Friday, April 26, 2024
Friday, April 26, 2024

సుప్రీంకోర్టు హక్కులకు కత్తెర?

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంపై చాలా కాలంగా చర్చ సాగుతోంది. ఇటీవల ఈ విషయం ఎక్కువసార్లు చర్చల్లోకి వచ్చింది. కొలీజియం సిఫారసు చేసినవారిని న్యాయమూర్తులుగా తీసుకోవాలన్న నిశ్చితాభిప్రాయాన్ని సుప్రీం వ్యక్తం చేసింది. దీనిపైన న్యాయశాఖమంత్రి కిరణ్‌ రిజిజు అనేకసార్లు తీవ్రంగా మాట్లాడారు. న్యాయమూర్తుల నియామకం హక్కు పార్లమెంటుదేనని సుప్రీంకోర్టుకు ఆ హక్కులేదని అన్నారు. సుప్రీంకోర్టుకుగల హక్కులను కత్తిరించేందుకు 2014లో అధికారం చేపట్టిన నాటినుంచి నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రయత్ని స్తున్నదని స్పష్టమవుతోంది. ప్రధాని మోదీ ఆశీస్సులు లేకుండా మంత్రి రిజిజు స్వతంత్రంగా మాట్లాడి ఉంటారన్నది సందేహమే. సుప్రీంపై దాడి చేయడానికి అత్యున్నత స్థానం అలంకరించిన ఉపరాష్ట్రపతి ధన్కర్‌ రిజిజు బాధ్యత తీసుకున్నారని తాజాగా రాజ్యసభలో సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడటం స్పష్టం చేస్తోంది. మోదీ ప్రభుత్వ ఆలోచనలు 2014లోనే స్పష్టంగా తెలుస్తున్నాయి. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ జ్యుడీషియల్‌ నియామకాల కమిషన్‌ బిల్లును పార్లమెంటు ఆమోదిం చింది. 2014 ఆగస్టు 13న ఈ బిల్లును లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించగా ఆ మరుసటిరోజే రాజ్యసభ తన అంగీకార ముద్ర వేసింది. ఈ కమిషన్‌ ద్వారా న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమించడానికి హక్కు ఉంటుంది. నేటి రాజకీయ వ్యవస్థలో నీతి, నిజాయితీ పూర్తిగా లోపించాయి. ప్రభుత్వం సర్వాధికారాలను స్వాయత్తం చేసుకునే దిశలో పయనిస్తున్నవేళ న్యాయమూర్తుల నియామకాలు లోపభూయిష్టంగా ఉండవచ్చు. తనకు అనుకూలమైన న్యాయమూర్తులను నియమించుకొని రహస్య లక్ష్యాలను సాధించుకొనే వీలు ప్రభుత్వానికి కలుగుతుందని అనేకమంది న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. వారికే కాదు..నేటి రాజకీయ పరిణామాలను పరిశీలించేవారికీ అనిపిస్తుంది. అయితే కమిషన్‌ ఏర్పాటును సుప్రీంకోర్టు తిరస్కరించింది. కమిషన్‌ ఏర్పాటు రాజ్యాంగ మౌలిక న్యాయవ్యవస్థకు అనుగుణమైందికాదని 2015 అక్టోబరు 16న మెజారిటీ న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఐదుగురితో కూడిన ధర్మాసనంలో నలుగురు కమిషన్‌ను తిస్కరించారు. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ చర్యలెంతమాత్రం పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని ధిక్కరించినట్టు కాదు. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటును అవమానించడమూ కాదు. ఎన్‌జెఎసిని ఏర్పాటుచేసి ఉండకపోతే మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకుగల అధికారాన్ని స్వాయత్తం చేసుకొనే యోచనలో ఉన్నారన్న అభిప్రాయమే ఎవరికీ కలిగి ఉండేదికాదు. హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల కోసం లాంఛనప్రాయం సంప్రదింపుల ప్యానల్‌ను ఏర్పాటుచేయడం రాజ్యాంగ చెల్లుబాటుపై సందేహం వ్యక్తంచేస్తూ 1978 జనవరి 4వ తేదీన లా కమిషన్‌ చైర్మన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ న్యాయ, కంపెనీ వ్యవహారాలశాఖ మంత్రికి లేఖ రాసారు. న్యాయమూర్తులను నియమించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయశాఖ మంత్రి ఎక్స్‌అఫీషియో సభ్యులుగా, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి లేదా జడ్జిలుగా పనిచేసిన ముగ్గురితో కూడిన ప్యానల్‌ ఏర్పాటుచేయడం మంచిదని లా కమిషన్‌ చైర్మన్‌ తన లేఖలో సూచించారు. ఈ ప్యానల్‌ చైర్మన్‌గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని కూడా ఆయన పేర్కొన్నారు. ప్యానల్‌ ఏర్పాటుకు ముందు ఇద్దరు అత్యంత సీనియర్లయిన ఇద్దరు సహచర న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తి సంప్రదించాలని కూడా లా కమిషన్‌ సిఫారసు చేసింది.
