Friday, April 19, 2024
Friday, April 19, 2024

విశాఖ ఉక్కుపై నిరర్థక రాజకీయాలు

నరేంద్ర మోదీ మంత్రివర్గంలో హేమా హేమీలకే దిక్కు లేనప్పుడు జనానికి బొత్తిగా పరిచితం కాని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే చేసిన ప్రకటనకు విలువ లేదని ఆ మర్నాడే రుజువైంది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సదరు మంత్రి చెప్పారంటున్నారు. ఇది కేవలం గాలి వార్త అని కేంద్ర ఉక్కు గనుల మంత్రిత్వ శాఖ చేసిన విస్పష్టమైన ప్రకటనతో తేలి పోయింది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగం లిమిటెడ్‌ (ఆర్‌.ఐ.ఎన్‌.ఎల్‌.) అధీనంలో ఉంటుంది. ఆర్‌.ఐ.ఎన్‌.ఎల్‌.లో పెట్టుబడులను ఉపసం హరించే ప్రక్రియ కొనసాగుతుందని గురువారం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంటే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విడనాడలేదు. అంటే ఫగ్గన్‌ చేసిన ప్రకటన అయినా తప్పయి ఉండాలి లేదా ఆయన మాటకు బొత్తిగా విలువలేదనైనా అనుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చేసిన ప్రతిపాదనల్లా విశాఖ ఉక్కుకు ముడి సరుకు సరఫరా చేసే ఉద్దేశం ఉన్న వారు ముందుకు రావచ్చునని ఆహ్వానించడమే. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొనడానికి తాము సిద్ధం అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. ప్రకటించడమే ఆశ్చర్యకరం. కానీ అదీ వివాదాస్పదమైంది. మరి కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మితే కొంటామని కె.సి.ఆర్‌. ప్రకటించారంటే ఎక్కడో తికమక ఉండి ఉండాలి. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకమని భారతీయ రాష్ట్ర సమితి (మునుపు తెలంగాణ రాష్ట్ర సమితి-టి.ఆర్‌.ఎస్‌.) నాయకులు అంటున్నారు. ఆ మాట నిజమే అనుకున్నా కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకున్నప్పుడు, వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలు ఆమోదించినప్పుడు కె.సి.ఆర్‌. పార్టీ వ్యతిరేకించిన దాఖలాలు ఉన్నాయేమో కాగడా పెట్టి వెతకాల్సిందే. విశాఖ ఉక్కుని తెలంగాణ ప్రభుత్వం కొనడం ఎలా కుదురుతుంది అని ప్రశ్నిస్తున్న ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వమూ పార్లమెంటులో మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం కొనడానికి బిడ్‌ వేయనే లేదని గుడివాడ అమర్‌ నాథ్‌ వాదిస్తున్నారు. ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా వెలువడలేదంటున్నారు. ఒక వేళ అది నిజమైనా సాధ్యమయ్యే పని కాదంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల అధికార పక్ష నాయకుల వాద వివాదాలు ఎలా ఉన్నా మరో విచిత్రం ఉంది. కె.సి.ఆర్‌. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకించిన మాట నిజమే అనుకున్నా తాము కొంటామనడం ప్రైవేటీకరణను సమర్థించడమే కదా అని గుడివాడ అమర్‌ నాథ్‌ మరో ప్రశ్న లేవనెత్తారు. వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ముందు నుంచీ విశాఖ కర్మాగార ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూనే ఉందని వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు ఒకరు చెప్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నష్టాల నుంచి బయట పడేయడానికి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అనేక సూచనలు చేశారని కూడా ఆయన అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇనుప ఖనిజ గనులు ప్రత్యేకంగా కేటాయించాలని కూడా జగన్‌ సూచించారట. అదీ నిజమే అనుకుందాం. