Friday, April 19, 2024
Friday, April 19, 2024

న్యాయం మంటగలిసిన అమృత ఘడియలు

ప్రభుత్వాలకు ఉన్న విచక్షణాధికారాలను విచక్షణారహితం గానే కాక వివక్షతో వినియోగిస్తే ఎన్ని ఘోరాలు అయినా జరుగు తాయి. 2002లో గుజరాత్‌ మారణ కాండ సందర్భంగా బిల్కిస్‌ బానో అనే గర్భిణీ మీద 11 మంది మూకుమ్మడిగా అత్యాచారం చేశారు. మూడేళ్ల పసికూన అయిన ఆమె కూతురిని బండకేసి బాది చంపేశారు. బిల్కిస్‌ బానో పట్టు వదలకుండా, నిర్భ యంగా, తనకు జరిగిన అన్యాయాన్ని సిగ్గువిడిచి చెప్పుకున్నందు వల్ల 11 మంది నిందితు లకు యావజ్జీవ కారాగార శిక్ష పడిరది. సుప్రీంకోర్టు జోక్యం చేసు కోకుండా ఉంటే అదీ సాధ్యమయ్యేది కాదేమో. దోషులకు శిక్ష పడిరదని సంతృప్తి పడడానికీ, నిరంతరం పోరాడితే అరుదుగానైనా న్యాయం జరుగుతుందని అనుకోవడం భ్రమేనని గుజరాత్‌ ప్రభుత్వం నిస్సిగ్గుగా నిరూపించుకుంది. ఈ పదకొండు మంది 14 ఏళ్ల జైలు శిక్ష అను భవించారు కనక, వారి వయసును, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని వారికి క్షమాభిక్ష ప్రసాదించి సోమవారం విడుదల చేయడం మానవ సమాజమే సిగ్గుతో తలదించుకోవలసిన పరిణామం. గుజరాత్‌ ప్రభుత్వం దోషులను విడుదల చేయడం బిల్కిస్‌ బానో మీద జరిగిన సామూహిక అత్యాచారంకన్నా హేయమైంది. మహిళల మీద సామూహిక అత్యాచారమే హేయమైన నేరం కాకుండాపోతే మరెంత ఘోరం జరిగితే హేయమైన నేరం అవుతుందో ఊహించడం కూడా కష్టమే. ఈ 11 మంది కిరాతకులు తాము 14 ఏళ్లు జైలులో గడిపాం కనక తమను విడుదల చేయాలని అభ్యర్థించారట. 14 ఏళ్ల శిక్షాకాలం పూర్తి అయినందువల్ల, దోషుల వయసును, నేరస్వభావాన్ని, జైలులో వారి సద్వర్తనను దృష్టిలో ఉంచుకుని విడుదల చేశామని గుజరాత్‌ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్య దర్శి (హోం శాఖ) రాజ్‌ కుమార్‌ ఏ మాత్రం మొహమాటపడకుండా వివరణ ఇచ్చుకున్నారు. జీవిత ఖైదు అంటే 14 ఏళ్లు కాదు అన్న వాస్త వాన్ని కప్పిపుచ్చడాన్ని విస్మరించ కూడదు. 2002 మార్చి మూడవ తేదీన దహోడ్‌ జిల్లాలోని లింఖెడా తాలూకాలో మూక దాడికి దిగి మొత్తం 14 మందిని మతకలహాల సందడిలో హతమార్చారు. అందులో బిల్కిస్‌ కుటుంబానికి చెందిన వారే ఏడుగురు ఉన్నారు. ఆ సమయంలో బిల్కిస్‌ గర్భిణీ. బిల్కిస్‌ ఆత్మస్థైర్యం కోల్పోకుండా మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. అప్పుడు సుప్రీంకోర్టు ఈ ఘోరకలి విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించింది. ఆ క్రమంలో బిల్కిస్‌ ఆత్మ రక్షణ కోసం అనేక ఇళ్లు మారాల్సి వచ్చింది. ఊళ్లూ మారక తప్పలేదు. ఆమెను చంపేస్తామని బెదిరించారు. ఈ దశలో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను గుజరాత్‌ న్యాయస్థానం నుంచి తప్పించి మహారాష్ట్రకు బదిలీ చేసింది. ఈ ఘాతుకం జరిగిన ఎనిమిదేళ్లకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి యు.డి.సాల్వీ 13 మందిని దోషులుగా తేల్చారు. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేయడానికి బొంబాయి హైకోర్టుకు మరో తొమ్మిదేళ్లు పట్టింది. 2019లో సుప్రీంకోర్టు బిల్కిస్‌కు 50 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2002 గుజరాత్‌ మారణ కాండలో ఇంత పెద్ద మొత్తంలో పరిహారం అందింది ఈ ఒక్క కేసులోనే. ‘‘జరగకూడని ఘోరం జరిగింది కనక ప్రభుత్వం పరిహారం చెల్లించవలసిందేనని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌, న్యాయమూర్తులు దీపక్‌ గుప్తా, సంజీవ్‌ ఖన్నా ఈ ఆదేశం జారీ చేశారు. 11 మంది దోషులు తాము 14 ఏళ్లు జైలులో గడిపినందువల్ల తమను విడుదల చేయాలని అర్జీ పెట్టుకున్నారు. ఈ అర్జీని పరిశీలించడానికి కొద్ది నెలల కింద ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ విడుదలకు సిఫార్సు చేసింది. ఈ కేసులో నిందితులను వెనకేసుకు రావడానికి ప్రయత్నించిన పోలీసు జవానుకు కూడా మూడేళ్ల శిక్ష పడిరది. సీనియర్‌ పోలీసు అధికారులు ముగ్గురి మీద క్రమశిక్షణా చర్య తీసుకున్నారు.
