Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

మోదీ పడగ నీడ

దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందనీ, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందనీ, ఆక్సిజన్‌ అందక ఇంతమంది మరణించారనీ, ప్రజాస్వామ్యం మంటగలిసిందని, గంగా నదిలో శవాలు కొట్టుకొస్తున్నాయని పత్రికలలో రాస్తే, టీవీ చానళ్లలో ప్రసారం చేస్తే ఊరుకోవడానికి మోదీ సర్కారు చేతగానిదనుకుంటే ఎలా! ఇలాంటి వారికి బుద్ధి చెప్తుంది. చెప్పింది కూడా. అనేక కేంద్రాల నుంచి వెలువడే దైనిక్‌ భాస్కర్‌ హిందీ దినపత్రిక మీద, లక్నోకు చెందిన భారత్‌ సమాచార్‌ టీవీ మీద కొరడా రaళిపించింది. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మీ ఇళ్ల మీద, ఆఫీసుల మీద ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌, సీబీఐ లాంటి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలతో దాడి చేయించగలం అని నిరూపించింది. ఆ వార్తా సంస్థలకు పెట్టుబడి సమకూర్చే వారినీ వదలలేదు. ప్రభుత్వమూ మాదే, ప్రభుత్వ వ్యవస్థలూ, సంస్థలూ మావే అన్నది మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు ధీమా. మోదీ హయాంలో న్యాయమార్గ పాలన అంటే మోదీ, అమిత్‌ షా గీసే లక్ష్మణ రేఖలే. అవే చట్టాలు. వారు చెప్పేదే న్యాయం. ‘‘మేం చెప్పేదే చట్టం. మేం చేసేదే పరిపాలన’’ అన్నది ఆ ప్రభుత్వ ధోరణి. అందుకే తమ ప్రభుత్వానికి ఎదురు ఉండకూడదనుకుంటుంది. తమకు అందరూ జడవాలనుకుంటుంది. లేకపోతే ఆ వార్తా సంస్థల, వాటిలో పనిచేసే పత్రికా రచయితల నోరు నొక్కేస్తుంది. వారి మీద దుష్ప్రచారం చేస్తుంది. భయపెడ్తుంది. ప్రధానమైన మీడియా అంతా మోదీ సర్కారుకు దాసోహం అంటుంటే గుప్పెడు మీడియా సంస్థలు నిజం చెప్పాలని, ప్రజల వాణిగా వ్యవహరించాలని అనుకుంటే కుదిరే పని కాదని, తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని దైనిక్‌ భాస్కర్‌, భారత్‌ సమాచార్‌ మీద దాడులు నిరూపిస్తున్నాయి. ఒక వేపు ప్రభుత్వ ఆదేశాలకోసం, కనుసైగల కోసం ఎదురుచూస్తూ ప్రభుత్వానికి దాసోహం అంటున్న మీడియా. మరో వేపు నిజం చెప్పాలని, వాస్తవాలను చిత్రించాలని, ప్రభుత్వ దుశ్చేష్టలను ఎత్తి చూపించాలని, ప్రజల వాణిగా మెలగాలని, ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అనిపించుకోవాలని తాపత్రయపడే మీడియా. ఎన్ని దాడులు చేయించినా దైనిక్‌ భాస్కర్‌ మేం భాస్కరులం, స్వతంత్రులం అని వాదిస్తూనే ఉంది. పాఠకుల, ప్రజల ప్రయోజనాలకు కాపలాదార్లుగా ఉంటాం అని పునరుద్ఘాటిస్తోంది. దిల్లీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రలోని దైనిక్‌ భాస్కర్‌ కార్యాలయాలన్నింటి మీద ఆదాయపు పన్ను (ఐ.టి) శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఇ.డి.) విభాగం అధికారులు విరుచుకుపడ్డారు. గంటల కొద్దీ సోదాలు చేశారు. ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టాలని చూస్తే సహించే ప్రసక్తే లేదు అని సత్తాగల సర్కారు చాటి చెప్పింది. ఇప్పుడేమైనా ఎమర్జెన్సీ ఉందా, వాక్‌ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ లాంటి ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా అని భావించే వారి భావాలను మోదీ సర్కారు ఎప్పటికప్పుడు పటాపంచలు చేస్తూనే ఉంది. ప్రజల గొంతు నొక్కడానికి, హక్కుల మాటెత్తే వారిని అణగ దొక్కడానికి అపారమైన సంకల్ప బలం ఉన్న ప్రభుత్వాలకు ఎమర్జెన్సీ విధించే లాంఛనంతో ఏం పని! నియంతలకు జీ హుజూర్‌ అని బతకడం నేర్చుకోనివారైనా, సంస్థలైనా తగిన ప్రతీకారానికి బలి కావలసిందే. రాజ్యాంగాన్ని వక్రీకరిస్తున్నారని ఆక్రోసించే వారికీ ఈ మధ్య కొదవలేకుండా పోతోంది. నియంతలందరిదీ ఒకే రాజ్యాంగం అని గుర్తించకపోవడం వీరి అమాయకత్వమే. అలాంటప్పుడు రాజ్యాంగబద్ధ పాలన కనిపించడం లేదని వగచి, వాదించి ప్రయోజనం ఏమిటి? మనీలాండరింగ్‌ నిరోధక చట్టం, విదేశీ మారక ద్రవ్య నిల్వల నియంత్రణ చట్టం అనే గొడ్డలి వేటు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి మీద ఎప్పుడో ఒకప్పుడు పడక తప్పదు. కాస్త ముందూ, వెనకా. అంతే తేడా. ఎన్‌.డి.టి.వి., క్వింట్‌, న్యూస్‌ క్లిక్‌ మీద దాడులు జరిగి ఎన్నాళ్లయిందని!
