Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సుప్రీంకోర్టు కర్తవ్య పరాయణత

ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారిని, మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ప్రభుత్వం ఏకపక్షంగా నియమించడానికి వీలు లేదని గురువారం అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ప్రధానమంత్రి, లోకసభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఉన్నతాధికార కమిటీ ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారిని, మిగతా ఇద్దరు కమిషనర్లను నియమించాలని సుప్రీంకోర్టు కరాఖండిగా చెప్పింది. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఎన్నికల కమిషన్‌ అత్యంత స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్‌ అధిపతులను ప్రభుత్వం ఏకపక్షంగా నియమించడాన్ని సవాలుచేస్తూ 2015లో అనూప్‌ బరన్వాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2018లో ఈ పిటిషన్‌ను విచారించిన ఇద్దరు సభ్యుల బెంచి దీన్ని అయిదుగురితో కూడిన బెంచికి నివేదించింది. ఈ లోగా సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, కాళీశ్వరం రాజ్‌, అశ్వినీ ఉపాధ్యాయ, గోపాల్‌ శంకర్‌ నారాయణన్‌ కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల బెంచిలో న్యాయమూర్తులు కె.ఎం.జోసఫ్‌, అజయ్‌ రస్తోగీ, అనిరుద్ధ బోస్‌, హృషీకేశ్‌ రాయ్‌, సి.టి.రవికుమార్‌ ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ అధిపతులను నియమించడానికి ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఉండాలని ఈ బెంచి తీర్పు చెప్పింది. ఈ బెంచీకి న్యాయమూర్తి జోసెఫ్‌ నాయకత్వం వహించారు. ఒకే రకమైన తీర్పులు వెలువరించినప్పటికీ జోసెఫ్‌, రస్తోగీ వేర్వేరుగా తీర్పులు వెలువరించారు. గురువారం నాటి తీర్పు ఎంతవిశిష్టమైందో ఆ సందర్భంగా న్యాయ మూర్తులు చేసిన వ్యాఖ్యలు అంతకన్నా విలక్షణమైనవి. అధికారంలో కొనసాగాలన్న అపరి మితమైన ఆశ ఉన్నందువల్ల తమకు అనుకూలమైన ఎన్నికల కమిషన్‌ అధిపతులను నియమిస్తారని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అలాంటి అధిపతులు కచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తారని న్యాయమూర్తి జోసెఫ్‌ అన్నారు. ఒకే సభ్యుడుగల ఎన్నికల కమిషన్‌ను 1993లో పీవీ నరసింహారావు హయాంలో ముగ్గురుసభ్యులుగల కమిషన్‌గామార్చారు. అయితే ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారిని పదవి నుంచి తొలగించాలంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలోనే ఇంపీచ్‌ చేయవలసి ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లను తొలగించడానికి ప్రధాన ఎన్నికలకమిషన్‌ సిఫార్సు సరిపోతుంది. ఇది అన్యాయం. ప్రధానాధికారి ఉన్నప్పటికీ మిగతా కమిషనర్లు ఆయనకంటే తక్కువ హోదాగల వారు కాదు. అందుకని వారిని తొలగించడానికి కూడా ప్రధాన ఎన్నికల కమిషన్‌ అధికారిని తొలగించే విధానాన్నే అనుసరించాలని న్యాయమూర్తి రస్తోగి తన తీర్పులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 324(5) ప్రకారం ఇలాగే ఉండాలని రస్తోగీ చెప్పారు.
