Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

ఊపిరాడని స్థితిలో నితీశ్‌

బిహార్‌ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం ఎప్పుడూ కష్టమే. నితీశ్‌ కుమార్‌లాంటి రాజకీయ దురంధరుడు, మనసులో మాట బయటపడనివ్వని తత్వం ఉన్న వ్యక్తి చక్రం తిప్పే అవకాశం ఉన్నంతకాలం బిహార్‌ రాజకీయాలను అంచనా వేయడం మరింత కష్టం. ఏనాటికైనా దేశ ప్రధానమంత్రి కావాలన్న ఆశ గుండెల నిండా నింపుకున్నవాడు నితీశ్‌. సోషలిస్టు భావజాల కుదురు నుంచి వచ్చినా అధికారం కోసం మతతత్వ భారతీయ జనతా పార్టీతో కలిసి సహజీవనం చేస్తున్నవాడు. కానీ బీజేపీ అధికార దాహంతో పోటీ పడడం కష్టం అని నితీశ్‌ గ్రహించి నట్టున్నాడు. నితీశ్‌తో సహగమనం ఎక్కువరోజులు సాగే అవకాశం లేదని బీజేపీ కూడా గ్రహించింది. 2020లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 74 స్థానాలు, నితీశ్‌ నాయకత్వంలోని జె.డి.(యు)కు 45 సీట్లు మాత్రమే వచ్చినా అంతకుముందు రాష్ట్ట్రీయ జనతాదళ్‌తో ఉన్న మైత్రిని త్యాగం చేసి తమతో కలిసి వచ్చినందువల్ల బీజేపీ నితీశ్‌ కుమార్‌కే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది. కానీ సొంతంగా తామే అధికారంలోకి రావాలన్న ఆకాంక్షను మాత్రం బీజేపీ వదులుకోలేదు. దీనికి తగ్గట్టుగానే నితీశ్‌ కుమార్‌ కూడా అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీని ఇరకాటంలో పెట్టే పని చేస్తూనే ఉన్నాడు. నితీశ్‌ను చక్రబంధంలో బిగించడానికి బీజేపీ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది. జె.డి.(యు)నాయకుడు ఆర్‌.సి.సింగ్‌ మొన్నటిదాకా కేంద్రంలో మంత్రివర్గంలో ఉండేవారు. కానీ ఆయన తన అనుమతితో మంత్రి కానందువల్ల నితీశ్‌ కినుక వహించాడంటారు. ఆర్‌.పి.సింగ్‌ రాజ్యసభ సభ్యత్వ గడువు ఇటీవల ముగిసింది. కానీ నితీశ్‌ ఆయనను రాజ్య సభకు పంపించడానికి సుముఖంగా లేరు. అందువల్ల సింగ్‌ రాజీనామా చేయక తప్పలేదు. ఆర్‌.పి.సింగ్‌ భుజం మీద తుపాకి పెట్టి నితీశ్‌ కుమార్‌ను కాల్చాలన్న బీజేపీ ఎత్తుగడను అర్థం చేసుకోలేనంతటి అమాయకత్వం నితీశ్‌కు లేదు. అందుకే ఆర్‌.జె.డి. నాయకుడు, లాలూ ప్రసాద్‌ కుమారుడు తేజస్వి యాదవ్‌ను మాలిమి చేసుకోవడానికి నితీశ్‌ ప్రయత్నం మొదలుపెట్టి చాలాకాలమే అయింది. జనాభా లెక్కల సేకరణలో కుల గణన ఉండాలని ప్రధానమంత్రిని ఒప్పించడానికి నితీశ్‌ దిల్లీకి తీసుకెళ్ళిన ప్రతినిధి వర్గంలో తేజస్వి యాదవ్‌ కూడా ఉన్నారు. బీజేపీని వదిలేస్తే తేజస్వి యాదవ్‌తో చేతులు కలిపి అయినా ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవచ్చునన్నది నితీశ్‌ అంచనాలా కనిపిస్తోంది. తేజస్వి యాదవ్‌ కూడా ఇటీవల నితీశ్‌ అంటే మండిపడడం తగ్గింది. ఆర్‌.పి.సింగ్‌ను పక్కన పెట్టిన దగ్గర్నుంచి నితీశ్‌ కుమార్‌ చిటపటలాడుతూనే ఉన్నారు. బీజేపీ మీద తన ప్రతికూలతను వ్యక్తం చేసే ఏ అవకాశమూ వదులుకోవడం లేదు. ఆదివారం ప్రధాన మంత్రి ముఖ్యమంత్రులతో సమావేశం అవుతున్న సమయంలో నితీశ్‌ అక్కడ లేదు. కనోనా సోకినందువల్ల నితీశ్‌ దిల్లీ వెళ్ళలేదంటున్నారు కానీ ఆది వారం పాట్నాలో ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మార్చి 25న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి నితీశ్‌ హాజరయ్యారు. అక్కడా ప్రధానమంత్రి మోదీని అన్యమనస్కంగానే పలకరించారు. ఆ తరవాత మోదీని కలుసుకోకుండా నితీశ్‌ జాగ్రత్త పడుతూ వస్తున్నారు. రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా నితీశ్‌ హాజరుకాలేదు. ఆర్‌.పి.సింగ్‌ రాజ్యసభ సభ్యత్వానికి మరోసారి వీలు కల్పించకపోగా ఆయన మీద అవినీతి ఆరోపణల తీవ్రత పెరిగింది. ఆర్‌.పి.సింగ్‌ నిజానికి బీజేపీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం కూడా నితీశ్‌ను తొలుస్తూనే ఉన్నట్టుంది. జె.డి.(యు) శాసన సభ్యులను చేరదీయడానికి సింగ్‌ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
