Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

సర్వం మోదీ మయం

ఏ ఎన్నికలు లేని సందర్భంలో సోమవారం ప్రధానమంత్రి మోదీ దిల్లీలో రోడ్‌ షో నిర్వహించడం విచిత్రంగా ఉంది. పటేల్‌ చౌక్‌ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగే ఎన్‌.ఎం.డి.సి. సమావేశం మందిరం దాకా దాదాపు ఒక కిలోమీటర్‌ మేర ఈ రోడ్‌షో సాగింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగేటప్పుడు ఇలాంటి విన్యాసాలు జరిగిన సందర్భం మరొకటి మాత్రమే ఉందట. ఒరిస్సాలో జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు ఇలాగే మోదీ రోడ్‌ షో నిర్వహించారట. ఈ రోడ్‌ షోలో మోదీ భద్రతా కట్టుదిట్టాలను కూడా లెక్కచేయకుండా కారు తలుపుతీసి నిలబడి కేరింతలు కొడ్తున్న జనాన్ని చేయి ఊపి ఉత్సాహపరిచారు. ఆయన మీద పూలవాన కురిసింది. సంగీతం హోరెత్తింది. నినాదాలు సరే సరి. రోడ్‌ షోలు నిర్వహించడం మోదీకి కొత్తకాదు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇలాంటి రోడ్‌షోలు అనేకం నిర్వహించారు. మొన్నటికి మొన్న గుజరాత్‌ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు 50 కిలోమీటర్ల పొడవున అహమదాబాద్‌లో రోడ్‌ షో నిర్వహించారు. సందర్భం లేకుండా దిల్లీలో రోడ్‌షో ఎందుకు నిర్వహించారు అన్న ప్రశ్నకు గుజరాత్‌ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించినందుకు అని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు. మరి హిమాచల్‌ప్రదేశ్‌లో ఓటమికి ఏ పరిహారం చేసుకున్నారో తెలియదు. ఈ రోడ్‌ షో ద్వారా మోదీ రాజకీయ సందేశం ఏమైనా ఇవ్వదలచుకున్నారా అని ఆలోచిస్తే దిల్లీలో అధికారంలోఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు చూశారా మీ ఏలుబడిలోఉన్న దేశ రాజధానిలో ఎంత బ్రహ్మాండమైన రోడ్‌షో నిర్వహించామో చూడండి అని తెలియజెప్పడం ఒక కారణంగా కనిపిస్తోంది. దిల్లీలో రాకపోకలకు జరగవలసినంత ఆటంకం తప్పలేదు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర దిల్లీలో కూడా కొనసాగింది. జనాదరణ కూడా బాగానే ఉంది. మధ్యప్రదేశ్‌లో రాహుల్‌ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. భారత్‌ జోడో యాత్రను కురచనచేసి చూపించడం కూడా మోదీ ఈ బల ప్రదర్శన ఆంతర్యం కావచ్చు. అంటే పనిలో పనిగా రాహుల్‌కు కూడా ఇవ్వాల్సిన రాజకీయ సందేశం ఇచ్చినట్టున్నారు. భారత్‌ జోడో బీజేపీకి వెన్నులో ఒణుకు పుట్టిస్తున్నట్టుంది. మోదీ రోడ్డెక్కితే గొదీ మీడియా బోలెడు హడావుడి చేసింది. టీవీ చానళ్లయితే ఈ దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారంచేసి తరించి పోయాయి. మేళ తాళాలు, దేశభక్తి గీతాలాపనలు, నినాదాలు షరా మామూలుగా మిన్నంటాయి. హిందుత్వ విధానాలు, విద్వేష ప్రచారాలు బీజేపీకి బాగానే ఓట్లు రాలుస్తున్నాయి. అయితే ఇది అన్నిచోట్లా సాధ్యం కావడంలేదు. భారతీయ జనతాపార్టీ సంస్థాగతంగా చాలా పటిష్ఠమైందనుకుంటారు. కానీ మోదీ ప్రధానమంత్రి అయిన తరవాత పార్టీ ప్రచారంకన్నా మోదీ ప్రచారమే శ్రుతిమించిపోతోంది. ఆయన పలుకుబడి బీజేపీ సంస్థాగత బలాన్ని ఎప్పుడోమించి పోయింది. బీజేపీని నిర్దేశించే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌.ఎస్‌.ఎస్‌.)కు కూడా మోదీ విన్యాసాలన్నింటినీ కిమ్మనకుండా భరించవలసి వస్తోంది. అటల్‌ బిహారీ వాజపేయి ప్రధానిగా, లాల్‌కృష్ణ అడ్వాణీ ఉప ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆదేశాలను పాటించవలసి వచ్చింది. ఈ ఇద్దరు అగ్రనేతలు గీత దాటుతున్నారనుకున్నప్పుడు ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేతలు వారిని పిలిపించి మంద్రస్థాయిలోనైనా మందలించేవారు. మోదీ మాత్రం ఆర్‌.ఎస్‌.ఎస్‌. అదుపాజ్ఞల్లో ఉన్నట్టు లేరు. ఉండాలని ఆర్‌.ఎస్‌.ఎస్‌. కూడా కోరుకుంటున్నట్టు లేదు. ఎందుకంటే ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఎజెండాను అమలు చేయడానికి మోదీ ఆశించిన దానికన్నా ఎక్కువే చేస్తున్నారు. అందుకే వాజ్‌పేయి హయాంలో కూడా అభ్యంతరాలు లేవనెత్తిన స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ లాంటి సంస్థలు అవతారం చాలించినట్టున్నాయి. ప్రస్తుతం మోదీ చేసేపనులకు పక్క వాయిద్యాలు వాయించే స్థితికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. చేరుకున్నట్టుంది. 

దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ మాత్రం ఒకే ఒక్క నాయకుడైన మోదీ మాటను జవదాటేస్థితిలో లేదు. ఆయనే సర్వాంతర్యామి. ఆయన చెప్పిందే వేదం. మోదీ మంత్రివర్గంలో ముగ్గురు, నలుగురు మంత్రులను మినహాయిస్తే మిగతా వారందరూ అనామకంగానే మిగిలిపోయారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయనే ప్రత్యక్షమవుతారు. అవి శాసనసభ ఎన్నికలు కావొచ్చు. సార్వత్రిక ఎన్నికలు కావచ్చు. మోదీ, అమిత్‌ షా ద్వయం అనడం కూడా మాటవరసకులాగే ఉంది. అన్నీ తానే అయి మోదీ అటు ప్రభుత్వాన్ని, ఇటు బీజేపీని ఒంటి చేతిమీద నడిపిస్తున్నారు. ఏ నిర్ణయమైనా ఆయన తీసుకోవలసిందే. అందరూ ఆయన కనుసన్నలలో మెలగాల్సిందే. ఈ విషయంలో ఆయన వ్యవహారసరళి అచ్చం ఇందిరా గాంధీని తలపిస్తోంది. బీజేపీ, ఆర్‌.ఎస్‌.ఎస్‌. చాలా సువ్యవస్థితమైన సంస్థలు అనుకుంటారుగదా! అలాంటప్పుడు ఒకే ఒక్క నాయకుడు దివారాత్రులు శ్రమించవలసిన పరిస్థితి ఎందుకు వస్తోంది? చిన్నా పెద్ద అన్ని ఎన్నికలకు ఆయనే సూత్రధారి. ఆయనే ప్రధాన ప్రచార నిర్వాహకుడు. ఎనిమిదేళ్లు దాటినా మోదీ ఏలుబడిలో ప్రస్ఫుటంగా కనిపించే బృందం ఏదీ లేదు. ఉమ్మడి నిర్ణయాలు మచ్చుకు కూడా లేవు. ఆయన తరవాత ఫలానా నాయకుడు పలుకుబడిగలవారు అని చెప్పడానికి అవకాశం కనిపించడం లేదు.
కరోనాకు టీకాలు వేయించినా అన్ని పెట్రోల్‌ బంకుల్లో ‘‘ధన్యవాదాలు మోదీ’’ అన్న భారీ ప్రచారబోర్డులే దర్శనమిస్తాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గుజరాత్‌ మారణకాండ జరిగింది. దేశమంతా మాత్రమే కాకుండా ప్రపంచ మంతా గగ్గోలు వినిపించింది. ఆమెరికా ఆయనకు వీసా ఇవ్వడానికి కూడా ఆ దశలో నిరాకరించింది. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఆయనే ప్రముఖ నాయకుడన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీని, పరి పాలనను మోదీ వ్యక్తి ప్రధానమైన, ఏకవ్యక్తిమీద ఆధారపడ్డ వ్యవహారంగా మలిచేశారు. నెహ్రూ తరవాత ఎవరు అన్న ప్రశ్న వినిపించేది. మోదీ తరవాత ఎవరు అని అడిగే సాహసం ఆ పార్టీలో కూడా ఎవరూ చేయలేరు. రాజ్యాంగ వ్యవస్థలు మోదీ ఏలుబడిలో ధ్వంసం అయ్యా యంటున్నారు. అందులో అంతా నిజమే ఉన్నా బీజేపీని కూడా ఏకేశ్వరో పాసనకు కట్టుబడ్డపార్టీగా మార్చిన ఘనతా మోదీదే. పార్టీగా బీజేపీ అస్తిత్వాన్నే మాయం చేసేటంతటి శక్తి మోదీ సంతరించు కున్నారు. మన రాజకీయ వ్యవస్థలో పార్టీలది ప్రధాన పాత్ర. కానీ మోదీ చలవవల్ల బీజేపీ కన్నా ఆయనే పెద్ద గీతగా తయారయ్యారు. ఇదీ ప్రజా స్వామ్యాన్ని విధ్వంసం చేసేదే. ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ మోదీకి భాష్యకారుడిగా మిగిలిపోవడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img