Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

హిందుత్వ వాదుల దురహంకారం

ఒక మతవర్గంపై విద్వేషం పెంచే ప్రసంగాలను అనుమతించ కూడదని, అలాంటి సందర్భాలలో కేసు నమోదు చేయాలని, ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు తమంత తాము కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు గత నెల 21న స్పష్టంగా తెలియజేసింది. తమ ఆదేశాన్ని పాటించకపోవడాన్ని కోర్టు ధిక్కారం కింద భావించి సంబంధిత అధికారులపై చర్య తీసుకుంటామని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కానీ నిరంతరం విద్వేష విషం కక్కే హిందుత్వ వాది యతి నరసింగానందకు ఇవేమీ పట్టవు. గత సంవత్సరం హరిద్వార్‌ లో నిర్వహించిన ధర్మ సన్సద్‌లో నరసింగానంద ముస్లింల మీద విషం కక్కడమే కాకుండా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు. ఈ రెండు ఆరోపణల కింద ఆయనను 2022 జనవరి 15న అరెస్ట్‌ చేశారు. దాదాపు నెల రోజులు నిర్బంధంలో ఉన్న తరవాత బెయిలు మీద విడుదలయ్యారు. బెయిలు మంజూరు చేసినప్పుడు న్యాయస్థానం మళ్లీ ఎలాంటి విద్వేష ప్రసంగాలూ చేయకూడదని, అలాంటి సమావేశాలలో పాల్గొనకూడదని షరతు విధించింది. ఈ షరతులన్నింటినీ ఉల్లంఘించి ఇప్పుడు ఆయన మళ్లీ ధర్మ సన్సద్‌ ఏర్పాటు చేస్తానంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకైనా, బెయిలు మంజూరు చేయడానికి విధించిన షరతుల దృష్టిలోనైనా నర్సింగానంద మీద చర్యలు తీసుకోవాలి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వమే విద్వేష రాజకీయాలు నడుపుతున్నందువల్ల ఇలాంటి బెదిరింపులను చూసీ చూడనట్టు ఊరుకుంటోంది. ఘజియాబాద్‌లోని దస్న దేవీ దేవాలయ పూజారి, హిందుత్వ నాయకుడు యతి నరసింగానంద ఉత్తర ప్రదేశ్‌ లో డిసెంబర్‌ 17 నుంచి ధర్మ సన్సద్‌ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇలాంటి సమావేశం నిర్వహించకూడదని పోలీసులు గురువారం నరసింగానంద కు నోటీసు జారీ చేశారు. మూడు రోజుల పాటు ఈ ధర్మ సన్సద్‌ నిర్వహించాలన్నది ఆయన సంకల్పం. డిసెంబర్‌ 17న భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ వైకుంఠ్‌ లాల్‌ శర్మ జన్మ దినోత్సవం. ఆ రోజున ధర్మ సన్సద్‌ నిర్వహించడం నరసింగానంద పనిగా పెట్టుకున్నారు. గత సంవత్సరం హరిద్వార్‌లో జరిగిన ధర్మ సన్సద్‌ కూడా డిసెంబర్‌ 17ననే నిర్వహించారు. దానికీ పోలీసులు అనుమతించ లేదు. ఇప్పుడూ అనుమతించే అవకాశం కనిపించడం లేదు. అనుమతించినా అనుమతించక పోయినా ధర్మ సన్సద్‌ నిర్వహించడం ఖాయం అని నర్సింగానంద హుంకరిస్తున్నారు. గత ఏడాది ధర్మ సన్సద్‌ కు భారీ సంఖ్యలో మత నాయకులు అనేక మంది హాజరయ్యారు. కరడుగట్టిన మితవాదులు, ఛాందస వాదులు, తీవ్ర హిందుత్వ భావాలు కలిగిన వారు, వివిధ హిందూ సంస్థల వారు హరిద్వార్‌ ధర్మ సన్సద్‌ కు హాజరయ్యారు. ఇందులో ముస్లింల మనోభావాలను భయంకరంగా దెబ్బ తీసే ప్రసంగాలు చేశారు. హింసను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. వీరి దృష్టి ప్రధానంగా ముస్లింలను ద్వేషించడం మీదే ఉంది. హరిద్వార్‌ ధర్మ సన్సద్‌ నిర్వహించినప్పుడు విద్వేషం రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఎఫ్‌.ఐ.ఆర్‌.లు నమోదయ్యాయి. హరిద్వార్‌ ధర్మ సన్సద్‌ జరిగిన నాటి నుంచి నరసింగానంద విద్వేష ప్రసంగాలు మానుకున్న సందర్భమే లేదు. ఉత్తర ప్రదేశ్‌ లో మూడు రోజుల ధర్మ సన్సద్‌ నిర్వహణకోసం డిసెంబర్‌ ఆరున సన్నాహక సమావేశం ఏర్పాటుచేయాలని నరసింగానంద ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి అనుమతి లేదని గజియాబాద్‌ గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్‌ ఇరాజ్‌ రాజా అంటున్నారు. వందలాది మంది హాజరవు తారనుకుంటున్న ఈ సమావేశాన్ని అనుమతి లేనిదే జరగ నివ్వబోమనీ, ఆ సమావేశానికి భద్రత కల్పించడం కూడా కష్ట సాధ్యమని పోలీసు సూపరింటెండెంట్‌ వివరించారు.
