Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

యోగీకి లఖింపూర్‌ అగ్గి నిరంకుశత్వాన్ని ఎదిరించే

భావప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడిన పిలిప్పీన్స్‌ పత్రికా రచయిత మెరియా రెస్సా, రష్యాకు చెందిన దిమిత్రీ మ్యురతోవ్‌ కు ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి దక్కడం ఆహ్వానించదగిన పరిణామం. దీనివల్ల నిరంకుశ పాలకులను నిలదీయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికా రచయితలకు కొత్త ఊపిరి ఊదినట్ట వుతుంది. యాదృచ్చికమే కావచ్చు కానీ ఈ ఇద్దరు పత్రికా రచ యితలూ స్వతంత్రంగా వార్తా వ్యవస్థలను నిర్వహిస్తున్న వారే. మెరియా రెస్సా ఫిలిప్పీన్స్‌ పత్రికా రచయిత్రి. దిమిత్రీ మ్యురతోవ్‌ రష్యాకు చెందిన పత్రికా రచయిత. నిరంకుశ ప్రభుత్వాలను నిలదీయడానికి పత్రికా రచనను ఆయుధంగా మలుచుకోవడం ప్రస్తుత పరిస్థితిలో సామాన్యమైన విషయం కాదు. దాడులకు, దూషణలకు, నిర్బం ధాలకు ఎదురొడ్డి నిలవడంతో పాటు ప్రాణాలకు కూడా తెగించి నిజం చెప్పవలసిన పరిస్థితి. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుకుంటూ, సమా చారం అందించడం ఒక వృత్తిగానో, ఉద్యోగంగానో మిగలకుండా సాహసో పేతమైన కార్యకలాపంగా తయారైంది. సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో పత్రికా రచయితలకు అందించే అతి పెద్ద పురస్కారం పులిట్జర్‌ బహుమతే. కానీ నోబెల్‌ కమిటీ వీరిద్దరికీ శాంతి బహుమతి అందించడం పత్రికా రచన స్థాయిని పెంచింది. ‘‘ప్రతికూల పరిస్థితిలో ఈ పత్రికా రచ యితలు పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడానికి కంకణం కట్టుకున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, సమాచారం అందించే స్వేచ్ఛ వల్ల ప్రజలు విజ్ఞానవంతు లవుతారు. ఈ హక్కులు ప్రజాస్వామ్యానికి మూల కందాలు. ఇవి యుద్ధాన్ని, ఘర్షణలను నిరోధించడానికి ఉపకరిస్తాయి. వీటి ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పి, ప్రాథమిక హక్కులను పరిరక్షించవలసిన అవసరాన్ని గుర్తు చేయడానికే వీరికి నోబెల్‌ శాంతి బహుమతి’’ అని నోబెల్‌ కమిటీ ప్రకటించింది. ‘‘హద్దులు లేని పత్రికా రచయితలు (రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌)’’ సంస్థ ప్రధాన కార్యదర్శి క్రిస్టోఫ్‌ డెలోయిర్‌ వీరిద్దరికీ శాంతి బహు మతి దక్కడాన్ని ప్రస్తావిస్తూ ఇది పత్రికా రచనకు దక్కిన ప్రశంస అన్నారు. నిజంగానే బూటకపు వార్తలు, ప్రజాస్వామ్యాన్ని కుళ్లబొడిచే ప్రభుత్వాలు, వాటిని సమర్థించే పత్రికలు, పత్రికా రచయితలు రాజ్యమేలుతున్న దశలో ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజాస్వామ్య సారాన్ని పరిరక్షించడం మామూలు విషయం కాదు. రెస్సా పరిశోధనాత్మక పత్రికా రచయిత్రి. 2012లో ఆమె రాప్లర్‌ అనే డిజిటల్‌ మీడియా వేదిక ఏర్పాటు చేశారు. ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుతెర్టే మాదక ద్రవ్యాలను అదుపు చేసే పేరుతో వివాదాస్పదం మాత్రమే కాకుండా హత్యా రాజకీయాలకు పాల్పడే పరిపాలన కొనసాగిస్తున్నారు. అలాంటి స్థితిలో రెస్సా ప్రయాణం ఎంత కష్టమో ఊహించుకోవలసిందే. అక్కడి పాలకులు తమ ప్రజలపైనే యుద్ధం ప్రకటించారు. ఫిలిప్పీన్స్‌లోనూ సామాజిక మాధ్యమాలను వినియోగించు కుని బూటకపు వార్తలను ప్రచారంలో పెడ్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారు. వార్తలను వక్రీకరిస్తున్నారు. ఈ విలోమ పరిస్థితుల్లో రెస్సా తన కర్తవ్య నిర్వహణకు కట్టుబడి ఉండడాన్ని నోబెల్‌ కమిటీ గుర్తించి శాంతి బహుమతి ప్రకటించింది. రష్యాకు చెందిన మ్యురతోవ్‌ దశాబ్దాల తరబడి పత్రికా స్వేచ్ఛ కోసం పాటుపడ్తున్నారు. పుతిన్‌ హయాంలో రష్యాలో స్వతంత్ర పత్రికా రచయితలు మనగలగడమే గొప్ప.
