Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ఈ నెల 7,8 తేదీల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తాను

సహాయ పునరావాస కార్యక్రమాల తీరును పరిశీలిస్తా
విమర్శలకు తావులేకుండా సహాయ పునరావాస కార్యక్రమాలు ఉండాలి
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్

విశాలాంధ్ర – ఏలూరు : వరద సహాయ పునరావాస కార్యక్రమాల ద్వారా తమను కలెక్టర్లు బాగా చూసుకున్నారనే మాట వరద బాధితులనుంచి వినిపించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.వరద ప్రభావిత జిల్లాలైన అల్లూరిసీతారామరాజు, ఏలూరు, ప.గో, తూ.గో, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో గురువారం ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కమీషన్ సమీక్షా సమావేశానికి వెళ్లిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ విశాఖపట్నం నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనగా ఏలూరు కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, జిల్లా ఎస్ పి మేరి ప్రశాంతి,నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్ష్ రాజేంధ్రన్, ఇంఛార్జి డిఆర్ఓ కె. పెంచల కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఎక్కడా కూడా విమర్శలకు తావులేకుండా సహాయ పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా జరగాలని కలెక్టర్లను ఆదేశించారు. విపత్తుల సమయంలో కలెక్టర్లతో సహా అధికారులకు ముందుగానే నిధులు విడుదల చేస్తున్నామన్నారు. ఇంట్లోకి వరదనీరు వచ్చినా , వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి కచ్చితంగా నిర్ణయించిన రేషన్ అందించాలని, దీనితోపాటు తాగునీరు కూడా అందించాలన్నారు. వరద సహాయక కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం తరపున అందించే సహాయం అందని వరద బాధిత కుటుంబం ఉండకూడదన్నారు. సహాయ శిబిరాల్లో ఉండి , వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేలు, వ్యక్తులైతే వెయ్యి ఇచ్చి పంపించాలన్నారు . వరద కారణంగా కచ్చా ఇల్లు పాక్షికంగానైనా , పూర్తిగా నైనా ధ్వంసం అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వర్గీకరణ చేయకుండా వారందరికీ కూడా రూ .10 వేలు సహాయం అందించాలన్నారు. ఏప్రాంతానికి వచ్చేది ముందురోజు మాత్రమే తెలియజేసి ఆయా ప్రాంతాల్లో తానే స్వయంగా ఈ నెల 7,8 తేదీల్లో క్షేత్రస్ధాయిలో పర్యటించి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలు ఏరకంగా చేపట్టారో స్వయంగా పరిశీలిస్తానన్నారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకుంటానన్నారు. వరదనీరు తగ్గగానే పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. ఇందుకు మిగిలిన ప్రాంతాలనుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య కార్మికుల సేవలను వినియోగించుకోవాలన్నారు.పంట ఆస్తి నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్ చేసి గ్రామ, వార్డు సచివాలయాలో సోషల్ ఆడిట్ కోసం జాబితాను ఉంచాలన్నారు. అత్యంత పారదర్శకంగా పంటనష్టానికి, ఆస్తి నష్టానికి సంబంధించిన పరిహారం అందించాలన్నారు అవసరమైన చోట వెంటనే కొత్త ఇళ్లను మంజూరు చేయాలన్నారు. ఏటిగట్లమీద ఉన్నవారికి పక్కా ఇళ్లను మంజూరు చేయాలన్నారు. వరద వచ్చిన ప్రతిసారి వారు ఇబ్బందిపడకుండా వారికోసం ఇళ్లను మంజూరుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. అలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఉండేవారికి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా రక్షిత ప్రాంతంలో ఇళ్లు ఇవ్వాలన్నారు. పోలవరం ఎగువన తరచుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలకు ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పశువులకు గ్రాసం కొరతలేకుండా చూడాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు , కల్వర్టులు తదితర నిర్మాణాల విషయంలో వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img