Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మోదీ, రాహుల్‌ ప్రతిష్ఠకు గీటురాయి కర్నాటక ఎన్నికలు

రెండు ప్రధాన రాజకీయ పక్షాల భవిష్యత్తు ఏమిటో తేల్చే కర్నాటక శాసనసభ ఎన్నికలు బుధవారం సాయంత్రం ముగిశాయి. కర్నాటకలో అధికారం నిలబెట్టుకోవడం బీజేపీకి, అంతకన్నా ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీకి ఎంత అవసరమో, పునరుజ్జీవనం పొందడానికి కాంగ్రెస్‌కు కూడా అంతే అవసరం. కర్నాటకలో ముక్కోణపు పోటీ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. జె.డి.(ఎస్‌) కూడా రంగంలో ఉంది. అయినా ప్రధానమైన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ఉందనిపిస్తోంది. ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యం ఇదివరకు ఎన్నడూ కనిపించలేదు. ప్రధానమంత్రి మోదీ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రచారంలో కూడా అంతా తానే అయి వ్యవహరించడం కొత్తేమీ కాదు. కానీ కర్నాటక ఎన్నికలలో ఓటమి బీజేపీకి అపారమైన నష్టం కలగజేస్తుంది. ఈ ప్రభావం ఈ ఏడాది ఆఖరు నాటికి మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌, మిజోరం, రాజస్థాన్‌, తెలంగాణ శాసనసభల ఎన్నికల మీద కూడా పడుతుంది. ఎన్నికలు జరగనున్న ఆరు రాష్ట్రాలలో ఛత్తీస్‌ గఢ్‌, రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉంది. తెలంగాణలో కె.చంద్రశేఖరరావు నాయకత్వంలోని భారతీయ రాష్ట్ర సమితి (ఇంతకుముందు టి.ఆర్‌.ఎస్‌.) అధికారంలోఉంది. తెలంగాణలో అధికారం సంపాదించడానికి బీజేపీ ఎంతగా ఆత్ర పడుతున్నప్పటికీ కె.సి.ఆర్‌. పార్టీని ఓడిరచడం అంత తేలిక కాదు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రస్తుతం నిస్తేజంగా తయారైంది. ఆ ఖాళీని ఆక్రమించాలని బీజేపీ ఆశిస్తోంది. కానీ అవకాశాలు తక్కువే ఉన్నాయి. కర్నాటకలో మోదీ సకల జాగ్రత్తలూ తీసుకున్నారు. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అంతకు ముందు దూరంగా పెట్టిన బీజేపీ అగ్ర నాయకుడు ఎడ్యూరప్పను మళ్లీ చేరదీసి ప్రచార బాధ్యతలు అప్పగించారు. అయినా ప్రధానంగా ప్రచారం మోదీదే. ముఖమంత్రి బొమ్మై నామమాత్రంగా మిగిలిపోయారు. తనను చూసి బీజేపీకి ఓటు వేయాలని మోదీ కోరారు. అంటే రాష్ట్ర నాయకులకు ఏ పాత్రా లేదనే. ఎన్నికల ప్రచారంలో మోదీ శైలే భిన్నమైంది. ఎక్కడ ఎన్నికలు జరగవలసిఉన్నా కొన్ని నెలల ముందే ఆ రాష్ట్రాలలో తరచుగా పర్యటిస్తారు. పథకాలు ప్రారంభిస్తారు. కొత్త పథకాలు ప్రకటిస్తారు. వాగ్దానాల జడివాన కురిపిస్తారు. ప్రభుత్వ కార్యకలాపాలను బీజేపీ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవడంలో మోదీని మించిన వారు లేరు. ఎప్పుడో పూర్తిఅయిన పథకాల ప్రారంభోత్సవాలను కూడా ఎన్నికలకు ముందు మోదీ ప్రారంభించడానికి అనువుగా నిలిపి ఉంచుతారు. కొన్నిసార్లు అసంపూర్ణ కార్యక్రమాలనూ మోదీ ప్రారంభించి ఎన్నికలలో ప్రయోజనం పొందడానికి అనువుగా మలుచుకుంటారు. కర్నాటకలో అధికారం కోల్పోతే ఈ ఏడాది ఆఖరులోగా జరగవలసిఉన్న ఇతర రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎన్నికల కార్యక్రమం ప్రకటించకముందే అనేక అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభిస్తూ ఉంటారు. ఇవన్నీ అధికార కార్యకలాపాల కింద చెలామణి చేసేస్తారు. ఇటీవలి కాలంలో ప్రధాని పాల్గొన్న కార్యక్రమాల కోసం వివిధ ప్రభుత్వ అంగాలు భరించవలసి వచ్చిన ఖర్చుచూస్తే ఎన్నికల్లో బీజేపీ విజయంకోసం అధికార దుర్వినియోగం ఎంత వికృత రూపంలో కొనసాగుతోందో అర్థం అవుతోంది. ప్రధాని పర్యటన సందర్భంగా బెంగుళూరు నగర కార్పొరేషన్‌ రూ. 24 కోట్లు ఖర్చు పెట్టింది. యోగా దినోత్సవం రోజున మోదీ పర్యటనకోసం కర్నాటక స్థానిక సంస్థలు రూ. 56 కోట్లు వెచ్చించాయి. కల్బుర్గీలో మోదీ కొద్ది సేపు పర్యటించినా రూ.11.18 కోట్లు ఖర్చుపెట్టి ఆ నగరాన్ని ముస్తాబు చేశారు. బెలగావీలో ప్రధాని పర్యటనకోసం రూ.14 కోట్లు వెచ్చించారు. మోదీ సభలకు జనాన్ని తరలించడానికే మూడు కోట్లు ఖర్చయింది. గత ఫిబ్రవరి 27న మోదీ ప్రభుత్వ పర్యటనకోసం కర్నాటక ప్రభుత్వం రూ. 36.43 కోట్ల ఖర్చు భరించాల్సి వచ్చింది. ధార్వాడ్‌లో ప్రధాని ఐ.ఐ.టి. ప్రారంభించడానికి రూ. 9.5 కోట్లు ఖర్చయింది. ఈ లెక్కలన్నీ ఒక్క కర్నాటకకు సంబంధించినవే.
