Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

స్వేచ్ఛకు సంకెళ్లు

నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య హక్కులకు ఎనలేని భంగం వాటిల్లుతోంది. అసహనం, ద్వేషం పెరిగిపోయాయి. వాస్తవాలను, సద్విమర్శలను బయటపెట్టే సమాచార, ప్రసార వ్యవస్థలను అన్ని విధాలుగా కట్టడి చేస్తున్నారు. ఇందులో భాగంగా అనేక మంది జర్నలిస్టులను అరెస్టు చేసి వాస్తవాలు వెలుగులోకి రాకుండా నిరోధిస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు అందించి వారిని చైతన్యపరచడం జర్నలిస్టు కర్తవ్యం. వాస్తవాలు తారుమారు చేసి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేసే మీడియాకు, జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండ దండలు లభిస్తున్న విషయం చాలా సంఘటనల్లో రుజువైంది. తాజాగా ప్రభుత్వ కన్ను ఆల్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ జుబేర్‌పై పడిరది. పై నుంచి ఆదేశాలు రాగానే పోలీసులు రంగంలోకి దిగి లక్ష్యంగా ఎంచుకున్న వారిని అరెస్టు చేసి రకరకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బెయిల్‌ కూడా రాకుండా చూస్తున్నారు. అరెస్టు చేయడానికి ముందు నోటీసు అందించాలి. కానీ అలా చేయడం లేదు. జుబేర్‌ విషయంలోనూ ఈ అక్రమమే చోటు చేసుకుంది. 2018లో జుబేర్‌ మత విద్వేషం రగిలించే ట్వీట్‌ చేశారని దానిపై విచారించాలని హోంమంత్రి అమిత్‌షా పరిధిలో పనిచేసే పోలీసులు ఆగమేఘాల మీద బెంగుళూరు చేరుకుని సోమవారం అరెస్టు చేసి దిల్లీ పటియాల హోస్‌ కోర్టులో మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ అజయ్‌ నర్వాల్‌ ముందు హాజరుపరచగా ఆయన ఒకరోజు పోలీసు కస్టడీకి అప్పగించారు. ఇంత హడావుడిగా అరెస్టు చేసి ఏడు రోజుల రిమాండిచ్చి తమకు అప్పగించాలని పోలీసులు కోరడానికి జుబేర్‌ దేశ ద్రోహి కాదు, కరుడు గట్టిన క్రిమినల్‌ కాదు. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో హిందూ జాతీయవాదుల అక్రమ చర్యలను ప్రశ్నించిన అనేక మంది జర్నలిస్టులను అరెస్టు చేసి హింసించారు. జుబేర్‌ నిర్వహిస్తున్న ఆల్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌కు ఆరు లక్షల మంది అభిమానులున్నారు. జుబేర్‌ ట్విటర్‌లో వచ్చే అన్ని వ్యాఖ్యలను గమనిస్తూ ఏది నిజం, ఏది కాదని గుర్తించి ఆ సమాచారాన్ని ప్రజలకు అందించడమే కర్తవ్యంగా పెట్టు కున్నారు. జర్నలిస్టు విధి కూడా నకిలీ వార్తలను, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం కాదు. పాలకులు, వారి అనుచరులు వెళ్లగక్కు తున్న విద్వేషాన్ని, తప్పుడు వ్యాఖ్యలపైన వాస్తవాలేమిటో వెల్లడిస్తున్నదని ఆల్ట్ట్‌ న్యూస్‌కు విశ్వసనీయత ఉండటం వల్లనే ఆరు లక్షల మంది అభిమానులున్నారు. జుబేర్‌ జర్నలిస్టుగా తెలుసు. అయితే వార్తల్లో నిజానిజాలు తెలుసుకుని వెల్లడిరచడమే జుబేర్‌ చేస్తున్న పని. వాస్తవ అంశాలను గుర్తించేవారు, జర్నలిస్టులు మోదీ ప్రభుత్వ పాలనలో ప్రమాదకర పరిస్థితు లను ఎదుర్కొంటున్నారు. నిత్యం ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి జరుగు తూనే ఉంది. పౌరుల హక్కులను, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూనే ఉన్నారు. మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న దేశంగా భారత్‌ను అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. చివరకు అమెరికా అధికారికంగానే వ్యాఖ్య చేసింది. అయినప్పటికీ మనది గొప్ప ప్రజాస్వామ్య దేశమని, ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మని తాజాగా జర్మనీలో జరిగిన జి`7 దేశాల సమ్మిట్‌ పాల్గొన్న సందర్భంలో మోదీ మాట్లాడారు. లేనిది ఉన్నట్టు చూపడం ఇంద్రజాలికుడు చేసే కళ. ఆ కళ మన ప్రధాన నాయకుడికి బాగా అబ్బింది.
