తుంటే మనస్సు చివుక్కు మంటుంది. ఈ వ్యవహారంలో మొట్టమొదటి సిట్‌ మోదీ నిర్దోషి అని తేల్చింది. ఆయన మీద వచ్చిన ఆరోపణలను నిరూపించడానికి సాక్ష్యాధారాలు లేవని భావించింది. 2014లో మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంవల్ల మోదీ మీద వచ్చిన ఆరోపణలను ప్రస్తావించే అవకాశమైనా లేకుండా పోయింది. ఇటీవలి కాలంలో మోదీ సర్కారు ముస్లింల మీద కత్తిగట్టినట్టు వ్యవహరిస్తోంది కనక ముస్లింలలో అభద్రతా భావం ఈ తీర్పువల్ల మరింత పెరగవచ్చు.
ప్రధాన మంత్రి మోదీకి మాత్రం 2022 జూన్‌ 23 శుభదినం. 2002 నాటి మారణ కాండను జనం ఎంత తొందరగా మరిచి పోతారా అని మోదీ, ఆయన భక్తులు, హిందుత్వ వాదులు ఆలోచించడం సహజం. తాజాగా శుక్రవారం మోదీకి క్లీన్‌ చిట్‌ ఇవ్వడంవల్ల జి 7 శిక్షరాగ్ర సభకు, ఆ తరవాత జర్మనీకీ వెళ్తున్న మోదీకి మరింత ఉత్సహం కలిగిస్తుంది. ఎందుకంటే మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధులు నూపుర్‌ శర్మ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను ముస్లిం దేశాలు, ముఖ్యంగా పర్షియన్‌ సింధు శాఖ దేశాలు ఎంత తీవ్రంగా స్పందించాయో గమనిస్తే ఈ తీర్పు మోదీకి ఎంత అనుకూలమో అర్థం అవుతుంది. జనం పడ్డ కష్టాలను చూసి తీర్పులు చెప్పడానికి అవకాశం లేదుగా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img