Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మారని కశ్మీర్‌ పరిస్థితి

కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి ఆ ప్రాంతాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించి శుక్రవారం నాటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యాయి. తీవ్రవాదాన్ని నిరోధించడానికి, జమ్మూ-కశ్మీర్‌ను అభివృద్ధి బాట పట్టించడానికే జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. 2019 ఆగస్టు 5 నుంచి 2022 జులై 9 వరకు భద్రతా దళాలకు చెందిన 128 మంది, పౌరులు 118 మంది మరణించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఓ ప్రశ్నకు లిఖితరూపంలో సమాధానమిస్తూ జులై21న పార్లమెంటులో తెలియజేశారు. మరణించిన 118 మందిలో అయిదుగురు కశ్మీరీ పండితులు హిందువులు, సిక్కులు కలిసి 16 మంది ఉన్నారట. అంటే తీవ్రవాద కార్యకలాపాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిలో 97మంది ముస్లింలే. దీన్నిబట్టి తీవ్రవాదులకు మత భేదం ఉండదని, తమ ఉన్మాద క్రమంలో తమ మతానికి చెందిన వారిని కడతేర్చడానికి వెనుకా ముందు చూడరని అర్థం అవుతోంది. 370 వ అధికరణాన్ని రద్దు చేసిన తరవాత ఎంతమంది కశ్మీరీ పండితులు కశ్మీర్‌లో ఉండలేక వలస వెళ్లారు అని అడిగితే సదరు మంత్రి ఎవరూ వెళ్ల లేదు అని నేరుగా సమాధానం చెప్పలేదు. ‘‘వివిధ ప్రభుత్వ శాఖల్లో 5,502 మంది కశ్మీరీ పండితులకు ఉద్యోగాలిచ్చాం’’ అని సదరు మంత్రి అన్నారు. అంటే కశ్మీరీ పండితులు వలస వెళ్లడానికి కారణమూ నిరుద్యోగమే తప్ప ముస్లింలు మెజారిటీ వర్గంగా ఉన్న ఆ రాష్ట్రంలో మత వివక్ష కారణం కాదని తేలిపోతోంది. గత సంవత్సరం కశ్మీరీ పండితుల మీద దాడులు జరిగినప్పుడు చాలామంది కశ్మీర్‌ నుంచి జమ్మూ వెళ్లిపోయారు. అయితే 370వ అధికరణం రద్దు తరవాత అంతా సవ్యంగా ఉందని చెప్పుకోవడానికి కశ్మీరీ పండితులను కశ్మీరీ లోయ వదిలి వెళ్లకూడదని, ఒక వేళ వెళ్తే ఉద్యోగాల్లో ఉన్న పండితులపై క్రమశిక్షణా చర్య తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అయిన దగ్గరి నుంచి జమ్మూ-కశ్మీర్‌లో 690మంది మిలిటెంట్లను హతమార్చారని కూడా నిత్యానంద రాయ్‌ పార్లమెంటులో చెప్పారు. అంటే మూడేళ్లలో సగటున ఏటా 234 మంది మిలిటెంట్లను హతమారుస్తున్నారు. మరో వేపు 527 మంది తీవ్రవాదముఠాలలో చేరారు. అంటే ఒక వేపు తీవ్రవాదులు భద్రతా సిబ్బంది ధాటికి నేలకు ఒరుగుతున్నా తీవ్రవాదాన్ని అనుసరించే వారి సంఖ్య పెద్దగా తగ్గలేదు. 370వ అధికరణం రద్దు అయిన తరవాత తీవ్రవాదుల చేతుల్లో మరణించిన అక్కడి మైనారిటీమతాలకు చెందిన 21మంది ఉండడం కేంద్రప్రభుత్వ కశ్మీర్‌ ప్రత్యేకప్రతిపత్తిని రద్దుచేయడం మైనారిటీలను కాపాడలేకపోయింది. ఎందుకంటే మూడేళ్లకాలంలో మైనారిటీమతాలకు చెందిన 21మందే హతమయ్యారని సంతృప్తి పడడానికి వీలులేదు. అంతకు ముందుదశాబ్దంతోపోలిస్తే గతమూడేళ్లలో తీవ్రవాదానికి బలైన హిందువులు, సిక్కుల సంఖ్యే ఎక్కువ. కశ్మీర్‌ లోయ నుంచి కశ్మీరీ పండితులు జమ్మూకు తరలి వెళ్లడం కూడా తీవ్రవాదం సద్దుమణగ లేదనడానికి నిదర్శనం. కశ్మీర్‌లో ఎంతటి అల్లకల్లోల పరిస్థితులున్నా తీవ్రవాదులు ముస్లిమేతరుల మీద గురిపెట్టింది ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఏరికోరి హిందువులు, సిక్కుల మీద దాడులు జరుగుతున్నాయి. అంటే మత వివక్ష అక్కడ కేంద్ర ప్రభుత్వ చలవే.
