Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విలోమ ఫలితం

సూరత్‌ లోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హెచ్‌. హెచ్‌. వర్మ విధించిన శిక్షను నిలిపివేయాలని రాహుల్‌ గాంధీ సూరత్‌ సెషన్స్‌ కోర్టులో పెట్టుకున్న పిటిషన్‌ను సెషన్‌ కోర్టు న్యాయమూర్తి రాబిన్‌ మొరేగా తోసి పుచ్చారు. న్యాయపరంగా చూస్తే ఇది రాహుల్‌ గాంధీకి గట్టి ఎదురు దెబ్బే కావచ్చు. 2019లో రాహుల్‌ గాంధీ కర్నాటకలోని కోలార్‌లో ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ‘‘దొంగలందరికీ మోదీ అన్న ఇంటిపేరే ఎందుకు ఉంటుంది’’ అన్నందుకు గుజరాత్‌ లోని సూరత్‌ కోర్టులో బీజేపీ నాయకుడు పూర్ణేశ్‌ మోదీ రాహుల్‌ మీద పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ దొంగలందరి ఇంటి పేరు మోదీ అనే ఎందుకు ఉంటుంది అనడం పరువు నష్టం కలిగించేదిగా భావించిన హెచ్‌.హెచ్‌. వర్మ గత నెల 23న రాహుల్‌ కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. రెండేళ్ల జైలుశిక్ష పడ్డ వారు ప్రజాప్రతినిధిగా కొన సాగడానికి వీలు లేనందువల్ల వెంటనే ఆయన లోక సభ్యత్వం రద్దు చేశారు. కానీ హెచ్‌.హెచ్‌.వర్మ నెలరోజులపాటు శిక్ష అమలును వాయిదా వేశారు. అలాగే రాహుల్‌ పై కోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలు కల్పించారు. బెయిలు కూడా ఇచ్చారు. సెషన్స్‌ కోర్టులో అప్పీలు చేసుకుంటే సెషన్స్‌ కోర్టు రాహుల్‌ అర్జీని తోసిపుచ్చింది. దీని తక్షణ పర్యవసానం ఏమిటంటే ఇప్పట్లో రాహుల్‌ లోకసభ సభ్యత్వం పున రుద్ధరణ కుదరదు. సెషన్స్‌ కోర్టు తీర్పును రాహుల్‌ హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో సవాలు చేయవచ్చు. లేకపోతే జైలుకెళ్లక తప్పదు. సెషన్స్‌ కోర్టు తీర్పు రాజకీయంగా రాహుల్‌ పైన, కాంగ్రెస్‌ పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న ప్రశ్న తలెత్తక మానదు. అయితే అంతకన్నా ముఖ్యంగా చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో విచారణ జరిగిన తీరు, సెషన్స్‌ కోర్టులో రాహుల్‌ అర్జీని తిరస్కరిస్తూ న్యాయమూర్తి మొరేగా చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా గమనించవలసినవే. పార్లమెంటు సభ్యుడై నంత మాత్రాన శిక్ష విధించకూడదా అని చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌, సెషన్స్‌కోర్టు న్యాయమూర్తి కూడా ప్రశ్నించారు. అయితే చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ రాహుల్‌కు అత్యధికంగా రెండేళ్ల శిక్ష విధించారు. ఇది పరువునష్టం కేసుల్లో విధించదగిన అత్యధికశిక్ష. ఈ శిక్ష పర్యవసానంగా రాహుల్‌ లోకసభ సభ్యత్వం రద్దు అవుతుందని చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌కు తెలియక కాదు. ఇలాంటి కేసుల్లో అత్యధిక శిక్ష విధించిన సందర్భం మరేదీ కనిపించదు. శిక్ష విధించిన న్యాయ మూర్తి ఇదివరకు ఇప్పుడు శక్తిమంతమైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఇదివరకు న్యాయవాది అంటున్నారు. రాహుల్‌ గాంధీని ఎలాగైనా ఏదో ఒక కేసులో ఇరికించాలని బీజేపీ ప్రయత్నించడం బహిరంగ రహస్యమే. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో 50 గంటల పాటు రాహుల్‌ ను అయిదు రోజుల పాటు ప్రశ్నించి నెలలు గడుస్తోంది. ఇంతవరకు ఆ కేసులో రాహుల్‌ మీద నికరమైన కేసు మోపడానికి ఆధారాలు దొరికినట్టు లేదు. కానీ గతంలో గుజరాత్‌ మంత్రిగా పనిచేసి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పూర్ణేశ్‌ మోదీ సూరత్‌లో దాఖలు చేసిన కేసు రాహుల్‌ మీద అక్కసు తీర్చుకోవడానికి వినియోగించుకున్నట్టు స్పష్టం అవుతూనే ఉంది. పూర్ణేశ్‌ ఈ కేసులో విచారణ నిలిపి వేయాలని అభ్యర్థించారు. న్యాయ స్థానం మన్నించింది. అదానీ విషయంలో రాహుల్‌ లోకసభలో గట్టిగా ప్రశ్నించగానే పూర్ణేశ్‌ విచారణ కొనసాగించాలని కోరగానే త్వరితగతిన విచారణ పూర్తిచేసి రాహుల్‌కు శిక్ష విధించింది. కేసు దాఖలు చేసిన వ్యక్తి బీజేపీ నాయకుడైనప్పుడు, అదీ కర్నాటకలో రాహుల్‌ అన్న మాటలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని వాదిస్తూ గుజరాత్‌ లోని సూరత్‌లో పరువు నష్టం కేసుదాఖలు చేయడంలో ఏ దురుద్దేశమూ లేదని ఎలా అనుకోగలం!
