Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

వేటకు బలవుతున్న జుబేర్‌

ఒక వేపు సాక్షాత్తు సుప్రీంకోర్టు బెయిలు విషయంలో సమగ్ర మైన చట్టం తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. బెయిలు ఇవ్వడం సర్వసాధారణం, జైలులో పెట్టడం అత్యవసరమైతే తప్ప అవసరం లేదు అని పదే పదే అత్యున్నత న్యాయస్థానం హితోక్తులు పలుకుతూ ఉంటుంది. అదే సుప్రీంకోర్టు తీస్తా సెత ల్వాడ్‌ విషయంలో అత్యంత ప్రతికూలమైన వ్యాఖ్యలు చేస్తుంది. దురుద్దేశంతో గుజరాత్‌ మారణ కాండ వ్యవహారాన్ని తీస్తా తెగలాగుతున్నారని చివాట్లు కూడా పెడ్తుంది. అంతకన్నా విచిత్రం ఏమిటంటే సుప్రీంకోర్టు తీర్పులో ఈ వ్యాఖ్యలు భాగం కాకపోయినా ఈ విషయంలో మాత్రం పోలీసులు సుప్రీంకోర్టు వ్యాఖ్యల ఆధారంగా హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌, గుజరాత్‌ పోలీసు ఉన్నతాధికారి ఆర్‌.బి.శ్రీకుమార్‌ను తక్షణం అరెస్టు చేసి జైలులో పెట్టారు. మరో పోలీసు అధికారి సంజీవ్‌ భట్‌ మీద కేసును తిరగతోడుతున్నారు. ఆయన జైలులోనే ఉన్నారు కనక అరెస్టు చేయవలసిన అవసరం రాలేదు. ఇదే నాణానికి మరో పార్శ్వం ఉంది. కింది కోర్టులు అప్పుడప్పుడు అద్భుతమైన తీర్పులు చెప్తున్నాయి. తాజాగా దిల్లీలోని కోర్టు ఆల్ట్‌ న్యూస్‌ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ జుబేర్‌కు బెయిలు మంజూరు చేసింది. 1983 నాటి హృషీకేశ్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘‘కిసీసే నా కహనా’’ సినిమాలోని ఒక దృశ్యాన్ని 2018లో ట్వీట్‌ చేసినందుకు జుబేర్‌ను అరెస్టు చేశారు. ఆ ట్వీట్‌ వల్ల తమ మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని ఓ అనామకుడు ఇటీవల ట్వీట్‌ చేశాడట. ఆ అనామకుడి వాంగ్మూలాన్ని అయినా రికార్డు చేయకుండా జుబేర్‌ మీద చేసిన ఆరోపణల్లో కనీసం ప్రాథమిక సాక్ష్యాధారా లైనా ఉన్నాయా లేవా అని ఆలోచించకుండా ఆయనను జైలుకు పంపిం చడం విడ్డూరమే కాదు. ఇది ప్రజాస్వామ్యం గొంతు నొక్కడానికి, న్యాయ నిర్ణయ ప్రక్రియను విరూపం చేయడానికి బాహాటంగా జరుగుతున్న ప్రయత్నాలకు తార్కాణం. జుబేర్‌ మీద దిల్లీలో కేసు నమోదు చేయడంతో పరిస్థితి ఆగలేదు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక చోట్ల నుంచి ఆయన మీద మరో ఆరు ఎఫ్‌.ఐ.ఆర్‌.లు నమోదు చేశారు. అందులో లఖింపూర్‌ ఖేరీలో దాఖలైన కేసులో జుబేర్‌కు బెయిలు మంజూరు చేయడానికి అక్కడి సెషన్స్‌ కోర్టు తిరస్కరించింది. ఒకే ఆరోపణ, ఒకే వ్యక్తి, ఒకే రకమైన కేసు అయినా ఒక కోర్టు ఒక రకంగా తీర్పుచెప్తే మరో చోట మరో కోర్టు తద్విరుద్ధంగా బెయిలు మంజూరు చేయడానికి నిరాకరిస్తుంది. ఇక్కడ చిక్కేమిటంటే దిల్లీలోని కోర్టు జుబేర్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును ఇతర కోర్టుల్లో పూర్వోదంతంగా చూపి బెయిలు మంజూరు చేయాలని కోరడానికి వీలు లేదు. ఇదే తీర్పు హైకోర్టో, సుప్రీంకోర్టో ఇచ్చి ఉంటే అలాంటి అవకాశం ఉండేది. మిగతా అయిదు చోట్ల దాఖలైన కేసుల్లో కూడా బెయిలు మంజూరు అయితే తప్ప జుబేర్‌ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. ఒక చోట బెయిలు వచ్చింది అంటే మరో చోట కొత్త కేసు దాఖలవుతోంది. ఆ ప్రాంత పోలీసులు జుబేర్‌ను అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈ విలోమ పరిస్థితి మన న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పులను, న్యాయ నిర్ణయ ప్రక్రియనే ప్రశ్నార్థకం చేస్తోంది. మరీ చెప్పాలంటే అపహాస్యం పాలు చేస్తోంది. తన మీద దాఖలైన ఆరోపణలన్నింటినీ ఒకే కేసు కింద పరిగణించి ఒకే చోట విచారణ జరిగేట్టు చూడాలని జుబేర్‌ సుప్రీంకోర్టులో అర్జీ పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని తేల్చడం చిటెకలో పని. కానీ ఇంకా ఈ కేసు ఎప్పుడు విచారణకు వస్తుందో తెలియదు. జుబేర్‌ మీద ఒకటి తరవాత ఒకటి ఎఫ్‌.ఐ.ఆర్‌.లు దాఖలవుతున్నందువల్ల జూన్‌ 27 నుంచి ఆయన జైలులోనే మగ్గుతున్నారు. కోర్టు మెట్లెక్కడానికి జనం ఎందుకు భయపడతారో జుబేర్‌ కేసును పరిశీలిస్తే అర్థం అవుతుంది. న్యాయస్థానాల్లో న్యాయం దొరుకుతుంది అన్న ఆశకన్నా కోర్టుల చుట్టూ తిరగలేక అలసిపోవాలని, అదే పెద్ద శిక్ష అన్న అభిప్రాయం జన సామాన్యంలో బలంగానే ఉంది.
