Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టీడిఆర్ బాండ్లు జారీ…

విశాలాంధ్ర -తాడేపల్లిగూడెం రూరల్: పురపాలక సంఘంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టిడిఆర్ బాండ్లు జారీ చేయడం జరిగిందని ఇందులో ఎటువంటి గోల్ మాల్ జరగలేదని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ స్పష్టం చేశారు. స్థానిక మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ చాంబర్లో బుధవారం టి పి ఓ కే హరిప్రసాద్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో కమిషనర్ సామ్యూల్ మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి స్థానిక భీమవరం రోడ్లో ఉన్నటువంటి తొమ్మిది టిడిఆర్ బాండ్లు జారీ చేసి పురపాలక సంఘానికి అప్పగించిన స్థలాలను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ బాండ్లు జారీ చేయడంలో అవలంబించిన విధానాన్ని కూడా పరిశీలించానని కమిషనర్ పేర్కొన్నారు. భీమవరం రోడ్డు మాస్టర్ ప్లాన్ లో వంద అడుగులుగా 1988లో డిటిసిపి అప్రూవల్ పొందింది అన్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు 80 అడుగులు ఉందన్నారు. మిగిలిన 20 అడుగులు విస్తరణ చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. తాడేపల్లిగూడెం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా రోడ్డు విస్తరణ చేయవలసిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ కారణంగా భీమవరం రోడ్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి టిడిఆర్ బాండ్లు ఇవ్వడం జరిగిందని కమిషనర్ స్పష్టం చేశారు. ఆ క్రమంలో ఇప్పటి వరకు 9 టీడిఆర్ బాండ్లు జారీ చేసి వారి స్థలాన్ని సబ్ రిజిస్టర్ ద్వారా పురపాలక సంఘానికి రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగిందన్నారు. వాటిని తాను వ్యక్తిగతంగా పరిశీలించగా 5 పూర్తిగా ఖాళీ స్థలాలుగా ఉన్నాయని వారు అప్పగించిన స్థలానికి మార్కింగ్ చేసి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. టౌన్ ప్లానింగ్ సిబ్బందిని నోటీసు బోర్డులు ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించినట్లు కమిషనర్ తెలియజేశారు. మిగిలిన నాలుగులో రెండు ప్లాన్లు అనుమతి పొంది మున్సిపల్ స్థలం వదిలి భవన నిర్మాణం చేస్తున్నారన్నారు. మిగిలిన ఒకదానిలో నిరుపయోగంగా ఉన్న థియేటర్ ప్రహరీ గోడ ఉందన్నారు. సంబంధిత యజమానిని సంప్రదించగా ఆ ప్రహరీ గోడను 15 రోజులు వ్యవధిలో తొలగిస్తామని లిఖితపూర్వకంగా తమకు తెలియజేశారన్నారు. దీంతో పురపాలక సిబ్బంది ఆ గోడకు పెగ్ మార్కింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయాలు గమనించాలని టి డి ఆర్ బాండ్లు జారీలో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని అంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img