Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మోదీ మార్కు ప్రజాస్వామ్యం

అయిదుగురు న్యాయమూర్తుల నియామకంకోసం తాము డిసెంబర్‌లో సిఫార్సు చేసినా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకో నందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజయ్‌ కిషన్‌ కౌల్‌, ఎస్‌.ఓకా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల అమలుపై మోదీ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నందువల్ల సుప్రీంకోర్టు కటువుగా వ్యవహరించక తప్పడంలేదు. న్యాయ మూర్తులు పంకజ్‌ మిత్తల్‌, సంజయ్‌ కరోల్‌, పి.వి.సంజయ్‌ కుమార్‌, ఎహసానుద్దీన్‌ అమానుల్లా, మనోజ్‌ మిశ్రా పేర్లు 2022 డిసెంబర్‌ 13న ప్రభుత్వానికి పంపిస్తే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఉలుకుపలుకు లేదు. అయిదుగురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సుచేస్తే ఇంతవరకు అతీగతీ లేదని న్యాయమూర్తులు సంజయ్‌ కిషన్‌ కౌల్‌, ఎస్‌.ఓకా వ్యాఖ్యానించారు. త్వరలో నియామకం జరుగుతుందని అటార్నీ జనరల్‌ వెంకటరమణి అన్నప్పుడు ‘‘జరుగుతూనే ఉంటుంది. అలా ఏళ్లు గడిచిపోతున్నాయి’’ అని న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం రికార్డు చేయవచ్చునా అని న్యాయమూర్తులు అన్నప్పుడు రికార్డు చేయ నక్కర్లేదు కాని అయిదు రోజుల్లోగా నియామకం పూర్తి అవుతుంది అని వెంకటరమణి బదులిచ్చారు. ‘‘సరే పది రోజులు గడువిస్తున్నాం లేకపోతే మేం చేయవలసింది చేస్తాం’’ అని న్యాయమూర్తులు అన్నారు. ఏ చట్టమూ సంపూర్ణంగా దోషరహితమైంది కాకపోవచ్చు. కానీ అమలులో ఉన్నంతకాలం ఆ చట్టాన్ని అమలు చేయాల్సిందే. న్యాయమూర్తుల నియామకం విషయంలో మాత్రం మోదీ సర్కారు ఇంతకాలంగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారంచేసి చట్టం అమలుకాకుండా అడ్డుకుంటోంది.
ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఒక్క కొలీజియం విషయంలోనే కాక ఇతర సందర్భాలలో కూడా న్యాయవ్యవస్థ మీద విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కొలీజియం వ్యవస్థ లోపభూయిష్టం అయిందని ప్రస్తుత సర్కారు భావిస్తే పార్లమెంటులో చట్టం చేయడానికి ఏ ఆటంకమూ లేదు. సుప్రీంకోర్టు కూడా అడ్డుతగిలే ఉద్దేశంలో లేదు. సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను ఎటూ తేల్చకుండా నాన బెట్టడం మోదీ సర్కారుకు అలవాటైపోయింది. సుప్రీంకోర్టు సిఫార్సులను ఆమోదించకుండా ఉండడానికి ప్రభుత్వంచూపిన కారణాలను సుప్రీంకోర్టు అంత ర్జాలంలో ఉంచేసరికి ప్రభుత్వం ఉలిక్కిపడిరది. నిజానికి కొలీజియంకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను, సంవాదాలను బహిర్గతంచేయడం సంప్రదాయం కాదు. కానీ సాక్షాత్తు కేంద్ర న్యాయశాఖ మంత్రే సుప్రీంకోర్టు మీద పదే పదే విమర్శలు సంధిస్తున్నందువల్ల సుప్రీంకోర్టు ప్రభుత్వ అభ్యంతరాలను జనం దృష్టిలో పడేట్టు చేయవలసి వచ్చింది. ఈ విషయంలో తాము ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తు న్నామని కూడా సుప్రీంకోర్టు తెలియజెప్పాలని నిర్ణయించుకుంది. 2019లో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత సుప్రీంకోర్టు సిఫార్సుల విషయంలో ధిక్కారస్వరం వినిపించడం బాగా పెరిగింది. దీనివల్ల న్యాయమూర్తుల నియామకమే కాక బదిలీలూ ఆగిపోతున్నాయి. ఇది విచారణా ప్రక్రియను దెబ్బతీస్తోంది. అదీ కాక ప్రభుత్వం ఎటూ తేల్చ నందువల్ల సమయానికి నియామకం జరగకపోవడంతో న్యాయమూర్తుల సీనియారిటీకి కూడా భంగం కలుగుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్నది కొలీజియం కనక ఆ సిఫార్సులకు నిబద్ధమై ఉండాలని గత నవంబర్‌లో కూడా సుప్రీంకోర్టు సూచించినా ప్రభుత్వం మునుపటి వైఖరి మానలేదు. సుప్రీంకోర్టు సిఫార్సుల విషయంలో ప్రభుత్వానికి భిన్నాభిప్రాయం ఏదైనా ఉంటే ఒకసారి అభ్యంతరాలేమిటో తెలియజేస్తూ ఆ సిఫార్సులను వెనక్కు పంపవచ్చు. సుప్రీంకోర్టు తన సిఫార్సులను అవసరమనుకుంటే సవరిస్తుంది. లేకపోతే మునుపటి సిఫార్సులనే పునరుద్ఘాటిస్తుంది. అప్పుడు ప్రభుత్వం మళ్లీ అభ్యంతరాలు లేవనెత్తడానికి అవకాశంలేదు. కానీ సుప్రీంకోర్టు సిఫారుసులనుఅడ్డుకోవడానికి ప్రభుత్వం వాటిని ఎటూ తేల్చకుండా జాప్యం చేస్తోంది. ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేసిన వ్యక్తి కేవలం 19 రోజులలో ఉద్యోగ విరమణ చేయవలసి వస్తోంది. అంటే ఆ న్యాయమూర్తికి దక్కవలసింది దక్కకుండా పోతోంది.
