Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మోదీకి గుణపాఠం నేర్పిన కర్నాటక

కర్నాటక ఎన్నికల పోరులో తాబేలు గెలిచింది, కుందేలు ఓడిరది. మధ్యలో రెండేళ్లు మినహా 2008 నుంచి దక్షిణాదిలో బీజేపీకి ఉన్న ఒకే ఒక్క సౌధం కూలిపోయింది. మోదీ ఉంటే ఏదైనాసాధ్యమే అన్న మంత్రజపంకూడా ఎందుకూ కొరగాకుండా పోయింది. సాధారణంగా ఎన్నికలు ముగిసిన వెంటనే నిర్వహించే జనాభిప్రాయ సేకరణలు గాడి తప్పుతుంటాయి. కానీ ఈ సారి ఆ జోస్యాలన్నీ నిజమైనాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన 113 స్థానాలకన్నా కాంగ్రెస్‌ దాదాపు పాతిక సీట్లు ఎక్కువే సాధించింది. జనతా దళ్‌ (ఎస్‌) కు పట్టున్న పరిమిత ప్రాంతంలో తప్ప ఎక్కువ చోట్ల ముఖాముఖి పోటీయే జరిగింది. అందుకే మోదీ నాయకత్వంలోని బీజేపీని ఓడిరచడం అసాధ్యం అని పాతుకుపోయి ఉన్న అభిప్రాయం కాస్తా మారిపోవలసి వచ్చింది. కాంగ్రెస్‌కు 136 సీట్లు వచ్చాయి. అంటే 2018 కన్న 57 స్థానాలు ఎక్కువ సంపాదించినట్టే. బీజేపీ 65 చోట్ల గెలిచింది. ఆ పార్టీకి మునుపటితో పోలిస్తే 39 స్థానాల్లో అపజయం ఎదురైంది. జె.డి.(ఎస్‌) పరిస్థితి మాత్రం గణనీయంగా తారు మారైంది. ఇది వరకు 37 సీట్లు ఉంటే ఇప్పుడు 18 స్థానాలు కోల్పోయి 19 సీట్లకు పరిమితం అయింది. ఓట్ల శాతం ప్రకారం చూస్తే కాంగ్రెస్‌ 2018లో 38. 14 శాతం ఓట్లు సంపాదిస్తే ఇప్పుడు అయిదు శాతం ఓట్లు పెరిగి 43 శాతం ఓట్లు సాధించగలిగింది. 2018లో గెలిచిన బీజేపీ సాధించిన 36.35 శాతం ఓట్ల కన్నా కాంగ్రెస్‌ ఎక్కువ శాతం ఓట్లు సంపాదించినా ఫలితం దక్కలేదు. ఈ సారి కాంగ్రెస్‌ 43 శాతం ఓట్లు సాధించింది. మనం అనుసరిస్తున్న ఎన్నికల వ్యవస్థ ప్రకారం ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి అన్నది ప్రధానం కాదు. ఓట్ల శాతాన్నిబట్టి సీట్లు ఉండకపోవచ్చు. బీజేపీ పరాజయం పాలైనా ఓట్ల శాతం తగ్గకపోవడం ఆ పార్టీకి ఊరటే. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ప్రజల సమస్యలు ఎన్నికల సమయంలో చర్చకు రాకుండా పోయాయి. కానీ కర్నాటక శాసనసభ ఎన్నికలలో మాత్రం బసవరాజ్‌ బొమ్మై నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా కొనసాగిందంటున్న అవినీతినే ప్రజలు నిరాకరించినట్టు కనిపిస్తోంది. 2008లో బీజేపీ మొట్టమొదటి సారి అధికారంలోకి వచ్చింది. కానీ బీజేపీది ఎప్పుడూ సుదీర్ఘ పోరాటమే. 1983 లో మొదటి సారి 110 స్థానాలకు పోటీ చేసిన బీజేపీ 18 సీట్లు, 7.9 శాతం ఓట్లు సాధించింది. 71 చోట్ల బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 1985 ఎన్నికలలో బీజేపీకి చేదు అనుభవమే మిగిలింది. 115 స్థానాల్లో పోటీ చేస్తే రెండు సీట్లే దక్కాయి. ఓట్ల శాతం కూడా 3.7 శాతానికి పడిపోయింది. 1989లో 119 స్థానాల్లో పోటీ చేసి నాలుగు సీట్లు, 4.13 శాతం ఓట్లు సంపాదించింది. 2014లో మాత్రం బీజేపీ 18 లోకసభ స్థానాలు దక్కించుకుంది. మళ్లీ 2013 శాసనసభ ఎన్నికలలో 40 సీట్లకు పరిమితం కావలసి వచ్చింది. ఈ లెక్కలన్నీ చూస్తే బీజేపీ అంత సులువుగా పోరాడకుండా ఉండదు. ఈ సారి బీజేపీ ఓటమికి అనేక కారణాలు చూపవచ్చు. కానీ బీజేపీ నిరంతర పోరాట పటిమను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. మత ప్రాతిపదికన ఎన్నికల్లో విజయం సాధించాలన్న బీజేపీ ప్రయత్నం ఈ సారి బెడిసి కొట్టింది. బజరంగ్‌ దళ్‌ ను బజరంగ్‌ బలీగా మార్చడానికి మోదీ ఎన్ని తంటాలు పడ్డా ఓటర్లు మెచ్చలేదు.
ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ ఏలుబడిలో పెరిగిన అవినీతి లాంటి ప్రజా సమస్యల మీద కాంగ్రెస్‌ దృష్టి కేంద్రీకరించినందువల్ల మోదీ మతత్వ ఎత్తుగడలు కూడా వీగిపోయాయి. జె.డి.(ఎస్‌) ఇప్పటికన్నా బలంగా ఉండడం, అనేక చోట్ల కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎదుర్కోవలసి రావడం గత ఎన్నికలలో బీజేపీకి కలిసొచ్చింది. ఈ సారి ఉత్తర కర్నాటకలో, మధ్య కర్నాటకలో చాలా వరకు కాంగ్రెస్‌, బీజేపీ ముఖాముఖి తలపడడంవల్ల దానికి బొమ్మై ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి తోడు కావడంతో కాంగ్రెస్‌ కు విజయావకాశాలు పెరిగాయి. కల్యాణ్‌ కర్నాటకలో కాంగ్రెస్‌ కు ఉన్న పట్టు నిలబెట్టుకోవడమే కాక బీజేపీకి బలమైన ప్రాంతాలు అనుకునే కిట్టూరు కర్నాటక, మధ్య కర్నాటకలోనూ కాంగ్రెస్‌ బీజేపీ కుడ్యాలను ఛేదించగలిగింది. అలాగే పాత మైసూరు జె.డి.(ఎస్‌) కు కంచు కోట అన్న అభిప్రాయమూ తారు మారై కాంగ్రెస్‌ కు లాభం చేకూర్చింది. కుల సమీకరణల మీద ఆధారపడే బీజేపీ పాచికా పారలేదు. లింగాయత్‌ ల ప్రభావం గురించి మాట్లాడిన మాటలు పూర్తిగా నెరవేరలేదు. ఒక్కలిగ సామాజిక వర్గం వారు ఈ సారి కాంగ్రెస్‌ కు దన్నుగా నిలిచినట్టున్నారు. ఉత్తర కర్నాటకలో జె.డి.(ఎస్‌) ప్రాభవం తగ్గడమూ కాంగ్రెస్‌ కు ఉపకరించింది. బీజేపీలో బలమైన నాయకులనుకున్న అనేక మంది ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారే వారికి కొదవ ఉండదు. హుబ్లి-ధార్వాడ్‌ సెంట్రల్‌ నుంచి పోటీ చేసిన జగదీశ్‌ షెట్టర్‌ బీజేపీని వదిలి కాంగ్రెస్‌ లో చేరినా ఓటమి తప్పలేదు. అంతకు ముందు ఆయన వరసగా ఈ నియోజక వర్గం నుంచి ఆరు సార్లు గెలిచారు. బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న లక్ష్మణ్‌ సావది ఇటీవలే కాంగ్రెస్‌లో చేరి అథానీ నుంచి పోటీచేసి గెలిచారు. దీన్నిబట్టి గెలుస్తుందనుకున్న పార్టీలో చేరే తత్వం ఎప్పుడైనా పని చేస్తుందన్న భ్రమ వీడిరది. వెరసి కర్నాటక ఓటర్లు సర్వాంతర్యామిలా వ్యవ హరించిన మోదీకి గుణపాఠంనేర్పారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అన్న మోదీ మంత్రజపం ఘోరంగా విఫల మైంది. మోదీ, అమిత్‌షాద్వయం కర్నాటకలో స్థానిక నాయకత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టడం ప్రతికూల ఫలితాలు ఇచ్చింది. కాంగ్రెస్‌ మాత్రం సిద్ధ రామయ్య, డి.కె.శివకుమార్‌ లాంటి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. సోనియా, రాహుల్‌, ప్రియాంక కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్పటికీ స్థానిక నాయకులను నిగమ శర్మ అక్క స్థానానికి దిగజార్చకుండా కాంగ్రెస్‌ జాగ్రత్త పడిరది. ఏడాది కాలంలో హిమాచల్‌ ప్రదేశ్‌, కర్నాటకలో బీజేపీని గద్దెదించిన కాంగ్రెస్‌లో నూతనోత్సాహం భవిష్యత్తులో నిరాసక్తంగా ఉండకుండా జాగ్రత్త పడవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పుంజుకోవడం కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అన్న మోదీ సంకల్పం మీద నీళ్లు చల్లింది. విజయం సాధిస్తే తన ఘనతేనని ప్రచారం చేసుకునే రాట్నం చుట్టూ తిరిగే ఈగలాంటి మనస్తత్వం గల మోదీకి తగ్గవలసిన దెబ్బే తగిలింది. మొత్తం మీద దక్షిణాదిలో బీజేపీ చేతిలో ఉన్న ఒక్క రాష్ట్రమూ కోల్పోయింది. ఈ అపజయానికి మోదీ బాధ్యత వహిస్తారా అన్నదే అసలు ప్రశ్న.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img