Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సిద్ధూ అధికార కాంక్ష

మన దేశంలో కాంగ్రెస్‌ అతి ప్రాచీనమైన పార్టీ. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ అనేక ఎగుడు దిగుళ్లను చూసింది. కానీ అధికారం లేకపోతే మనగలిగే శక్తి కాంగ్రెస్‌కు మొదటి నుంచీ తక్కువే. ఎమర్జెన్సీ తరవాత రెండు మూడేళ్లు అధికారం లేకపోయేసరికి అపారమైన జనాకర్షక శక్తి ఉన్న ఇందిరా గాంధీ కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు. మళ్లీ ఎప్పుడైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందోలేదోనన్న బెంగ ఇందిరా గాంధీని పీడిరచేది. లేదు మళ్లీ మీరు అధికారంలోకి తప్పకుండా వస్తారు అని అరుణా ఆసఫ్‌ అలీ లాంటి వారు భరోసా ఇచ్చినా ఇందిరాగాంధీకి నమ్మకం కుదరలేదు. ‘‘ఇంకెన్నాళ్లు’’ అని ప్రశ్నించారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు రెండున్నరేళ్లలోనే జనతా ప్రయోగం విఫలమై 1980లో మధ్యంతర ఎన్నికలలో ఇందిర అధికారంలోకి వచ్చారు. ఇందిరా గాంధీ ఎంత తిరుగులేని నాయకురాలైనప్పటికీ వ్యవస్థాగతంగా కాంగ్రెస్‌ నిర్వీర్యం కావడం ఆమె చలవే. సంస్థాగత ఎన్నికలకు అవకాశమే ఇవ్వలేదు. వ్యక్తి ఆరాధనా తత్వాన్ని పనిగట్టుకుని పెంచి పోషించారు. వంశపారంపర్య పాలనకు బీజాలు వేశారు. కాంగ్రెస్‌ లో ఇప్పటికీ అనేకమంది గొప్ప నాయకులున్నా అధికారం చేతిలో ఉంటే తప్ప వారు క్రియాశీలంగా ఉండలేరు. జీ హుజూర్‌ అనే తత్వం కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేసింది. అనుభవజ్ఞులైన, సమర్థులైన, ప్రజలలో అంతో ఇంతో పలుకుబడి ఉన్న నాయకులు సైతం అధిష్ఠానం ఏం చెప్తే అదే చేస్తాం అని అంటుంటారు. తమ చేతిలో అధికారం ఉన్న రాష్ట్రాలలోనూ పదిలంగా కొనసాగ లేకపోతోంది. ఇందిరా గాంధీ హయాంలో ఆమెను ఎదిరించే సాహసం కాంగ్రెస్‌ నాయకులకు లేకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి నడవడిక నిరంకుశులందరికీ ఉంటుంది. 2014 లోకసభ ఎన్నికలలో ఘోర పరాజయానికి గురైన తరవాత కాంగ్రెస్‌ కు జీవితేచ్ఛే నశించినట్టుంది. వచ్చే సంవత్సరారంభంలో ఎన్నికలు జరగవలసి ఉన్న పంజాబ్‌ లో ఇప్పుడు కాంగ్రెసే అధికారంలో ఉంది. రైతుల ఉద్యమానికి ప్రధానంగా నాయకత్వం వహిస్తున్నది పంజాబ్‌ రైతులే. అందువల్ల అక్కడ బీజేపీకి అవకాశాలు కనిపించడం లేదు. రైతుల ఉద్యమాన్ని కాంగ్రెస్‌ పీల గొంతుతోనైనా సమర్థించినందువల్ల మళ్లీ అధికారం దక్కుంచుకునే వీలుంది. ప్రస్తుత పంజాబ్‌ ముఖ్యమంత్రి అయిదేళ్ల పాలనలో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఆయన అనుభవజ్ఞుడు కూడా. కానీ గత నాలుగు నెలలనుంచీ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అసమ్మతి బావుటా ఎగరేసి పంజాబ్‌ పి.సి.సి. అధ్యక్ష స్థానం దక్కే దాకా విరామం లేకుండా అమరేంద్ర సింగ్‌కు వ్యతిరేకంగా పితూరీలు లేవదీస్తూనే వచ్చారు. సిద్ధూ ముందు మేటి క్రికెట్‌ క్రీడాకారుడు. 1983లో భారత్‌ ప్రపంచ కప్‌ సాధించిన బృందంలో ఆయనా సభ్యుడే. 2004లో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అమృత్సర్‌ నుంచి పోటీ చేసి 2004లోనూ, 2009లోనూ లోక సభ సభ్యుడిగా ఉన్నారు. 2016లో రాజ్య సభ సభ్యుడయ్యారు. 2017లో కాంగ్రెస్‌ లో చేరిపోయారు. అమృత్సర్‌ తూర్పు నియోజక వర్గం నుంచి పంజాబ్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ సారి కూడా పంజాబ్‌లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందన్న నమ్మకం సిద్ధూకు కూడా గట్టిగా ఉన్నట్టుంది. అందుకే ముఖ్యమంత్రి పదవి మీద ఆశా పెంచుకున్నట్టున్నారు. అందుకని అసమ్మతి వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. నానా యాగీ చేసిన తరవాత ఇటీవల కాంగ్రెస్‌ అగ్ర నాయకుల దర్శన భాగ్యం లభించింది. దానితో ఆయన పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యారు. ఈ మధ్య విమర్శలకు, ప్రతివిమర్శలకు, అభిప్రాయ వ్యక్తీకరణకు ట్విట్టర్‌ వేదికైంది. ఆ వేదిక ఆధారంగానే సిద్ధూ అసమ్మతి కార్యకలాపాలన్ని కొనసాగించారు. కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌ కు వ్యతిరేకంగా కానీ, సిద్ధూకు అనుకూలంగా కానీ కాంగ్రెస్‌ కార్యకర్తలు రోడ్డెక్కిన దాఖలా ఒక్కటీ లేదు. అయినా కాంగ్రెస్‌ అధిష్ఠానం సిద్ధూ అల్లరిని సహించింది. ఆయన కోరిక నెరవేర్చింది. ఆయనను పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిని చేయడంలో కూడా కాంగ్రెస్‌ నాయకత్వం తనకు బాగా అలవాటైన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాన్నే అనుసరించింది. ఆ నిర్ణయంలో కాంగ్రెస్‌ శ్రేణుల అభిప్రాయానికి తావే లేదు.
