Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

కుంపటి రాజేసిన పెలోసీ

రష్యా-ఉక్రైన్‌ యుద్ధం మొదలై ఆరు నెలలు కావస్తోంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అంతుపట్టడం లేదు. ఈ తరుణంలో అమెరికా పార్లమెంటు ఎగువసభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ హఠాత్తుగా బుధవారం తైవాన్‌ లో పర్యటించి మరో కుంపటి రాజేశారు. తైవాన్‌ చైనాలో అంతర్భాగమని చైనా అంటోంది. ఒకే చైనా అన్న వాదనను అమెరికాతో సహా ఐక్య రాజ్య సమితి, భారత్‌ కూడా అంగీకరిస్తాయి. కానీ తైవాన్‌ లో స్వయంపాలన ఉంది. తమది ప్రజాస్వామ్యం అని ఆ దేశాధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌-వెన్‌ వాదిస్తూ ఉంటారు. సైనిక చర్యకు దిగి అయినా సరే తైవాన్‌ మీద ఆధిపత్యంకోసం కృషి చేస్తామని చైనా అంటుంది. నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన సందర్భంగా చైనా తమ భూభాగానికి, తైవాన్‌ కు మధ్య ఉన్న క్రాస్‌ జలసంధిలో సైనిక విన్యాసాలు ప్రారంభించింది. పెలోసీ విమానాన్ని తైవాన్‌లో దిగనివ్వం అవసరమైతే పేల్చేస్తామని హెచ్చరించినా చైనా అంత దూకుడు ప్రదర్శించలేదు. పెలోసీ తైవాన్‌ లో పర్యటించడమే కాక అక్కడి చట్టసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. తైవాన్‌ కు అమెరికా మద్దతు ఉంటుందని చెప్పారు. కానీ అమెరికా సైతం ఒకే చైనా అన్న భావనకే 1970 నుంచి ఇప్పటివరకు కట్టుబడి ఉంది. తైవాన్‌ ను చైనాలో అంతర్భాగంగానే గుర్తిస్తోంది. అయితే అమెరికా ద్వంద్వ నీతిలో భాగంగా తైవాన్‌ తో అమెరికా అనధికారిక సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. కావాలనే అమెరికా సందిగ్ధ వైఖరి అనుసరిస్తూ ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాత్రం నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనకు వెళ్లకుండా నివారించలేదు. సుతి మెత్తగా మాత్రమే ఒద్దన్నారు. నాన్సీ పెలోసీ ముందు నుంచి తైవాన్‌ వ్యవహారంలోనే కాక హాంగ్‌ కాంగ్‌ విషయంలోనూ దూకుడు వైఖరినే అనుసరిస్తున్నారు. అనేక అంశాలలో చైనా విధానాలను పెలోసీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మరో వేపు తైవాన్‌ ను స్వతంత్ర దేశంగా భావించడాన్ని చైనా ససేమిరా సహించదు. చైనా దృష్టితో చూస్తే పెలోసీ స్థాయి వ్యక్తి తైవాన్‌ లో పర్యటించడం అంటే తైవాన్‌ స్వాతంత్య్రాన్ని సమర్థించడం. తమ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను సవాలు చేయడమే. ఇలాంటి వైఖరి అమెరికాతో చైనాకు ఉన్న సంబంధాలకు విఘాతం కలిగిస్తుందని చైనా భావిస్తుంది. పెలోసీ పర్యటన వల్ల తైవాన్‌లో స్వాతంత్య్రం కోరే వారికి మద్దతు ఇచ్చినట్టేనని చైనా అంటోంది. తైవాన్‌ కు స్వతంత్ర రాజకీయ అస్తిత్వం ఉండడాన్ని చైనా అంగీకరించదు. చైనాకు తైవాన్‌ కు మధ్య రాజకీయపరమైన స్పర్థలు ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తైవాన్‌ కు చెందిన అనేక మంది చైనా ప్రధాన భూభాగంలో పని చేస్తూనే ఉంటారు. అలాగే తైవాన్‌ లో చైనా పెట్టుబడులూ ఉన్నాయి. ఐక్య రాజ్య సమితి తైవాన్‌ ప్రత్యేక అస్తిత్వాన్ని అంగీకరించదు. దక్షిణ అమెరికా, కరేబియన్‌ ప్రాంతంలోని 13 దేశాలతో పాటు వాటికన్‌ తైవాన్‌ ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తిస్తున్నాయి. అమెరికా తైవాన్‌ ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తించకపోయినా తమ సందిగ్ధ విధానానికి అనువుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ గత జూన్‌ లో తైవాన్‌ స్వతంత్ర అస్తిత్వాన్ని గుర్తించబోము అంటూనే ఎవరైనా దాడి చేస్తే మాత్రం తైవాన్‌ ను సమర్థిస్తామన్నారు. పెలోసీ తైవాన్‌ చట్టసభ సభ్యులను