జిల్లాలో 5 వేల 024 మంది లబ్దిదారులకు రూ. 5.86 కోట్లు జమ…
జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్.
విశాలాంధ్ర ఏలూరు:నవరత్నాలు-ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి ఏ కారణంచేతనైనా లబ్ది అందని 5 వేల 024 మంది లబ్దిదారుల ఖాతాలకు రూ. 5.86 కోట్లు జమ చేయడం జరిగిందని జిల్లాకలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు.తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నవరత్నాలు-ద్వైవార్షిక నగదు మంజూరు కింద 2,62,169 మంది అర్హులకు రూ. 216.34 కోట్ల ను బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమచేశారు.ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, సాంఘీక సంక్షేమశాఖ జేడి జయప్రకాష్, బిసి కార్పోరేషన్ ఇడి ఎన్. పుష్పలత, జిఎస్ డబ్ల్యూఎస్ నోడల్ అధికారి రమణ, పలువురు విద్యార్ధినీ విద్యార్ధులు, లబ్దిదారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం లబ్దిదారులకు మెగా నమూనా చెక్కును కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాలు మంజూరులో అర్హులై వుండి ఏ కారణం చేతనైనా లబ్దిఅందని లబ్దిదారులను ప్రతి ఏడాది జూన్, డిశంబరు నెలలను ప్రాతిపదికగా గుర్తించి వారికి మరో అవకాశం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ విధంగా ప్రస్తుత ద్వైవార్షిక నగదు మంజూరు కింద జిల్లాలో 5 వేల 024 మంది లబ్దిదారులను గుర్తించి 5 కోట్ల 86 లక్షల 17 వేల 301 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. చేదోడు కింద రూ. 10 వేలు చొప్పున 1771 మందికి రూ. 1.77 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ. 10 వేలు చొప్పున 1099 మందికి రూ. 1.03 కోట్లు, విద్యాదీవెన కింద 985 మందికి రూ. 1.42 కోట్లు, అమ్మఒడి కింద రూ. 15 వేలు చొప్పున 702 మందికి రూ. 1.05 కోట్లు, ఈబిసి నేస్తం కింద రూ. 15 వేలు చొప్పున 306 మందికి రూ. 45.90 లక్షలు, రైతు భరోసా కింద 156 మందికి రూ. 11.42 లక్షలు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద రూ. 24 వేలు చొప్పున నలుగురికి రూ. 96 వేలు, మత్య్సకార భరోసా కింద ఒకరికి రూ. 10 వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.