ఇదంతా జరిగినప్పుడు న్యాయం ఇంకా బతికే ఉందని భావించాం. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజుల మీంచి నారీ శక్తి, స్త్రీలను గౌరవించవలసిన అగత్యం గురించి గంభీరమైన ప్రసంగం చేసిన కొన్ని గంటల్లోనే కిరాతకానికి పాల్పడ్డ 11 మందిని విడుదల చేయడం దిగ్భ్రాంతికరం. సాధారణంగా అత్యా చారాలు జరిగిన కేసులో శిక్ష పడడమే అరుదు. ఒక వేళ పడ్డా అది అనేక ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగితే తప్ప సాధ్యం కాదు. ఇలాంటి సందర్భాలలో అత్యాచారానికి గురైన మహిళలు ఎంత క్షోభ అనుభవించ వలసి వస్తుందో ఊహకు కూడా అందదు. గుజరాత్‌ మారణ కాండకు బాధ్యులైన ఎంతోమంది తప్పించుకోగలిగారు. ఆ మారణ కాండ వెనక హస్తం ఉందనుకున్న అనేకమంది బలాదూరుగా తప్పించుకున్నారు. ఉదా హరణ ప్రాయంగా న్యాయం జరిగింది అనుకున్న ఉదంతాలలో గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అత్యాచారం కన్నా ఏహ్యమైన నిర్ణయం తీసుకుని దోషులను విడుదల చేయడం వెనక ఉద్దేశం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గుజరాత్‌లో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే గనక సోమవారం నారీ శక్తి గురించి గొప్పగా చెప్పిన ప్రధానమంత్రి మోదీ మాటలు అర్థరహితమైనవి అని, ఆయన జనం కోసం చేసే ప్రసంగాలకు, తన పార్టీ నడుపుతున్న ప్రభుత్వాలు తీసుకునే భయంకరమైన నిర్ణయాలకు పొంతన ఉండదని అనుకోక తప్పదు. దోషులను వెనకేసుకు రావడంలో బీజేపీ నాయకుల చరిత్ర అందరికీ తెలిసిందే. కథువా కేసులో సీనియర్‌ బీజేపీ నాయకులు వీధుల్లోకి వచ్చి అఘాయిత్యానికి పాల్పడిన వారికి లజ్జా రహితంగా మద్దతిచ్చిన చరిత్ర ఇటీవలిదే. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీనే ‘‘రూ. 50 కోట్ల స్నేహితురాలైన అమ్మాయి’’, ‘‘కాంగ్రెస్‌ విధవ’’, ‘‘జెర్సీ ఆవు’’, ‘‘శూర్పణఖ’’ లాంటి పదజాలంతో మహిళ అని కూడా చూడకుండా దూషిం చిన దుష్ట సంస్కృతిని జనం ఇంకా మరిచిపోలేదు. బీజేపీ తమకు గిట్టని మతం వారి విషయంలోనే ఇలాంటి అసహ్యకరమైన వైఖరి అనుసరిస్తుంది అన్న విమర్శలు సత్యదూరం కావు. మోదీకి మహిళల మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా దాన్ని వాగాడంబర పూరితమైన ఉపన్యాసాలకు పరిమితం చేయకుండా ఆ 11 మందిని విడుదల చేయడాన్ని గుజరాత్‌ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని ఆదేశించగలరా? గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేట్టు చేయకపోతే మోదీ ఉపన్యాసాలు కేవలం జనాన్ని బురిడీ కొట్టించడానికే అనుకోవాలి. మోదీ హయాంలో నింపిన విద్వేషం ఎంతటి దారుణమైన నిర్ణయాలకైనా దారి తీస్తుంది అనడానికి ఇలాంటి అడ్డదిడ్డమైన నిర్ణయాలే తార్కాణం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img