Friday, April 19, 2024
Friday, April 19, 2024

మోదీ పరిపాలనా శైలి

కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థుల మీద కసి తీర్చుకునే ధోరణిని ప్రధానమంత్రి మోదీ వదిలిపెట్టేట్టు లేరు. ఒక వేపు కర్నాటక శాసనసభ ఎన్నికలు బీజేపీకి ప్రతికూలంగా వస్తున్న శనివారమే మోదీ సీబీఐ కొత్త డైరెక్టర్‌ గా కర్నాటక పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ గా ఉన్న ప్రవీణ్‌ సూద్‌ ను నియమించేశారు. సీబీఐ డైరెక్టర్‌ ను నియమించడానికి ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక సభలో ప్రతిపక్ష నాయకుడితో కూడిన కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో సూద్‌ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు లోకసభలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరీ అభ్యంతరాన్ని లెక్క చేయకుండా సీబీఐ డైరెక్టర్‌ గా సూద్‌ నియామకం పూర్తి అయిపోయింది. దీన్నిబట్టి సీబీఐ, ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌, ఆదాయపు పన్ను శాఖలను ప్రతిపక్ష నాయకులను వేధించడానికి వినియోగించే పద్ధతిని విడనాడే ఉద్దేశం మోదీ సర్కారుకు ఎంత మాత్రం లేదని రుజువైపోయింది. ఈ దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రధానంగా ప్రతిపక్ష నాయకుల మీద, సామాజిక కార్యకర్తల మీద ప్రయోగిస్తోంది. మోదీ ఈ పద్ధతి ఇకనైనా మాను కుంటారేమోనని అత్యాశ ప్రదర్శించిన వారికి తీవ్ర నిరాశే మిగిలింది. సూద్‌కు ఉన్న అర్హతలు, ఆయన సీనియారిటీని చూస్తే ఆయనను సీబీఐ అధిపతిగా నియమించడంలో దురుద్దేశం ఏమీ లేనట్టు కనిపిస్తుంది. కానీ ఇన్నాళ్లుగా సూద్‌ వ్యవహార సరళిని గమనిస్తే మోదీ ఆయననే ఎందుకు ఎంపిక చేశారో అర్థం అవుతుంది.
ప్రస్తుతం సీబీఐ డైరెక్టరుగా ఉన్న సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ ఈ నెల 25న ఉద్యోగ విరమణ చేయవలసి ఉంది. మధ్య ప్రదేశ్‌ పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ సుధీర్‌ సక్సేన, తాజ్‌ హసన్‌ కూడా సీబీఐ డైరెక్టర్‌ పదవి దక్కుతుందని ఆశించారు. తాజ్‌ హాసన్‌ ముక్కుసూటిగా వ్యవహరించే అధికారి కనక మోదీ సర్కారుకు ఎటూ నచ్చలేదు. పైగా తాజ్‌ హాసన్‌ ప్రజానుకూల వైఖరి అనుసరించే వారు. ఆయన దిల్లీ పోలీసు విభాగం ప్రధాన అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. కర్నాటక పోలీసు విభాగం అధిపతిగా ఉన్నంతకాలం సూద్‌ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేశారు. పనిగట్టుకుని ఆయన కాంగ్రెస్‌ నాయకుల మీద లేని పోని కేసులు నమోదు చేసేవారు. అందువల్ల ఆయనను అరెస్టు చేయాలని కర్నాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ కోరారు. కర్నాటక శాసనసభ ఎన్నికలలో తాము అధికారంలోకి వస్తే సూద్‌ మీద చర్య తీసుకుంటామని కూడా శివకుమార్‌ హెచ్చరించారు. అనుకున్నట్టే కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ లోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను దిల్లీ తీసుకెళ్లి పోవాలని నిర్ణయించారు. బీజేపీ అగ్రనాయకులకు సూద్‌ ఎప్పుడూ సన్నిహితంగా మెలగేవారు. 2017లో కాంగ్రెస్‌ నాయకుడు సిద్ధ రామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూద్‌ బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ గా ఉండే వారు. ఆయన ఆ స్థానంలో ఉన్నంత కాలం వివాదాలకు కేంద్రంగానే ఉన్నారు. ఆ కారణంగానే సూద్‌ను బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ స్థానం నుంచి తప్పించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధ రామయ్య సూద్‌ పై అనేక ఫిర్యాదులు చేసినందువల్ల ఆయనను బెంగళూర్‌ పోలీస్‌ కమిషనర్‌ పదవి నుంచి తప్పించవలసి వచ్చింది.
