Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

అజయ్‌ మిశ్రాను తొలగించాల్సిందే

వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలి
రైతు పోరాటాలకు సీపీఐ సంఫీుభావం
అదానీ కంపెనీలకే సర్వం ధారాదత్తం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరీ రైతుల మారణకాండలో ప్రధానపాత్ర పోషించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రాను ప్రధాని మోదీ తక్షణమే తొలగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. విజయవాడ దాసరిభవన్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అజయ్‌ మిశ్రాను అరెస్టు చేయాలని, కేంద్ర కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్‌ మోర్చా రైల్‌రోకోలు విజయవంతంగా నిర్వహించిందన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న రైతు, ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీల నేతలను అరెస్టు చేయడాన్ని ఖండిరచారు. లఖింపూర్‌ ఖేరీ వ్యవహారంపై మోదీ పట్టనట్టు ఉన్నారని విమర్శించారు. ఈ సంఘటనపై ఇంతవరకు మోదీ పెదవి విప్పలేదని, మరణించిన రైతు కుటుంబాలకు సానుభూతి కూడా తెలపలేదన్నారు. రైతులు సాగిస్తున్న ఉద్యమానికి సీపీఐ సంపూర్ణ సంఫీుభావం ప్రకటిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులతో చర్చలు జరపాలన్నారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను తక్షణమే ఉపసంహరించాలని, లేకుంటే ఈ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజావ్యతిరేక పాలన కొనసాగించడం దురదృష్టకరమన్నారు. మంచి పరిపాలన అందిస్తారన్న ఆశతో రెండేళ్ల క్రితం జగన్‌కు ప్రజలు అధికారం కట్టబెట్టారనీ, సీఎం ఏకపక్షంగా పాలన సాగిస్తున్నారనీ, ఇది మోసపూరితమని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు మొదలయ్యాయని, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పంపుసెట్లకు రాత్రిపూట విద్యుత్‌ ఇస్తున్నారని చెప్పారు. అయినా విద్యుత్‌ కోతలు ఉండబోవంటూ మంత్రి, విద్యుత్‌ ఉన్నతాధికారులు బొంకుతున్నారని వ్యాఖ్యానించారు. విద్యుత్‌ కోతలు ఉంటాయంటూ ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అధికార నేతలు హెచ్చరిస్తున్నారని గుర్తుచేశారు. విద్యుత్‌ కోతలను ఎదుర్కొనేందుకుగాను ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా బొగ్గును అదానీ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని సీఎం జగన్‌ సూచిస్తున్నారని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో కృష్ణపట్నం, గంగవరం, మచిలీపట్నం పోర్టులను అదానీకి అప్పగించారని, ఇప్పుడు బొగ్గును సైతం అదానీ కంపెనీల నుంచే కొనుగోలుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. మోదీ కనుసన్నల్లో రాష్ట్ర సంపదను అదానీకి, ఆయన కంపెనీలకు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గందరగోళం నెలకొందన్నారు. ఏపీ అప్పులు చర్చానీయాంశమైందని చెప్పారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దిల్లీ కేంద్రంగా అప్పుల కోసం ప్రాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో చేసిన అప్పులు, వాటి ఖర్చులపైనా, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని అప్పులు, వాటికి ఖర్చులపైనా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక్క పనీ చేయడం లేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగా సీఎం జగన్‌తోపాటు నలుగురైదుగురు మంత్రులు, అధికారులతోనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు తగవని హితవు పలికారు. కర్నూలు జిల్లా దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి(బన్నీ)ఉత్సవం సందర్భంగా ఏటా నిర్వహించే కర్రల సమరం పేరిట హింసాకాండ కొనసాగుతోందన్నారు. కేవలం బన్నీ ఉత్సవాల సమయంలో భారీగా పోలీసు బలగాల మోహరింపువల్ల ఒరిగేదేమీ ఉండబోదన్నారు. బన్నీ ఉత్సవం సందర్భంగా జరిగే కర్రల సమరాన్ని శాంతిభద్రతల సమస్యగా చూడకుండా సామాజిక అంశంగా గుర్తించాలన్నారు. సమావేశంలో ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, సీపీఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img