ఏదో ఒకరకంగా సుప్రీంకోర్టుతో ఘర్షణకు దిగాలని మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు ఉంది. ఉపరాష్ట్రపతి ధన్కర్‌, కేంద్ర న్యాయశాఖమంత్రి కిరణ్‌ రిజిజు నిర్విరామంగా సుప్రీంకోర్టును రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా మోదీ నోరు మెదపడం లేదు. అంటే ధన్కర్‌, రిజిజు చేస్తున్న విమర్శలు వారి వ్యక్తిగత స్థాయిలో చేస్తున్నవి కాదనీ, వాటికి కేంద్రప్రభుత్వ మద్దతు ఉందని అనుకోవలసి వస్తుంది. కిరణ్‌ రిజిజుకు సుప్రీంకోర్టును విమర్శించడం నిత్యకృత్యమై పోయింది. ఆయన ఎంతదాకా వెళ్లారంటే ‘‘అసలు కొలీజియం మాకు ఫైళ్లు పంపవలసిన అవసరమే లేదు. ప్రభుత్వం ఆ ఫైళ్లను తొక్కి పెడ్తోంది అనుకుంటే సుప్రీంకోర్టు తోచినట్టు చేసుకోవచ్చు’’ అని రిజిజు తీవ్రంగా వ్యాఖ్యానించడం సుప్రీంకోర్టును కించపరచడం అటుంచి కేంద్ర మంత్రి హోదా కూడా దిగజార్చినట్టే.
న్యాయవ్యవస్థ మీద సంపూర్ణ అధికారం కోసం మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం అవుతోంది. కానీ ఆ మాట నేరుగా చెప్పడానికి ఎందుకనో సందేహిస్తోంది. అందుకే ఇప్పుడున్న కొలీజియం వ్యవస్థ బదులుగా కొత్త బిల్లు ప్రవేశ పెడ్తారా అని అడిగితే ఏ సమాధానమూ ఇవ్వకుండా మిన్నకుండిపోయింది. కొలీజియం సిఫార్సులను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేయడంవల్ల కొంతమంది ప్రసిద్ధ న్యాయవాదులు అసలు న్యాయ మూర్తులుగా నియామకానికి అంతకుముందు చూపిన సమ్మతిని ఉపసంహరించు కుంటున్నారు. ఒకటికి రెండు సార్లు కొలీజియం సిఫార్సుచేసినా ప్రభుత్వంనుంచి చలనం ఉండడం లేదు. కనీసం తమ అభ్యంతరాలేమిటో కూడా ప్రభుత్వం చెప్పకపోవడం విచిత్రంగా ఉంది. కొంతమందిని న్యాయమూర్తులుగా నియమించడాన్ని సమ్మతించక పోవడానికి ప్రభుత్వానికి కారణాలు ఉండవచ్చు. అవేమిటో చెప్పకుండా మొత్తం ఫైలును తొక్కి పెట్టడం సహాయనిరాకరణే అనుకోవాలి. సుప్రీంకోర్టు సిఫార్సులు పంపిన తరవాత ఎన్నాళ్లలోగా ప్రభుత్వం సమ్మతో అసమ్మతో తెలియజేయాలి అన్న విషయంలో నిర్ణీత గడువు ఏమీలేకపోవడం ప్రభుత్వం ఇష్టా రాజ్యంగా వ్యవహరించడానికి అవకాశం కలుగుతోంది. పరస్పర సంప్రతింపులద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవడం అసాధ్యమైతే కాదు. కానీ ప్రభుత్వపక్షం ఘర్షణవైఖరి అనుసరించడం వివాదం ఒక కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణంగా తయారైంది. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలగకుండా ప్రత్యామ్నాయమార్గాన్ని సూచించడం ప్రభుత్వానికి అసాధ్యమేమీ కాదు. కానీ ప్రభుత్వం సయోధ్యకు సిద్ధ పడకపోవడమే పెద్ద సమస్య. ప్రభుత్వ లక్ష్యం సామరస్యం కాదు. ఆధిపత్యం చెలాయించడమే లక్ష్యం. సకల వ్యవస్థలమీద ఆధిపత్యం సంపాదించిన మోదీకి న్యాయవ్యవస్థే కొరుకుడు పడడంలేదు. ఏ వ్యవస్థా స్వతంత్రంగా వ్యవహరించకుండా చూడడమే మోదీ మార్కు ప్రజాస్వామ్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img