సిద్ధూకు ఉన్నది కాంగ్రెస్‌ ను తాను పరిపుష్ఠం చేయగలనన్న భరోసానా, లేక అమరేంద్ర సింగ్‌ కన్నా తాను మెరుగైన నాయకుడినని నిరూపించుకోవాలన్న ఉత్సాహమా అన్న ప్రశ్నలు అడిగే వారూ లేరు. సమాధానాలు లేని అంశాలకు ప్రశ్నలూ సాధ్యం కాదుగా! ఒక వేళ కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌ పని తీరు ఆయనకు నచ్చక తిరుగుబాటు చేసి ఉంటే పి.సి.సి. అధ్యక్ష పదవిని ఆకాంక్షించకుండా ఉండాల్సింది. కానీ ఆయన ఆశంతా ఆ స్థానం మీదే. ఇప్పుడైనా అమరేంద్ర సింగ్‌ తో సఖ్యంగా ఉంటారన్న నమ్మకమూ లేదు. సిద్ధూ తనను విమర్శించినందుకు క్షమాపణలు చెప్పాలి అన్న అమరేంద్ర సింగ్‌ మాటను పట్టించుకున్న వారే లేరు. కాంగ్రెస్‌లో పదవీ కాంక్ష, అసమ్మతి ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి సిద్ధూ వ్యవహారం మంచి ఉదాహరణ. ఒక నాయకుడినో, నాయకత్వాన్నో వ్యక్తిరేకిస్తున్న వారికి ప్రత్యామ్నాయ కార్యక్రమమో, సిద్ధాంతమో ఉంటే ఆ అసంతృప్తిని అర్థం చేసుకోవచ్చు. అసలు కాంగ్రెసే సిద్ధాంత రాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు సిద్ధూకు మాత్రం సిద్ధాంత ప్రాతిపదిక ఆశించలేం.
ఇందిరా గాంధీ హయాంలో కూడా అసమ్మతి వ్యక్తం చేసే అర్జున్‌ సింగ్‌, పి.ఎ. సంగ్మా, శరద్‌ పవార్‌ లాంటి నాయకులు వేరుకుంపట్లు పెట్టుకున్నారు తప్ప కాంగ్రెస్‌ ను కానీ, నాయకత్వాన్ని కానీ మార్చలేక పోయారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ నిస్తేజంగా తయారు కావడాన్ని సహించలేక 23 మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు సోనియా గాంధీకి లేఖ రాశారు. దాని మీద కాంగ్రెస్‌ అధిష్ఠానం చలించనే లేదు. ఆ లేఖ భవిష్యత్తు ఏమిటో ఎప్పటికీ తెలిసే అవకాశమూ లేదు. మహా అయితే ఆ లేఖ కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏ ఫైళ్ల కట్టలోనూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. 2019 లోకసభ ఎన్నికల్లో పరాజయం తరవాత కాంగ్రెస్‌ కు నికరమైన నాయకులెవరూ లేరు. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఏ.ఐ.సి.సి. సమావేశం జరిపే ఆత్మస్థైర్యం కాంగ్రెస్‌ కు ఉన్నట్టు లేదు. జాతీయ స్థాయిలో ఆపద్ధర్మ అధ్యక్షులున్నప్పుడు పంజాబ్‌ లో తిరుగుబాటు చేసిన సిద్ధూను సంతృప్తి పరచడానికి పి.సి.సి. అధ్యక్షుడిగా నియమించవలసిన అగత్యం ఏమిటో తెలియదు. సిద్ధూను శాంతింప చేయడానికి అధిష్ఠానానికి అంత ఆత్రం ఎందుకో అంతుపట్టదు. సిద్ధూ కోసమే అయితే ఆ నిర్ణయం అధిష్టానం బలహీనతకు నిదర్శనం. త్వరలో ఎన్నికలు జరగకుండా ఉంటే సిద్ధూ అంత భారీ స్థాయిలో అసమ్మతి వ్యక్తం చేసి ఉండే వారా? ఈ ప్రశ్నలు కాంగ్రెస్‌ అధినాయకులకు తట్టనే తట్టవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img