Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

హమ్మయ్య! దిల్లీ పోలీసులు దయతలిచారు

జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన మహిళా మల్ల యోధులపై భారత్‌ మల్ల యోధుల సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేయడానికి దిల్లీ పోలీసులు ఎట్టకేలకు అంగీకరించారు. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా మల్ల యోధులతో పాటు ఇతర క్రీడాకారులు మూడు నెలల నుంచి ఆందోళన చేస్తున్నారు. గత జనవరిలోనూ వీరు ఆందోళనకు దిగారు. ఫలితం కనిపించక పోవడంతో ఆరు రోజుల నుంచి జంతర్‌ మంతర్‌లో ఆందోళన చేస్తున్నారు. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ బీజేపీ ఎంపీ కనక ఆయన మీద ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయడానికి దిల్లీ పోలీసులు వెనుకాడినట్టున్నారు. విధిలేక ఈ మల్ల యోధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్ర చూడ్‌, న్యాయమూర్తి నరసింహ తో కూడిన బెంచి ఈ కేసును శుక్రవారం విచారణకు స్వీకరించింది. శుక్రవారం సాయంత్రానికి ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేస్తారని సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ కేసు మళ్లీ వచ్చేవారం విచారణకు వస్తుంది. లైంగిక వేధింపులకు గురైన వారిలో ఒక అమ్మాయికి మైనారిటీ అయినా తీరలేదు. బ్రిజ్‌ భూషణ్‌ పై చర్య తీసుకోవడానికి దిల్లీ పోలీసులు వెనుకడుగు వేసిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. చట్టం ముందు అందరూ సమానమేనన్నది మన న్యాయసూత్రాలలో అత్యంత ప్రధానమైనదైనప్పటికీ రాజకీయ ప్రముఖుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసులు వెనుకాడడం కొత్త కాదు. సకల విషయాలనూ రాజకీయాలే నిర్ణయించే పరిస్థితులు రాజ్యమేలుతున్నప్పుడు ఈ పక్షపాత ధోరణి ఉండకుండా పోదు. తాము లైంగిక వేధింపులకు గురైనామని చెప్తున్నవారు భారత్‌ కీర్తిని ఇనుమడిరప చేసిన క్రీడాకారులన్న విషయాన్ని పక్కకు పెట్టినా లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపిస్తు న్నప్పుడు ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేయకుండా మీన మేషాలు లెక్కించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కిందే లెక్క. పోలీసులు మామూలుగా తీసుకోవలసిన చర్య తీసుకోక పోవడానికి నిందితులకు రాజకీయ అండ ఉండడమే కారణం అవుతున్నప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ముందు అందరూ సమానులేనన్న న్యాయ సూత్రాలు ఎందుకూ కొరగాకుండా పోతున్నట్టే. నేరారోపణలున్నప్పుడు చట్టం ప్రకారం చర్య తీసుకోవడం పోలీసుల విధి. అలా జరగలేదంటే పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించినట్టే లెక్క. సామాన్య ప్రజల దృష్టిలో ప్రభుత్వం అంటే మొట్ట మొదట గుర్తుకొచ్చేది పోలీసులే. అధికారంలో ఉన్న రాజకీయ పక్షం కనుసన్నల్లో పని చేయడానికి పోలీసులు అలవాటు పడ్డారంటే ప్రభుత్వమే చట్టాన్ని ఖాతరు చేయనట్టు లెక్క. తాము లైంగిక వేధింపులకు గురయ్యామని ప్రసిద్ధులైన వారు ఫిర్యాదు చేస్తేనే దిక్కు లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో, వారు ఎన్ని గడపలు ఎక్కి దిగాల్సి వస్తుందో ఊహించుకోవచ్చు. సామాన్య పౌరుల మీద ఇలాంటి ఆరోపణలే వస్తే పోలీసులు చర్య తీసుకోకుండా ఉండరుగదా! ముందు వెనక ఆలోచించకుండా పోలీసుస్టేషన్‌కు ఈడ్చుకు వెళ్తారుగా. మల్లయోధులు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించి నప్పుడు ఇది చాలా తీవ్రమైన అంశం అని న్యాయ మూర్తులు వ్యాఖ్యా నించారు. ఎఫ్‌.ఐ.ఆర్‌. ఎందుకు దాఖలు చేయలేదు అని నిలదీశారు. ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరగవలసి ఉందని పోలీసులు వాదించారు. మూడు నాలుగు రోజుల తరవాత ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయడానికి సిద్ధపడ్డారు అంటే ప్రాథమిక దర్యాప్తు పూర్తి అయిందనుకోవాలా?
బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేసినందువల్ల క్రీడాకారులకు న్యాయం జరిగినట్టు కాదు. వచ్చిన ఆరోపణ శిక్షార్హమైన నేరం అయినప్పుడు నిందితుడిని అరెస్టు చేస్తే తప్ప ప్రయోజనం లేదు. ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలయ్యేట్టు చూడడానికి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించక తప్పలేదంటే చట్టబద్ధ పాలన ఎంతగా చట్టుబండలవు తోందో స్పష్టం అవుతూనే ఉంది. ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయడానికి ప్రాథమిక దర్యాప్తు అవసరం అని పోలీసులు వాదిస్తున్నారంటేనే వారికి తగిలించిన సంకెలలు ఎంత బలమైనవో తేలిపోతోంది. ఈ అంశంపై జరిగే దర్యాప్తు ఉద్యోగ విరమణ చేసిన న్యాయమూర్తి పర్యవేక్షణలో జరగాలని సీనియర్‌ న్యాయవాది అభ్యర్థించడం కూడా సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు అభ్యంతరకరమైంది. దర్యాప్తు ఎలా జరగాలో దిల్లీ పోలీసు కమిషనర్‌ నిర్ణయిస్తారు అని తుషార్‌ మెహతా అన్నారు. పోలీసుల నిష్క్రియాపరత్వం మీదే సవాలు ఎదురైనప్పుడు దర్యాప్తు ఎలా జరగాలో పోలీసు అధికారులే నిర్ణయిస్తారనడం అనౌచిత్యాల్లోకెల్లా అనౌచిత్యం. లైంగిక వేధింపులకు గురైన వారిలో ఒక మైనర్‌ బాలిక కూడా ఉంది కనక ఈ అంశాన్ని పరిశీలించి ప్రమాణ పత్రం దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించవలసి వచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం అవుతూనే ఉంది.
తమకు అన్యాయం జరిగిందని మొరపెట్టుకోవడానికి క్రీడాకారులు రోడ్డెక్కక తప్పని పరిస్థితి ఉన్నప్పుడు పరుగుల రాణి పి.టి. ఉష లాంటి వారు ఇలా వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేయడం క్రమశిక్షణా రాహిత్యం అని వాదిస్తే నిర్ఘాంతపోక తప్పదు. ఈ వ్యాఖ్య చేసింది సాధారణ వ్యక్తి కాదు. ఆమె ప్రఖ్యాత క్రీడాకారిణి. భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ సంఘం అధ్యక్షురాలు. క్రీడాకారులు నిరసన తెలియజేయడం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని పి.టి.ఉష లాంటి వారు అనడం వింతల్లోకెల్లా వింత. అన్యాయాన్ని ఎదిరించడం, హక్కులకోసం పోరాడడం దేశ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందనే వారిని చూస్తే వారు ఎవరి పక్షాన నిలబడ్డారో రుజువు అవుతూనే ఉంది. పార్లమెంటు సభ్యుడై ఉండి క్రీడాకారిణులపై లైంగిక వేధింపులకు పాల్పడడంవల్ల భంగం కాని దేశ ప్రతిష్ఠ న్యాయం కోసం పోరాడితే ఎలా మంట గలుస్తుందో! పి.టి.ఉష ఒక సందర్భంలో యువ క్రీడాకారులకే గాక దేశవాసులందరికీ గర్వకారణంగా ఉండే వారు. ఆమెను ఆదర్శంగా తీసుకున్న వారి సంఖ్య అపారం. ఆమె అకాడమీని కూలగొడ్తున్నప్పుడు సామాజిక మాధ్యమాలలో ఆ విషయాన్ని గట్టిగా ఆమే లేవనెత్తారు. అప్పుడు చాలా మంది క్రీడాకారులు ఆమెకు అండగా నిలిచారు. అలాంటి వ్యక్తి తోటి క్రీడాకారిణులకు జరిగిన అన్యాయాన్ని సహించడం వెనక మతలబు ఏదో ఉండే ఉంటుంది. జంతర్‌ మంతర్‌లో నిరసన తెలియజేస్తున్న క్రీడాకారులకు అనేక రాజకీయ పక్షాల మద్దతు సమకూరడం కొందరిలోనైనా ఇంకా సంవేదన మిగిలే ఉందనడానికి తార్కాణం. నిరసన తెలియజేయడమూ ఖరీదైన వ్యవహారమే. రోజుకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందట. బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేసి చట్టం ప్రకారం శిక్ష విధిస్తే తప్ప క్రీడాకారుల ఆందోళన సార్థకం కాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img