Friday, December 1, 2023
Friday, December 1, 2023

అణచివేత`హక్కుల హరింపు

. జమ్మూకశ్మీర్‌లో 2019 నుంచి చట్టాల దుర్వినియోగం
. జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలకు వేధింపులు
. ఆమ్నెస్టీ నివేదికలో వెల్లడి

శ్రీనగర్‌: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జమ్మూకశ్మీర్‌ పరిస్థితి అద్వాన్న మైంది. అధికరణ 370ను రద్దు చేసి రాష్ట్ర హోదాను తొలగించి జమ్మూకశ్మీర్‌ను ముక్కలు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. లోయ ప్రజలపై అధికార జులం, అణచివేతను కొనసాగించింది. 2019 ఆగస్టు నుంచి జర్నలిస్టులు, మానవహక్కుల సమర్థకులు/ కార్యకర్తలపై వేధింపులు మొదలయ్యాయి. వారిపై నిఘా, నిర్బంధం, అరెస్టు, క్రిమినల్‌ విచారణలు, దర్యాప్తులు వంటివి సాగుతూనే ఉన్నాయి. ఇటు వంటి సందర్భాలు 60కుపైగానే ఉన్నట్లు అంతర్జా తీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ 31 పేజీల నివేదికలో వెల్లడిరచింది. జమ్మూ కశ్మీర్‌లో తీవ్రమైన అణచివేతకు అద్దంపడుతూ గతవారంలో నివేదికను వెలువరించింది.
పాత్రికేయుల స్వేచ్ఛ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ పాత్రపై ఓ జర్నలిస్టు స్పందిస్తూ ‘కోర్టు అంటే ఏమిటి? అది చట్టం.. మమ్మల్ని చట్టమే శిక్షిస్తోంది… నిందితులు ఎవ్వరూ ఉగ్రవాదులు కాదు. న్యాయరక్షకులు దానిని అడ్డుగా పెట్టుకొని మమ్మల్ని శిక్షిస్తున్నారు. అన్యాయాన్ని సవాల్‌ చేయగలంగానీ న్యాయగ్రంధాలే అతిక్రమణకు పాల్పడుతుంటే ఏం చేయాలి? పీఎస్‌ఏ ఒక చట్టం, ఉపా ఒక చట్టం, ఎఫ్‌ఐఆర్‌లు చట్టబద్ధమైనవే’ అని అసహనం వ్యక్తంచేశారు. పత్రికా స్వేచ్ఛ జమ్మూ కశ్మీర్‌లో దారుణంగా ఉంది. జమ్మూకశ్మీర్‌ పోలీసు, సీఐడీ, ఎస్‌ఐఏ, భారతీయ ఆర్మీ సైనిక ఇంటెలిజెన్స్‌ విభాగం, ఇంటెలిజెన్స్‌ బ్యూరో నుంచి లోయ పాత్రికేయులకు ‘వెరిఫికేషన్‌’ ఫోన్లు తరచూ వస్తుంటాయని నలుగురు జర్నలిస్టులు తెలిపినట్లు ఆమ్నెస్టీ పేర్కొంది. ఎటువంటి న్యాయాధారం లేకుండా తమకు ఫోన్లు చేసి పోలీసులు విసిగిస్తారని, మౌఖికంగా సమన్లు జారీ చేస్తారని, రాతపూర్వకంగా ఏమీ ఉండదని, అకారణంగా తమ వార్తా సేకరణనే నేరంగా చూపుతారని, ప్రత్యేక కేసు ఉండదని పాత్రికేయుల వాంగ్మూ లాలలో వెల్లడి అయినట్లు నివేదిక తెలిపింది. 2019 ఆగస్టు నుంచి కశ్మీర్‌లో 27 మంది పాత్రికేయులను నిర్బంధించినట్లు పేర్కొంది.
2019 నుంచి మోదీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రజల ప్రాథమిక హుక్కులను అణచివేసిందని, అనేక అతిక్రమణలకు పాల్పడిరదని వెల్లడిరచింది. కశ్మీర్‌లో అధికార దుర్వినియోగం, వాక్‌స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ వంటివి హరించబడ్డాయని నివేదిక తెలిపింది. గోప్యతకు విఘాతం కలిగిందని పేర్కొంది. న్యాయం అందుబాటులో లేదని వెల్లడిరచింది. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలితో పాటు అనేక అంతర్జాతీయ హక్కుల సంఘాలు ఈ పూర్వ రాష్ట్రంలో మానవహక్కుల దుస్థితిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నాన్ని చేసినట్లు ఆమ్నెస్టీ నివేదిక పేర్కొంది. జర్నలిస్టలు, న్యాయవాదులు, మానవహక్కుల సమర్థకులు / కార్యకర్తలు, మాజీ న్యాయమూర్తులతో పాటు జమ్మూకశ్మీర్‌ పౌర సమాజ ప్రతినిధులతో జులై, ఆగస్టు నెలల్లో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు (సమాచార సేకరణ) ఆధారంగా తాజా నివేదికను విడుదల చేసినట్లు తెలిపింది.