ఈ తీర్పులో ఎన్నికలకమిషన్‌కు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన మార్పులను కూడా సూచించారు. ఎన్నికల కమిషన్‌కు కావలసిన నిధుల కోసం కేంద్ర న్యాయమంత్రిత్వశాఖను దేబిరించే అవసరం లేకుండా సంఘటిత నిధి నుంచి నిధులు తీసుకునే అవకాశం ఉండాలని ఈ తీర్పులో పేర్కొన్నారు. అలాగే ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి ఉద్యోగ విరమణ చేసినా, లేదా రాజీనామా చేసినా ప్రభుత్వానికి అనుకూలురైన మరెవరినో నియమిస్తున్నారు. ఇది కూడా చెల్లదని మిగిలిన కమిషనర్లలో సీనియర్‌ను ఆ స్థానంలో నియమించాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారులను, కమిషనర్లను నియమించడానికి తమ గుప్పెట్లో పెట్టుకున్న అధికారం ఆసరాగా తమకు అనుకూలమైన వారినే నియమించే అపసవ్య ధోరణి కొనసాగుతోంది. ఇలాంటి రుగ్మతలన్నీ ఎన్నికల కమిషన్‌ కు రాజ్యాంగ రీత్యా ఉండవలసిన ప్రత్యేక అధికారాలను లేకుండా చేయడానికే ఉపయోగించుకుంటున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ఎన్నికలకమిషన్‌ ప్రభుత్వానికి ఉపాంగంగా మారిపోయింది. ఇది ప్రజా స్వామ్యానికి తీవ్ర విఘాతం కల్గిస్తోంది. మన ప్రజాస్వామ్యం ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యమే కాదు. అది అత్యంత పటిష్ఠ మైందని కూడా సంబరపడి పోతుంటాం. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల కందం ఎన్నికలు అనుకుంటే అవే లోపభూయిష్టంగా ఉన్నాయి. అంతేకాదు ఎన్నికలు నిర్వహించడంలో రాజ్యాంగంద్వారా సర్వాధికారాలు సంక్రమించిన ఎన్నికల కమిషన్‌ మాత్రం చాలా సందర్భాలలో బలహీనంగా మిగిలి పోయింది. మన ఎన్నికల కమిషన్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక మైంది అనుకుంటాం. కానీ ఆ కమిషన్‌ ప్రధానాధికారిని, మిగతా ఇద్దరు కమిషనర్లను నియమించేపద్ధతి మాత్రం దశాబ్దాలుగా లోప భూయిష్టంగానే ఉంది. ఎన్నికల కమిషన్‌ అధిపతులను అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏకపక్ష సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నియమిస్తుండడం వల్ల అది ప్రభుత్వం కొంగుపట్టుకు తిరిగే వ్యవస్థగా దిగజారింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో హర్షించాయి. కానీ ప్రభుత్వపక్షం నుంచి ఇప్పటిదాకా నోరు మెదిపిన వారేలేరు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వచ్చినట్టే. అయితే ప్రభుత్వం వీటిని అంగీకరిస్తుందా, తు.చ. తప్పకుండా అమలు చేస్తుందా అన్నది ఇప్పటికి జవాబు లేని ప్రశ్నే. ప్రధానాధికారినో, మరో కమిషనర్‌ నో నియమించవలసిన తరుణంలోనే ప్రభుత్వ వైఖరి బయట పడ్తుంది. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయం కూడా ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వ ఇష్టానుసారంగానే నిర్ణయిస్తోంది. ఎన్నికల నియమావళిని సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ ఉల్లంఘించారన్న ఆరోపణలువస్తే ఆ ఆరోపణలను విచారించే సాహసం ఏ ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారికి లేకుండా పోయింది. ఆ సాహసం చేసినవారు మారుమాట లేకుండా తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడుకూడా ఉండాలని తీర్పు చెప్పడానికి అత్యంత ప్రాధాన్యంఉంది.
ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ మొత్తం లోకసభ స్థానాల్లో పదోవంతు రాలేదు కనక కాంగ్రెస్‌పక్ష నాయకుడికి అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు. అయినా లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో స్థానంఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపకరిస్తుంది. ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోవడం ఇప్పుడే ఎదురైన సమస్య ఏమీకాదు. ఇంతకు ముందూ అనేకసార్లు ఇలాగే జరిగింది. ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఉన్నప్పుడు నిష్పాక్షికతకు పూచీ ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా తయారైందన్న విమర్శలకు తావు లేకుండా పోతుంది. నిఖార్సైన ప్రవర్తనకు నిలువెత్తు నిదర్శనంగా వ్యవహరించిన కమిషన్‌ అధిపతులు చాలా మందే ఉన్నారు. కానీ వారి నియామక పద్ధతే ప్రశ్నార్థకమైంది. సుప్రీంకోర్టుతీర్పు ఈ అపవాదు తొలగించడానికి ఉపకరిస్తుంది. అప్పుడే మన ఎన్నికల కమిషన్‌ అత్యంత శక్తిమంతమైంది మాత్రమే కాదని, స్వతంత్రంగా వ్యవహరించగలదని, ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తే నిస్త్రాణమైన వ్యవస్థకాదని రుజువవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img