Friday, August 19, 2022
Friday, August 19, 2022

గర్జించే సింహాలా!

నేల మీంచి 33 అడుగుల ఎత్తు. మొత్తం 16000 కిలోల బరువు. ఆరున్నర మీటర్ల ఎత్తు. స్వచ్ఛమైన కాంస్యంతో తయారైంది. వందమంది నైపుణ్యంగల పని వారు తొమ్మిది నెలల పాటు పడ్డ శ్రమ ఫలితం. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. ఇదీ నూతన పార్లమెంటు భవనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించిన జాతీయ చిహ్నం. ఇది ఇంత వరకు మనం వినియోగిస్తూ వచ్చిన జాతీయ చిహ్నానికి ప్రతి రూపంగా లేదు. సార్నాథ్‌ మ్యూజియంలో ఉన్న అశోకస్తంభం మీద ఉన్న నాలుగు సింహాలలా ఉండవలసిన చిహ్నం ఇది. కానీ ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించిన నూతన జాతీయ చిహ్నం సార్నాథ్‌లోని మునుపటి జాతీయ చిహ్నంలా లేనే లేదు. మునుపటి జాతీయ చిహ్నంలోని సింహాలు ధీర గంభీర రూపంలో ఉంటాయి. రాజ ఠీవి ఉట్టిపడ్తుంది. మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలో కనిపించే సింహాలు రౌద్రంగా, భయ పెట్టేలా ఉన్నాయి. మోదీ ఈ విగ్రహావిష్కరణ తరవాత హిందూ మతాచారం ప్రకారం ఓ క్రతువులాంటిది నిర్వహించారు. అందులో ఆయనొక్కరే పాల్గొ న్నారు. ఆవిష్కరణకోసం ఆయన వెంట ఉన్న లోకసభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవ హారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అల్లంత దూరాన మౌన ప్రేక్షకు లుగా ఉండిపోయారు. మోదీ నిర్వహించిన ప్రారంభోత్సవ క్రతువుతో వారికి ఎలాంటి ప్రమేయమూ లేదు. ఈ జాతీయ చిహ్నం ‘‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’’ లోని అనేక అంశాలకు అద్దం పడ్తుందని గృహ నిర్మాణ, పట్టణాభి వృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. అందువల్లే కావచ్చు ఇంతవరకు వినియోగిస్తూ వస్తున్న జాతీయ చిహ్నంతో కొత్త దానికి పోలిక ఉన్నట్టు లేదు. నూతన పార్లమెంటు భవనంపైన ఆవిష్కరించిన ఈ చిహ్నం ప్రజల కోసం ప్రజలు నిర్వహించే అన్న నానుడికి అనువుగా ఉందని కూడా ఈ భాష్యకారులు సెలవిచ్చారు. అదీ అవాస్తవమే. 2020 డిసెంబర్‌ 10వ తేదీన నూతన పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేసినప్పుడు కూడా మోదీ ఒక్కరే సకల కార్యక్రమాలకు కర్త, కర్మ, క్రియ అయ్యారు. ఇప్పుడూ అంతే. పార్లమెంటు భవనం మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. ప్రజలు ఎన్నుకున్న లోకసభ సభ్యులు, పరోక్ష పద్ధతిలో ఎన్నికయ్యే రాజ్యసభ సభ్యులు మాత్రమే కాకుండా భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా పార్లమెంటులో భాగమే. ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు కనక ఆయన నేరుగా పార్లమెంటులో భాగమే. ప్రతిపక్ష నాయ కుల జాడే లేదు. వీరెవరూ ఆ దరిదాపుల్లో కూడా కనిపించలేదు. నూతన జాతీయ చిహ్నంలో కనిపిస్తున్న సింహాలు ఉగ్ర రూపంలో కోరలు సాచి ఉన్నాయి. ఇది మోదీ నిర్మిస్తున్న నూతన భారత్‌కు సంకేతం కావచ్చునంటు న్నారు విమర్శకులు. ఈ చిహ్నానికి రూపకల్పన చేసిన వారు ఇచ్చిన సంజా యిషీ భిన్నంగా ఉంది. చూసే కోణాన్నిబట్టి తేడా కనిపించవచ్చునంటు న్నారు. సార్నాథ్‌ స్థూపంలో ఉన్న దానికన్నా పెద్ద పరిమాణంలో జాతీయ చిహ్నాన్ని రూపొందించినందువల్ల, ఎత్తు మీద ఉన్నందువల్ల మార్పు కని పిస్తూ ఉండవచ్చు అంటున్నారు. అయినా రూపకల్పన చేసిన కళాకారులకు స్వేచ్ఛ ఉంటుందిగా అని సమర్థించుకుంటున్నారు. కింద నుంచి చూస్తే ఒకలా, పై నుంచి చూస్తే ఒకలా ఉంటుంది అంటున్నారు. అంటే ఏ ఎత్తు నుంచి ఏ కోణంలో చూడాలో మార్గదర్శకాలు ఏమైనా జారీ చేస్తారేమో! అశోకుడి స్థూపం న్యాయం, శాంతి, అహింసకు ప్రతిరూపం కానీ మోదీ పనుపున నిర్మించిన కొత్త చిహ్నంలోని సింహాలు గర్జిస్తున్నట్టుగా, భయంకర మైన కోరలు సాచినట్టుగా, మునుపటి చరిత్రను చెరిపేస్తున్నట్టుగా, విరూపం చేస్తున్నట్టుగా, తిరగ రాస్తున్నట్టుగా ఉన్నాయి అన్న విమర్శలు జోరుగా విని పిస్తున్నాయి. ఈ మార్పులు ఎవరి ఆదేశం ప్రకారం జరిగాయి అని ప్రశ్నిస్తు న్నారు. 1950లో ఆమోదించిన జాతీయ చిహ్నానికి కొత్త దానికి పోలికే లేదంటున్నారు.