సాధారణంగా ఉత్తర భారత రాజకీయ పరిణామాలు కేంద్రంలో అధికారం ఎవరిదో నిర్ణయిస్తుంటాయి. విచిత్రం ఏమిటంటే మొదటి సార్వత్రిక ఎన్నికల తరవాత దక్షిణాదిలోని కర్నాటకలో ఎన్నికల ఫలితాలు అటు మోదీ, ఇటు రాహుల్‌ గాంధీ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయబోతున్నాయి. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు కర్నాటకలో లభించిన జనాదరణ అపూర్వమైంది. దక్షిణ భారత దేశంలో బీజేపీకి అధికారం దక్కింది కూడా కర్నాటకలోనే. అందువల్ల ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి చాలా ముఖ్యం. అదే రీతిలో చీకట్లో దేవులాడుతున్న ప్రతిపక్షాలకు కర్నాటకలో కాంగ్రెస్‌ విజయం నూతనోత్సాహం కలిగిస్తుంది. ఆ రాష్ట్ర ఎన్నికలు రెండు ప్రధాన పార్టీల భవిష్యత్తుకు గీటు రాయిగా మారిపోయాయి. అదే సమయంలో కర్నాటకలో ఏ పక్షం గెలిచినా ఆ పార్టీల స్థానిక నాయకుల రాజకీయ జాతకం మారే అవకాశం ఏమీ లేదు. కాంగ్రెస్‌ గెలిచినా అది సిద్ధ రామయ్య లేదా డి.కె. శివకుమార్‌ కష్టానికి ఫలితం అని ఎవరూ అనుకోరు. రాహుల్‌ గాంధీ ప్రతిభ కిందే జమ అవుతుంది. అలాగే బీజేపీ గెలిస్తే అది ఎంత మాత్రం ఎడ్యూరప్ప లేదా బొమ్మై ప్రాభవంగా పరిగణనలోకి రాదు. ఎన్నికల ముగిశాయి కాబట్టి ఎడ్యూరప్పను పట్టించుకునే నాథుడే బీజేపీలో కనిపించకపోవచ్చు. ఎందుకంటే అంతా సర్వాంతర్యామిగా వ్యవహరించిన మోదీ ఘనత కిందే లెక్క వేస్తారు. కడకు చివరి క్షణంలో బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్‌ టైట్లర్‌ పరిస్థితీ ఇదే. రెండు పక్షాలలో ఈ రాజకీయ నాయకుల ప్రభావం జాతీయ రాజకీయాల మీద కూడా ఏమీ ఉండదు. కానీ మోదీ రాజకీయ భవిష్యత్తుకు మాత్రం ఇది కచ్చితమైన కొలమానంగా అవుతుంది. మహా అయితే అంతో ఇంతో కీర్తి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఖాతాలో పడొచ్చు.
కర్నాటక ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌ భవిష్యత్తు మీదా ప్రభావం చూపవచ్చు. ఆయన బీజేపీ ప్రచారంలో పాల్గొంటున్నా ఆయన ప్రవర్తన, ప్రసంగాలతీరు తన సొంత పలుకుబడిని పెంచుకోవడం మీదే ఉంది. భారత్‌ జోడో యాత్ర రాహుల్‌ గాంధీకి ఎంతగా మేలు చేసిందనుకున్నా ఆయన ఇంకా బలహీనమైన నాయకుడిగానే కనిపిస్తున్నారు. కానీ కర్నాటకలో కనక కాంగ్రెస్‌ విజయం సాధిస్తే రాహుల్‌ అమాంతం అత్యంత సమర్థుడైన నాయకుడిగా మారిపోతారు. ఆయన సోదరి ప్రియాంకా గాంధీకీ ఆ విజయంలో ఎంతో కొంత వాటా తప్పక ఉంటుంది. సోనీయా గాంధీ సైతం కర్నాటక ఎన్నికల ప్రచారానికి కదిలి వచ్చారంటే ఆ ఎన్నికల ఫలితాలు ఎంత ముఖ్యమైనవో ఊహించవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img