Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

అదానీ`మోదీ బంధాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా…

. ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం పోరాడతా
. శాశ్వత వేటు వేసినా, జైలుకు పంపినా ఆగేదేలేదు
. మోదీ భయమే నాపై చర్యలకు కారణం
. నాపై వేటు విపక్షానికి కేంద్రమిచ్చిన పెద్ద అస్త్రం : రాహుల్‌ గాంధీ

న్యూదిల్లీ: బీజేపీ ప్రభుత్వం వెన్నులో వణుకుపట్టిందని, ప్రధాని మోదీ కళ్లలో భయం కనిపించిందని, అందుకే తనపై అనర్హత వేటు పడిరదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు. అదానీ వ్యవహారంతో తాను ఏం మాట్లాడతానోనని మోదీ భయపడిపోయారని చెప్పారు. అందుకే పార్లమెంటులో తనను మాట్లాడనివ్వకుండా చేశారని, ఇప్పుడు అనర్హత వేటు వేశారన్నారు. ‘పార్లమెంటులో శాశ్వత అనర్హత వేటు వేసినా లేక జైలుకు పంపినా ప్రజాస్వామ్యం కోసం నా ఈ పోరాటం ఆగదు’ అని రాహుల్‌ తేల్చిచెప్పారు. అదే సమయంలో ‘నా పేరు సావార్కర్‌ కాదు… గాంధీ. గాంధీ ఎవరికి క్షమాపణ చెప్పడు’ అని తన క్షమాపణ కోసం బీజేపీ డిమాండ్‌ చేయడాన్ని ఉద్దేశించి అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అంతమైందన్నారు. ప్రజలకు తమ ఆలోచనలను వ్యక్తపర్చే స్వేచ్ఛలేదని, దేశంలోని వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని, ఇందుకు మోదీ`అదానీ బంధమే కారణమని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తనపై అనర్హత వేటు తర్వాత తొలిసారి మీడియా ముందుకు రావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడిరది. రాహుల్‌ మాట్లాడుతూ దేశ వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని తను కోరినట్లు మంత్రులు అబద్ధాలు చెప్పారని, తను అలా చేయలేదని చెప్పారు. తనపై అనర్హత వేటు వేయడం ద్వారా విపక్షానికి ఓ అస్త్రాన్ని కేంద్రం ఇచ్చిందని అన్నారు. అదానీ డొల్ల కంపెనీల్లో రూ.20వేల కోట్లు పెట్టుబడి పెట్టింది ఎవరని అది తేలేవరకు ప్రశ్నిస్తానని చెప్పారు. ‘భారత ప్రజల ప్రజాస్వామిక గళాన్ని నేను రక్షిస్తున్నా… దీనిని కొనసాగిస్తా. ఇలాంటి బెదిరింపులకు, అనర్హత వేటు, ఆరోపణలు, జైలుశిక్షలకు భయపడను. వీరి నన్ను ఇంకా అర్థం చేసుకోలేదు. వాళ్లంటే నాకు భయంలేదు’ అని బీజేపీని ఉద్దేశించి రాహుల్‌ వ్యాఖ్యానించారు. వ్యాపారవేత్త గౌతం అదానీతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న సంబంధం ఏమిటని సమాధానం వచ్చేవరకు ప్రశ్నిస్తానన్నారు.తనకు మద్దతిచ్చిన ప్రతిపక్ష పార్టీలకు రాహుల్‌ కృతజ్ఞతలు తెలిపారు. వీరంతా కలిసికట్టుగా ముందుకెళతారని, ప్రధాని మోదీలోని భయం విపక్షాలకు లబ్ధి చేకూరుస్తుందని చెప్పారు. ‘నిజం బయటకు వస్తుందన్న వారి భయం ప్రతిపక్షానికి పెద్ద అస్త్రాన్ని అందించింది. అదానీ అవినీతిపరుడని ప్రజలకు తెలుసు.. ఇప్పుడు వారి మదిలో కదిలాడే ప్రశ్న ఒక్కటే… అవినీతిపరులను మోదీ ఎందుకు కాపాడుతున్నారు?’ అని రాహుల్‌ అన్నారు. నిజం కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. బీజేపీ నేతృత్వ ప్రభుత్వానికి అదానీకి మించిన లోకం లేదని విమర్శించారు. ‘నా ప్రసంగం గురించి ప్రధాని భయపడ్డారు కాబట్టే అనర్హత వేటు పడిరది. ఆ భయం ఆయన కళ్లల్లో చూశా. నేను ఏం మాట్లాడతానోనన్న భయంతో పార్లమెంటులో ప్రసంగించనివ్వలేదు. అదానీ మీద నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకే నాపై ఆరోపణలు, అనర్హత వేటు’ అని రాహుల్‌ అన్నారు. మీ సభ్యత్వాన్ని తిరిగి పొందగలరని ఆశిస్తున్నారా అన్న ప్రశ్నకు ‘నాకు ఆశలపై ఆసక్తి లేదు’ అని చెప్పారు. సభ్యత్వం లభించినా, లభించకపోయినా నా పనిని నేను చేసుకుపోతా. శాశ్వత వేటు వేసినా… రెచ్చగొట్టినా సరే ఆగేదేలేదు. పార్లమెంటు లోపల ఉన్నానా.. బయట ఉన్నానా అన్నది అనవసరం. నా ‘తపస్య’ను చేస్తా’ అని రాహుల్‌ బదులిచ్చారు. జైలుకు పంపినాగానీ తన పద్ధతి మారబోదని చెప్పారు. సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించానని, అదానీకి ప్రభుత్వంతో ఉన్న బంధాన్నే ప్రశ్నించా, ఇది ఓబీసీల సంబంధించిన అంశమే కాదు అని ఓ ప్రశ్నకు రాహుల్‌ బదులిచ్చారు. బీజేపీ వర్గీయులు తన క్షమాపణ కోరుతుండటం, కోర్టులో తన వ్యాఖ్యలకు చింతన వ్యక్తం చేయాల్సిందన్న విషయంలో స్పందిస్తూ ‘నా పేరు సావార్కర్‌ కాదు… గాంధీ. గాంధీ ఎవరికి క్షమాపణ చెప్పడు’ అని రాహుల్‌ అన్నారు. పార్లమెంటులో తనను మాట్లాడనివ్వాలని అనేకమార్లు కోరడాన్ని గుర్తుచేశారు. ‘స్పీకర్‌కు రెండు లేఖలు పంపారు. వ్యక్తిగతంగా కలిశాను. ప్రజాస్వామ్య సంరక్షులైన మీరు నన్ను మాట్లాడనివ్వండి అని చెప్పాను. ఆయన చిరునవ్వుతో నేను అలా చేయలేన’ని బదులిచ్చారు. మీరు చేయలేకపోతే మరెవరు చేయగలరు? మోదీగారి వద్దకు వెళ్లినా ఆయన నన్ను మాట్లాడనివ్వరు. అందుకే చెబుతున్నా దేశంలో ప్రజాస్వామ్యం అంతమైంది. ప్రజలకు తమ ఆలోచనలను వ్యక్తపర్చే స్వేచ్ఛ లేదు. దేశంలో వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయి. ఇందుకు మోదీ`అదానీ బంధమే దారితీస్తోంది’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. అదానీ వ్యవహారంలో తన ప్రశ్నలు ఆగవని, దీనిపై నుంచి దృష్టి మళ్లించేందుకే అనర్హత వేటని ఆయనన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img