Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

రామసేతు మీమాంస

భారత్‌కు, శ్రీలంకకు మధ్య దాదాపు యాభై కిలోమీటర్ల మేర ఉందంటున్న రామసేతు రామాయణంలోని కావ్య నాయకుడు శ్రీరాముడు నిర్మించిందేనన్న వాదన చాలాకాలంగా ఉంది. అయితే ఇది కేవలం పురాణ గాథే తప్ప వాస్తవం కాదన్నమాట సుదీర్ఘకాలంగానే వినిపిస్తోంది. యు.పి.ఏ.అధికారంలో ఉన్నప్పుడు పర్యావరణవేత్త ఆర్‌.కె.పచౌరీ నాయకత్వంలో నిజానిజాలు తేల్చడానికి ఓ కమిటీని నియమించారు. సేతు సముద్రం పథకం నిర్మించడానికి ప్రత్యామ్నాయ మార్గం అన్వేషించాలన్నదృష్టితో ఈ కమిటీని నియమించారు. సేతు సముద్రం పథకం ప్రకారం సముద్రం మధ్యలో దీవుల గుండా నౌకాయానానికి మార్గం ఏర్పరచే ప్రయత్నంలో భాగంగా ఈ కమిటీని నియమించారు. రావణాసురుడు సీతను అపహరించి లంకలో ఉంచినప్పుడు ఆమెను తీసుకురావడానికి లంకకు వెళ్లడానికి వానరాల సహాయంతో శ్రీరాముడే సేతువు నిర్మించారన్న విశ్వాసం బలంగాఉంది. రామభక్తులు దీనిని పవిత్రమైందిగా భావిస్తారు కనక దీనికి ఎలాంటి విఘాతం కలిగించకూడదన్న కారణంచూపి సేతుసముద్రం పథకాన్ని ఇంతకాలం బీజేపీ వ్యతిరేకిస్తూ వచ్చింది. రామసేతును శ్రీరాముడు నిర్మించాడా అన్న విషయాన్ని పక్కన పెడ్తే అది మానవ నిర్మితమా కాదా లేక కేవలం పురాణ గాథా అని తేల్చుకునే ప్రయత్నాలు చాలాకాలంగా జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఉపగ్రహ చిత్రాలను కూడా పరిశీలించారు. ఈ పరిశీలనలో సముద్రంలో సున్నపురాయితో ఏర్పడిన దిబ్బలైతే ఉన్నాయి కానీ అది మానవ నిర్మితమైన వంతెనో కాదో నికరంగా చెప్పలేమని అంతరిక్ష పరిశోధనా మంత్రిత్వశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ గురువారం రాజ్యసభలో తెలియజేశారు. రామసేతు శ్రీరాముడు నిర్మించిందేనని విశ్వసించే బీజేపీకి చెందిన మంత్రే ఈ విషయం వెల్లడిరచడం విశేషమే. శ్రీరాముడు వానరాల సహాయంతో ఈ సేతువును నిర్మించాడంటున్న కాలం కనీసం 18,000 సంవత్సరాలనాటి విషయం కనక ఇదమిత్థంగా తేల్చలేమని కూడా మంత్రి చెప్పారు. అంటే అంతరిక్ష విజ్ఞానం ఆధారంగా ఇది మానవ నిర్మితమైన సేతువు కాదని బీజేపీ అంగీకరించడంలేదని అనుకోవాలి. ఉపగ్రహాల సాయంతో అంతరిక్షంనుంచి తీసిన చిత్రాలనుబట్టి చూస్తే సున్నపురాయితో చేసిన దిబ్బలు, అక్కడక్కడా చిన్న దీవులు కనిపిస్తున్నప్పటికీ ఇది మానవ నిర్మితమైన సేతువు అని కచ్చితంగా చెప్పలేమని మంత్రి రాజ్యసభలోనే తెలియజేశారంటే పరోక్షంగా రామసేతు అనుకుంటున్నది శ్రీరాముడు వానర సహాయంతో నిర్మించింది కాదని బీజేపీ ఒప్పుకున్నట్టే లెక్క. ఆ కనిపించే దిబ్బలు వంతెనలో భాగమని కూడా చెప్పలేమని జితేంద్రసింగ్‌ దాపరికం లేకుండానే చెప్పారు. అందువల్ల అక్కడ ఒక సేతువు ఉందని కచ్చితంగా చెప్పలేమని కూడా ఆ మంత్రి అంగీకరించినట్టే. అయితే అలాంటి దిబ్బలు మాత్రంఉన్నాయని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉన్న ఆధారాలవల్ల తెలుస్తోందని ఆయన అన్నారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు కార్తికేయ శర్మ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జితేంద్రసింగ్‌ ఈ విషయం వెల్లడిరచారు కనక శాస్త్రీయ ప్రమాణాలను అంగీకరిస్తున్నారనే భావించాలి. ఇదే మాట బీజేపీ నాయకుడు కాకుండా మరెవరైనాచెప్తే ఎంత రభస జరిగేదో. రామసేతుపై సినిమా కూడా అక్షయకుమార్‌ ప్రధాన పాత్రగా రాబోతోంది.
