Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సమైక్య పోరుకు బదులు ఏకపాత్రాభినయం

ఉమ్మడి శత్రువును ఓడిరచడానికి సమైక్య పోరాటం చేయవలసిన తరుణంలో కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఒంటరి బాట ఎంచుకుంటున్నాయి. మహానాటకానికి తెరతీయవలసిన పరిస్థితుల్లో ఏకపాత్రాభినయం చేయడం అంటే ఇదే. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2024 సార్వత్రిక ఎన్నికలలో తృణమూల్‌ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా అన్ని సీట్లకు ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో బలం ఉన్న అఖిలేశ్‌ యాదవ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కూడా మొత్తం 80 స్థానాలకు పోటీ చేస్తామంటోంది. మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌ పార్టీకూడా 80 సీట్లలో పోటీ చేస్తుందట. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషించాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్ర సమితిగా మార్చేసి తమది జాతీయ పార్టీ అయిపోయిందంటున్నారు. ఆ పార్టీ లోకసభ ఎన్నికలలో ఇతర రాష్ట్రాలలో కూడా పోటీ చేయడానికి ప్రయత్నించ వచ్చు. కానీ భారత రాష్ట్రసమితికి అపూర్వమైన రీతిలో స్వాగత తోరణాలు కట్టిన దాఖలాలులేవు. అందువల్ల కె.సి.ఆర్‌. పార్టీ కూడా ఇతర రాష్ట్రాలలో పోటీచేస్తే అది దాదాపుగా ఒంటరి పోటీనే అవుతుంది. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర తరవాత ఎక్కువ లోకసభ స్థానాలు ఉన్న రాష్ట్రం బెంగాల్‌. అలాంటప్పుడు మమతా బెనర్జీ ఒంటరి పోరాటం చేస్తామనడం ప్రతిపక్ష ఐక్యతకు మొహం తిప్పేసినట్టే. నిజానికి 2021లో బెంగాల్‌ శాసనసభ ఎన్నికలలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నాలుగింట మూడువంతులసీట్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. బెంగాల్‌లో పాగావేయాలన్న బీజేపీ ఎత్తుగడలను విజయవంతంగా వమ్ముచేసింది. తృణమూల్‌ ఏర్పడి పాతికేళ్లు అయింది. ఇందులో 13 ఏళ్లు అధికారంలో ఉండడం చెప్పుకోదగ్గ విషయమే. 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ 18 సీట్లు సాధించడంచూస్తే తృణమూల్‌ పట్టు సడలుతున్నట్టు కనిపించింది. అంతకు ముందు బెంగాల్‌నుంచి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు 34 మంది ఉంటే 2019లో వారి సంఖ్య 22కు తగ్గడంవల్ల బీజేపీ పుంజుకుంటున్నట్టు కనిపించింది. కానీ 2021 శాసనసభ ఎన్నికలలో మమతాబెనర్జీ బీజేపీని గణనీయంగా దెబ్బ తీయగలిగారు. 2021లో పెద్ద విజయం సాధించిన తరవాత తృణమూల్‌ అధినేత జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. చిన్న చిన్న రాష్ట్రాలలో, ఈశాన్య రాష్ట్ట్రాలలో పోటీచేసినా అంతగా ఫలితం దక్కడంలేదు. జాతీయస్థాయిలో తన పాదముద్రలు అన్వేషించడానికి మమతా బెనర్జీ అందరికన్నా ముందు ప్రతిపక్ష ఐక్యతారాగం ఎత్తుకున్నారు. రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరిగినప్పుడు తమ పార్టీ నాయకుడు, ఇదివరకు బీజేపీ నాయకుడు అయిన యశ్వంత్‌ సిన్హాను పోటీకి పెట్టారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష ఐక్యత గురించి నిరంతరం మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికలలో ఓటమి తరవాత ఆయన గొంతే వినిపించడం లేదు. 2022 గోవా శాసనసభ ఎన్నికలలో తృణమూల్‌ ఎంత హడావుడిచేసినా నిష్ప్రయోజనంగానే మిగిలింది. త్రిపురలో బెంగాలీ మాట్లాడేవారు 60శాతం మంది ఉన్నా తృణమూల్‌కు వచ్చిన ఓట్లు నోటా ఓట్లకన్నా తక్కువే. నోటాకు 1.36శాతం ఓట్లు వస్తే తృణమూల్‌ సాధించింది కేవలం 0.88 శాతమే. మేఘాలయలో కాంగ్రెస్‌ను తృణమూల్‌ మొత్తంగా కబళించేసినా దక్కింది మాత్రం 14 శాతం ఓట్లే. ఈశాన్య రాష్ట్రాలలో అరకొర పలుకుబడి తప్ప తృణమూల్‌ కాంగ్రెస్‌కు మరేరాష్ట్రంలోనూ కాలుమోపేచోటు కూడా లేదు. కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ అయినా తమ పార్టీని ఇతర రాష్ట్రా లలో విస్తరించడానికి, చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. మమతా బెనర్జీ ఆ పనీ చేయడం లేదు. బెంగాల్‌కు ఆవల తృణమూల్‌కు కార్యకర్తలూ లేరు, నాయకులూ లేరు, ఓటర్లు అంతకన్నా లేరు. 2019లో తృణమూల్‌కు ఓటువేసిన వారిలో 99.8శాతం మంది బెంగాల్‌కు చెందిన వారే. కాంగ్రెస్‌ లేదా ఇతర పార్టీల నుంచి నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడంతోనే తృణ మూల్‌ సంతృప్తి పడుతోంది.