నరసింగానంద విద్వేష ప్రచారం ధర్మ సన్సద్‌ల ఏర్పాటుకు మాత్రమే పరిమితమైంది కాదు. రెచ్చగొట్టే రీతిలో ఉన్న ఆయన ప్రసంగాలు అనేకం యూ ట్యూబ్‌లో కనిపిస్తాయి. ఇవన్నీ విద్వేషాన్ని నివారించడానికి యూట్యూబ్‌ నియమాలను ఉల్లంఘించేవే. అయినా ఇంతవరకు ఆయన మీద యూ ట్యూబ్‌ ప్రసంగాల కారణంగా కానీ, బెయిలు షరతులను ఉల్లంఘించినందుకు కానీ చర్య తీసుకున్న దాఖలాలు లేవు. వ్యక్తులకు, కుల, మత, స్త్రీపురుష వ్యవహారంలో విద్వేషాన్ని అనుమతించకూడదన్నది యూ ట్యూబ్‌ విధానం. దీనికి నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉన్నా యూ ట్యూబ్‌లో ఆయన విద్వేష ప్రసంగాలు కొనసాగడం విచిత్రమే. వివిధ మతాల మధ్య తంపులు పెట్టే సమావేశాలలో పాల్గొనకూడదని నరసింగా నందకు బెయిలు మంజూరు చేసినప్పుడు న్యాయస్థానం షరతు విధించింది. ఈ షరతును ఆయన పదే పదే ఉల్లంఘిస్తున్నా ఏ న్యాయస్థానమూ ఆయన మీద చర్య తీసుకోలేదు. బెయిలు మంజూరైన రెండు నెలలకే నరసింగానంద ఊనా ధర్మ సన్సద్‌ లో పాల్గొన్నారు. అక్కడా రెచ్చగొట్టే ప్రసంగాలే చేశారు. ఈ ప్రసంగాలు యూట్యూబులో అందుబాటులో ఉన్నాయి. వీటిని వేలమంది చూస్తూనే ఉన్నారు. అన్నింటికన్నా మించి ప్రధానమంత్రి మోదీ గత ఆగస్టులో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘‘హర్‌ ఘర్‌ తిరంగా’’ అని భారీ కార్యక్రమం చేపడ్తే నరసింగానంద దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఒక ముస్లిం కంపెనీ నడిపే వ్యాపారానికి మేలు చేస్తుందన్నది నరసింగానంద వాదన. అందుకే ‘‘హర్‌ ఘర్‌ తిరంగా’’కార్యక్రమాన్ని బహిష్కరించాలని నరసింగానంద పిలుపు ఇచ్చారు. గత సెప్టెంబర్‌లో ఒక బహిరంగ సమావేశంలో మాట్లాడిన తరవాత నరసింగానంద మీడియా సమావేశం కూడా నిర్వహించారు. అందులో తుపాకి మందుతో మదర్సాలనన్నింటినీ ధ్వంసం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ మాటలేవీ ఏలిన వారి చెవిన పడకుండా ఉంటాయా? మదర్సాల్లో చదువుతున్న వారి మదిలో ఉన్న వైరస్‌ ను తొలగించడానికి ఆ విద్యార్థులందరినీ ప్రత్యేక శిబిరాలకు పంపాలని నరసింగానంద బహిరంగంగానే కోరారు. 2012లో నిర్భయ మీద అత్యాచారం చేసింది ఒక ముస్లిం యువకుడు అని నరసింగానంద అసత్య ప్రచారానికి ఒడిగట్టారు.
ఇస్లాం మతాన్ని విశ్వసించని వారి అమ్మాయిల మీద అత్యాచారం చేయాలని ఆ మతం ప్రేరేపిస్తుందని కూడా ఆయన అన్నారు. షరతులతో కూడిన బెయిలు మంజూరైన సందర్భాలలో ఏదైనా ఉల్లంఘన ఉందేమో పోలీసులు పరిశీలించాలి. అలా జరిగితే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలి. నరసింగానందే అదే పనిగా బెయిలు షరతులను ఉల్లంఘిస్తున్నా ఏ చర్యా తీసుకోలేదు. మరో విచిత్రం ఏమిటంటే నరసింగానందకు లాంఛన ప్రాయంగా బీజేపీతో ఎలాంటి సంబంధమూ లేదు. కానీ ఆయన అనేక మంది బీజేపీ నాయకులతో సన్నిహితంగా తిరుగుతుంటారు. మొదట్లో నరసింగానందను ప్రోత్సహించింది బీజేపీ ఎంపీ వైకుంఠ్‌ లాల్‌ శర్మే. ఆయన రామ జన్మ భూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇన్ని జరుగుతున్నా కానీ మోదీ ప్రభుత్వం నోరైనా మెదపలేదు. అంటే పరోక్షంగా మోదీ సర్కారు విద్వేష రాజకీయాలకు మద్దతు ఇస్తున్నట్టేగదా.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img