ఆర్‌.పి.సింగ్‌కూ పరిస్థితి అర్థమైనట్టుంది. నితీశ్‌తో ఇక పొసగదన్న నిర్ణయానికి వచ్చినట్టున్నారు. అందుకే ఏడు జన్మలెత్తినా నితీశ్‌ ప్రధాన మంత్రి కాలేరు అంటున్నారు. ఇంకోవైపు తేజస్వి యాదవ్‌ నాయకత్వంలోని ఆర్‌.జె.డి నితీశ్‌మీద ఇటీవల మెతక వైఖరి ప్రదర్శిస్తోంది. తేజస్వి వ్యంగ్య బాణాలు తగ్గాయి. ఏప్రిల్‌ 22న బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రాబ్డీదేవి ఇంట్లో ఇఫ్తార్‌ పార్టీకి హాజరయ్యారు. ఆ తరవాత వారం రోజుల్లో నితీశ్‌, తేజస్వి మంతనాలు ఆడుకున్నారు. శాసన సభలో బలాబలాలను బట్టి చూస్తే ఆర్‌.జె.డి. ఇప్పుడు అతి పెద్ద పార్టీగా ఉంది. మజ్లిస్‌ పార్టీకి చెందిన నలు గురు ఆర్‌.జె.డి.లో చేరడంతో ఇప్పుడు ఆ పార్టీ బలం 80కి పెరిగింది. అంటే ఆర్‌.జె.డి. ఇతర బీజేపీయేతర పార్టీలతో కలిసి తన నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నితీశ్‌ అనుకుంటే తేజస్వి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అయితే సైద్ధాంతికంగా ఆర్‌.జె.డి. ఎంత మాత్రం బీజేపీని సమర్థించదు. బీజేపీని అధికారాన్ని దూరంగా ఉంచడం కోసం తేజస్వి తనకే ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబట్టకుండా నితీశ్‌నే ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి అంగీకరించవలసి వస్తుంది. తేజస్వి దూరదృష్టితో వ్యవహరించగలిగితే అది అసాధ్యం ఏమీ కాదు. బీజేపీతో సహవాసం నితీశ్‌ కుమార్‌కు ఊపిరి ఆడకుండా చేస్తున్నట్టు స్పష్టం అవు తోంది. అందువల్ల ఆ కలుగులోంచి బయటపడే మార్గాన్ని నితీశ్‌ అన్వేషిస్తు న్నారు. కేవలం 45 సీట్లున్న జె.డి.యు. నాయకుడు నితీశ్‌ కుమార్‌ను ఇన్నాళ్ళుగా ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వడం తమ తప్పేనని బీజేపీ అనుకుంటున్నట్టుగా ఉంది. పైకి ఒక మాట చెప్తూ లోపాయికారీగా తన పార్టీని బలహీనపరచడానికి అమిత్‌ షా చేస్తున్న ప్రయత్నాలు నితీశ్‌కు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. అయితే నితీశ్‌ కుమార్‌కు పొగ పెట్టడానికి బీజేపీ ప్రయత్నించడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. అది బీజేపీ తత్వం. నితీశ్‌ కుమార్‌ స్థానంలో ఆర్‌.పి.సింగ్‌ను కూర్మీల నాయకుడిగా నిలబెట్టాలని బీజేపీ ప్రయత్నించింది. ఇందులో అనుమానం లేదు. నితీశ్‌ కుమార్‌ బీసీల మద్దతు సమీకరించగలిగిన నాయకుడు ఆర్‌.పి.సింగ్‌ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కనక అతనికి దన్నుగా ఉండే వెనుకబడిన తరగతుల వారిని సమీకరించ గలమన్న ధీమా బీజేపీకి ఉండవచ్చు. నితీశ్‌ కుమార్‌ పలుకుబడిని, రాజకీయ చతురతను బీజేపీ తక్కువ అంచనా వేస్తుందని అనుకోలేం. కాని ఎక్కడ అధికారం సంపాదించాలన్నా బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందిస్తుంది. అనుకూలమైన పరిస్థితి ఏర్పడేదాకా వేచి చూడగల ఓర్పు బీజేపీకి ఉంది. త్రిపురలో 15 ఏళ్ళు శ్రమించి, వేచి చూసి అధికారం సంపాదించిన తీరు చూస్తే బీజేపీ దీర్ఘకాల పోరాటానికి సిద్ధపడుతుందని స్పష్టం అవుతూనే ఉంది. అధికారం కోసం బీజేపీ నితీశ్‌ కుమార్‌ లాంటి వారిని కొంతకాలం భరించవచ్చు. కానీ అంతిమంగా ప్రతిచోట, ప్రతి రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉండాలన్నదే అంతిమ లక్ష్యం. మతతత్వ రాజకీయాలకు కుల సమీకరణలను జోడిరచగల నైపుణ్యం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సొంతం. అలాంటప్పుడు నితీశ్‌ కుమార్‌ కాళ్ళ కింద నుంచి బీసీల మద్దతు లాగేయడం పెద్ద కష్టం కాదు. కానీ అధికారాంతంలోనైనా మతతత్వ బీజేపీతో కత్తు కలపడం వల్ల మూటగట్టుతున్న అపఖ్యాతిని నితీశ్‌ కుమార్‌ వదిలించుకుంటారా అన్నదే అసలు ప్రశ్న. ఆయన హాయిగా ఊపిరి పీల్చుకోవాలంటే అదొక్కటే మార్గం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img