Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సుఖాంతమైన సీఎం వివాదం

కర్నాటకలో ఓటర్లు కాంగ్రెస్‌ కు నిర్ణయాత్మకమైన విజయం సాధించి పెట్టారు. అంతటి మహత్తర విజయం దక్కినా ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి మూడు రోజుల సమయం పట్టింది. దీనికి ప్రధానమైన కారణం ముఖ్యమంత్రిని ఎన్ను కోవడం మానేసి ఎంపికచేసేపద్ధతి అనుసరించడమే. కాంగ్రెస్‌లో ఈ సంప్రదాయం ఇందిరా గాంధీ హయాంలో అమలులోకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్‌ అధిష్ఠానం సీల్డ్‌ కవర్లలో ఎవరి పేరును సూచిస్తే వారు ముఖ్యమంత్రి అయిపోయేవారు. అంటే ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులకు ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశమే లేకుండా పోయింది. శాసనసభాపక్షం అభిప్రాయంతో ఏ మాత్రం సంబంధం లేకుండా అధిష్ఠానం ఎవరిని కరుణిస్తే వారు ముఖ్యమంత్రి స్థానం దక్కించుకునే పద్ధతి వల్ల పార్టీ అంతర్గత వ్యవహారాల నుంచి ప్రజాస్వామ్య పద్ధతి అంతర్ధానం అయింది. ప్రస్తుతం కర్నాటకలో 135 సీట్లు సంపాదించినా ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి ప్రయాస పడవలసి వచ్చింది. దీనివల్ల ప్రజలు చేకూర్చిన అఖండ విజయానికి సంబరపడే అవకాశం మాయమై పోయింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, కర్నాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ ముఖ్యమంత్రి స్థానం కోసం భీకరంగా పోటీ పడ్డారు. చర్చోప చర్చల తరవాత అధిష్ఠానం ఆశీస్సులతో సిద్ధ రామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారని, డి.కె.శివకుమార్‌ ఉపముఖ్యమంత్రిగా ఉంటారని తేలింది. డి.కె.శివకుమార్‌ ను ఉపముఖ్యమంత్రి పదవితో సంతృప్తి చేయడానికి నానా అగచాట్లు పడవలసి వచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడం వెనక డి.కె.శివకుమార్‌ పాత్ర నిర్ణయాత్మకమైంది. శివకుమార్‌ ముఖ్యమంత్రి కావాలనుకోవడంలో అభ్యంతర పెట్టదగింది ఏమీ లేదు. కానీ కాంగ్రెస్‌ శాసనసభా పక్షంలో బలాబలాల రీత్యా చూస్తే సిద్ధరామయ్యను సమర్థించే వారు 95 మంది దాకా ఉన్నారు. పైగా ఆయన అనుభవజ్ఞుడు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధానంగా సిద్ధ రామయ్య మీదే ఆధారపడిరది. కానీ అప్పుడు కాంగ్రెస్‌ ఓడిపోయింది. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలన్న అంశం శాసనసభా పక్షానికి వదిలేయకుండా అధిష్ఠానం జోక్యం చేసుకునే అవకాశాన్ని అట్టిపెట్టుకోవడం వెనక ఏదో ఆంతర్యం ఉండే ఉంటుంది. ఒకే నాయకుడి మీద ఆధారపడే పరిస్థితి ఉంటే ఎన్నికలకు ముందే తమ పార్టీ విజయం సాధిస్తే ఆ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని కచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఒకరికన్నా ఎక్కువ నాయకులు ఉన్నప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలన్న అంశం ఎన్నికల తరవాత పరిస్థితినిబట్టి నిర్ణయించుకోవచ్చు లెమ్మన్న ధోరణి అధిష్ఠానాల్లో పెరిగిపోతోంది. కేంద్ర నాయకత్వమే అంత పటిష్ఠంగా లేనప్పుడూ ముఖ్యమంత్రి ఎవరో నిర్ధారించడానికి ప్రయాస పడవలసి వస్తోంది. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీలోనూ అధికారం అందివచ్చిన తరవాత కాంగ్రెస్‌లో ఉన్న రుగ్మతలు ఆ పార్టీకి కూడా అబ్బాయి. అయితే బీజేపీలో గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ముందే ప్రకటించకుండా ఉంటే ఆ తరవాత మోదీ, అమిత్‌ షా ద్వయం ఇష్టాయిష్టాల మేరకే నిర్ణయాలు జరిగిపోతాయి. కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణించే అలవాటు బీజేపీకి ఎటూ లేదు. కేంద్ర నాయకత్వం బలహీనంగా ఉన్నప్పుడు అంతర్గత సవాళ్లను ఎదుర్కోవడం ఇబ్బందిగా మారుతోంది. ఇటీవల శివసేనలో చీలిక రావడానికి కారణం కూడా అంతర్గత సమస్యలను పరిష్కరించే సామర్థం నాయకత్వానికి లేకపోవడమే. నాయకత్వంలో తగువులు తీర్చే సామర్థ్యం కొరవడడానికి తోడు ప్రజాస్వామ్య ప్రక్రియను అనుసరించాలన్న పట్టింపు లేకపోవడం సమస్యగా మారుతోంది.
ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరిగినప్పుడు మల్లికార్జున్‌ ఖడ్గేకు శశీ థరూర్‌కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ జరిగింది. అందువల్ల కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజా స్వామ్యానికి మళ్లీ బీజాంకురాలు పడ్డాయనుకోవడం కేవలం భ్రమేనని త్వరలోనే తేలిపోయింది. ఆ మాత్రం ప్రజాస్వామ్య ప్రక్రియకు కూడా తావులేకుండా శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకోవడం కాకుండా ఎంపికచేసే విధానమే కొనసాగు తోంది. రాజకీయ పార్టీల నిబంధనావళిలో ఏ పార్టీ అయినా సముచిత సూత్రాలు చేర్చడంలేదు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల్లో 60 శాతం పైగా సిద్ధ రామయ్యే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. నిజానికి అందరు శాసనసభ్యులు రాసిచ్చింది అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అన్న ఒకే వాక్యం ఉంది. గతంలో రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌లో కూడా కాంగ్రెస్‌కు ఇదే సమస్య ఎదురైంది. ఆ రెండు చోట్లా ఇద్దరేసి పోటీ పడ్డారు. ఛత్తిస్‌గఢ్‌లో భూపేశ్‌ బఘేల్‌, టి.ఎస్‌. సింగ్‌ దేవ్‌ మధ్య పోటీ జరిగితే అధిష్ఠానం బఘేల్‌ను ఎంపిక చేసింది. అలాగే రాజస్థాన్‌లో గెహ్లోత్‌, సచిన్‌ పైలెట్‌ కు మధ్య పోటీ ఉండేది. గెహ్లోత్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అయినా వివాదం సద్దు మణగలేదు. సచిన్‌ పైలెట్‌ ఇప్పటికీ తిరుగుబాటు బావుటా చేత పుచ్చుకునే తిరుగుతున్నారు. కర్నాటకలోని లింగాయత్‌, ఒక్కలిగ లాంటి బలమైన సామాజిక వర్గాలున్నాయి. ఆ రెండిరటి మధ్య పోటీ కూడా ఉంది. శివకుమార్‌ ఒక్కలిగ వర్గానికి చెందినవారు. ఈ రెండు సామాజిక వర్గాలకు కాకుండా సిద్ధ రామయ్య కురబ కావడం కూడా ఆయనకు అనుకూలించింది. ఇతర వెనుకబడిన వర్గాలు, ముస్లింలు, దళితులు కూడా ఆయనను సమర్థిస్తారు. కొంతమంది లింగాయత్‌ల మద్దతూ ఉంది. ముఖ్యమంత్రి పదవి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు ఉండొచ్చు కానీ ఇటీవలి ఎన్నికల్లో విభేదాలు పక్కన పెట్టడంవల్లే విజయం సాధ్యమైంది. సిద్ధ రామయ్యను అంతిమంగా ఎంపిక చేసింది కాంగ్రెస్‌ అధిష్ఠానమే అయినా, రెండు మూడు రోజుల సమయం పట్టినా శివకుమార్‌ను మాలిమి చేయగలిగింది. అన్నింటి కన్నా మించి శాసనసభ ఎన్నికలలో స్థానిక నాయకులకు ప్రాధాన్యం ఇచ్చింది. దీనికి విరుద్ధంగా బీజేపీ మాత్రం 1970లు, 80లలో లా కాంగ్రెస్‌ వ్యవహరించినట్టే స్థానిక నాయకులను పక్కన పెట్టింది. అధిష్ఠాన వర్గాలు దిల్లీలో హుకుంలు జారీ చేయడం దీర్ఘ కాలికంగా ఏ పార్టీకైనా ప్రమాదకరమే. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ ఈ సంకటం నుంచి బయట పడగలిగింది.
అధికార కేంద్రీకరణలో ఉన్న ముప్పు గ్రహించడం ఏ పార్టీకైనా ఉపకారమే చేస్తుంది. 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల తరవాత అన్ని శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ స్థానిక నాయకులను పట్టించుకోవడం లేదు. మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌ లో బీజేపీ ఆ రాష్ట్రాల నాయకులను పట్టించుకోలేదు. ఒక్క ఆదిత్యనాథ్‌ కు మాత్రమే స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం వచ్చింది. వికేంద్రీకరణవల్ల ప్రయోజనం ఎంత ఉందో కాంగ్రెస్‌ లాంటి పార్టీల్లో ప్రమాదమూ అంతకన్నా ఎక్కువే. ఆ స్థితిలో ఒకటికన్నా ఎక్కువ అధికార కేంద్రాలు ఏర్పడతాయి. ఇందిరా గాంధీ వికేంద్రీకరణకు మంగళంపాడితే రాజీవ్‌గాంధీ రాష్ట్రస్థాయి నాయకులను అవమానించిన సందర్భాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img