మహిళా రెజ్లర్లపై అడుగడుగునా లైంగిక వేధింపులు
అనుచితంగా తాకడం… పట్టుకోవడం… బెదిరింపులు
రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
న్యూదిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై పాల్పడిన దురాగతాలు అన్నీఇన్నీ కావు. అత్యంత హేయమైన చర్యలకు ఒడిగట్టి, వారిని భయాందోళనకు గురి చేశాడు. బ్రిజ్ భూషణ్ తమను అనేక సార్లు వేధించాడని ఆటగాళ్లు ఆరోపించారు. అనుచితంగా తాకడం, ఏదో ఒక సాకుతో ఛాతీపై చేయి వేయడానికి ప్రయత్నించడం, చేతులు పట్టుకోవడం, ఛాతీ నుంచి వెనుకకు చేతిని కదిలించడం, వెంబడిరచడం వంటివి ఫిర్యాదులో ఉన్నాయి. రెజ్లర్లు సుప్రీం కోర్టుకు వెళ్లడంతో బ్రిజ్ భూషణ్‌పై దిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఆరుగురు వయోజన రెజ్లర్లు, ఒక మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదు ఆధారంగా ఒక దశాబ్ద కాలంలో విదేశాలతో సహా వివిధ సమయాల్లో, ప్రదేశాలలో లైంగిక వేధింపులు, అనుచితంగా తాకడం, పట్టుకోవడం, వెంబడిరచడం, బెదిరించడం వంటి అనేక ఆరోపణలను వివరించాయి. దిల్లీ పోలీసులు ఏప్రిల్ 28న కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇందులో ఒక మైనర్ రెజ్లర్ తండ్రి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే పోక్సో చట్టాన్ని ప్రయోగించడం కూడా ఉంది. సుప్రీం కోర్టు ఆదేశంతో నమోదయిన ఎఫ్‌ఐఆర్‌లలో సింగ్‌పై వివిధ ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. అందులో ఐపీసీ సెక్షన్లు 354 (మహిళ గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో దాడి లేదా క్రిమినల్ బలవంతం), 354ఎ (లైంగిక వేధింపులు), 354డి (వెంబడిరచడం) ఉన్నాయి. ఈ అభియోగాలకు ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొంతమంది ఫిర్యాదుదారులు సింగ్ తమకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తూ ‘లైంగిక ప్రయోజనాలను’ పొందేందుకు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించాడని ఆరోపించారు. అయితే తనపై వచ్చిన ఒక్క ఆరోపణ రుజువైనా తాను ఉరివేసుకుంటానని, అన్ని ఆరోపణలను సింగ్ ఖండిరచారు. రెజ్లర్లు అందరూ తన పిల్లలలాంటి వారని, తన రక్తం, చెమట కూడా వారి విజయానికి దార పోసానంటూ, వారిని నిందించనని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఆరుగురు రెజ్లర్లు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో భారత రెజ్లింగ్ సమాఖ్య కార్యదర్శి వినోద్ తోమర్‌ను కూడా నిందితుడిగా పేర్కొన్నారు. వయోజన రెజ్లర్ల ఫిర్యాదుల ఆధారంగా దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో వారిలో ఒకరు ఇలా ఆరోపించారు. ‘నేను శిక్షణ పొందుతున్నప్పుడు, నిందితుడు నన్ను విడిగా పిలిచాడు. నిందితుడు ఇతర అమ్మాయిలను కూడా అనుచితంగా తాకుతున్నందున నేను నిరాకరించాను. అయితే, నన్ను మళ్లీ నిందితుడు పిలిచాడు. అతను నా టీ-షర్టును పైకి లాగి, తన చేతిని నా పొట్ట క్రిందకు జార్చాడు. నా శ్వాస సరళిని పరిశీలించే సాకుతో నా నాభిపై చేయి వేశాడు’ అని పేర్కొంది. ‘నేను హోటల్‌లో ఉన్న సమయంలోనే మహిళా అథ్లెట్లందరూ నిందితులను ఒంటరిగా కలవకుండా ఉండటానికి తమ తమ గదులను విడిచిపెట్టినప్పుడల్లా గుంపులుగా ప్రయాణించడం గమనించాను’ అని వివరించారు. ఇక రెండవ రెజ్లర్ తన ఆరోపణల్లో, ‘నేను చాపపై పడుకున్నప్పుడు నిందితుడు (బ్రిజ్ భూషణ్) నా వద్దకు వచ్చాడు. ఆ సమయంలో నా కోచ్ అక్కడ లేరు. నా అనుమతి లేకుండా నా టీ షర్ట్ తీసి నా ఛాతీ మీద చెయ్యి వేశాడు. నా శ్వాసను పరీక్షించే నెపంతో బ్రిజ్ భూషణ్ తన