Friday, April 19, 2024
Friday, April 19, 2024

శశీ థరూర్‌ ఒంటరి పోరు

రెండు దశాబ్దాల తరవాత కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఆ పార్టీలో ప్రజాస్వామ్యం మళ్లీ అంకురిస్తుందన్న ఆశలు మొలకెత్తాయి. అయితే కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి ఎన్నికల ప్రక్రియ మొత్తం పరిమిత ప్రజాస్వామ్య మూసలోకి దించేశారు. ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించగానే శశీ థరూర్‌ పోటీకి సిద్ధపడిపోయారు. ఆయన సోనియాను దర్శించి తన ఆకాంక్ష వ్యక్తం చేశారు. సోనియా తన మనసులో మాట బయట పెట్టలేదు కానీ ఆయనను ప్రోత్సహించలేదు. అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. తాను జోక్యం చేసుకోను అని చెప్పినా మొదట అభ్యర్థి అనుకున్న రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ సోనియా గాంధీ కుటుంబం మద్దతు ఆయనకే ఉందన్నది బహిరంగ రహస్యమే. ఆయన జోడు పదవులు కావాలని పట్టుబట్టకుండా ఉంటే ఆయనే రంగంలో ఉండేవారేమో! దిగ్విజయ సింగ్‌ పోటీ చేయడానికి సిద్ధపడ్డా సోనియా మద్దతు ఆయనకు ఉన్నట్టు కనిపించలేదు. ఆమె మనసులో మల్లికార్జున్‌ ఖడ్గే ఉన్నారని దిగ్విజయ్‌ చివరి నిమిషంలో తప్ప కనిపెట్టలేదు. చివరకు ఖడ్గే రంగ ప్రవేశం చేశారు. ఇంతకు ముందు కాంగ్రెస్‌లో సంస్థాగత సంస్కరణలు కావాలని సోనియాకు లేఖ రాసిన బృందంలో కొందరు బీజేపీలోకి దూకేసిన తరవాత మిగిలిన వారూ శశీ థరూర్‌ అభ్యర్థిత్వాన్ని మెచ్చలేదు. ఆ 23 మంది బృందంలో చాలామంది ఖడ్గే నామినేషన్‌ దాఖలు చేసినప్పుడు ఆయన వెంటే ఉన్నారు. నిజానికి శశీ థరూర్‌ 23 మందితో కూడిన బృందం నిలబెట్టిన అభ్యర్థి ఏమీ కాదు. ఆ బృందం అసలు అలాంటి ఆలోచనే చేయలేదు. శశీ థరూర్‌ కూడా తాను ఆ అసమ్మతి బృందం ప్రతినిధిగా పోటీ చేస్తున్నానని చెప్పలేదు. మల్లికార్జున్‌ ఖడ్గే కచ్చితంగా సోనియా గాంధీ మద్దతు ఉన్న అభ్యర్థి అని బాహాటంగానే తెలిసిపోయింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడిని ఎన్నుకునేది కేవలం 9000 మంది మాత్రమే. ఇద్దరు అభ్యర్థులూ ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. ఎవరు అధ్యక్షులుగా ఎన్నికైనా సోనియా గాంధీ కుటుంబం, మరీ ముఖ్యంగా రాహుల్‌ గాంధీకే పార్టీ వ్యవహారాల్లో అగ్రాసనం ఉంటుందని ఇప్పటికే దాపరికం లేకుండానే చెప్తున్నారు. పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్నవారు నిరంకుశంగా వ్యవహరించకూడదన్న నియమంతో ఎవరికీ పేచీ ఉండక్కర్లేదు. కానీ ముఖ్యమైన విషయాల్లో సోనియా కుటుంబంలోని వారి ప్రమేయం ఉంటుందన్నది వాస్తవం. పార్టీ అధ్యక్షులు వేరు నాయకులు వేరు అన్న భాష్యాలూ వినిపిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ విషయంలో ఆ మాట నిజమే. బీజేపీలోనూ వాజపేయి, అడ్వాణీకే అగ్రసానాధిపత్యం ఉండేది. పార్టీ అధ్యక్షులుగా ఎవరున్నా వారిద్దరి మాటను జవదాటి వ్యవహరించిన బీజేపీ అధ్యక్షులు ఎవరూ లేరు. కాంగ్రెస్‌ లోనూ మొదటి నుంచీ అదే పరిస్థితి. నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, మౌలానా ఆజాద్‌ లాంటి దిగ్దంతలు ఎంతమంది ఉన్నా కాంగ్రెస్‌లో ఆ నాడూ తిరుగులేని నాయకుడు నిస్సందేహంగా మహాత్మా గాంధీనే. గాంధీ ఒకే ఒక్క సారి 1924లో కాంగ్రెస్‌ అధ్యక్షులుగా వ్యవహరించారు. అయితే అప్పుడు సంస్థాగత ఎన్నికలు క్రమం తప్పకుండా జరిగేవి. గాంధీ, పటేల్‌, మౌలానా ఆజాద్‌ మరణం తరవాత 1950 నుంచి పండిత్‌ నెహ్రూ చివరి దాకా తిరుగులేని నాయకుడిగా కొనసాగారు. అయితే ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఇతరులు కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానంలో ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినా నెహ్రూనే అంతిమ నాయకుడు.
