Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వేడెక్కిన యూపీ రాజకీయాలు

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగనున్నాయి. ఇప్పటి నుండే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమకు ప్రయోజనం కలిగించే చిన్న పార్టీలతో పొత్తులు కుదుర్చుకొనే పనిలో ఉన్నాయి. రాజకీయ సమీకరణలు ఆకస్మికంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలనలో ఎన్‌కౌంటర్లు, దళిత మహిళలపై హత్యాచారాలు పెరిగిపోయాయి. కొవిడ్‌`19 మహమ్మారి నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. పోలీసు వ్యవస్థ అంతా యోగి కనుసన్నల్లో పనిచేస్తూ, తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మీడియా ఎలుగెత్తి చాటింది. హత్రాస్‌ దుర్ఘటన యోగి ప్రతిష్ఠను పూర్తిగా దిగజార్చింది. ప్రభుత్వ యంత్రాంగం, చివరకు కలెక్టరు స్థాయి ఉన్నతాధికారులు కూడా యోగి కనుసన్నల్లోనే పని చేస్తున్నారని హత్రాస్‌ దుర్ఘటన స్పష్టం చేసింది. అన్నిటికీ మించి మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే మూడు నల్ల చట్టాల రద్దుకు 11 నెలలుగా రైతులు చేస్తున్న మహత్తర పోరాటం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని క్లిష్టతరం చేసింది. మోదీ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న శత్రు వైఖరిని దేశ వ్యాప్తంగా నిరసిస్తున్నారు. తొలి నుండి రైతు ఉద్యమ వ్యతిరేకి అనిపించుకున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అనుసరించిన విద్వేషపూరిత విధానం యూపీ రైతాంగంలో తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఇటీవల యూపీలో జరిగిన లఖింపూర్‌ ఖేరీ విషాదం రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి రైతాంగం యోగి ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుకున్నారు. దీంతో మోదీ, అమిత్‌షాలు యూపీలో గెలిచి తీరాలన్న దిశలో దూరమైన చిన్న చిన్న పార్టీలను దగ్గరకు తీసుకునేందుకు అన్ని రకాల మాయోపాయాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ నాయకత్వంలోని సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌వాది (ఎస్‌బి ఎస్‌పి) పార్టీ, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాది (ఎస్‌పి) తో పొత్తు కుదుర్చుకొనేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాలక పార్టీ బీజేపీ వీరి మధ్య పొత్తు కుదరకుండా అడ్డుకొన్నది. అత్యంత వేగంగా కదిలి ఎస్‌బి ఎస్‌పి పార్టీతో పొత్తు కుదుర్చుకొన్నది. అలాగే అప్నాదళ్‌ పార్టీ నాయకురాలు సుప్రియ పటేల్‌ అఖిలేష్‌ యాదవ్‌తో చర్చిస్తున్న దశలో ఆమెకు మోదీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చారు. ఆమె కుటుంబ సభ్యులకు వివిధ స్థాయిల్లో పదవులు కట్టబెట్టి అప్నాదళ్‌తో బీజేపీ పొత్తు కుదుర్చుకొన్నది. మత్స్యకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిషాద్‌ పార్టీతోనూ బీజేపీ కలసి పోటీ చేయనున్నది. అధికార పదవులు కట్టబెట్టడం, అపారంగా సమీకరించి ఆర్థిక వనరులను ఎన్నికల్లో వినియోగించుకోవడంలో బీజేపీది అందె వేసిన చేయి. ఇంకా మరికొన్ని పార్టీలకు గాలం వేసేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం సర్వ శక్తులూ ఒడ్డుతున్నది.