చేతిని నా కడుపు భాగంలోకి తోసాడు’ అని పేర్కొన్నారు. మరో రెజ్లర్ టీమ్ ఫోటోను క్లిక్ చేసే సమయంలో తనను వేధించారని ఆరోపించారు. ‘నేను చివరి వరుసలో నిలబడి ఇతర రెజ్లర్లు తమ స్థానం కోసం ఎదురు చూస్తున్నప్పుడు, నిందితుడు వచ్చి నా పక్కన నిలబడ్డాడు. నేను దిగ్భ్రాంతికి గురయ్యేలా అతను అకస్మాత్తుగా నా పిరుదులపై చేయి వేశాడు. నేను వెంటనే వెనక్కి తిరిగి చూశాను. నిందితుడు నా పిరుదులపై చేతులు ఉంచాడు. దీంతో నేను దూరంగా వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు, నిందితుడు బలవంతంగా నా భుజం పట్టుకున్నాడు. ఎలాగో, నేను అతని బారి నుంచి బయటపడగలిగాను’ అని ఆమె ఆరోపించింది. ‘ఒక పతకాల ప్రదానోత్సవంలో నిందితుడు నన్ను పిలిచి వ్యక్తిగత ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. వేడుక ముగిసిన తర్వాత, అతను నాతో ఒక ఫొటో తీసే నెపంతో నా ఇష్టానికి విరుద్ధంగా నన్ను అతని వైపునకు లాగాడు. నా భుజాన్ని గట్టిగా పట్టుకుని, ఫొటో తీయమని బలవంతం చేశాడు. నన్ను నేను రక్షించుకోవడానికి, నేను నిందితుడి నుంచి దూరంగా వెళ్లడానికి ప్రయత్నించాను. ఫోటోను తీయడానికి నా వద్ద మొబైల్ ఫోన్ లేదని అతనికి తెలియజేశాను. అయితే నిందితుడు తన వద్ద మొబైల్ ఫోన్ ఉందని, దానితో తీయవచ్చని అన్నాడు’ అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇక ఐదవ రెజ్లర్ చేసిన ఆరోపణ ఏమిటంటే, బ్రిజ్ భూషణ్… సప్లిమెంట్‌లు కొంటానని ఆఫర్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ‘నేను ఒక ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాను. నేను నా గదిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఒక ఫిజియోథెరపిస్ట్ నా గదికి వచ్చి, అధ్యక్షుడు/నిందితుడు నన్ను అతని గదిలోకి పిలుస్తున్నారని చెప్పాడు. నేను ఛాంపియన్‌షిప్ గెలిచాను. అందువల్ల బ్రిజ్ భూషణ్ నన్ను అభినందిస్తాడని అనుకున్నా. నేను నిందితుడిని కలిసిన గదికి వెళ్లాను. ఆ సమయంలో నా దగ్గర వ్యక్తిగత మొబైల్ ఫోన్ లేకపోవడంతో అతను నన్ను నా తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడేలా చేశాడు’ అని ఆమె పేర్కొంది. అయితే, ఫోన్ కాల్ ముగిసిన తర్వాత, నేను దిగ్భ్రాంతికి గురయ్యేలా నిందితుడు నన్ను అతను కూర్చున్న తన మంచం వైపునకు పిలిచాడు. అకస్మాత్తుగా, అతను నా అనుమతి లేకుండా నన్ను బలవంతంగా కౌగిలించుకున్నాడు. అతను తన లైంగిక ఉద్దేశాలను మరింత నెరవేర్చుకోవడానికి, లైంగిక ప్రయోజనాలకు బదులుగా అథ్లెట్‌గా నాకు అవసరమయ్యే సప్లిమెంట్లను కొనుగోలు చేయడానికి ఆఫర్ చేయడం ద్వారా నాకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు’ అని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. సింగ్ తన కుమార్తెను బలవంతంగా తన వైపునకు లాగి లైంగికంగా వేధించాడని మైనర్ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ‘క్రీడాకారుడు పతకం సాధించినప్పుడు, నా కుమార్తెతో ఫోటో తీసే నెపంతో బ్రిజ్ భూషణ్ ఆమెను బలవంతంగా తన వైపుకు లాక్కున్నాడు. ఆమెను చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఫొటో తీసేటప్పుడు నిందితుడు ఆమెను తన వైపునకు మరింతగా లాక్కొని, ఆమె భుజంపై గట్టిగా నొక్కాడు. ఆపై ఉద్దేశపూర్వకంగా తన చేతిని ఆమె భుజం క్రిందకు జార్చాడు. ఆమె ఛాతీపై తన చేతులను వేశాడు’ అని ఆరోపించారు. ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌లతో పాటు డబ్ల్యూఎఫ్‌ఐ కార్యాలయం, భారత్‌తో పాటు విదేశాల్లో కూడా వివిధ సందర్భాల్లో సింగ్‌పై ఫిర్యాదుదారులు ఆరోపణలు చేశారు.