సూద్‌ బీజేపీ నాయకుల ఆగడాలను ఏ మాత్రం పట్టించుకోకుండా కాంగ్రెస్‌ వారి మీద మాత్రం అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణ తీవ్రంగా ఉండేది. ఆయన బీజేపీ ఏజెంట్‌ గా పని చేస్తున్నారన్న ఆరోపణ కూడా వచ్చింది. సూద్‌ ఒట్టి పనికిమాలిన వాడు అని డి.కె.శివకుమార్‌ బాహాటంగానే దుయ్యబట్టారు. తన విధిని సక్రమంగా నిర్వహించనందుకు ఆయన మీద కేసు నమోదు చేయాలని కూడా శివకుమార్‌ వాదించే వారు. కాంగ్రెస్‌ నాయకుల మీద దాదాపు పాతిక కేసులు నమోదు చేసిన సూద్‌ ఒక్క బీజేపీ నాయకుడి మీద ఈగైనా వాలనివ్వలేదు. ఈ విషయమై కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు కూడా చేసింది. కానీ స్వతంత్రంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్‌ కూడా మోదీ సర్కారుకు పరిచారికగా మారిపోయి చాలాకాలం అయింది. బీజేపీకి ఒక్కలిగ సామాజిక వర్గం ఓట్లు దక్కడానికి అనువుగా బీజేపీ నాయకులు మాండ్యాలో టిప్పు సుల్తాన్‌ ను చంపిన వారని వాదిస్తూ ఊరి గౌడ, నంజె గౌడ స్మృత్యర్థం ఒక కమాను నియమించారు. నిజానికి టిప్పు సుల్తాన్‌ను చంపింది వీరు కారు. కానీ మోదీ మాండ్యాలో పర్యటిస్తున్న సమయంలో హడావుడిగా ఒక్కలిగ ఓట్లు బీజేపీ కొంగులో పడడం కోసమే ఈ కమాను నిర్మించారు. దీన్ని సూద్‌ ఏ దశలోనూ అడ్డుకోలేదు. సూద్‌ను సీబీఐ డైరెక్టర్‌గా నియమించడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి శనివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి దశలోనే బీజేపీ ఓటమి ఖరారైంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం సూద్‌ను ఎక్కడ వేధిస్తుందోననని ఆయనను దిల్లీ తీసుకెళ్లి పోవాలని మోదీ సర్కారు నిర్ణయించినట్టుంది. 2024 ఆరంభంలో లోకసభ ఎన్నికలు జరుగుతాయి కనక సూద్‌ను సీబీఐ డైరెక్టర్‌గా నియమిస్తే ఆయన ‘‘సేవల’’ను మోదీ బలాదూరుగా వినియోగించు కోవచ్చు. పైగా కాంగ్రెస్‌ నాయకుడు డి.కె.శివకుమార్‌ మీద ఇప్పటికే ఆదాయానికి మించిన సంపద ఉన్న ఆరోపణలున్నాయన్న కేసు సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. శివకుమార్‌ ఆస్తుల మీద, ఆయన నడుపు తున్న విద్యాసంస్థల మీద కూడా సీబీఐ సోదాలు నిర్వహించింది. శివ కుమార్‌ కాంగ్రెస్‌ మంత్రివర్గ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఈ కేసుల్లో దర్యాప్తు మొదలైంది. ఈ సోదాలకు వ్యతిరేకంగా శివకుమార్‌ కర్నాటక హైకోర్టుకు వెళ్లినా ఫలితం కనిపించలేదు. శివకుమార్‌ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్న కేసు వచ్చే 30వ తేదీన విచారణకు రానుంది. ఒక వేళ కాంగ్రెస్‌ నాయకులు సూద్‌ ను వేధించకుండా చూడాలని అనుకుంటే ఆయనకు మరో బాధ్యత అయినా అప్పగించి ఉండే వారు. కానీ ఆయన నమ్మినబంటులా పని చేస్తారు కనక లోకసభ ఎన్నికలలో ఆయన అవసరం మరింత ఉంటుందని మోదీ భావించి నట్టున్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు మోదీ పలుకుబడి తగ్గడానికి సంకేతంగా భావిస్తున్నారు కనక ఆ పలుకుబడికి భంగం కలగకుండా ఉండాలంటే సూద్‌ లాంటి రామభక్త హనుమాన్‌ అవసరం ఎటూ ఉంటుందిగా! ఆ మరుసటి రోజు నియామకం పూర్తి అయిపోయింది. ఇది మోదీ పరిపాలనా శైలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img