యూపీ పశ్చిమ ప్రాంతంలో ఇటీవల పరిణామాల్లో ఏకమైన రైతులు, ముస్లింలు సమాజ్‌ పార్టీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ గట్టి అండగా నిలవనున్నారన్న బలమైన సూచనలున్నాయి. ముజఫర్‌నగర్‌లో గతంలో జరిగిన మతాల మధ్య అల్లర్లు రైతులను, ముస్లింలను వేరు చేశాయి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం వీరిని ఐక్యం చేసింది. ఒకానొకనాడు చరణ్‌సింగ్‌ నాయకత్వంలో ఏర్పడిన లోక్‌దళ్‌కు పశ్చిమ యూపీలో బలమైన అండ ఉంది. చరణ్‌సింగ్‌ ఆ తర్వాత ఆయన కుమారుడు అజయ్‌సింగ్‌లు రైతు నాయకులుగా పేరు పొందారు. రైతుల కోసం ఉద్యమాలు, వారి అభివృద్ధికి వీలైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాంత రైతులకు బలమైన నాయకుడు లేరు. మహా పంచాయత్‌లు నిర్వహించడం ద్వారా రైతు ఉద్యమానికి రాకేశ్‌ తికైత్‌ బలమైన నాయకుడిగా ఎదిగాడు. బీజేపీకి ఓటు వేయవద్దని రైతు ఉద్యమ నాయకులు నిర్ణయించారు. యూపీతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగా రైతులు ప్రచారం చేయనున్నారు. అఖిలేష్‌ ముందుగానే చాలా చిన్న చిన్న పార్టీలు, గ్రూపులతో పొత్తు కుదుర్చుకున్నాడు. ఇటీవల వరకు మౌనంగా ఉన్న బీఎస్‌పీ నాయకురాలు మాయావతి క్రియాశీలమైన ప్రచారం సాగిస్తోంది. గతంలో ఉన్న ఆదరణ ఇప్పుడు లేకపోయినా మాయావతికి గణనీయంగా ఓటు బ్యాంకు ఉంది.
చిరకాలంగా రాష్ట్రంలో అధికారం దక్కక బలహీనపడిన కాంగ్రెస్‌ పునరుజ్జీవం కావడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీ బాధ్యతను తీసుకొని మహిళలకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించి అన్ని పార్టీలను ఆశ్చర్యపరిచింది. ఈ ఎత్తుగడ ఎంతో కొంత పార్టీకి ఉపయోగపడవచ్చు. ఇక దాదాపు 19 శాతం ఉన్న బ్రాహ్మణ వర్గం కూడా యోగి ప్రభుత్వానికి దూరంగా జరిగింది. ఈ అంశాన్ని గుర్తించిన బీజేపీ కేంద్ర నాయకత్వం బ్రాహ్మణ వర్గంలో కొందరికి కేంద్రంలో, రాష్ట్రంలో పదవులు కట్టబెట్టి వారిని ఆకట్టుకొనేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నది. కులాలను, మతాలను పట్టించుకొనే పార్టీ తమది కాదని టముకు వేసుకొనే బీజేపీ ఆచరణలో అన్ని ఎన్నికల్లో కులాల, మతాలనే ఆధారం చేసుకొంటున్నది. ఇక రైతు ఉద్యమాన్ని చీల్చేందుకు తొలి నుండి మోదీ, బీజేపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రైతు ఉద్యమంతో మమేకమైన యోగేంద్ర యాదవ్‌ లఖింపూర్‌ ఖేరీ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు బీజేపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి వచ్చారు. దీనిపై సంయుక్త కిసాన్‌మోర్చా యోగేంద్ర యాదవ్‌ను నెలరోజులు సస్పెండ్‌ చేసింది. రైతు ఉద్యమ నాయకులలో ఉన్నత స్థానంలో ఉన్నవారిలో యోగేంద్ర యాదవ్‌ ఒకరు. ఈ ఘటనను ఆసరా చేసుకుని రైతు ఉద్యమాన్ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. యోగి పాలన పట్ల తీవ్రంగా ఉన్న వ్యతిరేకత బలంగా పనిచేస్తే బీజేపీకి కష్టాలే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img