విశాలాంధ్ర -కొయ్యలగూడెం: యువగళం పాదయాత్రతో వైసీపీలో వణుకు పుడుతుందని టిడిపి కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి అన్నారు. యువగళం పాద
యాత్ర 2000 కిలో మీటర్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె స్వగృహంలో ముందుగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేఘలాదేవి మాట్లాడుతూ లోకేశ్ యువగళం పాదయాత్ర ద్వారా
పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపటంతో పాటు ముఖ్య మంత్రి జగన్ అవినీతి, అక్రమ పాలనను
ఎండగడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ నుంచి స్థానిక ప్రజా ప్రతినిధుల వరకు దోచుకో దాచుకో అన్న చందంగా పరిపాలన సాగిస్తున్నారన్నారని ఆరోపించారు. కాసులు ముట్టందే ప్రజా ప్రతినిధులు పనిచేయడం లేదని విమర్శించారు. జగన్ పాలనలో యువత భవిత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాష్ట్రంలో సైకో పాలన సాగుతుందని, యువతకు ఉపాధిని కల్పించే ఒక్క పరిశ్రమ రాకపోగా, చంద్రబాబు హయాంలో వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు.లోకేష్ యువగళం పాదయాత్ర ఇప్పటికే ప్రజలలో మార్పు తెచ్చిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు అగ్రస్థానం కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.చంద్రబాబుతోనే రాష్ట్ర స్వర్ణయుగం అవుతుందన్నారు.