మమతా బెనర్జీ బెంగాల్‌లో తన బలాన్నే చూస్తున్నారు తప్ప బలహీనతలను పరిగణిస్తున్నట్టు లేదు. మహిళా నాయకుల్లో చూసినా మమత అగ్రనాయకురాలేమీ కాదు. బెంగాల్‌లో తృణమూల్‌ సాధించి చూపిన అభివృద్ధి కళ్లు చెదిరేది ఏమీకాదు. కాంగ్రెస్‌ నుంచి చీలిపోయి ఏర్పడిన పార్టీమాత్రమే కాకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తృణమూల్‌లో చేర్చుకుంటున్నారన్న అపఖ్యాతీ మమతకు ఉంది. మమతా బెనర్జీ ప్రతిపక్ష ఐక్యత గురించి ఎంత గొంతు చించుకున్నా బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రరశేఖరరావు కూడా ఆమెను విశ్వసించే స్థితిలోలేరు. బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ సీట్లు ఉంటే 40 సాధించగలమనుకోవడం అత్యాశే అవుతుంది. కాంగ్రెస్‌, వామపక్షాలు కూడా 2024లో ఎంతో కొంత మెరుగుపడొచ్చు. బెంగాలీ ఆత్మగౌరవమో, గొప్పతనమో గట్టెక్కిస్తుందని మమత భావిస్తే అంతకన్నా అవాస్తవం ఏమీ ఉండదు. లోకసభ ఎన్నికలలో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోతే 1996లో దేవెగౌడ, ఆ తరవాత ఐ.కె.గుజ్రాల్‌ ప్రతిపక్షం తరఫున ప్రధాని అభ్యర్థులు అయినట్టు తనకూ అవకాశం ఉందన్న మమత అంచనాలలోనూ బలంలేదు. ఏ దృష్టితో చూసినా జాతీయ రాజకీయాల్లో అక్కడో అంగ ఇక్కడో అంగ వేయడంకన్నా బెంగాల్‌లో ఉన్న పట్టు పదిలపరచుకోవడమే మమతకు లాభదాయకం. ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ప్రతిపక్ష పార్టీ సమాజ్‌ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌, బహుజన సమాజ్‌ పార్టీ నాయకురాలు మాయావతి కూడా లోకసభ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తా మంటున్నారు. అంటే ముక్కోణ, బహుకోణ పోటీలకు అవకాశం ఇవ్వడమే. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర సమాపనోత్సవంలో అఖిలేశ్‌ పాల్గొనకుండా కాంగ్రెస్‌వ్యతిరేకతను వ్యక్తంచేశారు. ఈ వాతా వరణంలో ప్రతిపక్ష ఐక్యతకు ఆయన తోడ్పడతారని అనుకోలేం. 2014 లోకసభ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ సాధించింది అయిదు సీట్లే. 2019లో ఆ పార్టీ మాయావతి పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. అయినా దక్కింది ఆ అయిదు సీట్లే. దీనివల్ల బహుజన సమాజ్‌ పార్టీకే మేలు కలిగి పది సీట్లు దక్కాయి. 2014లో మాయావతి పార్టీకి ఒక్క సీటూరాలేదు. అంటే ఇతరపార్టీలతో పొత్తు మాయావతిపార్టీకి మేలు చేసినా ఈసారి ఆమె ఒంటరిగా పోటీ చేస్తామంటున్నారు. ఇలా అనేక పార్టీలు ఒంటరిగా పోటీకి దిగడం అంటే మోదీని గెలిపించడమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img