ఇలాంటి వేధింపు చర్యలను ఇంతకు ముందు ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదని కాదు. కానీ ఇంత నిస్సిగ్గుగా, బరితెగించి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న ఘనత మాత్రం కచ్చితంగా మోదీదే. మన్మోహన్‌ సింగ్‌ రెండవ విడత ప్రధానమంత్రిగా ఉన్న అయిదేళ్ల కాలంలో 429 సార్లు అనేక మంది మీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దాడులు చేసింది. అదే మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరవాత 2014-19 మధ్య అదే విభాగం 2022 సార్లు దాడులు చేసింది. ఒక్క 2018-19లోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం 670 దాడులు చేసింది. అయితే ఈ దాడులకు గురైన వారందరూ దోషులని కాదు. మోదీ హయాంలో దాడులు ఎన్ని జరిగినా కేసుల దాకా వెళ్లింది కేవలం 1003 సందర్భాలలోనే. చివరకు అందులో దోషులుగా తేలింది తొమ్మిది ఉదంతాల్లోనే. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో మనీ లాండరింగ్‌ ఆరోపణలపై 2645 దాడులు జరిగితే మోదీ హయాంలో 3709 దాడులు జరిగాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన దాడుల సంఖ్య ఎక్కువ అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. సగటున చూస్తే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం రోజుకు ఆరు దాడులు, ఆదాయపు పన్ను శాఖ పది దాడులూ చేస్తోంది. ఆదాయపు పన్నుల శాఖ 11,611 కేసులు దాఖలు చేస్తే అందులో నిలబడిరది కేవలం 255 మాత్రమే. 1,500 సందర్భాలలో ఇలాంటి కేసులను కోర్టులు అసలు విచారణ చేపట్టకుండానే తోసిపుచ్చాయి. దైనిక్‌ భాస్కర్‌ నిజానికి సంప్రదాయబద్ధ పద్ధతుల్లో నడిచేదే. కానీ కరోనా కాలంలో అనేక వాస్తవాలు బయట పెట్టడానికి వెనుకాడలేదు. అది తన బాధ్యత అనుకుంది. స్థానిక సంస్థలు జారీ చేసిన మరణాల సర్టిఫికెట్లు ఎన్నో లెక్క కట్టి చెప్పింది. ఆ పత్రిక కృషికి అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చింది. న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రత్యేకంగా ఈ పత్రిక కృషిని మెచ్చుకుంది. మరి మోదీ సర్కారుకు ఆగ్రహం రాకుండా ఉంటుందా! మోదీ ప్రభుత్వం అవసరమైతే ఉక్కు పాదంతో అణచి వేస్తుంది. లేదా సత్యం ఏ మూలనుంచి అయినా వెల్లడైతే జనం ఎక్కడ నమ్మేస్తారోనని తన కీర్తిని ఇనుమడిరప చేసుకోవడానికి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు పెడ్తుంది. కేవలం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను సమర్థించుకోవడానికే రూ. 500 కోట్లు వ్యాపార ప్రకటనల కోసమే ఖర్చు పెట్టింది. ప్రభుత్వ ప్రచారం కోసం రోజుకు మూడు కోట్ల ఆరు లక్షలు ఖర్చు చేశారు. తమకు కిట్టని పత్రికలకు, వార్తా చానళ్లకు ఒక్క రూపాయి కూడా విదిలించలేదన్నది మరో కోణం. మీడియా ప్రజాభిప్రాయాన్ని మలుస్తుందన్న విషయాన్ని ఈ ప్రభుత్వం ఖాతరు చేయదు. తన అభిప్రాయమే అసలైన అభిప్రాయం అనుకుంటుంది. ఈ సత్యం గ్రహించిన వారికే మోదీ పడగ నీడలో మనుగడ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img