Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విదేశీ విశ్వవిద్యాలయాలు ప్రమాదకరం

విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని భావించేవారు ఎక్కువ మందే ఉంటారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి: విదేశీ విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయనుకోవడం. రెండు విదేశీ డిగ్రీల మీద మోజు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలో తమ శాఖలు నెలకొల్పడాన్ని అనుమతించాలని నిర్ణయించింది. నిజానికి ఈ ప్రతిపాదన మోదీ ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యావిధానంలోనే కనిపించింది. విదేశీ విశ్వవిద్యాలయాలు మనదేశంలో తమ శాఖలు ఏర్పాటు చేయడానికి పాటించవలసిన నిబంధనల ముసాయిదాను విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యు.జి.సి) రూపొందించింది. ఈ విశ్వవిద్యాలయాలు ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించాలి తప్ప ఆన్‌లైన్‌ తరగతులు నడపడాన్ని ఆమోదించబోమని యు.జి.సి చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ చెప్పారు. విదేశీ విశ్వవిద్యాలయాలు మనదేశంలో శాఖలు ప్రారంభించాలంటే యు.జి.సి అనుమతి తీసుకోవాలి. ప్రతి తొమ్మిదేళ్లకు ఒకసారి ఈ అనుమతిని పునరుద్ధరించుకోవాలి. ఈ విద్యాసంస్థలు మన దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే రీతిలో ప్రవర్తించకూడదన్న నియమంకూడా ఉంది. అంటే బీజేపీ అను కుంటున్న మన దేశసంస్కృతికి విఘాతం కల్గించకూడదన్న నియమం ఉంటుందేమో స్పష్టంగా తెలియదు. విదేశీ విశ్వవిద్యాలయాలు చాలావరకు ప్రైవేటువే అయి ఉంటాయి. అంటే లాభాలమీదే వీటి దృష్టి ఉంటుంది కనక ఆ లాభాపేక్షకు ఏమాత్రం భంగం కలగకుండా ఉండేందుకు ఇక్కడ సంపాదించిన లాభాలను ఆ విశ్వవిద్యాలయాలు నిరభ్యంతరంగా తమ దేశానికి తరలించుకు పోవచ్చు. ఈ వెసులుబాటు వాటిని ఆకర్షించడానికట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలలో మొదటి 500 స్థానాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలను మాత్రమే అనుమతిస్తామని జగదీశ్‌ కుమార్‌ తెలియజేశారు. దీనికితోడు ఈ విశ్వవిద్యాలయాలకు విద్యా భోధనలోనూ, పరిశోధనలోనూ పేరు ప్రఖ్యాతులు ఉండాలి. ఉన్నత ప్రమాణాలు పాటిస్తారన్న దాఖలాలు ఉండాలి. ఈ ప్రమాణాలను గనక కచ్చితంగా పాటించేటట్టయితే యేల్‌ యూనివర్సిటీ, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ లాంటి మేటి యూనివర్సిటీలకే మన దేశంలో అడుగు పెట్టే అవకాశం ఉండొచ్చు. విదేశాల్లో విద్యాభ్యాసానికి, మరీ ముఖ్యంగా ఉన్నతవిద్య అభ్యసించడానికి ప్రతి ఏటా మన దేశంనుంచి లక్షలాది మంది విద్యార్థులు వెళ్తూ ఉంటారు. గత సంవత్సరం నాలుగున్నరలక్షల మంది భారత విద్యార్థులు విదేశీ విద్యాలయాల్లో చేరారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలన్న ఉద్దేశం మనవారికి ఉంది కనక ఆ విశ్వవిద్యాలయాలను మన దేశానికే రప్పిస్తే మెరుగుఅన్న ఉద్దేశంతో విదేశీ విశ్వవిద్యాలయాలను అను మతిస్తున్నామని యు.జి.సి అధ్యక్షుడు జగదీశ్‌ కుమార్‌ అంటున్నారు.  ఈ ప్రతిపాదనలను అందరికీ అందుబాటులో ఉంచారు. ఇందులో మార్పులు, చేర్పులు సూచించడానికి అవకాశం ఉంటుంది. యూరప్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాలు మనదేశంలో తమ విభాగాలు ఎర్పాటుకు సుముఖత చూపాయి. ఈ దేశాల రాయబార కార్యాలయాలతో, విదేశీ ప్రతినిధులతో ప్రభుత్వం సంప్రతింపులు జరుపుతూ వారి ఆసక్తి ఏమేరకు ఉందో పసిగడ్తోంది. 