ఈ చిహ్నం ఆవిష్కరణ విషయంలోనే కాదు అసలు మొదటి నుంచీ మోదీ ఎవరితోనూ సంప్రదించకుండా తనకు తోచినట్టు చేశారు. అయితే మన జాతీయ చిహ్నం ఆటబొమ్మ కాదు. అది భారత్‌ అన్న మాటకు అర్థం చెప్పాలి. భారత రాజ్య వ్యవస్థ అంటే వివరించేదిగా ఉండాలి. ఈ చిహ్నాన్ని మన న్యాయస్థానాల్లో వినియోగిస్తాం. తద్వారా నిజాయితీని, నిష్పక్షపాతాన్ని ప్రదర్శిస్తాం. నాణాల మీద, కరెన్సీ నోట్ల మీదా ఈ చిహ్నాన్నే వాడతాం. ఈ చిహ్నమే వాటి చెలామణికి చట్టబద్ధత కల్పిస్తుంది. ఈ చిహ్నానికి రూపకల్పన చేసే ముందు పార్లమెంటును, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించలేదు. ప్రజాభిప్రాయం తెలుసుకోలేదు. ఏకపక్షంగా అసలు చిహ్నానికి మార్పులు చేసేశారు. శాంత గంభీర రూపంలో ఉండవలసిన సింహాలు రౌద్రంగా, కోరలు సాచి ఉండడం చూస్తే అమెరికాలోని స్వేచ్ఛా ప్రతిమ చేతిలోని జ్వలించే కాగడాను లాగేసి తుపాకీ పెట్టినట్టు ఉందని విజ్ఞులు అంటున్నారు. నూతన చిహ్నానికి సంబంధించిన సకల వ్యవహారాలూ అపసవ్యంగానే జరిగాయి. ఆవిష్కరణ తరవాత హిందూమత విధుల ప్రకారమే పూజలు చేశారు. మిగతా మత విధుల ప్రకారం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే పద్ధతికి స్వస్తి చెప్పారు. భిన్న మతానుయాయులు ఉన్నట్టే ఏ మతంలోనూ విశ్వాసం లేని వారు కూడా ఉంటారన్న వాస్తవాన్ని మోదీ సర్కారు పరిగణించిన దాఖలాలే లేవు. మైత్రికి, విశ్వాసానికి ప్రతీకగా ఉండవలసిన జాతీయ చిహ్నం కాస్తా భయపెట్టేదిగా, హెచ్చరించేదిగా తయారైంది. నూతన చిహ్నంలో జరిగిన మార్పులు కళాత్మకమైనవని, ఉద్దేశ పూర్వకంగా చేసినవి కాదని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇస్తున్న సంజా యిషీలను నమ్మడం మోదీ బూటక వాగ్దానాలను నమ్మినంత సులువు కాదు. ఈ మార్పును భావి తరాలవారు, ఇతర దేశాల వారు ఎలా స్వీకరిస్తారన్న ఆలోచనే సర్కారుకు ఉన్నట్టు లేదు.
ఈ సింహాలలో కనిపించే రౌద్ర స్వరూపం మన దగ్గర అణ్వస్త్రాలు న్నాయన్న ధీమా అనుకోవాలా? కృత్రిమ మేధా శక్తిలో, గూఢచర్యంలో, సైనిక శక్తిలో మన ఆధిపత్యాన్ని ప్రదర్శించు కోవడానికే సింహాలు అంత రౌద్రంగా మారాయనుకోవాలా? అంతిమంగా ప్రజలు దీన్ని చూసి గ్రహించవలసింది ఏమిటి? స్నేహ, సౌభ్రాతృత్వాలు ఇప్పటికీ భారత్‌ అనుసరించే విధానాల్లో ప్రధానమైనవని భావిస్తే భారత్‌ సంతరించు కుంటున్న శక్తి సామర్థ్యాలు దేశ రక్షణకే తప్ప, ఎవరినో బెది రించడానికి కాదని అనుకునేట్టయితే జరిగిన తప్పు సరిదిద్దితే పోయేదేమీ లేదు. ఇందులో మోదీ ప్రతిష్ఠకు కలిగే నష్టం కూడా ఉండదు. మునుపటి చిహ్నానికి ప్రతి రూపమే కొత్త పార్లమెంటు భవనం మీద ఉండడం సమం జసం. జాతీయ చిహ్నం అధికారంలో ఉన్న ప్రధానమంత్రి ఇష్టాయిష్టాలకు అనుకూలంగా ఉండకూడదు. అది జాతి జీవనాడికి ప్రతిబింబంగా ఉండాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img