కింది కోర్టు రాహుల్‌ ను దోషిగా తేల్చినప్పుడు ఆయన ఎంపీ కనక ఆయన మాటల ప్రభావం అనేక మంది మీద ఉంటుందని న్యాయమూర్తి అన్నారు. ఇప్పుడు ఎంపీ అయినంత మాత్రాన శిక్షించకూడదా అంటున్నారు. దొంగలందరి ఇంటి పేరు మోదీ అని ఎలా ఉంటుంది అని రాహుల్‌ అన్న మాటలు మోదీ అన్న ఇంటి పేరు ఉన్నవాళ్లందరికీ ఎలా వర్తిస్తాయో తెలియదు. పైగా 13 కోట్ల మంది మోదీల పరువుకు భంగం కలిగిందన్న ఫిర్యాదిదారు వాదనను సెషన్స్‌ కోర్టు కూడా అంగీకరించింది.
గుజరాత్‌ జనాభానే ఆరు కోట్లు అయినప్పుడు ఇతర రాష్ట్రాలలో మోదీ ఇంటిపేరు ఉన్న వారిని లెక్కేసినా ఇంత మంది మోదీలు ఎక్కడి నుంచి వచ్చినట్టు? రాహుల్‌ గాంధీ ఎంపీ కనక అలాంటి వారి నుంచి ఉన్నత నైతిక విలువలు ఆశిస్తాం అని కూడా న్యాయమూర్తి అన్నారు. పరువు నష్టం మాట అటుంచినా దేశంలో విద్వేషం పెంచడానికి, ముస్లింలను వేటాడడానికి విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన, చేస్తున్న వారిమీద చర్య తీసుకోవడం న్యాయస్థానాల బాధ్యత కాదనుకోవాలా? విద్వేషాలు రెచ్చగొట్టడం రాజ్యాంగ విరుద్ధమైన ప్రవర్తన అని కోర్టులు అనుకోవా? రాజ్యాంగ పరిరక్షణ న్యాయ వ్యవస్థ బాధ్యతేగా! రాహుల్‌ సామాన్య మానవుడు కాదు కనక, ఆయన మాటల ప్రభావం చాలా మంది మీద ఉంటుంది గదా అని సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి కూడా ఎదురు ప్రశ్నించారు.
మోదీని విమర్శించే ఉద్దేశంతోనే రాహుల్‌ గాంధీ కోలార్‌ ప్రసంగంలో నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ పేర్లు ప్రస్తావించారని భావించడానికి కష్టపడక్కర్లేదు. దీనికి మోదీ భక్త బృందం వెనుకబడిన తరగతుల వారిని రాహుల్‌ కించపరిచారని కువ్యాఖ్యానాలకు దిగారు. రాహుల్‌ ప్రస్తావించిన వారిలో మోదీ ఒక్కరే వెనుకబడిన తరగతి కిందికి వస్తారనుకున్నా మిగతా ఇద్దరూ వెనుకబడిన వర్గానికి చెందిన వారు కాదుగా! ఒకే ఇంటి పేరు ఉన్న వారిని ఒకే సామాజిక సముదాయంగా గుర్తిస్తారా? కిందికోర్టు, సెషన్స్‌ కోర్టు తీర్పులకు దురుద్దేశం అంటగట్టవలసిన అవసరం లేదు కానీ గుజరాత్‌లో ఏ కోర్టులోనూ మోదీ లేదా బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క తీర్పూ రావడం లేదుగా! అందుకే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌లో కేసు దాఖలు చేశారేమో. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసేట్టు మాట్లాడుతున్న వారిమీద చర్య తీసుకునే బాధ్యత న్యాయ వ్యవస్థకు ఉంటుందిగా. కక్ష తీర్చుకోవడానికి రాజకీయ దురుద్దేశంతో అనువైన చోట్ల కేసులు దాఖలు అవుతున్నా న్యాయవ్యవస్థ అభ్యంతర పెట్టదనుకోవాలా! రాహుల్‌ గాంధీ మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం రాజకీయంగా చివరకు ఆయనకు మేలే చేస్తుందేమో! దురుద్దేశ పూరిత చర్యలకు విలోమ ఫలితాలు రాక తప్పదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img