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న ఆలోచన మొదలైనప్పటి నుంచీ ఆ పరిశ్రమ కార్మికులు నిరంతరం ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘాలు అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రభుత్వ అనుకూల సంఘాలు కాకపోవచ్చు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు గానీ, ఆ పార్టీల నాయకులుగానీ విశాఖ ఉక్కును ఎలాగైనా పరిరక్షించుకోవాలని పాటు పడ్తున్న కార్మికుల పోరాటానికి మద్దతు ఇచ్చిన సందర్భాలూ కనిపించవు. విశాఖ ఉక్కు వ్యవహారాన్ని అధికారంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ రాజకీయ దృక్కోణం నుంచే చూస్తున్నాయి. కాని ‘‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’’ అని సుదీర్ఘ కాలం ఉద్యమం నిర్వహించి, ప్రాణ త్యాగాలు కూడా చేసిన వారి పోరాటానికి ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆ కర్మాగారాన్ని కొంటామంటున్న ప్రభుత్వం గానీ, ఎలా కొంటారని నిలదీస్తున్న ప్రభుత్వం గానీ కనీసం పోరాడు తున్న కార్మికులకు సానుభూతి తెలియజేసినా జనం వారి మాటలను నమ్మడానికి అవకాశం ఉండేదేమో. చంద్రబాబు హయాం నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఏ తెలుగు నాయకుడూ నికరంగా ప్రభుత్వ రంగ పరిరక్షణకు కట్టుబడిన ఉదంతమే లేదు.
విశాఖ ఉక్కుకు నేషనల్‌ మినరల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ టన్ను ముడి సరుకు ఆరేడు వందల రూపాయలకు అంటే తమకు అయిన ఖర్చు మేరకే వసూలు చేసి సరఫరా చేసేది. ఆ సంస్థ కార్పొరేట్‌ రూపం దాల్చిన తరవాత ఇప్పుడు ఆ ధర కనీసం పదింతలు పెరిగింది. విశాఖ ఉక్కును అమ్మడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం న్యాయసంబంధ వ్యవహారాలు పరిశీలించడానికీ, ఆ కర్మాగారం నికరంగా ఎంత విలువ చేస్తోందో లెక్క కట్టడానికీ రెండు కమిటీలను నియమించింది. ఆ కమిటీలు తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఏ దశలోనూ జగన్‌ కానీ, కె.సి.ఆర్‌. కానీ కేంద్ర విధానాన్ని వ్యతిరేకించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేసిన ప్రతిపాదనల్లా ఆసక్తిగల వారు ఎవరైనా తమ ముడి సరుకు తాము తెచ్చుకుని, ఉక్కు తయారు చేసి విశాఖ ఉక్కు కర్మాగారానికి అద్దె డబ్బులు చెల్లించి తీసుకుపోవచ్చు. నిజానికి ఉక్కు కర్మాగారానికి ప్రత్యేకంగా ఇనుప గనులు కేటాయించి ఉంటే లాభాలు సమకూరేవి. చాలా సందర్భాలలో ఆ కర్మాగారం లాభాలు సంపాదించింది కూడా. కేంద్రం చెప్తున్న ఆర్థిక సరళీకరణ విధానాలవల్ల కూడా ఉక్కు కర్మాగారానికి ఒరిగిందేమీ లేదు. కర్మాగారాన్ని నడపడానికి 13 లేదా 14 శాతం వడ్డీకి ఆ సంస్థ అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ వడ్డీ రేట్లు దాదాపు పది శాతం దరిదాపుల్లో ఉన్నాయి. కానీ ఆ అప్పులను రీషెడ్యూల్‌ చేసిన పాపాన పోలేదు. ప్రైవేటీకరణ ప్రస్తావన వచ్చినప్పుడే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ మహా సంస్థను పరీక్షించే పని చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వానికి పక్క వాద్యకారులుగా ఉండడంతోనే సరిపోయింది. ఇప్పుడు రాజకీయాలు చేయడంవల్ల ఫలితం ఏమీ లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img