Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విద్వేషంపై సుప్రీం సూటి ప్రశ్న

విద్వేష పూరిత ప్రసంగాలు, ప్రచారాలపై నిరసనలు వ్యక్తం కావడంతో పాటు న్యాయస్థానాలు కూడా కనీసం అయిదేళ్లుగా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. విద్వేషాన్ని నింపే వారి గురించి ఏం చర్య తీసుకున్నారో, తీసుకుంటున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను నిలదీస్తూనే ఉంది. అయినా ఫలితం కనిపించడంలేదు. తాజాగా సుప్రీంకోర్టు గురువారం రోజు విద్వేష ప్రసంగాలకు, ప్రచారానికి అడ్డుకట్ట వేయకపోతే తామే చర్య తీసుకుంటామని ప్రకటించింది. విద్వేష ప్రసంగాలు చేసేవారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సుమోటోగా క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోర్టు కోరింది. సెక్యులర్‌ విధానాలను అనుసరించడమే కాక సౌభ్రాతృత్వం అనుసరించాలని రాజ్యాంగ పీఠికలో ఉన్న విషయాన్ని న్యాయమూర్తులు గుర్తు చేశారు. విద్వేష ప్రసంగాలు కొనసాగుతుంటే ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర పోషించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. టీవీ చానళ్లు విద్వేష ప్రచారానికి ప్రధాన వాహికలుగా ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం గత సెప్టెంబర్‌లోనే వ్యాఖ్యానించింది. 2022 జులై 21న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎ.ఎం.ఖాన్విల్కర్‌ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. విద్వేష ప్రసంగాలు మానవ గౌరవాన్ని, జాతీయ ఐక్యతను దెబ్బ తీస్తాయని ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు. విద్వేషం నింపే వారి మీద చర్య తీసుకోవడానికి చట్టరీత్యా అనేక అధికారాలు ఉన్నాయి. రాజ్యాంగ మౌలిక సూత్రాలను పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత. ప్రాథమిక హక్కులను, రాజ్యాంగాన్ని పరిరక్షించడం, న్యాయమార్గ పాలన అమలయ్యేట్టు చేయడం తమ బాధ్యత అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అజయ్‌ రస్తోగి, సి.టి. రవికుమార్‌ నొక్కి చెప్పారు. విద్వేషప్రచారాన్ని ఆపడానికి తీసుకున్న చర్యలేమిటో తెలియ జేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించారు. విద్వేష పూరిత నేరాలకు పాల్పడే వారి మీద నిర్దిష్టమైన చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించాలని షహీన్‌ అబ్దుల్లా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విద్వేషపూరిత సంఘటనలపై స్వతంత్ర, విశ్వసనీయ, నిష్పాక్షిక దర్యాప్తు జరిగేట్టు చూడాలని షహీన్‌ అబ్దుల్లా అభ్యర్థించారు. విద్వేషం నింపే వారిపై, దానికి సంబంధించిన నేరాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అబ్దుల్లా తరఫు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ కోరారు. విద్వేషాన్నీ నింపే వారిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యు.ఎ.పి.ఎ.) కింద చర్య తీసుకోవాలని ఆదేశించాలని అబ్దుల్లా తన పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ చట్టం ఎంత కిరాతకమైందో అందరికీ తెలుసు. ఆ కర్కోటక చట్టాన్ని మానవహక్కులను పరిరక్షించాలని కోరేవారందరూ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఒక చట్టం దుష్టమైంది, క్రూరమైంది అనుకుంటే అది ఎవరి విషయంలోనైనా దుష్టమైందిగానే పరిగణించాలి. ముస్లింల మీద విషప్రచారం కొనసాగిస్తున్న పాలక పక్షాలను నిలవరించకపోతే ప్రమాదం మరింత ముంచుకొస్తుంది. నేరాలకు, భౌతిక దాడులకు పాల్పడే వారు, అందునా అధికార పార్టీ వారు మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వారు ముస్లింల మీద విద్వేషాన్ని వెళ్లగక్కితే సమాజం చీలికలు పేలికలు అవుతుంది. సుప్రీంకోర్టు హెచ్చరించడానికి రెండు రోజుల ముందు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ మన దేశంలో విద్వేషం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మానవ హక్కుల మండలికి ఎన్నికైన భారత్‌పై అంతర్జాతీయంగా మానవ హక్కులను ప్రోది చేయవలసిన అవసరం ఉందని, అలాగే అల్పసంఖ్యాక వర్గాల హక్కులనూ కాపాడాలి’’ అని గుటెరస్‌ అన్నారు. సుసంపన్నమైన వైవిధ్యం ఉండడం హక్కుల పరిరక్షణకు పూచీ పడదు అని ఆయన అన్న మాటలో లోతైన అర్థం ఉంది. విద్వేష ప్రచారాన్ని నిర్ద్వంద్వంగా ఖండిరచడం ద్వారా మాత్రమే మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌నెహ్రూ విలువలను గౌరవించినట్టు అవుతుంది అని గుటెరస్‌ అన్నారు. పత్రికా రచయితల, మానవ హక్కుల కార్యకర్తల, విద్యార్థుల, విద్యావంతుల హక్కులను పరిరక్షిస్తేనే గాంధీ, నెహ్రూ చెప్పిన విలువలను ఆదరించినట్టు అని గుటెరస్‌ అన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలని కూడా ఆయన అన్నారు.