రామసేతును ఆదం వంతెన అని కూడా అంటారు. ఈ వంతెన నిజానికి సున్నపురాయి దిబ్బలతో సహజంగా ఏర్పడిరదని శాస్త్రీయ విజ్ఞానం చెప్తోంది. శాస్త్రీయ సమాధానాలు జనం విశ్వాసాన్ని మారుస్తాయన్న హామీ లేదు. రామసేతు వ్యవహారాన్ని పరిశీలించడానికి, ఆ సేతువును ఎన్నేళ్లకింద నిర్మించారో తెలుసుకోవడానికి సముద్రజలాల లోతును పరిశోధన చేయడానికి కేంద్రప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది. ఈ అధ్యయనం పూర్తిఅయితే రామసేతు రామాయణం అంత ప్రాచీనమైందో కాదో కూడా తెలియవచ్చు. రామసేతు వ్యవహారం కోర్టులో విచారణలో ఉంది. ఆ విచారణ సందర్భంగానే రామసేతు శ్రీరాముడు నిర్మించిందా లేక మానవ నిర్మితమైందా కాదా, లేదా సహజంగా ఏర్పడిరదా అన్న చర్చ సాగుతోంది. మన పురాణగాథలకు, ఆధునిక నిర్మాణాలకు లంకె పెట్టొచ్చునా లేదా అన్నది మరో అంశం. పంబ దీవి, లేదా తమిళనాడులోని రామేశ్వరం దీవినుంచి శ్రీలంకలోని మన్నార్‌ దీవిదాకా దిబ్బలతో కూడిన మార్గాన్ని రామసేతు అంటున్నారు. ఇది మానవ నిర్మితమైంది అని శాస్త్రీయంగా నిరూపిస్తే తప్ప ఈ సేతువు ఎన్నాళ్లకింద నిర్మించారో తెలియదు. రామసేతు లేదా ఆదం వంతెన మట్ట్టి కట్టపోసి నిర్మించిన ఒక కాలిబాటలా ఉంటుంది. ఇది మన్నార్‌ అఖాతాన్ని పాక్‌ జలసంధిని విడదీస్తుంది. ఈ వంతెన చుట్టూ ఉన్న సముద్రం అంత లోతైందికాదు. ఇక్కడ సముద్ర జలాల లోతు మూడు అడుగుల నుంచి 30 అడుగుల దాకా ఉంటుంది. ఈ వంతెన సముద్ర మట్టానికి 1480 అడుగుల ఎత్తున ఉండేదని అనేక శాస్త్ర పరిశోధనల్లో తేలింది. అయితే తుపానుల కారణంగా ఇది శిథిలమైందని శాస్త్రవేత్తలు అంటారు.
15వ శతాబ్దం దాకా ఈ దిబ్బల మీంచి నడిచి వెళ్లడం సాధ్యమయ్యేదని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ తరవాత అక్కడ సముద్ర జలాల లోతు పెరిగిందంటారు. ఇప్పుడు రామసేతువు అనుకుంటున్నది ఒకప్పుడు భారత్‌కు, శ్రీలంకకు మధ్య ఉన్న భూమార్గం ఉండేదనడానికి భూవిజ్ఞాన శాస్త్ర పరమైన ఆధారాలున్నాయి. రామేశ్వరం పరిసరాల్లో నీటిలో తేలే శిలలూ కనిపిస్తాయి. అగ్నిపర్వతాల కారణంగా ఏర్పడిన శిలలు నీటిలో తేలుతాయి. పగడాలదీవుల దగ్గర సముద్రజలాలు అంత లోతుగా ఉండవు. ఈ మార్గం గుండా నౌకాయానం కుదరదు. అందుకే శ్రీలంక వెళ్లాలంటే నౌకలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. శ్రీలంకకు దగ్గరి దారిలో వెళ్లడానికే సేతుసముద్రం పథకం చేపట్టారు. సముద్ర విజ్ఞానశాస్త్రాన్ని బట్టి చూస్తే ఈ సేతువు 7000 ఏళ్ల కిందటిదని తేలింది. మన్నార్‌ దీవుల, ధనుష్కోటి దగ్గరి బీచ్‌లు కూడా దాదాపు ఏడువేల ఏళ్ల కింద ఏర్పడినవే. మరి శ్రీరాముడు నివసించింది 18000 ఏళ్ల కింద అయితే, రామసేతువు శ్రీరాముడే నిర్మించాడనడానికి వీలులేదు. రామసేతువు శ్రీరాముడు నిర్మించిందా కాదా అని నిర్ణయించడం ఒక ఎత్తు అయితే అది మానవ నిర్మితం అయిందా కాదా అని తేల్చడం మరో ఎత్తు. శ్రీరాముడు వాల్మీకి రాసిన ఆదికావ్యమైన రామాయణంలో కథా నాయకుడు. వాల్మీకి ఆ పాత్రను మలిచిన తీరు శ్రీరాముడిని సకల సద్గుణ సంపన్నుడిగా, పురుషోత్తముడిగా నిలబెట్టింది. దానివల్లే శ్రీరాముడు దేవుడైపోయాడు. దేవుడు జనన మరణాలకు అతీతుడు అంటారుగా! కావ్యంలోని పాత్రలు నిజజీవితంలోని మనుషులను పోలిఉండొచ్చు. అయినా అవి కల్పితపాత్రలే. ఈ వాస్తవాన్ని అంగీకరించనందువల్లే శ్రీరాముడి చుట్టూ అనేక విశ్వాసాలు పాదుకున్నాయి. వైజ్ఞానిక దృష్టికి రుజువులు, నిరూపణలే ప్రధానం. శ్రీరాముడు కావ్యనాయకుడన్న విషయాన్ని అలా ఉంచితే మొదట తేలవలసింది అది మానవ నిర్మితమా కాదా అన్నదే. ప్రకృతి సిద్ధంగా వంతెనలాంటిది ఏర్పడిరదని భవిష్యత్తు శాస్త్ర పరిశోధనల్లో తేలితే అన్ని మిథ్యలు పటాపంచలు కాక తప్పదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img