ఆర్‌.ఎస్‌.ఎఫ్‌. సంస్థ పత్రికా స్వేచ్ఛలో ఏ దేశం ఏ స్థాయిలో ఉందో ఒక సూచికను విడుదల చేస్తూ ఉంటుంది. 180 దేశాలలో పరిస్థితి ఆధారంగా రూపొందించే ఈ సూచికలో ఫిలిప్పీన్స్‌ 138వ స్థానంలో, రష్యా 150వ స్థానంలో ఉన్నాయి. ఈ సందర్భంలోనే భారత్‌ ఏ స్థానంలో ఉందో గ్రహించడం అవసరం. భారత్‌ 142వ స్థానంలో ఉంది. అంటే మన దేశంలో పత్రికా స్వేచ్ఛ ఫిలిప్పీన్స్‌ కన్నా అధమ స్థాయిలో ఉంది. నిరంకుశత్వం ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు కూడా భావప్రకటనా స్వేచ్ఛను, పౌరుల ప్రాథమిక హక్కులను కిరాతకంగా అణచి వేయవచ్చు. నిరంకుశత్వానికి కుడి ఎడమల తేడాలు, రంగు రూపంలో భేదాలు ఉండవు. మన దేశంలో పైకి చూడడానికి పత్రికా స్వేచ్ఛ ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఆచరణలో ఈ స్వేచ్ఛను చిదిమేసే ప్రయత్నం మోదీ హయాంలో తీవ్రంగా కొనసాగుతోంది. ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి పత్రికా స్వేచ్ఛ పీక నులిమారు అని అంగలార్చే పార్టీ పరిపాలనలో మరో పద్ధతిలో పత్రికా స్వేచ్ఛ మీద దాడి జరుగుతోంది. ఎమర్జెన్సీ సమయంలో పత్రికల మీద ఆంక్షలు విధించిన మాట వాస్తవమే. దాన్ని ఎవరూ మెచ్చరు. అప్పుడూ ఈ నిరంకుశత్వాన్ని ఎదిరించిన పత్రికలూ ఉన్నాయి. పత్రికా రచయితలూ ఉన్నారు. మోదీ హయాంలో ఎమర్జెన్సీ లేదన్న మాటే గానీ ప్రభుత్వ అకృత్యాలను శంఖంలో పోసి, మసి పూసి మారేడు కాయ చేసి తప్పుడు సమాచారం అందించే పత్రికా వ్యవస్థలు తయారైనాయి. వీటినే గోదీ మీడియా అంటున్నాం. ఇది స్వచ్ఛందంగా బానిసత్వాన్ని ఆమోదించడం. ప్రజలకు నిజం తెలియజేసే బాధ్యతను పాలకుల మెప్పుకోసం బాహాటంగా తాకట్టు పెట్టడం. అధికార మదోన్మత్తులను నిలదీసే సత్తా ఉన్న పత్రికా రచయితలు మన దేశంలో ఎదుర్కుంటున్న భయంకరమైన పరిస్థితులు మన ప్రజాస్వామ్యంలోని డొల్లతనాన్ని బయట పెడ్తున్నాయి. భారత పత్రికా రంగం ఇప్పుడు మోదీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయింది. వ్యతిరేక వర్గంలో ఉన్న పత్రికా రచయితలు అనునిత్యం వేధింపులకు గురవుతున్నారు. వినోద్‌ దువాలాంటి పత్రికా రచయితల మీదే దేశద్రోహ ఆరోపణ మోపే దుస్థితిలో పత్రికారంగం సవాళ్లను ఎదుర్కుంటోంది. సిద్దీఖ్‌ కప్పన్‌ లాంటి జర్నలిస్టులు జైళ్లల్లో మగ్గుతున్నారు. 2020వ సంవత్సరంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించని రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం మన దేశంలో మచ్చుకైనా లేదు. పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేయడానికి కరోనా అప్పనంగా ఉపయోగపడ్తోంది. 2020 నవంబర్‌ 16న జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రధాని, కేంద్ర హోం మంత్రి, ఉప రాష్ట్రపతి పత్రికా స్వేచ్ఛ పరమ పవిత్రమైందని ఉపన్యాసలిచ్చారు. వాస్తవ పరిస్థితి దానికి పూర్తి భిన్నం. 55 మంది పత్రికా రచయితలను అరెస్టు చేశారు. వారిమీద ఎఫ్‌.ఐ.ఆర్‌.లు నమోదైనాయి. అనేకమంది తాకీదులు అందుకున్నారు. దాడులకు గురి కావలసి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌, జమ్మూ-కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో పత్రికా రచయితల మీద ఎక్కువ దాడులు జరిగాయి. ఇవన్నీ బీజేపీ పాలన ఉన్నవే. బీజేపీ పాలిత రాష్ట్రాలలో పత్రికా రచయితలు కత్తి మీద సాము చేయవలసి వస్తోంది. కొంతమంది పత్రికా రచయితలైతే అంగరక్షకుల కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించవలసి వస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో పత్రికా రచయితలకు నోబెల్‌ శాంతి బహుమతి దక్కడం నిరంకుశత్వాన్ని ఎదిరించే జర్నలిస్టులకు తమ కర్తవ్యాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. నిబద్ధ పత్రికా రచయితలు చేయవలసిన పని నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎత్తిన జెండాను దించకుండా ముందుకు సాగడమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img