370వ అధికరణంరద్దు బీజేపీకి పూర్వ రూపమైన భారతీయ జనసంఫ్‌ు ఉన్నప్పుటి నుంచీ ఉన్నదే. వాజపేయి ప్రభుత్వానికి ఎన్నడూ సంపూర్ణమైన మెజారిటీ లేదు కనక వివాదాస్పదమైన ఈ అంశాన్ని అటకెక్కించారు. 2019 ఎన్నికలలో బీజేపీ సొంతంగా మెజారిటీ సంపాదించింది. అందుకే రెండవ సారి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే మోదీ సర్కారు 370 వ అధికరణాన్ని రద్దు చేయడమే కాక జమ్మూ-కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. జమ్మూ-కశ్మీర్‌లో ప్రధాన రాజకీయపక్ష నాయకులను కేంద్ర ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. దాదాపు ఓ సంవత్సరం తరవాత కశ్మీరీ నేతలు విడుదలయ్యారు. 370వ అధికరణం రద్దు తరవాత జమ్మూ-కశ్మీర్‌లో అయిదు ప్రధానమైన పరిణామాలను గమనించవచ్చు. ఒకటి: అంతవరకు ప్రత్యర్థులుగా ఉన్న ఫారుఖ్‌ అబ్దుల్లా, ఉమర్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్‌ ఫరెన్స్‌ మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపూల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీలకు బీజేపీయేతర రాజకీయ పక్షాల ఐక్యత ఎంత ప్రధానమైందో అర్థమైంది. ఈ ప్రతిపక్షాల కూటమినే గుప్కార్‌ సంఘటన అంటారు. జమ్మూ-కశ్మీర్‌కు మునుపున్న ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం పోరాడాలని గుప్కార్‌ సంఘటన నిర్ణయించింది. రెండు: 370, 35ఎ అధికరణాలు అమలులో ఉన్నప్పుడు జమ్మూ-కశ్మీర్‌కు చెందని వారు ఆ రాష్ట్రంలో భూమి కొనడానికి వీలుండేది కాదు. ఇప్పుడు వ్యవసాయ భూమి తప్ప ఇతరభూములను ఇతర రాష్ట్రాలవారూ కొనొచ్చు. అయితే ఇతర రాష్ట్రాల వారు అంతగా ఆసక్తి చూపడంలేదు. దీనికికారణం తీవ్రవాదం తగ్గక పోవడమే. మూడు: ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నప్పుడు జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పతాకం ఉండేవి. ప్రత్యేక శిక్షా స్మృతి కూడా ఉండేది. ఇప్పుడు అక్కడ త్రివర్ణ పతాకం మాత్రమే ఎగురవేయాలి. నాలుగు: 370వ అధికరణం రద్దుకు ముందు కశ్మీరీ మహిళలు కశ్మీరీలు కాని వారిని పెళ్లి చేసుకుంటే ఆ పురుషులను స్థానికులుగా పరిగణించే వారు కాదు. అందువల్ల అలాంటి మహిళలకూ ఆస్తులు కొనడానికి లేదా వారసత్వంగా పొందడానికి వీలుండేది కాదు. ఇప్పుడు అలాంటి మహిళలు ఆస్తులూ కొనొచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలకూ దరఖాస్తూ చేసుకోవచ్చు. అయిదు: రాళ్లు రువ్వడంతో పాటు విచ్ఛిన్నకర, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి పాస్‌ పోర్టు ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కశ్మీరీ ప్రజలు ఇతరులతో సమానంకాకుండా చేసిన 2019ఆగస్టు అయిదు శాశ్వతంగా గుర్తుండి పోతుంది. 370వ అధికరణం రద్దు, తదితర అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను సవాలు చేస్తూ కనీసం 23 పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ ప్రధాన న్యాయమూర్తి కావడానికి ముందే ఒకసారి ఆయన నాయకత్వంలో ఓ బెంచి ముందు ఈ అంశం చర్చకు వస్తే మరింత పెద్దబెంచి ముందు ఈ పిటిషన్లను పంపించడానికి నిరాకరించారు. ఆ తరవాత ఈ పిటిషన్లువిచారణకే నోచుకోలేదు. ఏప్రిల్‌లోఓ సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ జులై 11న వేసవిసెలవులు ముగిసిన తరవాత విచారణగురించి ఆలోచిస్తామని చెప్పారు. అయినా విచారణ ఊసేలేదు. ఈ నెల 26న ప్రధాన న్యాయమూర్తి రమణ పదవీ విరమణ చేస్తారు. తరవాత ఆ స్థానంలోకి వచ్చే న్యాయమూర్తి లలిత్‌ పదవీకాలం మూడు నెలలే. అంటే అప్పుడూ కుదరకపోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img