మన విశ్వవిద్యాలయాల్లో ఉన్నత ప్రమాణాలు పాటించేవి లేకపోలేదు. మన విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుకున్నవారు మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌, ఆల్ఫాబెట్‌ ఇన్‌ కార్పొరేటెడ్‌ లాంటి అత్యున్నత పరిశ్రమల్లో ప్రధాన కార్యనిర్వహణాధికారులుగా నియమితులు అవుతూనే ఉన్నారు. అయితే మన విశ్వవిద్యాలయాల్లో చాలావాటిల్లో విద్యా ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయి. అందుకే విదేశీవిద్య మీద మక్కువ పడ్తున్నారు. ప్రమాణాలను పెంచడంతోపాటు వీటిలో పోటీతత్వం కొరవడుతోంది. పాఠ్య ప్రణాళికలు మార్కెట్‌కు అనుగుణంగా ఉండడం లేదు. ఈ దిశగా పరిస్థితిని మెరుగు పరచడానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చూపిన శ్రద్ధ ఏమీలేదు. విదేశీసంస్థలను నేరుగా అనుమతిస్తే పోతుంది కదా అన్న హ్రస్వదృష్టి మాత్రం దండిగా ఉంది. కొన్ని విదేశీ విశ్వ విద్యాలయాలు ఇప్పటికే పాక్షికంగా మనదేశంలో పని చేస్తూనే ఉన్నాయి. ఇవి మన విశ్వవిద్యాలయాలతో లంకె పెట్టుకుని కొంతకాలం మన దేశంలోనూ, మరికొంతకాలం విదేశాల్లోనూ చదివితే విదేశీ విశ్వ విద్యాలయంలో చదివినట్టే లెక్క. ఈ పద్ధతి ఇప్పటికే అందుబాటులో ఉంది. కొత్తగా రూపొందించిన నిబంధనల ప్రకారం విదేశీ విశ్వవిద్యాలయాలు మన విశ్వవిద్యాలయాలతో సంబంధం పెట్టుకోకుండా నేరుగా తమ శాఖలే ఏర్పాటు చేసుకోవచ్చు. యు.జి.సి రూపొందించిన ముసాయిదా నిబంధనలను త్వరలో పార్లమెంటులో ప్రతిపాదించి ఆమోదం పొందితే అది చట్టం అవుతుంది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఎవరిని చేర్చుకోవాలి, ఎంత ఫీజు వసూలు చేయాలి, ఒక వేళ ఉపకార వేతనాలు ఏమైనా అందజేయాలనుకుంటే ఆ మొత్తం ఎంత అన్న విషయాన్ని నిర్ణయించడానికి విదేశీ విశ్వవిద్యాలయాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సకల వ్యవహారాల్లో మన నిబంధనలు దాదాపుగా విదేశీ విశ్వవిద్యాలయాలకు వర్తించవు. అధ్యాపకుల నియామకానికి సైతం ఈ విదేశీ సంస్థలు తమ కొలమానాలను నిర్ణయించుకోవచ్చు. ఆ అధ్యాపకుల విద్యార్హత, వేతనాలు, వారి పనిపరిస్థితులు మొదలైనవి కూడా ఆ విశ్వవిద్యాలయాల ఇష్టానుసారంగానే సాగుతాయి. అయితే అధ్యాపకులను నియమించడానికి వారికి ఉండవలసిన అర్హత ఆ విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉండే అర్హతలతో సమానంగా ఉండాల్సిందే. విదేశీ విశ్వవిద్యాలయాల మీద మక్కువ ఎంతతీవ్రంగా ఉన్నప్పటికీ వాటిని అనుమతించడంవల్ల నష్టాలు కూడా తక్కువేమీ ఉండవు. యు.జి.సి రూపొందించిన నిబంధనలను పరిశీలించి అభిప్రాయాలు తెలియజేయడానికి ఇచ్చిన సమయం చాలాతక్కువ. ఇప్పటికే విద్య వ్యాపారం అయిపోయింది. ఉన్నత విద్య లాభార్జనకు అనువైంది కనకే విదేశీ విశ్వవిద్యాలయాలు మనదేశంలో శాఖలు ఏర్పాటు చేయడానికి ఉత్సాహం చూపు తున్నాయి. అంటే ఉన్నతవిద్య ఇప్పుడున్న దానికన్నా ఎక్కువగా అమ్మకం సరుకు అయిపోతుంది. ఇది పెద్దప్రమాదం. కలిగిన వారికి మాత్రమే ఈ విశ్వవిద్యాలయాలు ఎక్కువగా తోడ్పడతాయి. పేదలకు వీటిలో ప్రవేశం దుర్లభమే. ఇది సంపన్నులకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వవైఖరికి పూర్తిగా అనుగుణమైందే. విద్యారంగంమీద ప్రభుత్వవ్యయం పెరగాలని అనేక కమిషన్లు చెప్తూనే వస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. క్రమంగా విద్యారంగ బాధ్యతను వదిలించుకునే దిశలోనే ప్రభుత్వ విధానంఉంది. అందుకే విదేశీ విశ్వవిద్యాలయాల మీద అత్యుత్సాహం కనబరుస్తున్నారు. విదేశీ విద్యాసంస్థలలో రిజర్వేషన్లు, సామాజిక న్యాయం అన్న మాటలకు వీసమెత్తు విలువకూడా ఉండదు. విదేశీ విద్యాసంస్థలను రాష్ట్రాలమీద రుద్దడం ఫెడరల్‌ విధానాల మీద మరో సమ్మెట పోటే. అందుకే విద్యార్థులు, అధ్యాపకులు ప్రభుత్వ ప్రతిపాదనను ప్రతి ఘటించాలని సీపీఐ భావిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img