ఇటీవల మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌శర్మ చేసిన వ్యాఖ్యల పైన కూడా జుబేర్‌ స్పందించి వాస్తవాలు వెల్లడిరచారు. నూపుర్‌శర్మ వ్యాఖ్యలు సరిహద్దులు దాటిపోయి దాదాపు 15 ముస్లిం దేశాలు మన దేశానికి తమ నిరసన తెలిపాయి. మనతో స్నేహంగా ఉన్న ముస్లిం దేశాలను తిరిగి మచ్చిక చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం నానా యాతన పడిరది. జుబేర్‌ కార్యకలాపాలపై దిల్లీ పోలీసులు కొన్ని నెలలుగా దృష్టి పెట్టారు. చివరకు 2018 నాటి ట్వీట్‌ను శోధించి పట్టుకొని కేసు పెట్టారు. జుబేర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండానే పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. సమాచారాన్ని సేకరించడానికి, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడానికి జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ లేని రోజు పాలకులు నిరంకుశులుగా తయారవుతారు. ప్రజాస్వామ్య స్థానంలో నియంతృత్వ సమాజం ఏర్పడుతుంది. ఇప్పుడున్నది ప్రజా స్వామ్యమా, ప్రజాస్వామ్యంలో నియంతృత్వమా అనేది విజ్ఞులు తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యం హరించుకు పోతున్నదని గ్రహిస్తే దాన్ని తీవ్రంగా పరిగణించి స్పందించాలి. జర్నలిస్టులను నిష్కారణంగా నిర్బంధం పాలు చేస్తున్నారని గతంలో సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను సైతం పోలీసులు, వారికి ఆదేశాలిస్తున్న వారు పట్టించు కోరు. హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేసిన రోజుల్లోనే జుబేర్‌ను అరెస్టు చేయడం జర్నలిస్టులకు, హక్కుల కార్యకర్తలకు తీవ్ర ప్రమాదకర హెచ్చరిక చేసినట్లే అవుతుంది. మత మనోభావాలను రెచ్చగొట్టారని, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తూ కేసు పెట్టారు. సెక్షన్‌ 295ఎ, 153ఎ కింద కేసు నమోదు చేస్తే బెయిల్‌ రాదు. మోదీ పాలనలో హక్కుల కార్యకర్తలపై, అసమ్మతి తెలిపే రచయితలపై, చరిత్రకారుల మీద బెయిల్‌ రాని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైళ్లలో పెట్టి హింసిస్తున్నారు. అయితే తాను చేసిన ట్వీట్‌లో తప్పుపట్టవలసిన అంశాలేమీ లేవని వాదించడానికి వీలు లేకుండా ఆ ట్వీట్లను జుబేర్‌ తొలగించాడని తెలుస్తోంది. తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కాపీని సైతం పోలీసులు జుబేద్‌కు ఇవ్వలేదు. అరెస్టు చేయడానికి గత మూడు నెలల కాలంలో రు.50 లక్షలు ఆయన బ్యాంకు అకౌంట్‌ను చేరాయన్న ఆరోపణలను ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు ప్రతిక్‌సిన్హా తిరస్కరిస్తూ, ఆరోపణలు వాస్తవం కాదని నిరూపించే బ్యాంకు ఎకౌంట్‌ కాపీ తన వద్ద ఉందని అన్నారు. అయితే ఎన్ని రుజువులున్నా ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూసే వారికి ఇదే గతి పడుతుందేమో!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img