36 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిపివేత
కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో విద్యుత్ విభాగం సిబ్బంది సమ్మెకు దిగారు. దీంతో 36 గంటల పాటు కరెంట్ సరఫరాతో పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. ట్రాఫిక్ లైట్లు కూడా పని చేయకపోవడంతో వాహనదారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. జనరేటర్లతో ఆస్పత్రులను నడపడం అసాధ్యమని చండీఘడ్ హెల్తె సర్వీసెస్ డైరెక్టర్ సుమన్ సింగ్ తెలిపారు. దీంతో ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో పలు కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. ఆన్ లైన్ క్లాసులకు అంతరాయం కలిగింది. నిరంతరాయంగా కరెంట్ లేకపోవడంతో ఫోన్లలో ఛార్జింగ్ కూడా లేని పరిస్థితి. దీంతో చాలామంది ప్రజలు ఫోన్ ఛార్జింగ్‌లు పెట్టుకునేందుకు పొరుగు నగరాల్లో ఉండే బంధువల ఇళ్లకు వెళుతున్నారు. పక్కనే ఉన్న మొహాలీ, జిరాక్‌పూర్, పంచకుల ప్రాంతాల్లో చండీగఢ్ వాసుల తాకిడి ఎక్కువైంది. పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వం యంత్రాంగం విద్యుత్ విభాగ సిబ్బందిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. అయినా ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. చాలా ప్రాంతాల్లో బుధవారం ఉదయానికి కూడా విద్యుత్ కోత కొనసాగుతోంది.