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియాపై ఆంక్షల కారణంగా జమ్మూకశ్మీర్‌లోని నిర్బంధ కేంద్రాలు లేదా కోర్టులను చేరుకునే అవకాశం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు లభించలేదని నివేదిక వెల్లడిరచింది. ఈ పరిస్థితుల్లో వేర్వేరు వర్గాల నుంచి లభించిన సమాచారం ఆధారంగానే నివేదికలో కొన్ని అంశాలు ఉన్నట్లు తెలిపింది. 2020 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి వరకు పోలీసుల బూటకపు ఎన్‌కౌంటర్లు జమ్మూకశ్మీర్‌లో అత్యధికంగా చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పటి నుంచి సాయుధ బలగాలు పౌరులను చట్టవిరుద్ధంగా చంపిన ఘటనలు 20శాతం మేర పెరిగినట్లు తెలిపింది.ఆర్టీఐ వంటివి ఇక్కడ పనిచేయవన్నది. దేశ భద్రత నెపంతో జమ్మూకశ్మీర్‌ ప్రజల హక్కులను హరించివేసేందుకు కేంద్రప్రభుత్వం చాలా చాకచక్యంగా న్యాయ కార్యాచరణను ఆచరణలో పెట్టింది. సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాల చట్టం, ప్రజా భద్రతా చట్టం వంటి వివాదాస్పద చట్టాల అమలు కొనసాగించిందని నివేదిక వెల్లడిరచింది. తాజా సంస్కర ణల క్రమంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) వంటివి నీరుగారిపోయాయి. 2005లో భారతీయ ప్రభుత్వానికంటే ముందుగానే సమాచార హక్కు చట్టాన్ని జమ్మూకశ్మీర్‌ అమల్లోకి తెచ్చిందని ఆమ్నెస్టీ నివేదిక తెలిపింది. 2019 వరకు కేంద్ర సమాచార హక్కు చట్టంలోని ప్రగతిశీల నిబంధనల చేరిక బలంగానే సాగింది. కాలక్రమేణ ఈ చట్టం నీరుగారింది. తొలుత రాజకీయ పార్టీలను చట్టం పరిధిలో నుంచి తొలగించారు. సమాచార కమిషనర్ల నిష్పాక్షికతను తక్కువచేసి చూపారు. గతంలో ఆర్టీఐ వ్యవస్థ క్రియాశీలంగా ఉండి 100 అభ్యర్థనలకు కనీసం 70`80కు కచ్చితంగా స్పందన వచ్చేదని ఓ మానవ హక్కుల కార్యకర్త తెలిపినట్లు నివేదిక వెల్లడిరచింది.
ఈ సంవత్సరం (ఆగస్టు 4 నాటికి) దాఖలైన 585 హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లలో 14 మాత్రమే న్యాయస్థానం ద్వారా పరిష్కరించబడినట్లు ఆమ్నెస్టీ గుర్తించింది. జమ్మూకశ్మీర్‌ Ê లఢక్‌ హైకోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న 1,346 కేసులను సమీక్షించింది. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ల సంఖ్య 32శాతం పెరగడాన్ని గుర్తించింది. 2019లో మొత్తం 761 హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు నమోదు అయ్యాయని, 2022లో ఏడు నెలల్లో 585 అభ్యర్థనలు వచ్చినట్లు పేర్కొంది. వీటిలో 569 ప్రజా భద్రతా చట్టం కింద నిర్బంధానికి సంబంధినవి ఉన్నట్లు ఆమ్నెస్టీ నివేదిక వెల్లడిరచింది. 2019 ఆగస్టు తర్వాత నుంచి ప్రజా భద్రతా చట్టం కింద హెబియస్‌ కార్పస్‌్‌ పిటిషన్‌ పరిష్కారానికి ఏడాదికిపైగా సమయాన్ని హైకోర్టు తీసుకుంటున్నట్లు పేర్కొంది. పీఎస్‌ఏతో పాటు ఉపా (చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం) వినియోగం పెరిగిందని కోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తెలుస్తోందని ఆమ్నెస్టీ నివేదిక వెల్లడిరచింది. 568 పీఎస్‌ఏ కేసుల్లో 179 అంటే 31శాతం ఉపా కేసులు ఉన్నట్లు తెలిసిందని, ఉపా వినియోగం 12శాతం పెరిగిందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img