విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పరింపుడి గ్రామపంచాయతీ సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి పేర్కొన్నారు. మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని కొయ్యలగూడెం పట్టణంలో గ్రామపంచాయతీ స్థలంలో నూతనంగా నిర్మించిన ఫిష్ ఆంధ్ర దుకాణాలను మంగళవారంప్రారంభించారు. మత్స్యకారులు అంతా కలిసి సర్పంచ్ విజయ కుమారి ని ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ చేపల వ్యాపారం చేసుకోవడానికి సరైన స్థలం లేక, ఎండల్లో వానల్లో అనేక ఇబ్బందులు పడ్డామని, పంచాయతీ పాలకవర్గ సభ్యుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లగా వెంటనే పంచాయతీ స్థలంలో దుకాణాలు నిర్మించి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ విజయ కుమారి మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు సహకారంతో, పంచాయతీ నిధులతో దుకాణాలు నిర్మించడం జరిగిందని ఆమె తెలిపారు. త్వరలో మిగిలిన పంచాయితీ స్థలాలలో 15 దుకాణాలు నిర్మించి వివిధ వ్యాపారాలు చేసుకునే యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందని అన్నారు. దుకాణాలు నిర్మాణానికి శాసనసభ్యుల సహకారం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పాల్గొన్నారు.