Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వృధా అవుతున్న పార్లమెంటు సమావేశాలు

ప్రజాస్వామ్యంలో చట్టసభల పాత్ర ఎంతో ముఖ్యమైంది. ఇవి రాను రాను మొక్కుబడి సమావేశాలుగా మారిపోతున్నాయి. ప్రజల సమస్యలు, పాలనా విధానాలు, చేయవలసిన చట్టాల కోసం ప్రవేశపెట్టే బిల్లులపైన సమగ్రచర్చ జరపడం తప్పనిసరి. ప్రజా స్వామ్య వ్యవస్థలో బలమైన ప్రతిపక్షం ఉంటే ప్రజలకు మేలైన పాలన అందుతుంది. అనేక కారణాల వల్ల పార్లమెంటులో అనేక రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రతిపక్షం బలహీనంగా ఉంటోంది. అందు వల్లనే పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ నిరంకుశ పోకడలు పోతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత తొమ్మిది రోజులుగా ఒక్క సమస్యను కూడా చర్చించలేదు. సభా కాలమంతా వృధా అయింది. సమావేశాల నిర్వహణకు, సభ్యుల వ్యయానికి కొన్ని పదుల కోట్లు ఖర్చు చేయవలసి ఉంటుంది. దేశాన్ని, ప్రపంచాన్ని ఊపేస్తున్న పెగాసస్‌ స్పైవేర్‌ సమస్యపైన, రైతులను దివాలా తీయించే మూడు వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు ఐక్యంగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ రెండు సమస్యలు అత్యంత ముఖ్యమైనవి. కొవిడ్‌19 మహమ్మారి సమస్యను సైతం తొలి దశ నుంచి మోదీ ప్రభుత్వం సమగ్రంగా చర్చించి కార్యచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయలేదు. సభాసమయాన్ని ప్రతిపక్షాలు వృధా చేస్తూ పార్లమెంటు పవిత్రతను ప్రతిపక్షాలు ధ్వంసంచేస్తున్నాయని ప్రభుత్వం ఘాటుగా మాట్లాడుతోంది. ప్రధాన మంత్రి సభలో పాల్గొని ముఖ్యమైన సమస్యలపై చర్చించి బాధ్యతగా సమాధానం చెప్పాలి. మన ప్రధానికి తొలి నుంచి ఈ అలవాటు లేదని భావించవచ్చు. మహత్తరమైన రైతు పోరాటం ప్రారంభమై ఎనిమిది నెలలు గడిచినప్పటికీ మోదీ అసలు సమస్యే కాదన్నట్టుగా పట్టించుకోవడం లేదు. యుపిఎ2 ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో నేటి పాలకులు అనేక మార్లు సభను స్తంభింపజేసి సభా సమయాన్ని, ప్రజా ధనాన్ని వృధా చేశారు. 2010లో అంత క్రితం పార్లమెంటు సమావేశాల సమయం దాదాపు 38శాతం వృధా అయినట్టు అంచనా. 2013 ప్రారంభంలో బడ్జెట్‌ సమావేశాలు 163గంటలు జరిగితే 146గంటలు వృధాఅయింది. కామన్వెల్త్‌ క్రీడలు, వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు తదితర అంశాలపై నాటి ప్రతిపక్షం సభ జరగనివ్వలేదు. ఈ విషయాలు గుర్తు చేసుకోవలసిన అవసరం పాలక, ప్రతిపక్షాలకు అవసరం. అయితే చాలా సార్లు పాలక పక్షమే కావాలని చర్చ జరగకుండా వ్యూహాత్మకంగా సభను నిర్వహించిన సందర్భాలున్నాయి. మోదీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కొవిడ్‌19 తొలిదశలో మన దేశంలోకి వైరస్‌ ప్రవేశించిన తర్వాత ప్రభుత్వ ఆలోచన ప్రకారం బిల్లులను ఆమోదింప జేసుకొనేందుకు 2020 పార్లమెంటు సమావేశాలు నిర్వహించి కరోనా నియంత్రణను నిర్లక్ష్యం చేశారు. మరోవేపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆహ్వానించి ఆయనకు బ్రహ్మరథం పట్టే పనిలో మోదీ తల మునకలయ్యారు. ఈ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను ఆమోదింప జేసుకున్నారు. కొవిడ్‌పై అంతకు ముందు రెండు నెలలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలను సైతం పట్టించుకోలేదు. ఆకస్మిక లాక్‌డౌన్‌ ప్రకటించి కోట్లాది వలస కూలీలను ఎనలేని బాధలకు గురి చేశారు. పెగాసస్‌ స్పైవేర్‌ను ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ సంస్థ నుంచి మోదీ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఉంటుందని చెప్పడానికి బలమైన సూచనలున్నాయి. ఇద్దరు మంత్రులు కూడా స్పైవేర్‌ నిఘా జాబితాలో ఉన్నారన్న విషయం వైర్‌ మీడియా సంస్థ తాజాగా విడుదల చేసిన జాబితాలో ఉంది. దేశంలో మోదీ ప్రభుత్వానికి ఇష్టులు కాని 155 మంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మేధావులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు ఉన్నారన్న విషయం వెల్లడైంది. స్పైవేర్‌ను తాము ప్రభుత్వాలకు వాటి ఏజెన్సీలకు మాత్రమే విక్రయిస్తామని ఎన్‌ఎస్‌ఒ స్పష్టంగా ప్రకటించింది. ప్రభుత్వ అధీనంలో ఉండే గూఢచర్య వ్యవస్థ దేశ వ్యాప్తంగా అవినీతి, అక్రమాలు తదితర అనేక అంశాలపై దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తుంది. గూఢచర్య వ్యవస్థలో సిబిఐ లాంటి అనేక సంస్థలున్నాయి. అయితే మోదీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలుపు కోసం, ప్రభుత్వాలను కూల్చివేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయిల్‌ నుండి కొనుగోలు చేసి ఉంటారని దేశ ప్రజలు భావిస్తున్నారు. 2017లో మోదీ ఇజ్రాయిల్‌లో పర్యటించినప్పుడే ఎన్‌ఎస్‌ఒ గ్రూపుతో సంప్రదించారని అంతర్జాతీయ మీడియా చెప్తోంది. ఏ మాత్రం పారదర్శకత లేని మోదీ పాలనలో తీసుకొనే నిర్ణయాలు, చేసే చట్టాలు పార్లమెంటులో సమగ్ర చర్చకు నోచుకోవడం లేదు. వ్యవసాయ చట్టాలను కోట్లాది మంది రైతులకు ఇష్టం లేకుండా రూపొందించారు. కార్పొరేట్‌ రంగానికి వ్యవసాయాన్ని అప్పగిస్తే రైతులు కూలీలుగా మారిపోయే ప్రమాదం ఉందని అనేక మంది నిపుణులు చేసిన సూచనలను సైతం మోదీ పెడచెవిని పెట్టారు. రైతుల జీవన్మరణ సమస్యను సైతం పట్టించుకోలేని పాలన సమర్థమైంది కాదని భావిస్తే తప్పుపట్ట వలసిందేమీ లేదు. ఒకవేపు ప్రతిపక్షం సభలో ఈ అంశాలపై చర్చించాలని కోరుతున్న దశలో ప్రభుత్వం మంద బలంతో నాలుగు బిల్లులను ఆమోదింపజేసుకున్నది. ప్రజల పాత్ర, అభిప్రాయాలు ఆలకించని ప్రభుత్వం నిరంకుశమైందిగానే భావించాలి. కొవిడ్‌19 మహమ్మారి రెండో దశలో తీవ్ర వైఫల్యం చెందిందన్న అభిప్రాయం మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మూడో దశ మహమ్మారి పొంచి ఉందని ప్రజలను హెచ్చరించిన మోదీ కనీసం కోట్లాది ప్రజల జీవన్మరణ సమస్యను సైతం సభలో చర్చించకపోవడం దారుణం. ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్‌ చేస్తున్న సమస్యలు అత్యంత తీవ్రమైనవి. అయినా చర్చించడానికి మోదీ సుముఖత వ్యక్తం చేయడం లేదు. 300 మంది సభ్యులు తమ వైపు ఉన్నందున ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరన్న ప్రజా ధిక్కార ఆలోచన గల మోదీ పాలన తీరుతెన్నులను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. పార్లమెంటు సమావేశాలు చక్కగా నిర్వహించడానికి పాలకులే ప్రధాన పాత్ర వహించవలసి ఉంటుంది. ప్రతిపక్షాలపై ఆరోపణలు చేసి నిందలు వేసినంత మాత్రాన తమ బాధ్యత తీరిపోదు. పెగాసస్‌ అంతర్జాతీయ కుట్రగా ప్రచారం చేసినా, దేశంలో దీన్ని ఎవరు కోనుగోలు చేసిందన్న సత్యం సుప్రీంకోర్టు విచారణ నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img