ఇంకా విచిత్రం ఏమిటంటే జడ్జి జంగాల దేవేందర్‌ కుమార్‌ బెయిలు మంజూరు చేస్తూ జుబేర్‌ను జైలులో పెట్టడం ఎంత తప్పో, ఎందుకు తప్పో సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు తమ విధానాల మీద విమర్శల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ భద్రంగా ఉండాలంటే అసమ్మతికి, భిన్నాభిప్రాయ వ్యక్తీకరణకు చోటు ఉండి తీరవలసిందేనన్నారు. రాజకీయ పక్షాలను విమర్శించినంత మాత్రాన భారత శిక్షా స్మృతిలోని 153ఎ, 295ఎ కింద కేసులు దాఖలు చేయడం అన్యాయం అన్నారు. హిందూ మతం చాలా సహన శీలమైందని, ఈ మతాన్ని అవలంబించే వారు తాము ఏర్పాటు చేసే సంస్థలకు, సంఘాలకు, కడకు తమ పిల్లలకు కూడా దేవుళ్ల పేరు పెట్టు కుంటారని గుర్తు చేశారు. జుబేర్‌ నాలుగేళ్ల కింద ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యల వల్ల తన మనోభావాలకు భంగం కలిగిందని మరో వ్యక్తి ఎవరో ట్విట్టర్‌లో వాపోతే కనీసం ఆ వ్యక్తి వాంగ్మూలం అయినా రికార్డు చేయకుండా జుబేర్‌ను నిర్బంధించడం ఏమిటని జడ్జి దేవేంద్ర కుమార్‌ నిలదీశారు. జుబేర్‌ నాలుగేళ్ల కింద ట్విట్టర్‌లో 1983 నాటి సినిమా లోని ఒక భాగాన్ని పెట్టడంవల్ల ఇన్నాళ్ల పాటు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదుగా అని ఆ జడ్జి నిలదీశారు. ఇవేవీ జుబేర్‌ మీద ఫిర్యాదులు దాఖలు చేసే వారికి, ఆ ఫిర్యాదుల ఆధారంగా మోదీ ప్రభుత్వ వ్యతిరేకులు అనుకుంటున్న వారిని కటకటాల వెనక్కు తోయడానికి అత్యు త్సాహం ప్రదర్శించే పోలీసులకు చెవికెక్కుతున్న దాఖలాలే లేవు. ఇక్కడ సమస్యల్లా చిన్న ఫిర్యాదు వచ్చినా కిట్టని వారనుకుంటే వెంటనే జైల్లో పెట్టిం చడం, ఆ తరవాత నెమ్మదిగా సాక్ష్యాధారాలకోసం వెతుకులాడడం పోలీసు లకు అలవాటైంది.
పటిష్ఠమైన న్యాయ నిర్ణయ ప్రక్రియ అమలులో ఉన్న ఏ దేశంలోనూ పరిస్థితి ఇంత దారుణంగా ఉండదు. విచారణ ఎప్పుడు జరుగుతుందో, ఎన్నాళ్లు, ఎన్నేళ్లు పడ్తుందో ఎవరికీ తెలియదు. విచారణ ప్రారంభం కాకుండానే ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న వారు మొత్తం ఖైదీలలో 76 శాతం ఉన్నారని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో జుబేర్‌ పెట్టుకున్న అర్జీని విచారించినప్పుడైనా ఇలంటి వేధింపులకు స్వస్తి చెప్పే మార్గం సూచించాలి. లేకపోతే సుప్రీంకోర్టు అప్పుడప్పుడు చెప్పే మహత్తరమైన మాటలకు విలువే లేకుండా పోతుంది. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యతను విస్మరించినట్టు అవుతుంది. ప్రభుత్వాలు వేటకుక్కల్లా వ్యవహరించకూడదని అత్యున్నత న్యాయస్థానం కచ్చితమైన ఆదేశాలు ఇస్తుందని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img