ఉద్దేశించి అమెరికా మద్దతు ఉంటుందని చెప్పడానికి సాహసించడానికి ఈ సందిగ్ధతే కారణం. అమెరికా తైవాన్‌ కు ఆయుధాలు సరఫరా చేయడం ద్వంద్వ విధానానికి పరాకాష్ఠ. 1997లో కూడా అప్పటి అమెరికా ఎగువ సభ స్పీకర్‌, రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు గింగ్రిచ్‌ తైవాన్‌ లో పర్యటించారు. దాడి చేస్తే తైవాన్‌ కు అండగా నిలబడతామని కూడా చెప్పాడు. ఆ సమయంలో చైనా పెద్దగా రభస చేయలేదు. ఆ తరవాత తైవాన్‌ లో పేరున్న అమెరికా నాయకుల పర్యటన పెలోసీదే. ఆర్థికంగా ఇప్పుడున్నంత బలంగా ఆ రోజుల్లో చైనా లేకపోవడమే దీనికి కారణం. 2016లో స్వాతంత్య్ర కాంక్ష వ్యక్తం చేసే పార్టీకి తైవాన్‌ ప్రజలు పట్టం కట్టారు. చైనాలో మానవ హక్కుల కోసం పాటు పడే వ్యక్తిగా పేరుండడంవల్ల పెలోసీ తైవాన్‌ పర్యటనకు పరిస్థితులు అనుకూలించినట్టున్నాయి. 1991లో ఇతర అమెరికా రాజకీయ నాయకులతో కలిసి ఆమె చైనాలో పర్యటించారు. తియాన్‌మెన్‌ స్క్వేర్‌ లో జరిగిన హింసాకాండ రెండవ వార్షికోత్సవం అన్న మిషతో అప్పుడు పెలోసీ తదితరులు ఒక పతాకం లాంటిది ఆవిష్కరించారు. 2009లోనూ పెలోసీ చైనా వెళ్లి రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని చైనా అధ్యక్షుడు హూ ను కోరారు.
1995లో అప్పటి తైవాన్‌ అధ్యక్షుడు లీ తెంగ్‌ హూయ్‌ అమెరికాలో పర్యటించినప్పుడు కూడా చైనా తైవాన్‌ పరిసరాల్లో క్షిపణులు ప్రయోగించింది. సైనిక విన్యాసాలు నిర్వహించింది. అప్పటితో పోలిస్తే చైనా సైనిక శక్తి ఇప్పుడు చాలా పెరిగింది. ఈ దశలో చైనాను రెచ్చగొట్టడం అంటే మరో యుద్ధానికి తెరతీయడమే. ఇంకో వేపు తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ అమెరికా, యూరప్‌, ఆసియా నుంచి ప్రముఖులను ఆహ్వానించడంలో నిమగ్నమై ఉన్నారు. అమెరికా అండ లేకుండా చైనాను ఎదిరించడం కుదరదు కనక త్సాయ్‌ సైనికంగా బలం పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పెలోసీ పర్యటన తమను రెచ్చగొట్టడమే కనక తాము తైవాన్‌ పరిసరాల్లో సైనిక విన్యాసాలు చేస్తున్నామని తమది ప్రతిక్రియ మాత్రమేనని చైనా అంటోంది. అమెరికా, తైవాన్‌ రెచ్చగొట్టే ధోరణి వల్లే తాము సైనిక బలాన్ని ప్రదర్శించవలసి వస్తోందని చైనా అంటోంది. ఉత్తర, నైరుతి, ఆగ్నేయ ప్రాంతంలోని జలసంధి జలాల్లోనూ, వైమానికంగానూ తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తామని చైనా చెప్తోంది. ఒకే చైనా అన్న భావనను అమెరికా అంగీకరించిన తరవాతే అమెరికా-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. చెప్పిన మాటలకు, చేసిన వాగ్దానాలకు కట్టుబడే లక్షణం అమెరికాకు ఏనాడూ లేదు. అనేక సంవత్సరాలుగా అమెరికా నుంచి తైవాన్‌ కు ఆయుధ సరఫరా కొనసాగుతూనే ఉంది. 1982 నాటి స్థాయి నుంచి తైవాన్‌ కు ఆయుధ సరఫరా తగ్గిస్తామన్న మాటను కూడా అమెరికా నిలబెట్టుకోలేదు. పైగా ఆయుధ సరఫరా పెరిగింది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా ఆయుధ సరఫరా బలాదూరుగా సాగుతోంది. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా సైనిక విన్యాసాలు ఆగనే లేదు. చైనాతో అమెరికాకు మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నప్పటికీ ఇలా రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించడం అంటే ఆయుధాలు విక్రయించడానికే ప్రాధాన్యం ఇస్తోందనుకోవాలి. వాస్తవం కూడా అదే. గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అమెరికా పాలకుల నైజం. మన సరిహద్దుల్లో చైనా కవ్వింపు వైఖరి అనుసరిస్తున్నందువల్ల భారత విధానం మరింత స్పష్టంగా ఉండాల్సిందే. అయితే ప్రభుత్వ విధానం ఏమిటో ఇంతవరకు బయట పడలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img