ఇందిరాగాంధీ హయాంలోనూ కొంతకాలం ఆమె ప్రధానిగా ఉంటే ఇతరులు కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆ సంప్రదాయానికి ఇందిరాగాంధీయే స్వయంగా గండి కొట్టారు. రెండు పదవులూ ఆమె దగ్గరే ఉంచుకున్నారు. ఆమె తరవాత రాజీవ్‌ గాంధీ, పీవీ నరసిం హారావు ఆ సంప్రదాయాన్నే కొనసాగించారు. సోనియా 1998లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అయిన తరవాత మధ్యలో రాహుల్‌ అధ్యక్షులుగా వ్యవహరించిన కొద్ది కాలం మాత్రం మినహా కాంగ్రెస్‌ పై ఆమె ఆధిపత్యానికి తిరుగు లేకుండా పోయింది. రాహుల్‌ రాజకీయాల్లోకి ప్రవేశించిన తరవాత ఆయనకు అవకాశం వచ్చినా మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉండగా మంత్రిపదవి స్వీకరించడానికి నిరాకరించారు. కాంగ్రెస్‌ వ్యవహారాల్లో మాత్రం ఆయన ప్రమేయం అంతకంతకూ పెరగడం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. మన్మోహన్‌ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడూ అసలు అధికారం సోనియా గుప్పెట్లోనే ఉందని, ఆయన కేవలం సోనియా చేతిలో కీలుబొమ్మ అన్న విమర్శలు హోరెత్తాయి. కాంగ్రెస్‌ పార్టీ మీద సోనియా కుటుంబం పట్టుకు ఎదురులేకుండా పోయింది. ఉదాహరణ ప్రాయంగా కూడా అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహించే ఆలోచనకైనా తావు లేకుండా పోయింది. మన్మోహన్‌ ఏలుబడిలో మంత్రిపదవి ఒద్దన్న రాహుల్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షస్థానం వద్దంటున్నారు. కానీ పెత్తనం ఆయనదేనన్నది నిర్వివాదాంశం. నిజానికి 23 మంది బృందంలోని వారి అభ్యంతరం లేదా ఫిర్యాదు సోనియాగాంధీ మీద కాదు. రాహుల్‌గాంధీ మీద నమ్మకం లేకపోవడమేనని అనేక పరిణామాలు రుజువు చేశాయి. అయితే నిర్ణయాధికారం రాహుల్‌ చేతిలోనూ ఉండడాన్ని అంతో ఇంతో అసమ్మతి వ్యక్తం చేసే వారూ ఎన్నడూ వ్యతిరేకించలేదు. పోటీ చేయాలని నిర్ణయించుకున్న తరవాత వెనుదిరిగిచూడడానికీ, పోటీ నుంచి విరమించు కోవడానికీ థరూర్‌ సిద్ధపడలేదు.
విరమించుకోమని నన్నెవరూ అడగలేదంటున్నారు. ఎన్నిక నిర్వహిస్తున్నట్టు కనిపించడానికైనా సోనియా కుటుంబానికి థరూర్‌ పోటీ చేయడం అవసరం. జయాపజయాలు చేతిలో ఉన్నంత కాలం థరూర్‌ పోటీవల్ల పోయేది ఏమీ లేదు. ఆయన విరమించుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసిన వారి ఆంతర్యం ఏకాభిప్రాయంతో ఖడ్గే ఎన్నికయ్యేట్టుచూడడమే. ఈ ఏకాభిప్రాయ సాధన కూడా సంస్థాగతంగా ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించడానికి ఉపకరించదు. ఎన్నిక నిర్వహించడానికి మధ్యలో అయిదు రోజులే మిగిలాయి. ఖడ్గే సోనియా గాంధీ కుటుంబం మద్దతు ఉన్న వారే కనక ఆయన విజయం ఖాయం. శశీ థరూర్‌ ఎంత తక్కువ వోట్లు సంపాదించినా ప్రజాస్వామ్య ప్రక్రియ తంతుగానైనా కొనసాగడానికి తోడ్పడుతుంది. ఆ మేరకు చిరు మార్పు వచ్చినట్టే. ఇక మిగిలిందల్లా శశీ థరూర్‌ ఒంటరి పోరాటమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img