న్యాయవ్యవస్థ అధికారాలను తగ్గించాలని లేదా హరించాలని ఎందుకు మొండి పట్టుదలతో ఉన్నదో మోదీ ప్రభుత్వం వెల్లడిరచాలి. అలాగే ఈ అంశాన్ని మరింత వివాదాస్పదం చేయాలన్న భావనతో ఉపరాష్ట్రపతి ధన్కర్‌ పరుషంగా మాట్లాడారన్న సందేహం వ్యక్తమవు తోంది. అయితే ధన్కర్‌ తొలినుంచి నరేంద్ర మోదీకి విధేయుడిగా పనిచేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌ గవర్నరుగా పనిచేసినప్పుడు ఆయన చర్యలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు మోదీకి విశ్వాసపాత్రుడిగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే. పైగా రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యాలయంగా మార్చుకొని ఆ పార్టీ నేతలను పిలిపించుకొని మాట్లాడేవారన్న విమర్శలూ ఉన్నాయి. ఈ పరిణామాలు సుప్రీంకోర్టు, ప్రత్యేకించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి.చంద్రచూడ్‌ చెప్పిందే తుది మాట కారాదన్న పట్టుదలతో మోదీ ప్రభుత్వం ఉందని తెలియ జేస్తున్నాయి. ఎన్‌జెఎసి చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దుచేయడం పార్లమెంటు సార్వభౌమాధికారంపై దాడిచేయడమేనని, ఇది కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని రాజ్యసభలోనే ధన్కర్‌ మాట్లాడటం వల్ల కోర్టుకు ప్రభుత్వానికి మధ్య వివాదం తీవ్రతరం అవుతుందన్న అభిప్రాయం కలుగుతోంది. సుప్రీంకోర్టు తన వైఖరిని మార్చుకోవాలని, లక్ష్మణరేఖ పరిధిలో ఉండాలని వ్యాఖ్యానించడం కచ్చితంగా సర్వోన్నత న్యాయ స్థానాన్ని మోదీ ప్రభుత్వం తన ఆధీనంలోనే పనిచేయ వలసిందేనన్న నిర్ణయంతో వ్యవహరిస్తోంది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య వివాదంపై మాజీ ప్రధాన న్యాయమూర్తి బీజేపీకి అనుకూలంగా తీర్పు చెప్పారు. అలాగే కశ్మీరుకు గల స్వయంప్రతిపత్తిని హరించడానికి 370వ అధికరణను ప్రభుత్వం రద్దుచేసినప్పటికీ దాన్ని సమర్థిస్తూ ఆనాటి ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఆ న్యాయమూర్తికి ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టడానికి కారణం అనుకూల తీర్పులేనన్న విమర్శలున్నాయి. అన్ని రాజ్యాంగ వ్యవస్థలు మోదీ కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్న అభిప్రాయం విస్త్రతంగా ప్రజానీకంలోఉంది. ఏమైనా రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య వివాదం ఎంతమాత్రం మంచిది కాదు. రాజ్యాంగ నిపుణులైన న్యాయమూర్తులకే కాబోయే న్యాయమూర్తుల సామర్ధ్యం, నీతి, నిజాయితీ విలువల పాటింపు అంశాలను అంచనా వేయగలుగు తారనేది సర్వత్రా గల అభిప్రాయం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img