Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సుప్రీంకోర్టు సహేతుక అపనమ్మకం

గత అక్టోబర్‌ మూడో తేదీన లఖింపూర్‌ ఖేరీ సంఘటనలో నలుగురు రైతులు, మరో నలుగురి మృతిపై ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న దర్యాప్తు మీద తమకు ఏ మాత్రం నమ్మకం లేదని సుప్రీంకోర్టు నిర్మొహమాటంగా తెలియజేసింది. యోగీ ఆదిత్యనాథ్‌ నాయకత్వంలోని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం లఖింపూర్‌ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ఏర్పాటు చేసింది. ఆ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక న్యాయమూర్తిని కూడా నియమించింది. అయితే ఈ దర్యాప్తు కొనసాగుతున్న తీరు తమకు సంతృప్తికరంగా లేదని, దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతను ఇతర రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తికి అప్పగించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడిరది. దీనికోసం పంజాబ్‌, హర్యానా హై కోర్టు న్యాయమూర్తి పేరు కూడా సూచించింది. పంజాబ్‌, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి రాకేశ్‌ కుమార్‌ జైన్‌ లేదా న్యాయమూర్తి రంజిత్‌ సింగ్‌ కు దర్యాప్తును పర్యవేక్షించే బాధ్యత అప్పగించవచ్చునని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ, న్యాయమూర్తులు హిమ కోహ్లి, సూర్యకాంత్‌ తో కూడిన బెంచి అభిప్రాయపడిరది. లఖింపూర్‌ ఖేరి మారణకాండపై దర్యాప్తు కొనసాగుతున్న తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టడం ఇది మొదటి సారి కాదు. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కాళ్లీడుస్తోందని అత్యున్నత న్యాయస్థానం ఆక్షేపించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు అశీశ్‌ మిశ్రాకు చెందిన వాహనాల బిడారును నిరసన తెలియజేస్తున్న రైతుల మీంచి పోనిచ్చినందువల్ల నలుగురు రైతులు మరణించారు. దీనిపై ఆగ్రహించిన రైతులు ప్రతిఘటించడంతో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఒక పత్రికా రచయిత కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన దేశమంతటా తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనపై నమోదు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌. మీద కూడా న్యాయమూర్తులు అనుమానం వ్యక్తం చేశారు. మొదట మూడు ఎఫ్‌.ఐ.ఆర్‌.లు దాఖలైనాయని చెప్పారు. ఇప్పుడు రెండు ఎఫ్‌.ఐ.ఆర్‌.లే ఉన్నాయని అంటున్నారు. ఒక ఎఫ్‌.ఐ.ఆర్‌. లోని అంశాలను మరో ఎఫ్‌.ఐ.ఆర్‌.లో పేర్కొన్న నిందితులను కాపాడడానికి దుర్వినియోగం చేయడాన్ని సహించబోమని న్యాయ మూర్తులు స్పష్టం చేశారు. ఒక్కొక్క ఎఫ్‌.ఐ.ఆర్‌. మీద విడివిడిగా దర్యాప్తు కొనసాగించాల్సిందేనని ఆదేశించారు. అంతకు ముందు అక్టోబర్‌ మూడవ తేదీన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నమోదు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌. పరిస్థితి ఏమిటి అనీ, ఇంతవరకు ఎంతమందిని అరెస్టు చేశారని నిలదీసింది. అంత పెద్ద ఎత్తున జనం గుమికూడిన చోట ఈ సంఘటన జరిగితే సాక్షులు 23 మందే ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సాక్షులకు తగిన రక్షణ కల్పించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర మంత్రి కుమారుడిని కాపాడడం కోసం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నానా యాతన పడుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఒక ఎఫ్‌.ఐ.ఆర్‌.కు మరో ఎఫ్‌.ఐ.ఆర్‌.కు లంకె పెట్టకుండా దర్యాప్తు కొనసాగించడానికి ప్రత్యేక దర్యాప్తు సంస్థ వెనుకాడు తుండడాన్ని సుప్రీంకోర్టు బెంచి పసిగట్టింది. దర్యాప్తు కొనసాగుతున్న తీరును వివరించే నివేదికలో సైతం మరి కొంతమంది సాక్షులని విచారించాం అన్న మాట తప్ప మరే సమాచారమూ లేదు. సుప్రీంకోర్టు పది రోజుల గడువిచ్చినా రావలసిన నివేదికలు రానేలేదు. మరణించిన వారికి సంబంధించిన వైద్య పరీక్షల నివేదికలు కూడా అందలేదు, దర్యాప్తు సాగవలసిన పద్ధతి ఇది కాదు అని ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్యాప్తు ఎంత మందకొడిగా జరుతుతోందో తెలుసుకోవడానికి పోలీసులు ఒకే ఒక మొబైల్‌ ఫోన్‌ ను స్వాధీనం చేసుకోవడమే బలమైన నిదర్శనం. మరి మిగతా అనుమానితుల ఫోన్ల సంగతి ఏమైంది అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక్క అశీశ్‌ మిశ్రా ఫోన్‌ ను మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లఖింపూర్‌ సంఘటనపై దేశమంతటా గగ్గోలు పుట్టినా అశీశ్‌ మిశ్రాను అరెస్టు చేయడానికి ఉత్తరప్రదేశ్‌ పోలీసులకు మూడు రోజులు పట్టింది. పోలీసులు యోగీ ఆదిత్య నాథ్‌ ప్రభుత్వ అదుపాజ్ఞల్లో పని చేస్తున్నారనడానికి అశీశ్‌ మిశ్రాను అరెస్టు చేయడం మానేసి ఆయన ఇంటి మీద నోటీసు అంటించి రావడమే బలమైన సంకేతం. ఆ సమయంలో అశీశ్‌ మిశ్రా ఇంట్లోనే ఉన్నా ఆయనకు ఒంట్లో బాగా లేదని చెప్పడంవల్ల నోటీసు ఆయన ఇంటిగోడకు అంటించి పోలీసులు వెనుదిరగడం చూస్తే పోలీసులు ఎవరి ఆదేశాల మేరకు పని చేస్తున్నారో స్పష్టం అవుతూనే ఉంది.
దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ప్రారంభమై మరో మూడు వారాలు గడిస్తే ఏడాది పూర్తి అవుతుంది. ఈ ఆందోళన పొడవునా హర్యానా ప్రభుత్వం, ప్రధానంగా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ప్రవర్తిస్తున్న తీరు రైతులంటే బీజేపీ నాయకత్వానికిగల ద్వేష భావానికి ప్రతీకగా ఉంది. అజయ్‌ మిశ్రా కూడా అదే ధోరణిలో మాట్లాడినందువల్లే లఖింపూర్‌ ఖేరీలో రైతులు నిరసనకు ఉపక్రమించారు. ఆందోళన చేస్తున్న రైతుల విషయంలో బీజేపీ నాయకుల వైఖరి రోజురోజుకు మరింత కరకుగా తయారవుతోంది. రైతులను రెచ్చగొట్టే, అవమానించే ధోరణిలో మాట్లాడడం మానడం లేదు. ఇంత సుదీర్ఘ కాలం రైతుల ఆదోళన కొనసాగడం ప్రపంచ చరిత్రలోనే అపూర్వం. అదీ గాంధేయ పద్ధతిలో సంపూర్ణంగా అహింసాయుత రీతిలో ఇంత కాలం ఆందోళన కొనసాగించ గలగడం నిజంగా అపురూపమే. మేఘాలయ గవర్నర్‌ సత్పాల్‌ మాలిక్‌ సైద్ధాంతికంగా బీజేపీకి సన్నిహితుడే. ఆయన అనేక సందర్భాలలో రైతుల ఆందోళనను సమర్థించారు. కనీస మద్దతు ధరకు చట్ట ప్రతిపత్తి కల్పిస్తే రైతుల ఆదోళన ఆగిపోతుందని కూడా ఆయన అన్నారు. ఆయన మాటలను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడ్తోంది. నిజానికి కేంద్ర ప్రభుత్వంలోని వారెవరూ దాదాపు పదకొండు నెలలుగా రైతుల ఆందోళనను పట్టించుకున్న దాఖలాలే లేవు. రైతులు వారి మానాన వారు ఆందోళన చేస్తారు లెమ్మన్న నిర్లక్ష్య ధోరణి అధికార వర్గాల మాటల్లో నిస్సిగ్గుగా ద్యోతకం అవుతోంది. రైతులతో చర్చల ప్రహసనం పదకొండు సార్లు నడిపిన వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమరు మాటే వినిపించడం లేదు. సకలసమస్యలను పరిష్కరించేబాధ్యత తన భుజ స్కందాల మీద మోస్తున్నాను అన్నట్టుండే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రైతుల ఉద్యమం విషయంలో ఏమీ పట్టనట్టు ఉండడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అయితే ఆనవాయితీగా జనబాహుళ్య సమస్యలు గుర్తే ఉండవు. రైతుల ఉద్యమ క్రమంలో దాదాపు 750 మంది రైతులు వివిధ కారణాలవల్ల ప్రాణాలు కోల్పోయినా ప్రధాన మంత్రికి చీమకుట్టినట్టయినా లేదు. రైతే దేశానికి వెన్నెముక అని ప్రవచనాలు చెప్పే వారిలో చలనమే కనిపించడం లేదు. ప్రజల గోడు ఏ మాత్రం పట్టించుకోకుండా ఇంత బండబారినట్టుండే ప్రభుత్వం ఎక్కడా ఉండదు. అందుకే సుప్రీంకోర్టు అపనమ్మకం నిర్హేతుకమైంది కాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img