న్యూదిల్లీ : కోవిడ్19 మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ పునర్జీవ సంకేతాల నడుమ అక్టోబరు 12 నుంచి 2022
23 వార్షిక బడ్జెట్‌ను సిద్ధం చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తును ప్రారంభించనున్నది. వచ్చే ఏడాది బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను స్థిరమైన 8 శాతానికి పైగా వృద్ధి మార్గంలో ఉంచడం, ఉద్యోగ కల్పన, డిమాండ్ ఉత్పత్తి వంటి కీలక అంశాలను పరిష్కరించవలసి ఉంటుంది. ఇది మోదీ 2.0 ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ల నాల్గవ బడ్జెట్. కాగా సెప్టెంబర్ 16, 2021 నాటి ఆర్థిక వ్యవహారాల బడ్జెట్ సర్క్యులర్ (2022-23) ప్రకారం, ‘ప్రీ-బడ్జెట్/ఆర్‌ఈ(సవరించిన అంచనా) సమావేశాలు అక్టోబరు 12, 2021న ప్రారంభమవుతాయి. ఇతర కార్యదర్శులు, ఆర్థిక సలహాదారులతో వ్యయ కార్యదర్శి చర్చలు పూర్తి చేసిన తర్వాత 2022-23కు సంబంధించిన బడ్జెట్ అంచనాలు తాత్కాలికంగా ఖరారు చేయబడతాయి. ముందస్తు బడ్జెట్ సమావేశాలు అక్టోబరు 12న ప్రారంభమై నవంబర్ రెండవ వారం వరకు కొనసాగుతాయి. ‘ఈ సంవత్సరం ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, తుది బడ్జెట్ కేటాయింపుల ప్రాతిపదిక మొత్తం ఆర్థిక స్థానం, మంత్రిత్వ శాఖ/విభాగం శోషణ సామర్థ్యానికి లోబడి ఉంటుంది’ అని పేర్కొంది. కేంద్ర రంగం, కేంద్ర ప్రాయోజిత పథకాలతో సహా అన్ని విభాగాల వ్యయాల మొత్తం కేటాయింపులను చర్చిస్తారు. సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి చివరి వారంలో ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రథమార్ధంలో 2022-23 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ వాస్తవంగా 10.5 శాతం వృద్ధి రేటును అంచనా వేయగా, ద్రవ్య లోటు స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 6.8 శాతంగా అంచనా వేయబడిరది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరి చివరిలో బడ్జెట్‌ను సమర్పించే సంప్రదాయాన్ని రద్దు చేసింది. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొదటిసారిగా 2017 ఫిబ్రవరి 1న వార్షిక ఖాతాలను సమర్పించారు.