బీజేపీ ఎంపీ పర్వేష్‌ వర్మ, బీజేపీ శాససనసభ్యుడు కిశోర్‌ గుజర్‌ విద్వేష ప్రసంగాలను కాంగ్రెస్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. బీజేపీ నాయకులు ఎంత విద్వేషాన్ని విరజిమ్ముతున్నా ప్రధానమంత్రి మోదీ ఒక్కసారి కూడా నోరు మెదపరు. ‘‘విరాట్‌ హిందూ సభ’’ లో చేసిన విద్వేష ప్రసంగాలు విచ్చలవిడిగా ప్రచారంలోకి వచ్చాయి. ఇలాంటి విద్వేష ప్రచారాలు కొనసాగుతున్న కొన్ని సమావేశాలకు ప్రభుత్వం నుంచి అనుమతికూడా ఉండడంలేదు. ఇవన్నీ ప్రభుత్వాలు జాగ్రత్త వహించ వలసిన అంశాలు. ముస్లింలను బహిష్కరించాలని పర్వేశ్‌ కుమార్‌ బాహాటంగానే కోరారు. అయినా పోలీసులు ఏ చర్యా తీసుకోలేదు. అలాంటప్పుడు న్యాయస్థానాలైనా ఈ అంశాన్ని పట్టించుకోవాలని పిటిషనర్‌ షహీన్‌ అబ్దుల్లా కోరారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా రెచ్చగొట్టే ప్రసంగాలపై పెదవి విప్పడం లేదు. 2020లో ఈశాన్య దిల్లీలో మతకలహాలు చెలరేగినప్పుడు మీడియా, కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసులు ఏమీ పట్టనట్టు కూర్చున్నారు. హింస రెచ్చగొట్టిన వారు బలాదూరుగా తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. గత సంవత్సరం ఉత్తరాఖండ్‌లో, దిల్లీలో ధర్మసన్సద్‌లు నిర్వహించిన నేపథ్యంలో ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయో చెప్పాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దిల్లీ పోలీసు విభాగం కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటుంది కనక సమాధానం చెప్పవలసింది కేంద్ర ప్రభుత్వమే.
విద్వేష ప్రసంగాలకు సంబంధించిన వివరాలు, అలాంటి వాటికి పాల్పడిన వారిపై తీసుకున్న చర్యలను తెలియజేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్‌, న్యాయమూర్తి ఎస్‌.ఆర్‌. భట్‌తో కూడిన బెంచి ఆదేశించింది. న్యాయస్థానం చర్య తీసుకోవాలంటే నిర్దిష్టమైన సమాచారంఉండాలి. దాని నేపథ్యం తెలియాలి. 58 సందర్భాలలో విద్వేష ప్రసంగాలు చేసినట్టు పిటిషనర్‌ తెలియజేశారు కానీ ఒకటి రెండు అంశాలకు సంబంధించిన వివరాలైనా ఉండాలని న్యాయస్థానం భావించింది. ఈ వివరాలు తెలియజేయడానికి పిటిషనర్‌కు కోర్టు వ్యవధి ఇచ్చింది. ఈ సంఘటనలపై చర్య తీసుకుంటే ఆ వివరాలు, నిందితులు ఎవరో తెలియజేయాలని కూడా కోర్టు కోరింది. ఈ వివరాలతో అక్టోబర్‌ 31 లోగా ప్రమాణపత్రం అందజేస్తే నవంబర్‌ ఒకటిన కేసును విచారిస్తామని న్యాయమూర్తులు చెప్పారు. ఆలస్యంగానైనా విద్వేషప్రచారం అత్యున్నత న్యాయస్థానం దృష్టికెళ్లింది కనక విచారణ జరిపి దోషులను శిక్షించే అవకాశం ఉంటుందని ఆశించవచ్చు. 2017లో తెహసీన్‌ పూనావాలాకేసులు సుప్రీంకోర్టు విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసినా ఈ ఉదంతాలు కొనసాగుతూనే ఉండడం విద్వేషం నింపే వారికి ఉన్న దన్ను ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాటిని ఏ మాత్రం సహించకూడదని అప్పుడు సుంప్రీంకోర్టు స్పష్టంగానే చెప్పింది. ఈ కేసు తేలాక అయినా వీటికి తెరపడుతుందని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img